మీ అడుగు జాడల్లో

Mi Adugu Jadallo - Telugu Emotional Story | Rohini bhairavajosyulu
మీ అడుగు జాడల్లో - తెలుగు భావోద్వేగ కథ | రోహిణి భైరవజోశ్యులు
Published in manatelugukathalu.com on 25/09/2026
“మీ అడుగు జాడల్లో....” ఒక హృదయాన్ని కదిలించే సామాజిక కుటుంబ కథ. భర్తను ఆదర్శంగా తీసుకుని అవయవదానం, దేహదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె తీసుకున్న నిర్ణయం ఈ కథకు స్ఫూర్తిదాయకమైన ముగింపును అందిస్తుంది.
మీ అడుగు జాడల్లో....
ఆ రోజే రాజారామ్ వచ్చేది.
కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది రజని.
‘ఇక ఇద్దరూ కలిసి జీవించే రోజు వచ్చేస్తోంది. భర్త దుబాయ్ వెళ్లి ఎంత కాలమైంది! పాపం ఏం తింటున్నారో ఏమో! ఎప్పుడూ తన చేతి వంట తప్ప వేరేవి రుచించేవి కావు. అలాంటిది ఇంత కాలం ఎలా ఉండగలిగారో! చివరగా పిల్లల పెళ్లికి వచ్చిందే. అప్పటికే సన్నగా అయిపోతున్న భర్తను చూసి, ఏడుపు తన్నుకు వచ్చింది తనకు. కనీసం ఇప్పుడన్నా సుఖంగా ఉండాలి.’
రజని ఈ మాటలు ఎన్నిసార్లు అనుకున్నదో!
ఆమెకు గతమంతా గుర్తుకు రాసాగింది.
అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన రాజారాం, "రజనీ! ఇదిగో కూరలు," అంటూ చేతిలో ఉన్న కూరల సంచీ భార్య చేతికిచ్చాడు.
అతను ఫ్రెష్ అప్ అయి వచ్చేటప్పటికి, గ్లాసులో వేడివేడి కాఫీ ఇచ్చింది రజని.
కాఫీని ఆస్వాదిస్తున్న రాజారాం "పిల్లలేరి?" అని అడిగాడు భార్యను.
"నాన్నా!" పరుగుపెడుతూ వచ్చి, తండ్రి ఒళ్లో కూర్చున్నారు తేజస్విని, వసంత్.
“మా ఫ్రెండ్స్ అంతా ‘స్పైడర్ మ్యాన్’ సినిమాకు వెళ్లారు. మనమూ వెళ్దాం నాన్నా!” గోముగా అడిగాడు వసంత్.
“ఈ రోజు లేట్ అయింది. ఇప్పుడు మనం వెళ్లేసరికి సినిమా మొదలు పెట్టేసి ఉంటారు. వచ్చే ఆదివారం తప్పకుండా వెళ్దాం,” బుజ్జగించాడు రాజారాం.
“నువ్వెప్పుడూ ఇలాగే అంటావు నాన్నా! అప్పటికి సినిమా వెళ్లిపోతుంది,” బుంగమూతి పెడుతూ అన్నది తేజస్విని.
కూతురి బుంగమూతిని చూసి పెద్దగా నవ్వేశాడు రాజారామ్.
“అయితే రేపే వెళదాం. సరేనా!” కూతుర్ని, కొడుకునూ ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
పిల్లలిద్దరూ సంతోషంగా గంతులేస్తూ, ఈ విషయం స్నేహితులందరికీ చెప్పడానికి బయటికి పరుగులు తీశారు.
"మామయ్య ఉత్తరం రాశారు" అని ఒక కవరు తెచ్చి ఇచ్చింది రజని. మామూలు సమస్యలే రాశారు సుబ్బరామయ్య.
సుబ్బరామయ్య, రంగనాయకి దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఆయన ఇంకో రెండేళ్లలో రిటైర్ అయిపోతారు. పిల్లలింకా సెటిల్ కాలేదు.
అందరికంటే పెద్దవాడు రాజారాం. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. పెళ్లై, ఇద్దరు పిల్లలు అతనికి. తనకొచ్చే జీతంతో తన సంసారం గడవడమే కష్టం. ఇక తండ్రికి కూడా పంపించాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
రాజారాం తరవాత ఇద్దరు ఆడపిల్లలు. అందరికన్నా చిన్నవాడు ధనుంజయ్ పదో తరగతి చదువుతున్నాడు.
