top of page
Original.png

మదర్స్ డే

#Mother'sDay, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Mother's Day - New Telugu Story Written By Mayukha

Published In manatelugukathalu.com On 27/12/2025

మదర్స్ డే - తెలుగు కథ

రచన: మయూఖ


జానకమ్మకి కొడుకు అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమని ఆసరాగా తీసుకుని కోడలు రమ అత్తగారిని ఒక ఆట ఆడిస్తుంది. తను ఏదైనా చెప్పాలనుకుంటే భర్త వంశీ చేత చెప్పిస్తుంది. కొడుకు మాట కాదనలేని బలహీనత జానకమ్మది. కొన్ని సంఘటనలకి జానకమ్మకి మనసు బరువెక్కినా, కలి ప్రభావం అలాగే ఉంటుంది. నా కొడుకు మంచివాడే. అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటుంది. ఇటువంటి కలి ప్రభావాలు రోజుకి నాలుగు ఐదు ఆ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి.


‌ రమ ఉద్యోగం చేస్తోంది. నిజానికి రమ ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. జానకమ్మకి అమలాపురంలో పెద్ద ఇల్లు, బస్టాండ్ లో షాపింగ్ కాంప్లెక్స్, ముక్తేశ్వరం దగ్గర 20 ఎకరాల కొబ్బరి తోట ఉన్నాయి. పొలం మీద వచ్చే కౌలు డబ్బు వంశీ తీసుకుంటాడు. షాపుల మీద వచ్చే అద్దెలు జానకమ్మ తీసుకుంటుంది. తను మాత్రం ఆ డబ్బు ఏం చేసుకుంటుంది?. ఇద్దరి మనవలకి పుట్టినరోజులకి, పండగలకి మళ్లీ వాళ్లకే ఇస్తూ ఉంటుంది.


రోజు జానకమ్మ వంట చేస్తుంది. ఆదివారాలు మాత్రం రమ చేస్తుంది. కానీ నెలలో రెండు ఆదివారాలు ఏదో వంక పెట్టి బయట తినేస్తుంది రమ. అప్పుడు ఆ ఆదివారాలు కూడా జానకమ్మ వంట చేయవలసి వస్తోంది.

******

జానకమ్మకి భర్త పోవడంతో కొడుకు దగ్గరకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇక్కడ పనే. అమలాపురంలో అయితే పాలేరు ఉండేవాడు కాబట్టి, పై పని అంతా చేసేవాడు. తనకా ఓపిక తగ్గిపోతోంది. కోడలు వంట మనిషిని పెట్టిన బాగుండేది. చేయలేకపోతున్నాను. అనుకుంటూ ఆదివారం ఉదయాన్నే పూజ చేసుకుని, కోడలు కోసం ఎదురుచూస్తోంది."ఇంకా లేవట్లేదు ఏమిటా అని!.


ఇంతలో కొడుకు , కోడలు రెడీ అయ్యి బెడ్ రూమ్ లోంచి బయటకు వచ్చారు. వాళ్ళని చూడ్డంతోటే జానకమ్మ నీరు కారిపోయింది."అయితే వీళ్ళు బయటికి వెళ్తారన్నమాట. ఈ పిల్లల్ని చూడడం నావల్ల కావట్లేదు. వీళ్ళ అల్లరిభరించలేకపోతున్నాను. తల్లి అంటే భయం కొద్ది నోరు మూసుకుంటారు. తల్లి దగ్గర లేకపోతే నన్ను ఒక ఆట ఆడిస్తారు. అమ్మో! వీళ్ళని భరించడం నావల్ల అవట్లేదు"అనుకుంటోంది జానకమ్మ.


ఇంతలో కొడుకు"అమ్మా!ఈరోజు మదర్స్ డే! అంటే తల్లిని గౌరవించే రోజు. నీ కోడలు నీకు ఏదో గిఫ్ట్ కొంటోంది. అందుకే బజారుకు వెళ్ళొస్తాం"అన్నాడు కొడుకు.


"అదేమిట్రా! అప్పుడే తొమ్మిది న్నర దాటుతోంది ఎప్పుడు వెళ్లి, ఎప్పటికీ వస్తారు? వంట ఎప్పుడు చేస్తుంది?"అంది ఆందోళనగా. ఎక్కడ వంట తనమీద పడుతుందోనని భయపడుతూ.


కోడలు వచ్చి"అత్తయ్య గారూ! ఈరోజు మదర్స్ డే కదా! మీకు నచ్చిన ఐటమ్స్ చేయండి. సరేనా! ఎటూ మీ పూజ అయిపోయింది కాబట్టి, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి అప్పుడు వంట మొదలెట్టండి. ఇదిగో పిల్లలూ,! మామ్మని విసిగించకోడదు. సరేనా! వెళ్ళొస్తాం అత్తయ్య గారు"అంటూ వెళ్లిపోయింది.


