నేనిక ఈ అడవిదారి సాగిపోనా!
- Pandranki Subramani

- 18 hours ago
- 10 min read

Nenika E Adavidari Sagipona - Telugu Emotional Story | Pandranki Subramani
నేనిక ఈ అడవిదారి సాగిపోనా! - తెలుగు భావోద్వేగ కథ | పాండ్రంకి సుబ్రమణి
| ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 03/09/2026
మనిషి జీవితంలో కొన్ని బంధాలు ముగిసిపోయాయని అనుకున్నా, వాటి జ్ఞాపకాలు మాత్రం పూర్తిగా చెరిగిపోవు. ప్రభుత్వ అధికారిగా, భార్యా పిల్లలతో స్థిరమైన జీవితాన్ని గడుపుతున్న రాఘవకు ఒకరోజు గతం అనూహ్యంగా ఎదురవుతుంది. కాలేజీ రోజుల్లో ప్రేమించిన శ్వేతాదేవి ఇప్పుడు ప్రముఖ సినీతార. ఎన్నేళ్ల తర్వాత ఆమె చేసిన ఒక్క ఫోన్‌కాల్ రాఘవను ప్రేమ, బాధ్యత, కృతజ్ఞత, మానవత్వం మధ్య తీవ్రమైన సంఘర్షణలోకి నెడుతుంది. పాండ్రంకి సుబ్రమణి రచించిన “నేనిక ఈ అడవిదారి సాగిపోనా!” మానవ సంబంధాల్లోని సంక్లిష్టతను ఆవిష్కరించే భావోద్వేగ కథ.
రాఘవ ప్రభుత్వ కార్యాలయంలో చేరకముందు ఎవడైనా అదోలా ముఖం పెట్టి, “అబ్బ! ఏం పనిరా బాబూ! కడుపు నింపుకోవడానికి కూడా తీరిక దొరకడం లేదంటే నమ్మండి” అంటే విని విస్తుపోయేవాడు. డాంబికం అనుకునేవాడు. ఎక్కడైనా అంత తీరికలేని పని ఉంటుందా, ఎంత పొడిగించినా రోజులో ఇమిడేది ఇరవై నాలుగు గంటలేగా, అని అబ్బురపడుతూ కనుబొమ్మలెగరేసేవాడు.
కానీ, అతడు అడుగు పైన అడుగు వేస్తూ ప్రభుత్వాధికారిగా గజెటెడ్ స్థాయి అందుకున్న తరువాత తెలిసొచ్చింది, చాలా మందికి కాకపోయినా కొద్ది మందికైనా అటువంటి గడ్డు పరిస్థితి అడపాదడపా ఎదురవుతూనే ఉంటుందని. అది కాదనలేని వాస్తవమని.
అతడు శంషాబాద్ విమానాశ్రయంలో విమానమెక్కి ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో దిగి ప్రీపైడ్ టాక్సీ పట్టుకుని తిన్నగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న డిపార్టుమెంటు విడిదికి రిపోర్ట్ చేసి అక్కడ అల్పాహారం తీసుకున్నాననిపించి, ఆదరాబాదరాగా సూటుకేసు తెరిచి అక్కడి వాతావరణానికి తగ్గట్టు సూటుతో టై వేసుకుని అక్కణ్ణించి అటు పోతున్న ఆటోరిక్షాను అందుకుని ట్రైనింగ్ అకాడమీ చేరుకున్నాడు.
ఆ తరువాత ట్రైనింగ్ క్లాసులు పూర్తయి ఊపిరి పీల్చుకుంటూ బయటకు వచ్చాడో లేదో వసంత్ విహార్ నుండి డిపార్టుమెంటు లీగల్ అడ్వైజర్ నుండి పిలుపు వచ్చింది; తనను అత్యవసరంగా కలుసుకోమని, ఢిల్లీ హైకోర్టులో మరునాడు ముఖ్యమైన కేసొకటి హియరింగ్ కి రాబోతున్నదని ఆ కేసు విషయమై తనతో వచ్చి చర్చించమని.
