top of page
Original.png

మౌన ముద్ర


మౌన ముద్ర తెలుగు కథలో భార్య శ్రావణి సైబర్‌సెక్యూరిటీ నిపుణురాలని తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్న అభిరామ్

Mouna Mudra - Telugu Family Story | Mayukha

మౌన ముద్ర - తెలుగు కుటుంబ కథ | మయూఖ

Published in manatelugukathalu.com on 29/08/2026


“మౌన ముద్ర” ఒక హృదయస్పర్శి తెలుగు సామాజిక–కుటుంబ విలువల కథ. భార్యను కేవలం ఇంటిని చూసుకునే వ్యక్తిగా భావించి, ఆమె తెలివితేటలను తక్కువగా చూసే భర్త అభిరామ్ జీవితంలో ఒక అనుకోని సంఘటన అతని ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది.


హైదరాబాద్‌లోని ఆ విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉదయం ఎనిమిది గంటలంటే అభిరామ్ ఆజ్ఞల పరంపర మొదలైనట్టే. అద్దం ముందు నిలబడి తన బ్రాండెడ్ వాచ్ సర్దుకుంటూ గంభీరంగా అరిచాడు.


"శ్రావణీ! నా ఆఫీస్ ఫైల్స్ ఇంకా బ్యాగ్‌లో పెట్టలేదా? నీకు అసలు బాధ్యత అనేది ఉందా? వంటగదిలో ఆ గిన్నెలు తోముకోవడం తప్ప నీకు లోకజ్ఞానం ఎప్పటికి వస్తుందో ఏంటో!"


శ్రావణి కంగారుగా లోపలి నుంచి వచ్చింది. ఆమె చేతులకు తడి అంటుకుని ఉంది.

"అయ్యో.. క్షమించండి, ఇప్పుడే టిఫిన్ రెడీ చేశాను. ఆ ఫైల్స్ అన్నీ పద్ధతిగా బ్యాగ్‌లో పెట్టాను చూడండి."


అభిరామ్ విసుగ్గా బ్యాగ్ అందుకుని, "చూడు శ్రావణీ, నువ్వు ఇంకా ఆ పాతకాలపు పద్ధతుల్లోనే ఉన్నావు. కనీసం నీ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయడం కూడా నీకు రాదు. నా పరువు తీయకు!" అన్నాడు.


శ్రావణి చిన్నగా నవ్వి, "నాకు మీ అంత తెలివితేటలు ఎక్కడివండి? మీరు మేధావులు. నేను మీ నీడలో ఉండే సాదాసీదా అమ్మాయిని" అంది వినయంగా.


వారం రోజుల తర్వాత.. అభిరామ్ పాలిపోయిన మొఖంతో ఇంటికి వచ్చాడు. సోఫాలో కూలబడి తల పట్టుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి.


శ్రావణి దగ్గరకు వెళ్లి, "ఏమైందండి? ఒంట్లో బాగోలేదా?" అని అడిగింది.


"అంతా అయిపోయింది శ్రావణీ! మా కంపెనీ సర్వర్‌ని ఎవరో హ్యాక్ చేశారు. క్లయింట్స్ డేటా మొత్తం వాళ్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రేపు ఉదయం 9 గంటల లోపు 50 కోట్ల రూపాయలు వాళ్లకు ఇవ్వాలి. లేకపోతే నా ఉద్యోగం పోవడమే కాదు, నన్ను జైల్లో పెడతారు. సర్వర్ సెక్యూరిటీ బాధ్యత నాదే కదా!" అన్నాడు కళ్ళల్లో నీళ్లతో.


శ్రావణి అమాయకంగా అడిగింది, "అంటే కంప్యూటర్‌లో దొంగతనం చేస్తున్నారా అండీ? పోలీసులకు చెప్పొచ్చు కదా?"


"నీకు చెబితే టైమ్ వేస్ట్ శ్రావణీ! నీకు ఆండ్రాయిడ్ ఫోన్ వాడటమే సరిగ్గా రాదు, ఇక హ్యాకింగ్ గురించి నీకేం తెలుస్తుంది? వెళ్ళు.. నాకో స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా!" అని గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.