రజని కట్నం తీసుకురాలేదని, రంగనాయకికి కోడలంటే కోపం. ఆ కట్నంతో కూతురికి పెళ్లి చేయొచ్చని ఆవిడ ఉద్దేశం. రజని అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చింది.
రాజారాంకు కట్నం తీసుకోవడం ఇష్టం లేదు. అందుకే అందం, అణకువ కలిగిన పేదింటి పిల్ల అయిన రజనిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.
"ఏవండీ! వసంత్ కూడా స్కూల్‌కు వెళ్తున్నాడు కదా! పిల్లల స్కూల్లోనే టీచర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. నేనా ఉద్యోగం చేస్తే ఆ డబ్బు మామయ్యగారికి పంపవచ్చు కదా!" అడిగింది రజని.
"నీకు వీలవుతుందా రజనీ! ఇప్పటికే చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెప్తున్నావు, జాకెట్లు కుడుతున్నావు. పైగా పనిమనిషి కూడా లేదు. ఇంత పనీ చేసుకోగలవా?" అడిగాడు.
"చేసుకోగలను. ప్లీజ్! ఒప్పుకోండి," బ్రతిమాలింది.
ఇప్పుడు ఇంట్లో అందరూ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఆదాయం కూడా కొంత పెరిగింది. ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు వాళ్లకు.
నెలానెలా ఏదో ఒక ఖర్చు రావడంతో, వచ్చిన డబ్బంతా అయిపోసాగింది.
ఒక నెలలో తండ్రి జబ్బు పడ్డాడని, సిటీలోని హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది. అప్పు తెచ్చి కట్టాడు హాస్పిటల్‌కు.
మరో నెలలో పిల్లల పరీక్షల ఫీజు కోసం అప్పు చేశాడు.
పండుగలు, పబ్బాలు అంటూ తల్లి చేసే ఖర్చులకు అంతు లేదు. ఇదేమని రాజారాం అడిగితే కోడలి మీద ఇంతెత్తున ఎగురుతుంది.
"పెళ్లికి ముందు నా కొడుకు ఎంత డబ్బు అడిగినా ఇచ్చేవాడు. నీతో పెళ్లయ్యాక మారిపోయాడు. ఖర్చుల గురించి నన్ను నిలదీస్తున్నాడు," అంటుంది.
అప్పులు ఎక్కువైపోయాయి. పెద్ద చెల్లెలు పెళ్లికి ఎదిగింది, పెళ్లి చేసేయ్యాలి అంటూ డబ్బు సర్దమని తండ్రి రోజూ ఉత్తరం రాస్తున్నాడు.
తమ్ముడేమో మెడిసిన్‌లో చేరాలనుంది, దానికి ఇప్పటినుంచే కోచింగ్ తీసుకోవాలి డబ్బు పంపమని అన్నయ్యకు లెటర్ రాస్తున్నాడు.
దిక్కుతోచడం లేదు రాజారాంకు.
ఒకరోజు అనుకోకుండా చిన్ననాటి స్నేహితుడు రాఘవ కనబడ్డాడు. ఖరీదైన బట్టలు, మెడలో బంగారు గొలుసు, ఖరీదైన గడియారం, బంగారు బ్రేస్‌లెట్— చూడగానే గుర్తుపట్టలేదు.
చదువు సరిగా అంటని కారణంగా చదువు మధ్యలోనే దుబాయ్ వెళ్లి ఏదో ఉద్యోగం సంపాదించాడట. ఊరిలోనూ, సిటీలోనూ రెండుమూడు ఇళ్లు కూడా కొన్నాడట.
చిన్ననాటి నుంచి రాజారాం ఇంటి పరిస్థితి ఎరిగినవాడు కనుక ఇప్పటి పరిస్థితికి ఆశ్చర్యపోలేదు కానీ జాలిపడ్డాడు.
"రాజా! నీకు అభ్యంతరం లేకుంటే దుబాయ్‌లోని మా కంపెనీలో నీకొక మంచి ఉద్యోగం సిద్ధంగా ఉంది. నీవు దానిలో చేరావంటే లక్షల్లో సంపాదించి ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు."