రాఘవ "ఉఁ" అంటూనే తటపటాయించాడు. హైదరాబాద్ కి చెందిన తను ఇక్కడ ఢిల్లీకి చేరుకున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ లీగల్ అడ్వైజర్ కి ఎలా తెలుసుంటుంది? ఇంకెవరు, తమ ప్రాంతీయ ఆఫీసు హెడ్డే చెప్పి ఉంటాడు, పనిలో పనిగా కేసు వ్యవహారం ముగించేయమని.
ఇక చేసేది లేక, భారంగా ఓ నిట్టూర్పు విడిచి విడిదికి వెళ్లి విరామం తీసుకోకుండానే ట్రైనింగ్ అకాడమీ నుండి తిన్నగా వసంత్ విహార్ కి బయల్దేరాడు. అక్కడ క్యూకట్టి కూర్చున్న ఇతర డిపార్టుమెంటు వాళ్లను చూసి గుండె గుభేలుమంది. చచ్చీచెడీ ఎట్టకేలకు తన వంతు వచ్చిన తరువాత కేసు వ్యవహారం చర్చించి బయటకు వచ్చి చూస్తే ఇంకేముంది, రాత్రి పదిన్నర. పరుగున వెళ్లి హైరోడ్డున వెళ్తున్న టాక్సీని ఆపి విడిది చేరుకుని పరికిస్తే ఆఫీసు ప్యాంట్రీ మూసేశారు.
కడుపులో ఎలుకలు పరిగెడుతున్న సమయం. లేవలేక నడవలేక నీరసంగా అడుగులు వేసుకుంటూ వెళ్లి హ్యాండ్ బ్యాగులో ఉంచుకున్న బిస్కెట్లు మూడు తిని పాలమ్ముతున్న పఠాన్ వద్ద ఏకబిగిన రెండు గ్లాసుల పాలు తాగి విడిది రూము చేరుకున్నాడు రాఘవ. ఇది కాదా బ్రతుకు పోరాటం! గ్రైండర్ మిషన్ లా తిప్పుతున్న జీవన శైలిలో విరామం తీసుకునే తీరికెక్కడిది? మూడు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము ముగిసి, ట్రైనింగ్ తీసుకున్న వైనానికి రుజువుగా ప్రశంసాపత్రాన్ని అందిపుచ్చుకుని పాలెం ఎయిర్‌పోర్టుకి బయల్దేరేటప్పుడు రాఘవ గట్టిగా అనుకున్నాడు, ఢిల్లీలో తను పడ్డ అవస్థల గురించి పరమేశ్వరికి ససేమిరా చెప్పకూడదని.
"అన్నానికి సహితం దూరమై నానా తిప్పలు పడుతూ మీకు మీరుగా అనారోగ్యం కొనితెచ్చుకునే అధికారం మీకు లేదు. మీకు ఆఫీసే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న భార్య, ఇద్దరు బిడ్డలున్నారన్నది మరవకూడదు" అని నిలదీస్తుంది.
పరమేశ్వరి అభిప్రాయంలో వాస్తవం ఉంది. కాదనలేడు. కానీ జీవితం ఎప్పుడూ ఎవరిష్ట ప్రకారమూ నడుచుకోదు కదా! ఇక అసలు విషయానికి వస్తే జీవితానికి ఒకరు చెప్పే మాటను వినే అలవాటెప్పుడుంది? దానిది సర్వాధికారం. పోర్టికోలో టాక్సీ దిగి ఇంట్లో లోపలికి వచ్చేటప్పటికి పరమేశ్వరి నవ్వు ముఖంతో ఎదురొచ్చింది. యథా ప్రకారం ఆమె రాఘవ నెక్ టైని వదులు చేసి అతడి చేతినుండి సూటుకేసు అందుకుని ప్రక్కన పెట్టి అతణ్ణి సాదరంగా సోఫాలో కూర్చోబెట్టి నుదుట ఆప్యాయంగా ముద్దు పెట్టి, "ఇదిగో ఇప్పుడొస్తాను" అంటూ లోపలికి వెళ్లింది.
