పెన్నేటి బతుకు - పార్ట్ 1
- Kasivarapu Venkatasubbaiah

- 2 hours ago
- 6 min read

Penneti Bathuku Part 1/2 - Telugu farmer Story | Kasivarapu Venkatasubbaiah పెన్నేటి బతుకు - పార్ట్ 1/2 - తెలుగు రైతు కథ | కాశీవరపు వెంకటసుబ్బయ్య
Published in manatelugukathalu.com on 24/04/2026
రైతన్నల కన్నీటి కథలు తెలుసుకోవడం మన బాధ్యత. కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి పెన్నేటి బతుకు మొదటి భాగంలో ఆ కన్నీళ్లను పంచుకుందాం.
కొక్కొరోకోయని కోడి కూసింది.
ఉలిక్కిపడి లేచి ఆకాశం వైపు ఓసారి చూశాడు రమణయ్య. తెల్లవారుజాము చుక్క పొడిచి బారెడు పొద్దెక్కింది. ఆదరా బాదర జాలాట్లోకి పోయి ముఖం కడుక్కొని "ఏమేయ్ ఎంగట్లచ్చిమే! నేను మడికాడికి పోతాండ గానీ పెద్దోంతో సద్ది బువ్వ పంపియ్యి! మడికి మడవ కట్టాల. మూడ్రోజుల్నుంచి మడవ కడ్తాన్యా పారకం పారలేదు. ఈ రోజు అంబలి పొద్దుగ్గాని ఇంటికి రాలేను" అంటూ గట్టిగా కేక వేశాడు.
భార్య వెంకటలక్ష్ముమ్మ అంతకు ముందెప్పుడో లేచి ఇంటి ముందర ప్యాడ్నీళ్ళు చల్లి ఎంగిలి బోకులు కడక్కుంంటన్నామె భర్త కేకతో బరబరా బయటికొచ్చింది.
"ఇంట్లో సరుకులైపోయినాయ్! కూరగాయల గ్గూడా లెక్క లేదు. అంగట్లో అప్పెక్కువైందని, సరుకులియ్యడం లేదు. ఎట్టా చేయమంటావో చెప్పయ్యా మద్యాన్నాలకీ" అంది ఆదుర్దాగా.
"ఈ రోజెట్టో గొట్టా రేపో మాపో ఇచ్చామంజెప్పి అప్పు తీసుకొని చెయ్. ఎలాగోలా సర్దుదాం గానీ" అన్జెప్పి చేను దోవ పట్టబోయాడు రమణయ్య.
"పెద్దోడు ఏదో పరీచ్చ ఫీజు కట్టాలంటా, పేపర్లో ఉద్దోగాలు పన్యాట. వాడు నీతో చెప్పలేక నాతో చెప్పినాడు. నయాపైసా చేతిలో లేనప్పుడే ఇదోకటొచ్చి పడింది" భార్య గొనుగుతుంది.
ఇదేమి పట్టనట్టు కదిలాడు రమణయ్య. "ఎద్దుమాద్రి పన్జేచ్చాన్యా నోటికాడికి కూటి గ్గూడా గతి లేకుండా పోతాంది. దేవుడి క్కూడా కనికరం లేదు" భర్త వైపు జాలిగా చూసుకుంటూ అనుకుంది వెంకటలక్ష్మి తానేమో మినహాయింపైనట్లు.
. . *
పిండారబోసినట్లు వెన్నెల. పచ్చటి చెట్ల మధ్య బండ్ల బాట తెల్లగా కనిపిస్తుంది. బాటెంబడి రమణయ్య నడుస్తున్నాడే గానీ మనసు మనసున లేదు. అలలు అలలుగా ఆలోచనా దొంతరలు రమణయ్య మెదడులో సుడులు తిరుగుతున్నాయి.
