పెన్నేటి బతుకు - పార్ట్ 2
- Kasivarapu Venkatasubbaiah

- Apr 29
- 7 min read

Penneti Bathuku Part 2/2 - Telugu farmer Story | Kasivarapu Venkatasubbaiah పెన్నేటి బతుకు - పార్ట్ 2/2 - తెలుగు రైతు కథ | కాశీవరపు వెంకటసుబ్బయ్య
Published in manatelugukathalu.com on 29/04/2026
"ఒక రైతు… తన కళ్ల ముందే తన పంట మొత్తం కొట్టుకుపోతే… ఏమి చేస్తాడు?"
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి పెన్నేటి బతుకు పార్ట్ 2 చదవండి.
అంతకంతకు పేరుకుపోతున్న బాకీలు, ఆడికాడికి జరిగిపోతున్న సంసారం. ఆశాజనకంగా లేని వ్యవసాయం... మనసు వికలమై ఆలోచిస్తూ వస్తున్న రమణయ్యను ఎవరో పిలిచినట్లై గతంలో నుంచి తల పైకెత్తి చూశాడు.
ఎదురుగా మైయిన్ రోడ్డు ప్రక్కన టీ అంగడి వద్ద రంగయ్య సోమిరెడ్డి సూరినాయుడు రాజన్న టీ తాగుతూ కనిపించారు.
"దా రమణయ్యా! టీ తాగుదువూ, ఇబ్బుడే కరెంటు పోయింది. మడికాడికి పోయి ఏం జేచ్చావూ!" అంటూ రంగయ్య ఆదరణ పూర్వకంగా పిలిచాడు రమణయ్యను.
ఏటి ఒడ్డున మైయిన్ రోడ్డుకు ఇరువైపులా ఆంజనేయ, విఘ్నేశ్వర, శ్రీరామ, కనకదుర్గ, అయ్యప్ప మొదలైన దేవాలయాలు ఉన్నాయి. వీటీతో పాటు అమృతేశ్వరుడు పేరుతో శివాలయం అద్భుత కళా రీతిలో నిర్మిస్తున్నారు. వీటి ప్రక్కనే రెండు కళ్యాణ మండపాలతో పాటు అనేక రకాల కట్టడాలు మహాఠీవి వెలిశాయి. వీటిని ఆసరాగా చేసుకుని రకరకాల అంగళ్ళు అసంఖ్యాకంగా వెలిశాయి. రాత్రి పదకొండు గంటలకు వరకు జనసందడిగా ఉంటుంది. మళ్లీ ఉదయం నాలుగు గంటలకే టీ అంగళ్ళు తెరుస్తారు. చుట్టుపక్కల పొలాలోని రైతులు తమ మళ్ళకు మడవలు కట్టుకుంటూ కరెంటు పోయినప్పుడు టీ తాగడానికి ఇక్కడికే వస్తుంటారు.
టీ పిల్లోడు రమణయ్యకు టీ గ్లాసు ఇచ్చాడు. అందరూ టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటే రామాలయం పూజారి రఘునాథ శాస్త్రి టీ తాగడానికి వచ్చి ఆ గుంపులో కలిసిపోయాడు.
"ఏమబ్బా! రమణయ్యా! పైరెట్టా ఉందీ?" అంటూ ఆత్మీయంగా అడిగాడు సోమిరెడ్డి రమణయ్యను.
"చెప్పుకొనేంత పెద్దగా ఏం లేదు సోమిరెడ్డన్నా! అగ్గితెగులు, బూడిద తెగులు, మజ్జిగ తెగులు వచ్చి పైరు గులక బట్టిందన్నా! ఆడికి రొండుమూడు తూర్లు మందులు గొట్టినా! ఎంతని కొట్టేది. మందుల ధరలు మండిపోతున్నాయ్. ఐనా ఇబ్బుడు పర్వాలేదు. అన్నిటికీ మించి నీటి తడులే తక్కువై పోతాండయ్. పైగా వాన గుడకా పడకపోయా! పోసిన్నీళ్ళు ఎంతబెడ్తే ఏం లాబమన్నా! 'వాన్నీళ్ళు తల్లిపాలు, ఇంజన్నీళ్ళు పోతపాలు' కదన్నా!" అంటూ నిర్లిప్తంగా చెప్పుకొచ్చాడు రమణయ్య.