భార్య పరామర్శతో అతణ్ణి అంతవరకూ ఊపిపారేసిన అలసట ఎక్కడికో ఎగిరిపోయినట్లనిపించింది. కొన్నాళ్ల ఎడబాటు తరువాత ఎడారి మధ్య చెలమ చూసినట్లనిపించింది. అతడికి వెంటనే ఎవరో సినీ గేయకవి నిర్వచించిన వాక్యం వీణానాదంలా మనసున మ్రోగింది: "అనువైన అనురాగమయి భార్యగా లభించడం దైవమిచ్చిన వరమే!"
అతడలా తలపోస్తూ టీవీ ఆన్ చేయడానికి లేచాడు. అప్పుడు పరమేశ్వరి గొంతు వినిపించింది, "కొంచెం ఆగండి. ముందు కాఫీ తాగడం ముగించండి. మీకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, కనీవినీ ఎరుగనిది."
అతడు ఆ మాటకు నవ్వుతూ భార్య చేతినుండి కాఫీ కప్పు అందుకున్నాడు, "ఆడాళ్లు ఆవేశాన్ని, ఆనందాన్ని రెంటినీ ఆపుకోలేరు సుమా!" అని మనసున అనుకుంటూ. ఆ తరువాత భార్య ఆదేశానికి తలొగ్గుతూ కాఫీ తాగడం పూర్తి చేసి ఇటు తిరిగాడు విషయమేమిటన్నట్టు చూపులు సారిస్తూ.
"ఎవరో ఒకావిడ, ముక్కూ మొహం ఎరుగని ఆవిడ మీపైన జోకులు కొడుతోంది ఫోనులో."
ఏమని, అన్నట్టు కనుబొమ్మలెగరేసి చూశాడు రాఘవ నవ్వు ముఖంతో.
"పేరడిగితే శ్వేతాదేవి అంటుంది. ఫిల్మ్ స్టార్ అంటుంది. మీతో అర్జంటుగా మాట్లాడాలంటుంది. 'జోకులు కొట్టడానికి వేళాపాళా లేదా! పొద్దుపోకపోతే ఏదో పార్కులోనో పబ్బులోనో గడపాలి గానీ, సంసారుల ఇళ్లకు ఫోనులు చేసి చెలగాటాలాడటమా!' అని మందలించాను. అయినా విడిచిపెడితేనే కదా? ఫెవికాల్ లా పట్టుకుందంటే నమ్మండి."
భార్య మాటలకు అతడేమీ అనలేదు. తల వంచుకుని నేల చూపులు సారిస్తూ కూర్చున్నాడు. అప్పుడు పరమేశ్వరి స్టూలు తెచ్చుకుని భర్తకు ఎదురుగా కూర్చుని అంది, "అదేమిటండీ, ఎవరో పిచ్చి వాజమ్మ మాటలకు మీరు నొచ్చుకుంటున్నట్టు తల వంచుకుంటారు! మీకు తెలియకపోవచ్చు గానీ, ఇటువంటి దురదగొండి ఫోనులు అడపాదడపా వస్తూనే ఉంటాయి. అటువంటి పిచ్చి పిచ్చి కాల్స్ కి నొచ్చుకుంటే ఎలా!"
అప్పుడతను నోరు విప్పాడు, "ఒక్క నిమిషం ఆగు పరమేశ్వరీ! అది ఫేక్ కాల్ కాదు. నిజమైన కాలే! ఆమె నిజంగా సినీ స్టార్ శ్వేతాదేవే."
ఆ మాటకు ఆమె కనురెప్పలల్లార్చింది నమ్మలేనట్టు. ఎట్టకేలకు తేరుకుంటూ స్వగతంలా అడిగింది, "ఆవిడతో మీకెప్పుడు పరిచయం ఏర్పడింది?"
“నిన్న మొన్నటి పరిచయం కాదు. కాలేజీ రోజుల్లో క్లాస్‌మేట్.”
దానికి ఆమె వెంటనే రియాక్టయింది, “క్లోజ్‌నెస్ ఉండేదా!”