రామయ్యకు డిగ్రీ పూర్తిచేసి నిరుద్యోగిగా ఉన్న కొడుకు సురేశు, పెళ్ళీడుకు వచ్చిన కూతురు సునిత, ఎప్పుడూ ముక్కుతూ మూలుగుతూ మంచం దిగని ముసలి తల్లిదండ్రులున్నారు. ఏరోజు కారోజు అతి కష్టమ్మీద నెట్టుకొస్తున్న కుటుంబం రమణయ్యది. సరుకులంగట్లో, గుడ్డలంగట్లో, ఎరువులంగట్లో అప్పలసప్పులతోనే కాలం గడుపుకొస్తున్నాడు. కొడుకు క్రమశిక్షణ పట్టుదల కలవాడు. ఏదో విధంగా ఉద్యోగాన్ని అందకోవాలన్న దీక్షలో ఉంటూ కూడా ఉదయాన్నే లేచి తన ఊరికి అతి సమీపంలో ఉన్న ప్రొద్దుటూరు టౌనుకు పోయి న్యూస్ పేపర్ ఇంటింటికీ వేసి కుటుంబానికి కాస్తోకూస్తో సహకరిస్తుంటాడు. భార్య తనకున్న ఒకే ఒక పాడి ఎనుము ఇచ్చే అరకొర పాలను ప్రొద్దుటూరులోని ఒక టీ షాపులో పోసి వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టు ఇంటి అవసరాలకు ఎగదోస్తుంది. కూతురు ఇంటిపట్టునే ఉంటూ కుట్లు అల్లికలు అల్లుకుంటూ ఉంటుంది.
కూతురుకి ఏదో విధంగా పెళ్లి చేసి పంపిస్తే ఒక బ్రహ్మాండమైన బరువు దిగిపోతుందని రమణయ్య ఆలోచన. ఇప్పటికే పుట్టెడు బాకీల్తో సతమతమవుతున్న తనకు, కూతురికి పెళ్లి చేయడం కలగానే మిగిలిపోయింది. ఇలాంటి ఆలోచనలతో గతాన్ని స్మృతిపథంలోకి తెచ్చుకున్నాడు రమణయ్య.
. . *
సరిగ్గా ఏడాది క్రిందట పదెకరాల మెట్ట భూమి ఉండేది రమణయ్యకు. అది వానొస్తే పండేది. రాకుంటే ఎండేది. ఐదారేండ్లుగా రాయలసీమలో ఏటేటా కరువుల్తో ఉండడం వల్ల అసలు మెట్ట భూములు ఉండడమే గగనమై పోయింది. ఎవరైనా 'ఆరు నూరు గానీ, నూరు ఆరు గానీ, అంబారం కాలిపోనీ' అని ధైర్యం చేసి పంట వేసినా విత్తనాల గింజలు కూడా దక్కేవి కావు. పంట కోసం అప్పు తెచ్చిన చోట బొక్కట్లే ఉండేది.
రమణయ్య వ్యవసాయం కూడా ' ఏడుకేడు తీసికట్టు మిడతం బొట్లు ' అన్నట్లు సాగేది. కొడుకు సురేశు అప్పుడప్పుడు అంట్టుండేవాడు "అన్ని విధాలా ప్రతికూల పరిస్థితులున్న ఈ ముదనష్టపు కాలంలో వ్యవసాయం లాభదాయకం కాదు నాన్నా! మనం మరో వృత్తిని ఆశ్రయించడం మంచిదని" కానీ రమణయ్యే "భూమెమ్మను నమ్ముకున్నోడు ఎన్నటికీ చెడిపోడు. ఒకతూరి కాకున్యా మరోతూరన్నా బయటేచ్చది. అని అంటుండేవాడు మొండిగా. ఇలాగే అయితే ఇక కుటుంబ పోషణ కష్టమని భావించి తన మెట్ట భూమిని అయిన కాడికి అమ్మేసి వచ్చిన దానికి కొంత ఎదురేసైనా నీటి వసతి ఉన్న కొద్ది భూమిపైనా సరే కొనాలని నిర్ణయించాడు. నీటి వసతి ఉంటే ఆకుకూరలు కూరగాయలు పండించైనా ప్రొద్దుటూరు మార్కెట్లో అమ్ముకొని బతకొచ్చని అనుకున్నాడు రమణయ్య.
ప్రొద్దుటూరు దగ్గర్లోని పెన్నానది ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెలను రామయ్య ఆక్రమించుకొని, చదును చేసుకొని సాగుచేసుకుంటున్న ఐదెకరాల నీటి వసతిగల ఏటి పరంబోగు భూమిని కొన్నాడు రమణయ్య. భూమికి కరెంట్ కనెక్షన్ గల బోర్ బావి, మోటార్ ఉండడంతో తన మెట్ట భూమి అమ్మగా వచ్చిన సొమ్ము కాక అధిక వడ్డీకి అప్పు తెచ్చకోవాల్సి వచ్చింది. ఇలాంటి భూములకు అగ్రిమెంట్లేగాని రిజిస్ట్రేషన్లు ఉండవు. సాగుదార్లు ఏటి వరదల్తో గానీ, మరే ఇతర కారణాల వల్ల గానీ పంటకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం బాధ్యత తీసుకొని నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోదు.