స్నేహితుడి సలహా బాగానే ఉంది కానీ భార్యాపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లడం ఎలా అని ఆలోచించాడు.
రజని, తల్లిదండ్రులు కూడా బలవంతం చేయడంతో ఒప్పుకోక తప్పింది కాదు రాజారాంకు.
పాస్‌పోర్ట్, వీసా వంటి ఫార్మాలిటీస్ అన్నింటిలోనూ రాఘవ బాగా సహాయం చేశాడు.
రజని చెవిదుద్దులు, గాజులు అమ్మి దుబాయ్‌కి వెళ్లాడు రాఘవతో కలిసి.
రాఘవ కంపెనీలోనే రాజారాంకు మంచి ఉద్యోగం దొరికింది.
కొన్నాళ్లు కుటుంబం గురించి దిగులుగా ఉండేది. నెలానెలా భార్యకు, తల్లిదండ్రులకు విడివిడిగా డబ్బు పంపడంతో మెల్లగా అన్ని అప్పులూ తీర్చేసింది రజని.
పిల్లల్ని మంచి స్కూల్లో వేసింది. అందరూ రజనిని ఉద్యోగం మానేయమని చెప్పినా, తను మాత్రం ఉద్యోగం మానలేదు.
ట్యూషన్లు, జాకెట్లు కుట్టడం కూడా మానలేదు. ఇంతకుముందు ఈ పనులన్నీ ఆర్థిక అవసరాల కోసం చేస్తే, ఇప్పుడు రాజారాం లేని ఇంట్లో ఒంటరిగా ఉండలేక బిజీగా ఉండడం కోసం చేస్తోంది. పిల్లలు కూడా బుద్ధిగా చదువుకుంటున్నారు.
సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు.
మొదటిసారి వచ్చినప్పుడు సన్నగా అయిపోయిన రాజారాంను చూసి దుఃఖం కట్టలు తెంచుకు వచ్చింది రజనికి. భార్యాభర్తలిద్దరూ విడిపోవాల్సి వచ్చినందుకు ఎంతో బాధపడ్డారు.
"కొన్ని సంవత్సరాలు కష్టపడితే బాధ్యతలు తీరిపోతాయి. నీవు ధైర్యంగా ఉంటేనే నేను అక్కడ పని చేయగలుగుతాను," భార్య కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు రాజారాం.
ఘనంగా చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు రాజారాం. తమ్ముడిని మెడిసిన్‌లో చేర్పించాడు. తృప్తిగా ఉన్న తల్లిదండ్రులను చూసి సంతోషించాడు. ఇక ఉద్యోగం మానేసి వచ్చేయమని రజని పోరింది.
"నా చెల్లెళ్ల, తమ్ముడి బాధ్యతలు తీరాయి కానీ నా బిడ్డలను అలా ఎలా వదిలేస్తాను?" అంటూ ఇంకా కొన్నేళ్లు పనిచేస్తానని చెప్పాడు రాజారాం.
ఇంతలో తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు జబ్బు పడడంతో డబ్బు మంచి నీళ్లలా ఖర్చయిపోయింది.
పిల్లలిద్దరూ ఇంజనీరింగ్‌లో చేరారు. అవి అయిపోగానే మంచి ఉద్యోగాలు రావడం, పెళ్లిళ్లు అయిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.
"ఇప్పుడు నేను ఒంటరి అయిపోయాను. నాకు ఆ డబ్బు అక్కరలేదు. మీరు తోడుంటే చాలు," అన్నది రజని. రాజారాం కూడా అక్కడ ఒంటరిగా ఉండలేకపోయాడు.
తను చేసిన వంట సహించేది కాదు. సగం రోజులు అభోజనంగానే పడుకునేవాడు. భార్యాపిల్లలు గుర్తుకువచ్చి నిద్రకు దూరమయ్యేవాడు.
చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, వెంటనే విమానం ఎక్కేశాడు భార్య దగ్గరికి రావడానికి.
గతం గుర్తుకు వచ్చి కళ్లనీళ్లు తుడుచుకుంది రజని.
భర్తను చూసి ఉలిక్కిపడింది రజని. అతని ఆకారం చూసి భయపడింది. అతని శరీరంలో ఎముకలు తప్ప కండ ఏ మాత్రమూ లేదు. అతన్ని పట్టుకుని వలవలా ఏడ్చేసింది.