ఉఁ అని తలూపుతూ బదులిచ్చాడు, “అప్పటి రోజుల్లో! కారణాంతరాల వల్ల ఇద్దరి దారులూ వేరయిపోయాయి. ఆమె గ్లిట్టరింగ్ వరల్డ్‌లోకి వెళ్లిపోయింది. నేను కుటుంబ బాధ్యతల బరువు మోసుకుంటూ ఉద్యోగ వెతుకులాటలో పోరాడుతూ ఇటు వచ్చేశాను. అంతే! నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఇప్పుడు అటువంటిదేమీ మా మధ్య లేదు. నీటిమీది గీతల్లా చెరిగిపోయాయి.”
“మరి నాకీ విషయం ఎప్పుడూ చెప్పలేదే?”
“చెప్పాలనిపించలేదు, చెప్పదగ్గ విషయం కాదనుకుని.”
“సరే, ఆ విషయాన్ని ప్రక్కన పెడదాం. మనకు పెండ్లై ఆరేళ్ల తరువాత, ఇద్దరు పిల్లల తరువాత ఇప్పుడు ఎందుకు పనిగట్టుకుని పలకరిస్తుంది?”
తనకు తెలియదంటూ చటుక్కున లేచాడు రాఘవ మేడ మెట్లెక్కడానికి. అప్పుడామె అతణ్ణి ఆపి చేతికి శ్వేతాదేవి ఫోన్ నెంబర్ అందిచ్చింది. అతడేమీ అనకుండా ఆ స్లిప్పుని అందుకుని అక్కణ్ణించి కదలి వెళ్లిపోయాడు.
తిన్నగా పైకి చేరుకుని రాఘవ కిటికీ గుండా బయటకు చూశాడు. ఆకాశం మబ్బుపట్టింది. నదీతీరాన చెలరేగే సముద్ర గాలుల్లా ఆలోచనలు అతణ్ణి కమ్మేశాయి. ఒకప్పటి జ్ఞాపకాలు నీటి బిందువుల్లా మనసు సరోవరంలోకి నిశ్శబ్ద క్షణాల్లా రాలాయి. ఎన్నాళ్ల మాట! ఎప్పటి మాట! అంతా గతజల సేతుబంధనమనేగా అనుకున్నాడు తను.
మళ్లీ మళ్లీ ఇప్పుడు శ్వేత తన గురించి తలపోయడమేమిటి? తనపట్ల ఆరాటం చూపించడమేమిటి? ఇప్పుడతని ఆలోచనలు తుఫాను గాలికి చెల్లాచెదురైపోయే ఎండుటాకుల్లా అల్లాడసాగాయి. గుండెలోతుల్లో నుండి డప్పుమోతలా కదలికలు వినిపించసాగాయి.
అప్పటి తమ స్నేహపు ప్రవాహం నెలా రెండు నెలలా! కాలేజీలో నిరాటంకంగా సాగిన రెండు సంవత్సరాల సహవాసం కదూ! పచ్చగా తియ్యతియ్యగా తనకిప్పటికీ జ్ఞాపకం, శ్వేతను మొదటిసారి ఇందిరా పార్కులో ముద్దు పెట్టుకోవడం. ఆ రీతిన మరింత దగ్గరకావడం. మరి ఆ తరువాత ఏమైంది? గూటి నుండి ఎగిరిపోయిన గువ్వలా మాయమైంది మిరుమిట్లు గొలిపే మాయా ప్రపంచంలోకి, రంగురంగుల చలనచిత్ర ప్రపంచంలోకి.
తానెప్పుడైనా అనుకున్నాడా శ్వేత తనను నడిరోడ్డున విస్తరిలా విడిచిపెట్టి వెళ్తుందని, తన ప్రేమను కాలరాసి పోతుందని? కానీ చివరకు జరిగిందదే! తన హృదయాన్ని కడవరకూ పిండి ధగధగ మండే నిప్పులో పోసి తన జీవన ప్రాంగణం నుండి నిష్క్రమించింది.