పెన్నానదికి దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఉన్న రేగడి భూముల్లో ఎక్కడా బోర్ బావులకు నీళ్ళు పడనందునా పడినా వ్యవసాయానికి పనికిరాని ఉప్పు నీరు, జౌకు నీరు కావడం వలన రైతులు పెన్నేటి పరంబోగు భూముల్ని ఆశ్రయిస్తూ ఉంటారు.
గాలి కాలాల్లో పడమటి గాలులు వేగంగా వీచినప్పుడు పెన్నానదిలోని ఇసుక నదికి ఉత్తరం వైపుకు అర్ద కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు గాలి వాటంగా వచ్చి పడుతుంది. ఇలా వేల ఏండ్లుగా ఇసుక వచ్చిపడుతుండడం వలన కొండల్ని తలపించే ఇసుక దిన్నెలు ఏర్పడ్డాయి. ఈ ఇసుక దిన్నెల క్రింద పెన్నేటి కారణంగా పుష్కళంగా భూగర్భ జలాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే ఇక్కడి రైతులు తలా కొంత ఆక్రమించుకొని దిన్నెలను చదును చేసుకొని, నాపరాళ్ళ గనుల కోసం త్రవ్వి ప్రక్కన పోసిన నల్లరేగడి మట్టిని అడుగు మందాన నెరపుకొని సాగు చేసుకుంటూ ఉంటారు.
వాన రాకుంటే ఒట్టి కరువు, వానొస్తే పచ్చి కరువు, కరువు మాత్రం ఈ ప్రాంతవాసులకు అతి సమీప బంధువు. అనావృష్టి వలన ఎడారిని తలపించే పెన్నానది, అప్పుడప్పుడు అతివృష్టి వల్ల మహోధృత వరదలతో ముంచెత్తి సాగు భూములన్నిటిని తుడిచి పెట్టుకు పోయేది. వరదల వల్ల ఇసుక మేట వేసిన భూముల్ని తిరిగి సాగులోకి తెచ్చేసరికి ఖర్చు తడిసి మోపెడు అయ్యేది. మొత్తం మీద ఈ భూముల వలన ప్రయోజనం మాత్రం 'చదివిందానికి మరిచి పోయిందానికి సరి' అన్నట్లు సాగేది.
పెన్నకు ఎగువ భాగంలో జమ్మలమడుగు నుండి దిగువ భాగంలో పెన్నతో కుందూనది కలిసే రంగనాయక తువ్వ వరకు వేలాది ఎకరాలు ఈ విధంగా సాగులోకి వచ్చినవే! ఇక్కడి కరువు బాధిత రైతుల్ని ప్రభుత్వం ఉదాసీనంగా చూసినా పెన్నానదీమతల్లీ కొంత మేరకైనా రైతుల కన్నీరు తుడుస్తుంటుంది.
పెన్నేటి రైతుల్లో ఒకరైపోయిన రమణయ్య భూమి కొన్న ఏడాది ఖరీఫ్ సీజన్ కావడంతో ఎన్నిరకాలు అప్పులు తేవాలో అన్ని రకాల అప్పులు తెచ్చి వరిపైరు పెట్టడానికి నారుకయ్య తయారు చేసుకొని, పులక (మొలక వచ్చిన వడ్లు) చల్లుకున్నాడు. పులక నెల వయస్సు నారు కాగానే సత్తువ, చల్లా చల్లుకొని భూమినంతా బాగా కలియ దున్నుకొని వరినాట్లు వేసుకున్నాడు.
'దురదృష్టవంతున్ని ఎవరూ కాపాడలేరు. అదృష్టవంతున్ని ఎవరూ చెరపలేరు' అన్న సూక్తిలో మొదటి రకానికి చెందిన వ్యక్తి రమణయ్య.