రాజారాంకు కూడా కన్నీళ్లు ఆగలేదు. తన చేతి వంట తిని కోలుకుంటాడులేమ్మని ధైర్యం తెచ్చుకుంది. అలవాటు లేకేమో మొదట్లో ఒక పిడికెడు అన్నం కూడా తినలేకపోయేవాడు.
మెల్లగా కొంతకొంత ఎక్కువ మోతాదులో తీసుకోవడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకు మొహం తేటగా అవడం చూసి సంతోషపడ్డది రజని.
ఒకరాత్రి ఒకటే కడుపునొప్పితో మెలికలు తిరిగిపోతున్న భర్తను చూసి కంగారు పడింది. తనకు తెలిసిన వైద్యం చేసింది. చల్లటి మజ్జిగ ఇచ్చింది.
టాబ్లెట్ వేసుకున్నాక కాస్త స్థిమితపడ్డాడు. కానీ ఆ కడుపునొప్పి మళ్లీ మళ్లీ రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లారు. అన్ని పరీక్షలు చేసి లివర్ పూర్తిగా పాడయిందని చెప్పారు. ఈ మాటలకు కొయ్యబారిపోయింది రజని. సంపాదించిన డబ్బంతా నీళ్లలా ఖర్చుపెట్టినా ఫలితం దక్కలేదు. రెండు నెలలకల్లా ప్రాణం పోయింది. నిశ్చేష్టురాలైంది.
అందరికీ కబురు తెలిసి వచ్చారు.
ఏడుపే లేకుండా బొమ్మలా కూర్చున్న రజనిని చూసి షాక్‌కు గురైందని, ఆమెను ఏడిపించడానికి శతవిధాలా ప్రయత్నించారు.
లాభం లేకపోయింది. ఎవరితో మాటా పలుకూ లేకుండా, గోడకు ఆనుకుని బొమ్మలా కూర్చుండిపోయిన తల్లిని చూసి తేజస్విని తట్టుకోలేకపోయింది. అమ్మను కౌగలించుకుని ఒకటే ఏడుపు.
ఆడపడుచులు ఓదార్చారు. డాక్టర్ అయిన మరిది, వదిన దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. అప్రతిభురాలైంది రజని. ఎవరో వచ్చి రాజారాం పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి తరలించారు.
చనిపోయాక తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తున్నట్టు రాజారాం వాగ్దానం చేసి, సైన్ చేసిన పత్రాలు చూపించారు. పరిగెత్తుకుంటూ గది లోపలికి వెళ్లి, కుమిలి కుమిలి ఏడ్చింది రజని. ‘నేను ఏం పాపం చేశాను? కళ్లారా మిమ్మల్ని చూసుకునే భాగ్యం కూడా ఇవ్వలేదు మీరు,’ అని కుమిలి కుమిలి ఏడ్చింది.
పిల్లలు తమతో రమ్మన్నారు. తరవాత చూద్దాంలే అని వాళ్లను పంపేసింది.
“వదినా! ఇక్కడ నువ్వొక్కదానివే ఎందుకు? మాతో పాటు ఉందువు కానీ, మా ఇంటికి వెళ్దాం రా! ఇప్పుడు అమ్మానాన్నలు కూడా మాతోనే ఉన్నారు కదా! అందరం కలిసి ఉందాం పద,” అన్నాడు ధనుంజయ్.
“మీ అన్నయ్య గడిపిన ఇంట్లో, ఆయన జ్ఞాపకాలతో, నేను ఆ ఇంట్లోనే ఉంటాను,” అన్నది రజని నెమ్మదిగా.
“మేము ముసలివాళ్లమైపోయాం తల్లీ! వాడితో తల కొరివి పెట్టించుకోవాల్సిన మేము, వాడి చావు చూస్తూ, ఇంకా బతికే ఉన్నాము. మాకు గర్భశోకం మిగిల్చి వాడు వెళ్లిపోయాడు.
అందరి బాధ్యతలూ తీర్చి, అందరికీ వెలుగునిచ్చే కొవ్వొత్తిలా కాలిపోయాడు. నీకు తోడుగా ఉందామంటే, ఈ వయస్సులో నీకేమాత్రం సహాయం చేయలేము. పైగా నీతోనే చాకిరీ చేయించుకోవాలి.