అది జరిగింది ఎప్పుడు, సుమారు ఆరేళ్ల క్రితం. మళ్లీ ఇప్పుడు, అవన్నీ ఆరిపోయిన గతకాలపు వాసన లేని అత్తరు మరకలేగా! అతడు తల బలంగా విదిలించాడు, దేనినో దులిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు. ఎటువంటి సందర్భంలోనూ పరమేశ్వరిని నొవ్వకుండా చూసుకోవాలని తీర్మానించాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అతడిక అక్కడ నిల్చోలేదు. చకచకా దుస్తులు తీసి దండేనికి తగిలించి స్నానాల గదిలోకి ప్రవేశించాడు. షవర్లో తలనిండుగా స్నానం చేసి తిన్నగా పూజా గదిలోకి ప్రవేశించి భగవద్గీత గ్రంథాన్ని విప్పాడు.
విప్పిన వెంటనే అతడికి సాక్షాత్కరించింది: "యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ | తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ||"
శ్లోకాన్ని పఠించిన తరువాత తాత్పర్యంలోకి నిశ్చలంగా చూశాడు రాఘవ: "(పూర్వజన్మ సంస్కారము చేత) చంచలమును అస్థిరమునగు మనస్సు ఏయే విషయముల దెసకు పరుగిడుచుండునో ఆయా విషయముల నుండి మరల్చి, ఆత్మయందే స్థిరమొనర్చునది."
అతడలా కాసేపు పఠనం చేసి ధ్యాననిమగ్నుడై పూజా గది నుండి బయటకు వచ్చాడు. అప్పుడతనికి తెలియకుండానే అతడి చూపు షోకేసు పైనున్న తన మొబైల్ పైన పడింది. అతడి కాళ్లు ముందుకు సాగలేదు. ఆ మొబైల్ నుండి శ్వేత ముఖారవిందం అతణ్ణి పలకరించినట్లయింది. బరువుగా నిట్టూరుస్తూ దానిని అందుకుని ప్రక్కనున్న స్లిప్పు తీసుకుని మొబైల్ నెంబర్ గుర్తుపెట్టుకుని శ్వేతకు ఫోన్ చేశాడు.
"ఎవరూ!" అన్న గొంతు విని అతడాగాడు. "ఎవరండీ!" మళ్లీ అదే గొంతుతో అదే ప్రశ్న.
అతడు మరికాసేపాగి బదులిచ్చాడు, "నేను రాఘవను. నా కోసం రెండుసార్లు ఫోన్ చేశావట. నేనిప్పుడు అంత అకస్మాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చానో! నువ్వేమో నింగిలోకి ఎగిసిపోయిన తారవు. నేనేమో నేలపైన తారట్లాడుతున్న సామాన్య పామరుణ్ణి. నువ్వే అన్నావుగా మన మధ్య ఈ మానసికమైన వ్యత్యాసం ఉంటూనే ఉంటుందని, ఇప్పుడా వ్యత్యాసం గుర్తుకు రాలేదేమో!"
అప్పుడు అటునుంచి బదులు రావడానికి ఆలస్యమైంది. బరువైన నిట్టూర్పొకటి వినిపించింది. ఆ నిట్టూర్పు తరువాత గొంతు వినిపించింది, "నీకు నాపైన కోపం, కాదు ద్వేషం ఉండటం సబబే, అర్థం చేసుకోగలను. రెండేళ్ల పాటు కలసిమెలసి తిరుగుతూ ముద్దులూ ముచ్చట్లూ పంచుకుంటూ చివరన నాకు మిరుమిట్లు గొలిపే వెండితెర ప్రపంచమే ముఖ్యమని చావుకబురులా చల్లగా తప్పుకుంటే ఏ మగాడికి మాత్రం ఆక్రోశం కలగదు మరి! ఇంతకీ నేనెందుకు నీకు ఫోన్ చేశానో నువ్వడగలేదు."