"ఎగసాయం ఏం లాబం లేదన్నా! అంతా జూదమై పోయింది. పొద్దుటూరు టౌన్లో కూలో నాలో చేస్కొనేటోడు గుడకా బాగా బత్కుతాండడు" రాజన్న గొంతులోంచి నెట్టుకొచ్చిన ఆవేదన.
"రాజన్న జెప్పింది నిజ్జమే మరీ. కూల్లరేట్లు, కాండ్ల రేట్లు, ఎరువులు రేట్లు, పురుగు మందుల రేట్లు పెరిగిపాయా! అన్నీ లెక్కగడ్తే మనకు మిగిలేది 'అల్లికి అంల్లీ, సున్నకు సున్న" ఇది రంగయ్య నోట్లోంచి ఊడిపడ్డ బాధ.
"ఇదీ నిజ్జమే! ఇత్తానాల కాన్నుంచి, వరినాట్లు మొదలుకొని వరికోతలయ్యాక, గింజలు మండికి తోలెంత వరకు లెక్కేచ్చే ఎకరాకు కర్చు ఇరువై ఇరవై ఐదేల దాకా ఐతాది. ఇంతచేసి ఎకరాకు పంట మూడున్నర నాలుగు పుట్లకు మించదు. పుట్టీకి మండీలో దర తొమ్మిది పది ఏలకు దాట నీయ్యరు యాపార్లు. మన పెట్టుబడి పోను మిగిలింది అప్పు తెచ్చిన చోట వడ్డికి సరి. మనకు మిగిలేది మట్టే. రైతు బాగుపడేది కల్లోనే." సోమిరెడ్డి సందేహాస్పద వాక్కులు.
"అద్సరే వడ్లగింజలు యేసుకున్న యాపార్లు వెంటనే లెక్క ఇచ్చారాంటే అదీ లేదూ. మన వడ్లు అమ్మీ, దాండ్లో లాబాలు తిని, మనల్ను తిప్పి తిప్పి గానీ ఇయ్యరు." సూరినాయుడు గొంతు నిరాశగా పెరుగుతుండగా
"మీరంతా ఇట్లా దిగాలు పడిపోతున్నారే, ఈ యేడాది స్వామివారి ఉత్సవాలు జరుపుతారా లేదా? నాయుడు గారు!" ఆతృతగా అడిగాడు పూజారి రఘునాథశాస్త్రి.
"మేమెట్టా వున్న సాములోరికి తక్కవ జేయ్యం. పతేడులాగానే మా కట్టాలు మేం పడి ఉచ్చవాలు జరుపుతాం" శాస్త్రీకి ఊరటగా అన్నారు సోమిరెడ్డి సూరినాయుడ్లు.
టీ తాగుతూ అక్కడేవున్న స్కూల్ టీచర్ సూర్యం సార్ వారి సంభాషణలో జోక్యం చేసుకుంటూ " మీ మాటలు మొదలుపెట్టినప్పటి నుంచి వింటున్నాను. మీ మాటల్లోని ఆవేదన, బాధ నాకు అర్ధమైంది. మన వ్యవసాయ రంగం ఇలా కుప్పకూలి పోవడానికి కారణం, మన ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించక పోవడమే. అదే అమెరికా, బ్రిటన్, ప్రాన్స్, రష్యా, చైనా లాంటి దేశాలలో అయితే విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు అన్ని యాబై శాతం నుంచి ఎనబై శాతం వరకు సబ్సిడీ యిచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
అక్కడి వ్యవసాయ అధికార్లు రైతులకు అన్ని వేళల అందుబాటులో ఉండి గొప్ప సాంకేతిక విజ్ఞానాన్ని అందిస్తారు. అందువలన అక్కడి పంటలు ఇక్కడికన్నా పదిరేట్లు అధికంగా పండుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని అధికంగా పట్టించుకోవడం వలన అక్కడి రైతులు అత్యధికంగా దిగుబడులు సాధించి లాభసాటిగా పంటలు పండిస్తున్నారు. మన ప్రభుత్వం ఆ స్థాయిలో రైతుల్ని పట్టికోక పోవడం మన దురదృష్టంగా చెప్పుకోవాలి" కీలక అంశాన్ని విడమరచి చెప్పాడు సూర్యం సార్ నిర్లిప్త స్వరంతో.