దయచేసి మాతో పాటు ఉందువు గాని మా ఇంటికే రామ్మా!” గద్గద స్వరంతో అన్నది అత్తగారు. శుష్కహాసం చేసింది రజని. ఇక చేసేదేమీ లేక అందరూ వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వచ్చి, రజని యోగక్షేమాలు కనుక్కునేవారు.
ఒక్కొక్కసారి ఆమెను బతిమాలి తమ ఇంటికి తీసుకువెళ్లేవాళ్లు.
మళ్లీ తన స్కూల్, ట్యూషన్లు, జాకెట్లు కుట్టడం... ఇదే దినచర్య.
ఆరోజు భర్త ఫోటోకు దండ వేసి, "మీరు కొవ్వొత్తిలా కాలిపోయి అందరికీ వెలుగునిచ్చారు.
నేనేం పాపం చేశానని నేనడిగిన ఒకే ఒక కోరిక తీర్చలేదు? నాకు తోడుగా ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారు?" సాయంత్రం చీకట్లు పడుతున్న వేళ అలా నిస్తేజంగా కూర్చుండిపోయింది. ఎప్పటికో లేచి ఒక గ్లాసు నీళ్లు తాగి పడుకుంది.
"రజనీ!" అన్న పిలుపు వినిపించి ఉలిక్కిపడి లేచింది.
ఎదురుగా రాజారాం.
"ఏమండీ, నన్నొదిలిపోలారే! నేనేమైపోతానో, ఎలా బ్రతకాలో, ఒక్కసారైనా ఆలోచించారా? మీరు లేని ఈ జీవితం ఎంత శూన్యంగా ఉందో తెలుసా?” అని భోరున ఏడ్చింది.
"పిచ్చిదానా! నేనెక్కడికి పోయాను? నీ హృదయంలోనే ఉన్నాను. నీవు కూడా నీ అవయవాలను దానం చేసి, మరణించాక కూడా జీవించు. దీనినే ప్రచారం చేస్తూ అందరినీ ప్రభావితం చేయి. అలా అని వాగ్దానం చేయి," అన్నాడు.
"అలాగేనండి. మీ అడుగుజాడల్లో నడుస్తాను," అని భర్త చేతిలో వేసిన చేయి అలాగే జారిపోయింది. ఉలిక్కిపడి నిద్రలేచిన రజనికి ఎదురుగా ఫోటోలో నవ్వుతున్న రాజారాం కనబడ్డాడు.
‘మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని, రేపటి నుంచే అవయవ దానం గురించిన ప్రచారం ప్రారంభిస్తాను.
నా మరణం తరువాత నా దేహాన్ని, శరీర అవయవాలను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అడుగుజాడల్లో నడుస్తాను.’ కళ్లు తుడుచుకుని, నిద్రాదేవతను ఆహ్వానిస్తూ కళ్లు మూసుకుంది రజని.
***
రోహిణి భైరవజోశ్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: రోహిణి భైరవజోశ్యులు
నా పేరు రోహిణి భైరవజోశ్యులు. మా ఊరు అనంతపురం.
ప్రస్తుత నివాసం హైదరాబాద్.
పెళ్ళి తరువాత నేను M.Com., M.A ( ఇంగ్లీష్) చేశాను.
20 సంవత్సరాలు కామర్స్ లెక్చరర్ గా వివిధ కళాశాలల్లో పని చేశాను.
మా వారు బ్యాంక్ లో Assistant General manager గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ రీత్యా మేము
Asansol (West Bengal), Faridabad (Haryana) near Delhi, Kannur ( Kerala) తిరిగాము.
అలాగే ఆదోని ( కర్నూలు), నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్ళాము.
నేను 3 1/2 సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నాను.
నేను ఎక్కువగా కుటుంబ కథలు రాస్తుంటాను. అప్పుడప్పుడు హారర్ కథలు, హాస్య కథలు కూడా రాస్తుంటాను.
ఈనాడు ఆదివారం పత్రికలో రెండుకథలు పబ్లిష్ అయ్యాయి.
సంచిక, విశాలాక్షి, విశాఖ, ఉషా, సుమతి, సహరి, తిరుపతి రచయితల పోటీ, విజయనగరం జిల్లా రచయితల సంఘం మొదలగు పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.







Comments