అతడు స్పందించలేదు. మౌనం వహించాడు. కెలికినట్లనిపించిన గుండె గాయం అతణ్ణి మాట్లాడనివ్వలేదు. అప్పుడామె తానుగా బదులిచ్చింది, "నాకు తెలుసు నువ్వడగవని. ఆకాశగంగ వంటి ఆవేశం పొంగుకు వస్తే నువ్వెలా గొంతు ముడి విప్పి మాట్లాడగలవు. నువ్వనుకుంటున్నట్టు నేను మూడుసార్లు ఫోన్ చేయలేదు. పదిసార్లయినా మీ ఇంటికి ఫోన్ చేశాను. అర్థమైందా!
సరే, అదలా ఉంచు. నేనిప్పుడు చెప్పబోయేది విని అరవకు. నీకు అరిచే అలవాటు ఎక్కువ. ఇప్పుడు నాకోసం ఓపిక తెచ్చుకుని నిదానంగా విను. విని సీను నుండి తప్పుకో! నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. నాకంతిమ ఘడియ ఆసన్నమైంది."
రాఘవ గుండె గతుక్కుమంది. "ఆర్ యూ జోకింగ్?" నిజంగానే అరిచాడతను.
"లేదు. నిజంగానే నా కథను ముగించుకోబోతున్నాను. ఇది నీకు మాత్రమే ఎందుకు చెప్పాలనిపించిందని అడగబోతున్నావు. అంతే కదూ! అదీ చెప్తాను. యవ్వన ప్రాయంలో రంగుల ప్రపంచంలో నాకెందరితోనో పరిచయాలు ఏర్పడి ఉండవచ్చు. భుజాలు ఒరుసుకుంటూ పూసుకుంటూ తిరిగి ఉండవచ్చు. అవసరాల కోసం కొంత, పబ్లిసిటీ కోసం కొంత నేను అఫైర్లు నడిపి ఉండవచ్చు. కానీ మనసా వాచా కర్మణా నేను మనసిచ్చి మసలిన వ్యక్తివి నువ్వొక్కడివే! ఇది నమ్మడం నమ్మకపోవడం నీ వంతు. నౌ గుడ్ బై టు యూ అండ్ టు మై టియర్స్."
అది విని అతడు క్షణం కూడా ఆగలేదు. "ఆగు! కాసేపు ఆగు!" అతడు అరిచాడు.
అప్పుడామె ఎదురు ప్రశ్న వేసింది, "ఎందుకాగాలి? ఎవరికోసం ఆగాలి? దేనికోసమాగాలి?"
“చెప్తాను. ఒక్క నిమిషం గానీ అనుకున్నది చేసుకోకుండా ఆగావంటే చెప్తాను.”
శ్వేత ఈసారి ఏడుపు ఎగుపుల్లోంచే "ఉఁ" అంది.
అతడు ఊపిరి తీసుకోవడానికి క్షణం సేపు ఆగి చెప్పసాగాడు, “నేను నీ ముందు మోకరిల్లి మనం పెండ్లి చేసుకుందామని అడిగినప్పుడు నువ్వు అలవోకగా సరళరేఖలు ఎన్నటికీ కలవవని చెప్పి విదిలించి వెళ్లిపోయినప్పుడు, ఫెళఫెళమనే ఆ రంగుల మేడవైపు విసవిసా సాగిపోతున్నప్పుడు నాకు నిజంగానే కోపం వచ్చింది. నిన్నక్కడికక్కడే పాతిపెట్టేయాలన్నంత కోపం కలిగిన మాట వాస్తవమే.
కానీ అది ఒక పార్శ్వం మాత్రమే, మరొక పార్శ్వం, నేను నిన్నెప్పుడూ ద్వేషించలేదు. ఎందుకంటే కావాలనుకున్నా నిన్ను ద్వేషించలేను. నేను గానీ నిన్ను ద్వేషించనారంభిస్తే నేను మనిషి రూపాన్ని పూర్తిగా కోల్పోయినవాడినవుతాను. ఎందుకో తెలుసా! అది చెప్పేముందు నీ గురించి ఒక మాట అనేవాణ్ణి. గుర్తుందా?”
లేదన్న ధ్వనినిచ్చేలా "ఉఁ ఉఁ" అందామె.