రాత్రి 11 గంటలు. అభిరామ్ టెన్షన్‌తో నిద్రపోలేక సెడెటివ్ టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు. శ్రావణి మెల్లగా లేచి, హాల్లోకి వచ్చింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక తెలియని తీవ్రత ఉంది. అభిరామ్ ఆఫీస్ ల్యాప్‌టాప్‌ను తన చేతుల్లోకి తీసుకుంది.


ఆమె వేళ్లు కీబోర్డ్ మీద మెరుపు వేగంతో కదులుతున్నాయి. స్క్రీన్ మీద వేల లైన్ల కోడ్ పరుగెడుతోంది. ఆమె ఏవో సంక్లిష్టమైన సర్వర్లలోకి ప్రవేశిస్తోంది. గంటల తరబడి నిశ్సబ్దంగా యుద్ధం చేస్తోంది. ఎక్కడో రష్యాలో కూర్చుని హ్యాక్ చేస్తున్న వారి మూలాలను కనిపెట్టి, వైరస్‌ను నాశనం చేసింది. అంతా పూర్తయ్యాక, ఆమె ఆ ల్యాప్‌టాప్‌లో తాను చేసిన పనుల గుర్తులు ఏమీ లేకుండా క్లీన్ చేసింది.


మళ్ళీ ఏమీ తెలియనట్టు వెళ్లి అభిరామ్ పక్కన పడుకుంది.


మరుసటి రోజు ఉదయం. అభిరామ్ భయపడుతూనే ల్యాప్‌టాప్ ఆన్ చేశాడు. ఆశ్చర్యం! సర్వర్ నార్మల్‌గా ఉంది. ఆఫీస్‌కు వెళ్ళగానే అతనికి ఘనస్వాగతం లభించింది. మేనేజర్ అతన్ని హగ్ చేసుకుని, "అభిరామ్! అద్భుతం చేశావు. రాత్రి నువ్వు ఏదో కోడ్ రన్ చేశావట కదా, మొత్తం క్లియర్ అయిపోయింది!" అని అరిచాడు.


అభిరామ్ గర్వంగా కాలర్ ఎగరేసుకున్నాడు. "అవును సార్, రాత్రి నిద్రలో కూడా నా మైండ్ ఆ ప్రాబ్లమ్ గురించే ఆలోచిస్తూ ఏదో మ్యాజిక్ చేసేసింది" అని అబద్ధం చెప్పాడు.


అప్పుడు కంపెనీ మేనేజర్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్‌కి పిలిచాడు.

"ఫ్రెండ్స్, మన కంపెనీని కాపాడింది కేవలం అభిరామ్ టీమ్ మాత్రమే కాదు. బ్యాక్ ఎండ్‌లో ఒక అజ్ఞాత శక్తి పని చేసింది. ఆమె ఎవరో కాదు.. సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో లెజెండ్ అయిన 'అథీనా'. ఆమె సాయం లేకపోతే ఈరోజు మనం రోడ్డున పడేవాళ్ళం. ఆ అథీనా ఎవరో ఇప్పుడు చూడండి."


స్క్రీన్ మీద శ్రావణి ఫోటో పెద్దగా డిస్‌ప్లే అయింది. వంటింట్లో ఉన్నట్టు చాలా సింపుల్‌గా ఉన్న ఫోటో అది. అది చూడగానే అభిరామ్ చేతిలోని గ్లాసు కింద పడి పగిలిపోయింది.


అభిరామ్ నోరు వెళ్లబెట్టి, "సార్.. ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది?" అని అడిగాడు.


మేనేజర్ నవ్వుతూ, "ఆమె పేరు శ్రావణి. తను ఒక గృహిణి. తను ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక కండిషన్ పెట్టింది. తను పని చేస్తున్న విషయం తన ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా తన భర్తకి తెలియకూడదని చెప్పింది. 'మా ఆయనకి ఇగో ఎక్కువ సార్.. నాకంటే తనే గొప్ప మేధావి అని ఆయన నమ్ముతారు. ఆ నమ్మకమే ఆయన సంతోషం. అది నా వల్ల దెబ్బతినకూడదు' అంది. ఎవరో ఆ పుణ్యాత్ముడు కానీ, తన భార్య తన కంటే వెయ్యి రెట్లు తెలివైనది అని అతనికి పాపం ఎప్పటికీ తెలియదు!" అన్నాడు.