వంద హెచ్. పి. సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్ కింద రెండు వందల హెచ్. పి. మోటార్ల సర్వీసులు ఉన్నందున ఓవర్ లోడై ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. పాత ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి మోటారుకు రెండు వేల రుపాయల చొప్పున రమణయ్య వంతు చందాగా వేసుకోక తప్పలేదు. కరెంట్ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి అధికారులను బతిమాలి బామాలిన తరువాత రైతుల దగ్గర నుంచి మందు బిర్యాన్లతోపాటు అన్ని రకాల మామూళ్లు పొందాక, మదపుటేనుగు మందగమనంలా కదిలారు విద్యుత్ అధికారులు. రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాక్టరుపై పాత ట్రాన్స్ఫార్మరును తీసుకుని పోయి మైదుకూరు సర్వీస్ సెంటర్లో వదిలేసి కొత్త ట్రాన్స్ఫార్మరును తీసుకొచ్చి యదాస్థానంలో బిగించారు. అందుకోసం బాధ్యత తీసుకొన్నా నేరానికి 'మూలుగే నక్కపై తాటికాయ పడ్డట్లు' రమణయ్యకు అదనంగా మరో వెయ్యి రూపాయలు తలకెక్కింది.
కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించాక మోటార్లు బాగనే ఆడుతున్నాయి. దానికి తోడు ఓ మోస్తరు తుంపర వాన పడడంతో వరినాట్లు పచ్చబడి కరుక్కొచ్చాయి..
ఒకప్పుడు తొమ్మిది గంటలు ఇస్తున్న కరెంటు ఏవేవో కుంటిసాకులు చూపించి ఏడు గంటలకు మార్చారు. అదికూడా ఏకధాటిగా ఏడు గుంటలు ఇవ్వకుండా రెండు మూడు దఫాలుగా ఇస్తుండడం వలన సగం కయ్య మడవ పారేసరికి కరెంటు పోయేది. తిరిగి కరెంటు వచ్చాక పారిన కయ్యే మరలా పారగట్టాల్సి వచ్చేది. మిగిలిన పైరు పారకం లేక వాడి పోయేది. రమణయ్య తన పొలం చూసుకున్నప్పుడల్లా గుండె దారేది. బాకీలు బరువు పెరిగేది.
ఇది ఇలా ఉంటే ఉన్నట్లుండి ఒకరోజు రమణయ్య పెంపుతో పాటు రైతులందరి పంపులకు నీళ్ళు రాకుండా ఖాళీ మోటార్లు ఆడడం మొదలు పెట్టాయి. ఈ సోద్యమేమిటో నిపుణులు వచ్చి చెప్పేవరకు ఎవరికి అర్థం కాలేదు.
వరుసగా రెండు మూడేండ్లు వర్షాలు పడనందున భూగర్భ జలాలు మోటారుకు అందనంత అట్డడుక్కు చేరుకున్నాయని మోటార్ల మెకానిక్ ఆలోచన. కానీ అది సరైన అంచనా కాదని, పది సంవత్సరాలు వానలు పడకపోయినా అంతర్వాహినైనా పెన్నానది గర్భంలో నీరు తరుగదని, దీనికంతటికీ ఇసుక క్వారీలే కారణమని మరో నిపుణుడు చెప్పగా విని రైతులు నోరెళ్ళబెట్టారు.
పెన్నానది గర్భంలోని ఇసుకను విరామం లేకుండా నిరంతరం జె సి బి లతో తోడి వందలు వేల లారీలకు, ట్రాక్టర్లకు నింపి ప్రతిదినం ఇతర ప్రాంతాలకు పంపుతూ ఉండడంవలన నదిలో లోతైన అగాధాల్లాంటి గుంతలు ఏర్పడి అడుగున ఉన్న చట్టు బయట పడింది. ఆ కారణంగా నదిలోని ఊట పాతాళానికి చేరిపోయి వ్యవసాయ మోటార్లకు నీటి చమ్మ అందక రైతులకు సాగునీటి సమస్య ఏర్పడింది. ప్రభుత్వమే ఇసుక తోడుకోని అమ్ముకోవడానికి అండదండగా నిలవడం విచారకరం.
ఈ కొత్త సమస్య నుంచి బయట పడడానికి రైతులు తమ బోర్ బావులకు ఇరవై అడుగుల లోతు గుంతలు తవ్వుకొని మోటార్లను అందులో అమర్చి ఆడించుకోవడం మొదలు పెట్టారు.. ఈ చర్య ద్వారా రమణయ్యకు అప్పుల మోత మరింత పెరిగింది.
పైరు గంటగట్ఠి పాలగింజ దశ దాటి చిరుపొట్ట దశకు చేరుకుంది.
===============================================
ఇంకా వుంది..
పెన్నేటి బతుకు - పార్ట్ 2/2 త్వరలో
===============================================
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను









Comments