సూర్యం సార్ పెదవి విరుపు మాటలు విన్న రైతులు " మమ్మల్ని ఏ శక్తీ సంఘటిత పర్చి మన హక్కుల్ని సాధిస్తుందో!" అనుకుంటూ ఉండగా...
"ఏమండ్రోయ్! మీరింగా యీడ్నే ఉండారా! కరెంటు వొచ్చీ యయ్యాలైందనుకున్నారూ? పోండి పోండి" అప్పుడే అక్కడికొచ్చిన నారాయణ అరుపులతో అందరూ ఎవరి షెడ్లకు వాళ్ళు పరుగులాంటి నడకతో గబగబా కదిలారు.
రమణయ్య తన షెడ్డుకు పోయి స్విచ్ఛాన్ చేశాడు రెండు ఫేజ్ లకే కరెంటు వచ్చిన విషయం తెలియక. మోటార్ రన్ అవుతూనే మోటార్లో నుంచి నల్లటి పొగ వచ్చి కమురు వాసన కొట్టింది. మోటారు కాలిపోయిందని తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు రమణయ్యకు. కన్నీళ్లు కళ్ళంబడి వాటికవే రాలిపోతున్నాయి. వస్తున్న దుఃఖాన్ని పళ్ళు బిగువున బిగబట్టి ఇల్లు చేరాడు రమణయ్య.
దెబ్బ మీద దెబ్బ పడుతుండడం వల్ల రమణయ్య సంసారం అగసాట్ల పాలైంది. పూట పూటకు పోరాటం ఎక్కువైంది. కడగండ్ల గట్టు ఎక్కేది ఎట్లాని రమణయ్య మనసు మదన పడడం మొదలైంది.
కళతప్పీన ముఖంతో తల దించుకొని కూర్చున్న భర్తను చూసి వెంకటలక్ష్ముమ్మ మనసు తీవ్రంగా కలచివేసింది. హృదయం విలవిల కొట్టుకుంది. భర్త తలను గుండెలకు హత్తుకుని ఓదార్చాలన్నంత ఉద్వేగానికి లోనై భర్త దగ్గర చేరింది. తండ్రి పడుతున్న ఆవేదనకు భయవిహ్వలమైన కొడుకు కూతురు తండ్రి అంచుకు చేరి కూర్చున్నారు.
"బాదపడకయ్యా! కట్టాలొచ్చినబ్బుడే గుండె నిబ్బరం సేస్కోవాల. యేవొచ్చినా! యేయిరాకున్నా! భయపడకూడ్దు. కాయకట్టాన్ని నమ్ముకొని బతుకుతున్నోళ్ళం. ఆపై దేవుడుండాడు. బాదపడడంవల్ల పయోజనం ఏముందయ్యా? నీవే డీలాపడిపోతే మా పరిచితి ఎట్టుంటాది. నిమ్మలపడయ్యా!" అంటూ భర్తను ఓదార్చింది వెంకటలక్ష్ముమ్మ.
"నాన్నా! సమస్యలు వచ్చినప్పుడే మనిషి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిలబడాలి. సమస్యల్ని ఆత్మధైర్యంతో ఎదుర్కోవాలి నాన్నా! మనం మన వంతు కృషిలోపం లేకుండా పని చేయాలి. అక్కడకి ఫలితం లేకపోతే మరో బతుకు మార్గం ఎన్నుకోవాలి. అంతేగానీ ఇక జీవితమే లేదనుకొని కృంగి పోకూడదు నాన్నా!" చదువుకున్న కొడుకు జీవిత పరమార్థాన్ని విడమరచి తండ్రికి ధైర్యం చెప్పాడు.