అభిరామ్ గుండెల్లో రాయి పడినట్టయింది. దారి పొడవునా ఆమెను తాను తిట్టిన మాటలు, ఎగతాళి చేసిన దృశ్యాలు గుర్తొస్తున్నాయి.


"పురుష అహంకారంతో ఎన్నేసి మాటలు అనేవాడిని! వంటింటి కుందేలు, చేతకాని దద్దమ్మ... ఛీ... నేను మనిషినేనా! నేను ఎన్ని మాటలు అన్నా! ఆమె ఎప్పుడూ తన్ని పల్లెత్తు మాట అనలేదు, ఎదిరించలేదు. ఆమె మౌనంగా ఉంటే తనకి చిరాకు వచ్చేది. కానీ ఈ మౌన ముద్ర వెనక ఎంత విజ్ఞానం దాగుంది! అహంకారంతో కన్ను మిన్ను కానక ఎంత అవమానపరిచాను! ఇప్పుడు తను ఆదుకోబట్టి నా ఉద్యోగం ఉంది, లేకపోతే ఎప్పుడో ఊడిపోయేది. ఆఫీస్‌లో మేనేజర్ ఆమె గురించి అంత గర్వంగా చెబుతుంటే 'ఆమె నా భార్యే!' అని గొంతెత్తి గర్వంగా చెప్పాలనిపించింది. కానీ నా 'కుచ్చిత బుద్ధి' అందరికీ తెలిసిపోతుందని నోరు మూసుకొని కూర్చున్నాను.


అపర సరస్వతిని అణిచివేశాను. ఆమె ఇంతటి 'విజ్ఞాన గని' అని నేను కనిపెట్టలేకపోయాను. అయినా ఎలా కనిపెడతాను? అహంకారంతో కళ్ళు మూసుకుపోతే! ఆమెని క్షమించమని అడగడం చాలా చిన్న పదం" అనుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ఇంటికి చేరుకున్నాడు.


ఇంటి ముందు శ్రావణి మామూలుగానే వంటగదిలో పప్పు తిరగమోత వేస్తోంది. అభిరామ్ ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె చేతులు పట్టుకుని భోరున ఏడ్చాడు.


"నన్ను క్షమించు శ్రావణీ! నువ్వు అమాయకురాలివి కాదు, నేను అజ్ఞానిని. నా సంతోషం కోసం నీ గుర్తింపుని చంపుకున్నావు కదా.. నేను ఎంతటి మూర్ఖుడినో ఈరోజే అర్థమైంది. నీ మేధస్సు ముందు నేను ఎందుకు పనికిరాను. నువ్వు ఇంత గొప్ప దానివని తెలుసుకోలేకపోయాను.


నీ చదువు వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోయాను. నా దృష్టిలో ఎప్పుడూ ఆడాళ్ళకి పెద్ద చదువులు ఎందుకు? చిన్నపాటి అక్షర జ్ఞానం ఉంటే చాలు అనుకునేవాడిని. అటువంటిది ఇప్పుడు నువ్వు ఎంతో జఠిలమైన, క్లిష్టమైన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి, నా ఉద్యోగాన్ని, నా పరువుని నిలబెట్టావు. చదువుతోటే ఏదైనా సాధ్య అవుతుంది, ఏదైనా సాధించవచ్చు అని నిరూపించావు" అన్నాడు.


శ్రావణి కళ్ళనీళ్లు తుడుస్తూ, "మీరు నా భర్త అండీ. మీ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. పెళ్లిచూపులప్పుడే మీ గురించి నాకు తెలిసింది. నేను ఎప్పటి నుంచో ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాను. ఆఫీసుకు వెళ్లక్కర్లేదు. ఆ ఉద్దేశంతోటే మీకు నా చదువు వివరాలు పూర్తిగా చెప్పలేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను కాబట్టే మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా నేను పట్టించుకోలేదు. బయట నేను అథీనా కావొచ్చు, కానీ మీ ఇంట్లో మాత్రం మీ శ్రావణిని మాత్రమే" అంది చిరునవ్వుతో.


అభిరామ్ ఆ రోజు తన అహాన్ని వదిలేసి, తన భార్యలోని మేధస్సును గర్వంగా ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు.


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


శారద

రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page