అనుమానం పెనుభూతం
- Munipalle Vasundhara Rani

- 4 days ago
- 3 min read

Anumanam Penubhootham - Telugu Moral Story | Vasundhara Rani Munipalle
అనుమానం పెనుభూతం- తెలుగు నీతి కథ | వసుంధర రాణి మునిపల్లె
మన జీవితంలో కొన్నిసార్లు అనుమానం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. నిజం తెలుసుకునే ముందు మనం ఇతరులపై అనవసరంగా అనుమానాలు పెంచుకుంటే, అది సంబంధాలను దెబ్బతీస్తుంది. అలాంటి పరిస్థితిని అద్భుతంగా చూపించే కథే “అనుమానం పెనుభూతం”. |
సుధ ఇల్లంతా జల్లెడ పడుతోంది. సోఫా కుషన్లు విదిలించి, టీపాయ్ కింద తలపెట్టి చూసి, చీపురుతో మూలమూలలా గీకుతోంది.
ఆమె ఆందోళన చూసి పిల్లలిద్దరూ కంగారుగా పరుగున వచ్చారు. "ఏంటమ్మా అంతలా వెతుకుతున్నావు, ఏమైనా పోయిందా?" అని అడిగారు.
సుధ నుదుటి మీద చెమట తుడుచుకుంటూ బాధగా చెప్పింది.
"రేయ్.. నా బంగారు దిద్దు ఒకటి కనిపించడం లేదురా. వారం క్రితం ఆఫీసుకి వెళ్లేటప్పుడు వేరే సెట్ దిద్దులు పెట్టుకున్నాను. సరే, ఇవి తీసి లోపల పెడదామని అనుకున్నాను కానీ హడావిడిలో మళ్ళీ గదిలోకి వెళ్లే టైం లేకపోయింది. అందుకే నా హ్యాండ్ బ్యాగ్ బయట ఉండే చిన్న జిప్పులో వేశాను. అందులోనే నా ఆఫీసు క్యాబిన్ తాళాలు, మన ఇంటి బీరువా తాళాల గుత్తి కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆ విషయమే పూర్తిగా మర్చిపోయాను.
ఈరోజు ఆటో దిగేటప్పుడు ఆటో అబ్బాయికి డబ్బులు ఇద్దామని అదే జిప్పు తీస్తే.. తాళాల మధ్య ఒక దిద్దు మాత్రమే ఉంది, రెండోది లేదు" అని దిగులుగా అంది.
అసలు అది ఎప్పుడు, ఎక్కడ పడిపోయి ఉంటుందో అర్థం కాక సుధ బుర్ర పాడైపోతోంది. ఈ వారం రోజుల్లో ఆమె ఆ బ్యాగ్ జిప్పును చాలాసార్లు తీసింది. ఉదయం ఆఫీసుకి వెళ్ళగానే క్యాబిన్ తెరవడానికి ఆ తాళాల గుత్తిని తీసింది, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక బీరువాలో వస్తువులు పెట్టడానికి అదే జిప్పులో ఉన్న తాళాలను వాడింది.
ఆ తాళాలు తీసేటప్పుడో, పెట్టేటప్పుడో ఆ గుత్తికి తగిలి దిద్దు కింద పడిపోయి ఉండాలి. వస్తువు ఒకచోట ఉంటే, అనుమానం వంద చోట్ల ఉంటుంది అన్నట్లు సుధ ఆలోచనలు ఇప్పుడు మనుషుల మీదకు వెళ్లాయి. ఇప్పుడు వెతికితే ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. కానీ.. ఈ వారం రోజులుగా రోజూ ఇల్లు శుభ్రం చేస్తున్న పనిమ్మాయి లక్ష్మికి ఎప్పుడైనా దొరికి ఉండొచ్చు కదా! ఒకవేళ ఆమెకు దొరికితే తిరిగి ఇస్తుందా? పోనీ ఆఫీసులో క్యాబిన్ తాళాలు తీసేటప్పుడు పడి ఉంటే.. నా రూమ్ చిమ్మే ఆయాకి దొరికి ఉండొచ్చు. బంగారం ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వాలని ఏముంది? దొరికిన వస్తువు దేవుడిచ్చిన వరప్రసాదంలా దాచేసుకుని ఉంటుంది అని సుధ మనసులో అనుమానపు పక్షులు ఎగరడం మొదలయ్యాయి.
ఆ రోజంతా సుధ మనసు ప్రశాంతంగా లేదు. పనమ్మాయి లక్ష్మి ఇల్లు ఊడుస్తుంటే ఆమె వంకే పరీక్షగా చూడసాగింది. రోజూ ఎంతో నమ్మకంగా పనిచేసే లక్ష్మి, ఈరోజు ఎందుకో తన కళ్లలోకి చూడటం లేదని సుధకు అనిపించింది. అటు ఆఫీసులో ఆయాను చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. నేను తాళాలు తీసినప్పుడే అది పడిపోయి ఉంటుంది, ఆయా చూసి చూడనట్లు తీసేసిందేమో అని తనలో తానే కుమిలిపోయింది.
బ్యాగులో ఉన్న విషయం ముందే గుర్తొచ్చుంటే తాళాలు తీసేటప్పుడే జాగ్రత్తగా చూసుకునేదాన్ని కదా అని తనని తాను తిట్టుకుంటూనే, అందరినీ దొంగల్లా చూడటం మొదలుపెట్టింది.
మరుసటి రోజు ఆఫీసులో తన క్యాబిన్ లో ఫైల్స్ అన్నీ వెతుకుతుంటే, డ్రాయర్ మూల ఒక చిన్న ఫైల్ కింద తళుక్కున మెరిసింది. తీసి చూస్తే.. అది తన బంగారు దిద్దు! ఆఫీసు క్యాబిన్ తాళాలు తీస్తున్నప్పుడు అది జారి డ్రాయర్ లో పడిపోయింది. అది చూడగానే సుధకు ప్రాణం లేచి వచ్చినట్లయింది కానీ, వెంటనే ఒక తీవ్రమైన అపరాధ భావం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అమ్మయ్య! దొరికింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇది దొరకకపోయి ఉంటే... పాపం ఆ లక్ష్మిని, ఆఫీసు ఆయాను జీవితాంతం అనుమానంతోనే చూసేదాన్ని కదా! వారు ఎంత నిజాయితీగా పని చేసినా, నా మనసులో మాత్రం వారిని దొంగలుగానే ముద్ర వేసేదాన్ని. నా అజాగ్రత్తకు వారు బలి అయిపోయేవారు కదా అని సుధ మనసంతా బాధతో నిండిపోయింది.
అనుమానం అనేది పెనుభూతం లాంటిది. అది మన కళ్ళకు పొరలు కమ్మేలా చేస్తుంది.పోగొట్టుకున్న వస్తువు దొరికినప్పుడు కలిగిన సంతోషం కన్నా, ఏ పాపం తెలియని వారి మీద అనవసరంగా పెంచుకున్న అనుమానం పట్ల సుధకు ఎక్కువ బాధ కలిగింది. తను నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఆ నిందని ఇతరుల మీద వేయడం ఎంత అన్యాయమో ఆ రోజు ఆమెకు పూర్తిగా బోధపడింది.
“అనుమానం అనేది పెనుభూతం లాంటిది… అది మన కళ్ళకు నిజాన్ని కనిపించనివ్వదు.” |
సమాప్తం
ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం www.manatelugukathalu.com సందర్శించండి.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.
#AnumanamPenubhutham, #అనుమానంపెనుభూతం |




Comments