భార్య కొడుకు మాటలు వింటూ కూతురి వైపు చూశాడు రమణయ్య. కూతురి ముఖం బేలగా బెదురుగా ఉండడం చూసి దుఃఖాన్ని ఆపుకోలేక కూతురి తల నిమిరి గుండెలకు అదుముకున్నాడు. అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.
"కాలిపోయిన మోటారు విప్పుకొని తెల్లారేసరికి ప్రొద్దుటూరు చేర్చాలి. మెకానిక్ కిట్టుడు తెలిస్సినోడే ఒంటిగంట కల్లా వైరు చుట్టిచ్చాడు. తిరిగి సాయంత్రం మూడు గంటలకల్లా మోటారు బిగించకపోతే పైరు కాపాడుకోలేం! కిట్టుడి కాళ్ళో కడుపో పట్టుకొని లెక్క ఆమని కిచ్చానని బతిమాలుకోవాలి." అని తనలో తానే అనుకుంటున్నాడు రమణయ్య. రమణయ్య మంచితనం వల్ల అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోయింది.
పైరు వెన్నూరి కొరుకుడు గింజ దశకు చేరింది.
. . *
"పైరు ఉన్నంతలో ఒక రకంగా బాగానే ఉంది. పదైదు ఇరవై రోజుల్లో కోతకు రావచ్చు. అప్పులు ఈ యేడు అన్ని కాకున్నా సగమైనా తీరచ్చు."తనలో తాను అనుకుంటున్నాడు రమణయ్య మడి గెనెం మీద కూర్చుని తన పైరు వైపు చూసుకుంటూ..
"ఏంటి రమణయ్య! దిగులుపడ్తే పన్లు చక్కబడతాయా! కట్టాలు మడుసులకు కాకపోతే మాన్లకు వొచ్చాయా? కాలాన్ని కాల్తో తంతే పోదు రమణయ్యా! అనబయించ్చాల్సిందే తప్పదు" రమణయ్య కష్టం తెలిసిన పక్క పొలం ఆసామి సుందరయ్య పలకరించాడు రమణయ్యతో కబుర్లు చెప్పుకోడానికి వొచ్చి.
"అబ్బే అదేం లేదు సుందరయ్యా! దేవుడెట్టా బెట్టింటే అట్టానే జరుగుతాది. మనం బాదపడి లాబమేముందీ. దా కూకో!" అంటూ చోటు చూపించాడు రమణయ్య సుందరయ్యకు.
"ఔనులే రమణయ్యా! 'పుట్టెడు ఆముదంలో కుప్పటిచ్చి దుంక్కితే, అంటేకాడే అంటుతాదట. అంటనికాడ 'అంటడానికి నీ బంటునా' అంటాదట! కాబట్టి యాడికి పాప్తమో ఆడికే దక్కతాది." సుందరయ్య తాత్వికంగా చెప్పుకొచ్చాడు.
"నిజ్జమే సుందరయ్యా! అట్టని మనం చెయ్యాల్సింది చేయకపోతే ఎట్టా! మునుగారు పైరు, మునుగోలు మగబిడ్డ సరైన సమయానికి ఎదిగొచ్చి ఆదుకుంటారట. అదునులో పదును చేసుకొని పైరేసుకుంటే రాచినుకు పోచినుకు పడి చేతికి అందోచ్చాది" భూమి మీద అమితంగా నమ్మకం ఉన్న రమణయ్య ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.
"అద్సరే గానీ రమణయ్యా! నిన్నటిదాకా నిప్పుల వొర్సం కుర్సిన యెండలు. ఈరోజేంటో వాతావొర్నం సల్లగా వుంది. ఆకాసం కాండ్రాకుండా మోడాలాడ్తాండాయ్. వానేమైనా వొచ్చాదంటావా? రమణయ్యా!" సుందరయ్య భయపడుతూ అనుమానం వ్యక్తం చేశాడు.