జానకమ్మ అనుకున్నంతా అయింది. ఎక్కడలేని నీరసం వచ్చేసింది."ఉదయాన్నే అయితే చేయగలదు. కానీ ఎండ ఎక్కిన తర్వాత వంట చేయలేదు"వాషింగ్ మిషన్ లో బట్టలేసి పనిమనిషి కోసం ఎదురు చూస్తుంటే, పక్కింటి పార్వతమ్మ చెప్పింది"ఈరోజు పనిమనిషి రాదని మాకు కబురు చేసింది"అంది.


"అయ్యో! అలాగా! అయితే ఈ పని కూడా నా మీదే పడింది. మా కోడలు అమ్మ రోజు అని నాకు గిఫ్ట్ కొనడానికి బజారుకు వెళ్ళింది. ఇప్పుడు వంట కూడా నేనే చేయాలి"అంది బాధగా.


"అదేంటి! మదర్స్ డే అంటే నిన్ను కూర్చోబెట్టి నీకు చేయవలసింది పోయి, నీ చేత పని అంతా చేయించడం ఎంత దారుణం!. మా కోడలైతే అన్నీ హోటల్ నుంచి ఆర్డర్ పెట్టింది. ఈరోజు ఒక్క పని కూడా నన్ను ముట్టుకోనివ్వట్లేదు. కొత్త చీర తెచ్చింది. సాయంత్రం చీర కట్టుకొని అందరం గుడికి వెళతాం"సంతోషంగా.


జానకమ్మకి తన పరిస్థితిని చూసి తనకే జాలేసింది.

అంట్లు తోముకుని వంట చేసేటప్పటికి మధ్యాహ్నం రెండు అయింది. మధ్యలో పిల్లల తగువులు తీరుస్తూ కొడుకు కోడలు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో కొడుకు నుంచి ఫోన్."అమ్మా! మేం హోటల్ లో లంచ్ చేసి, సినిమాకి వెళ్లొస్తాం. ఈ విషయం పిల్లలకు చెప్పకు"అదీ సారాంశం.


జానకమ్మకి ఉక్రోషం, ఉడుకు మోత్తనం వచ్చేసాయి. ఏమి చేయలేని, ఎవరినీ ఏమీ అనలేని తన అసహాయ స్థితికి ఏడుపొచ్చింది జానకమ్మకి. పిల్లలకి అన్నం పెట్టి తను తినేటప్పటికి మూడు అయింది.


సాయంత్రం చీకటి పడుతుంటే కొడుకు కోడలు వచ్చారు. పిల్లలకి కర్రీ పఫ్ లు, చాక్లెట్లు తెచ్చారు. ఆ రెండు జానకమ్మ తిననివే.


పిల్లలు అడిగారు"అమ్మ! మామ్మ కి ఏం తెచ్చారు?"


"మీ నాన్నని అడుగు"అంది కోడలు.


తండ్రి కొడుకు కేసి చూసి"మా అమ్మకి ఎక్కువ ఏమిష్టం? పువ్వులు. పెద్ద పూలబొకే కొన్నాం. చాలా బాగుంది. సినిమాకి వెళ్ళామా! పక్క సీట్లో పెట్టి, తీసుకురావడం మర్చిపోయాం. అందుకే అమ్మకి కోపం వచ్చింది".అన్నాడు కొడుకు.


జానకమ్మ కోడలు కోపం అర్థం చేసుకొని"పిచ్చి పిల్ల! తనకి బొకే ఇవ్వలేదని బాధపడుతున్నట్టు ఉంది"అనుకుని"పోనీలే రమ! బొకే ఇవ్వలేదని బాధపడకు"అంది.


"ఇవ్వడం గురించి కాదు నేను బాధపడుతుంది! మర్చిపోవడం గురించి అంటున్నాను. రెండు రోజుల్లో బాబు బర్త్డే కదా! హాల్లో టేబుల్ మీద పెడితే బాగుంటుంది అని తీసుకున్నాను. రెండు విధాల ఉపయోగపడుతుందని"అంది కోడలు.


ఆ సమాధానానికి జానకమ్మ చాలా బాధపడింది."తన ఉనికే ఇక్కడ ప్రశ్నార్థకం అయింది. తన పుట్టినరోజు ఎటూ చెయ్యరు. ఇదేనా తను చేయమందా! ఇటువంటి రోజు ఒకటి ఉంటుందని తనకు తెలుసా! బయటకు వెళ్లడానికి ఇది ఒక సాకుగా తీసుకుని వెళ్ళిపోయింది. తనకి బొకే ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, కోడలి సమాధానానికి జానకమ్మ మనసు తట్టుకోలేకపోయింది.


ఉదయం నుంచి తను పడిన శ్రమ గుర్తుకు వచ్చి, మదర్స్ డే ప్రతి సంవత్సరం కాకుండా నదీ పుష్కరాల్లా 12 సంవత్సరాలకి ఒకసారి వస్తే బాగుండును అనుకుంది బాధగా.


ఇదా మదర్స్ డే ముచ్చట అనుకుంది విరక్తిగా.


******శుభం *******


మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page