" సూచ్చాంటే నాగ్గూడా అట్టే అనిపిచ్చాంది సుందరయ్యా! ఈదురు గాలి వీచ్చాంది. వాన వాసన వొచ్చాంది. సముద్రంలో తుపానో గిపానో లేచ్చిందేమో" సందేహిస్తూ చెప్పారు రమణయ్య దిగులు నిండిన స్వరంతో.
"వాన గానీ వొచ్చిందంటే అంతో గింతో వొచ్చొండే మాసూళ్ళు గడకా నాసమైబోతాయి. ఐనా గార్తులన్నీ పోయినాంక ఇబ్బుడు వాన వొచ్చాదంటవా రమణయ్యా!" సుందరయ్య కంగారుపడుతూ అడిగాడు.
"ఇబ్బుడు సగాలంలో వానలు పడ్తాండాయా? సెప్పు సుందరయ్యా! ఎబ్బుడంటే అబ్బుడే పడ్తాండయ్! ఇబ్బుడు రుతువులు మారిపోయినై సుందరయ్యా!" అని చెప్పుకుంటూ ఇంటి దోవా పెట్టారు ఇద్దరూ చేసేదేమీ లేక.
. . *
రాత్రి ఏడెనిమిది గంటలకు చిరుజల్లులతో మొదలైన వాన నడిరాత్రి పన్నెండు గంటలకు ఓ మోస్తరు దశ దాటి ఒంటి గంటకల్లా భయానకమైన భారీ వర్షంగా రూపుదాల్చింది.
నెల్లూరుకు ఐదు వందల కిలోమీటర్ల దూరాన సముద్రంలో వాయుగుండం లేచిందని, దాని వల్ల కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తులై ఉండాలని రేడియో, టీవీ ద్వారా వాతావరణం కేంద్రం వారు హెచ్చరించారు.
ఏటి ఒడ్డు బతుకులకు ఎప్పుడూ భయమే.
తీయకుండా వారం రోజులు కుండపోతగా వర్షాలు పడడంతో రమణయ్య ఆశలు మోడులు కాసాగాసొయి. ఇంటియిల్లిపాది గువ్వల్ల గుమిగూడి కన్నీరౌతూ మంచి నీళ్ళు కూడా ముట్టలేకపోయారు.
పెన్నానదికి పైభాగాన అనంతపురం జిల్లాను వారం రోజులుగా తుఫాన్ కుదిపేస్తుంది. ఎడతెరిపిలేని వర్షాలతో ముంచెత్తుతూ జనజీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా నీళ్ళు రాక పగుళ్లు చీలిన చిన్నా పెద్దా చెరువులు నీటి ప్రవాహ ఉధృతికి గట్లు తెగి పెన్నానదిలో కలుస్తున్నాయి. శింగనమల చెరువు, ధర్మవరం చెరువు, అనంత చెరువు మొదలైన పెద్ద పెద్ద చదువులు అలుగులెత్తి పారుతున్నాయి. ఈ చెరువులు తెగితే మైలవరం ప్రాజెక్టుకు ముప్పు తప్పదని అధికారుల్లో ఆందోళన, పెన్నేటి రైతుల్లో భయాందోళనలు మొదలైనాయి.
పెన్నానదికి కనీవినీ ఎరుగని వరదముప్పు వాటిల్లిందని, మైలవరం డ్యాముకు అపరిమితంగా నీరు వచ్చి చేరుతున్నందన ఈ అర్దరాత్రి డ్యాముకు ఉన్న పన్నెండు గేట్లు తెరిచి నీటిని కిందికి వదులుతున్నామని, దిగువన ఉన్న పెన్నా తీరవాసులంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని టి వి, రేడియోల్లో ప్రకటించారు అధికారులు
ప్రకటన విన్న రమణయ్య హాతశుడై పోయాడు. నోట్లో తడి ఆరిపోయింది. రాత్రంతా నిద్రపట్టలేదు. మనసు చెడి గుండెల్లో సలుపు, వెన్నులో చెలి మొదలై మెలికలు తిరిగిపోయాడు. ఇక తమ భూమి తనకు దక్కదేమో అనుకున్నాడు.
" ఓ దేవుడా! నా భార్యాపిల్లలపై దయ చూపు తండ్రీ!" దేవుడికి లెక్కలేనన్ని సార్లు మొర పెట్టుకున్నాడు. కన్జీకటి ఉండగానే రమణయ్య యింటి నుండి బయటికొచ్చాడు. వర్షం పూర్తిగా తగ్గిపోయింది. వీధులన్నీ జనంతో కలకలంగా ఉన్నాయి.
ఏటికి వరద వచ్చిందని ప్రొద్దుటూరు ప్రజలంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ చూడడానికి పోతున్నారని తెలిసి రమణయ్య నిర్ఘాంతపోయాడు. గుండెలు దడదడలాడాయి. కాళ్ళల్లో కంపనం మొదలైంది. శరీరం ఒక్కసారిగా మోయలేనంతగా బరువెక్కింది.
ఒట్టి కరువో పచ్చి కరువో క్రమము తప్పకుండా వచ్చి రాయలసీమ రైతులను కుంగతీస్తు ఉండడం అతి సహజమైపోయింది. నీటికి మొగం వాచిపోయిన జనం ఏటిని చూడడానికి రకరకాల వాహనాల్లోనూ,కాలి నడకనా ఏటి ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఇసుక వేస్తే రాలనంత జనం. అల్లకల్లోలం అంకాలమ్మ తిరునాళగా ఉంది పెన్నేటి ఒడ్డున. రమణయ్య గుండెలు విరామమెరకుండా కొట్టుకుంటున్నాయి.
ఏటి వరద సందర్శనకు చేరిన అసంఖ్యాకమైన జనసందోహాన్ని తోసుకుంటూ ఏటి ఒడ్డుకు వచ్చి చూశాడు రమణయ్య. అందరి భూములతో పాటు తన భూమీ నదీ మధ్యలో ఉంది. నీటి ఉరవడిలో పైరు కనిపించలేదు.
గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన అప్పులు, దిగజారిపోయిన కుటుంబ ఆర్థిక పరిస్థితి, పెళ్లికి ఎదిగొచ్చిన కూతురు, నిరుద్యోగైన కొడుకు, దీనంగా చూస్తున్నట్లు భార్యా ముసలి తల్లిదండ్రులు ఒక్కసారిగా గుర్తుకు వచ్చారు రమణయ్యకు.
పంటపండి తమందరిని ఉద్దరిస్తుందనుకున్న పొలం నీటి మునిగి, ఏటకొట్టుక పోవడం కళ్ళారా చూసి స్థిమితంగా కోల్పోయాడు రమణయ్య. ఉన్నట్టుండి మహా ఉధృతితో సాగుతున్న నదిలోకి దూకి తన పొలం వైపుగా పెద్ద పెద్ద భారలు వేస్తూ ఈదుకుంటూ ఉద్వేగభరితంగా పోసాగాడు.
ఈ హఠాత్తు పరిణామానికి హాహాకారాలు చేస్తూ ఉద్విగ్నతతో, ఉత్కంఠతతో చూస్తూ ఉండిపోయారు జనం. అదే సమయంలో కొడుకూ, భార్యల మాటలు వీపుతడుతూ, గుండెలు నిమురుతూ జ్ఞప్తికి వచ్చాయి రమణయ్యకు. వెంటనే గిరుక్కున వెనక్కి గట్టు వైపుగా తిరిగాడు.
ప్రొద్దుటూరు పట్టణం వెలుగులు చిమ్ముతూ ఆశాదీపంలా, ఆప్తమిత్రుడిలా, కనిపించింది.
ఏటి గట్టు ఎక్కి అప్పుడే అక్కడికి కంగారుగా పరిగెత్తి వచ్చిన భార్యా, కొడుకు, కూతుర్ల భుజాలపై చేతులు వేసి ప్రొద్దుటూరు దిక్కుగా అడుగులు వేశాడు రమణయ్య. అంతులేని ఆత్మవిశ్వాసంతో.
===============================================
సమాప్తం
===============================================
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను











Comments