“నీకు భగవంతుడు అవధికి మించిన అందం ఇచ్చేశాడు. అయినా సరే నీది హృదయమున్న అందం అనేవాణ్ణి.”
అప్పుడామె స్పందించింది, “ఆ అందమే కదా నన్ను అహంకారిని చేసి నా జీవితాన్ని చిత్తు చేసింది!”
“అది వేరే విషయం. ఇప్పుడు నా విషయానికి వస్తున్నాను. నేనీనాడు నా కాలేజీ చదువులు ముగించి నేనింత వాణ్ణయ్యానంటే దానికి కారణం నువ్వు కాదూ! ఊళ్లో అకస్మాత్తుగా వడగండ్లకు ఆరుగాల పంటలు నాశనమై, మూడు పాడి ఆవులూ మరణించి ఘోరంగా మారిన మా ఇంటి పరిస్థితుల వల్ల నేను ఫీజు కట్టలేని దుర్భర స్థితి దాపురించినప్పుడు, నేను కాలేజీ ఎగ్గొట్టకుండా చూడటానికి నువ్వే కదా నా ఇగో దెబ్బతినకుండా జాగ్రత్తపడుతూ నాకు తెలియకుండానే నా తరఫున ఫీజుతో బాటు స్పెషల్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు కూడా కట్టి రిసీప్టులు మాత్రం నా జేబులో కుక్కి వెళ్లేదానివి.
నీలోని గొప్పతనమేమిటో తెలుసా! ఇంతవరకూ ఆ విషయం ఎవరితోనూ చెప్పకపోవడం, కడకు నీ మిత్రురాండ్రతో సహా, ఎంత గొప్ప ఔన్నత్యం! అంతేనా, నువ్వు తెచ్చుకున్న కమ్మని టిఫిన్ బాక్సుని నా డెస్కుపైన ఉంచేసి, ఫ్రెండ్స్‌తో పనుందని ఫుడ్ పాయింట్‌కి వెళ్లిపోయేదానివి. ఎంత కోపం ఉంటే మాత్రం ఇవన్నీ మరచిపోదగ్గ విషయాలా! తలచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోదూ!”
“అలాగని నేను చేసిన పొరపాటు పొరపాటు కాకుండా పోతుందా! డాషింగ్ మోడల్‌గా మారాలని, సినిమా స్టార్ కావాలన్న దుగ్ధతో నిన్ను అమానుషంగా దూరంగా నెట్టి నా దారి నేను చూసుకోవడం అన్యాయం కాకుండా పోతుందా!”
“కావచ్చు, కాకపోవచ్చు. కానీ అదంతా అప్పటి విషయం. మనకందరికీ మానసిక పరిణతి పూర్తిగా వికసించని సమయం. కాదా మరి!” అప్పుడు శ్వేత బలంగా స్పందించింది, “ఇది నీకెలా వర్తిస్తుంది నీపైన నువ్వు భారం వేసుకోవడం తప్ప?”
“ఒక రకంగా నాకూ వర్తిస్తుంది. నాకు గానీ నిజంగానే మానసిక పరిణతి ఉంటే నేను అందని మ్రానిపండును ఆశించి ఉండేవాణ్ణి కాను కదా! నువ్వు నన్ను నడిరోడ్డున విడిచివెళ్లే ముందు నాకు నేనుగా నీ దారినుండి తొలగిపోయి ఉండేవాణ్ణిగా! మన ఇద్దరి అంతస్తుల మధ్య హస్తిమశకాంతర భేదం ఉందని తెలిసి కూడా నిన్నే అంటిపెట్టుకున్నానంటే దాని అర్థం అదే కదా!”
అప్పుడక్కణ్ణించి మౌనమే బదులుగా రావడం గమనించి రాఘవ ఊపందుకున్నాడు, “అంచేత నేనిప్పుడు నిన్నొకటి కోరబోతున్నాను. కాదనకూడదు.”
"ఉఁ" అందామె.
“నాకు నిన్నొకసారి చూడాలనుంది. అక్కడక్కడ సినిమా పోస్టర్లలో తప్ప, టీవీ లైవ్ ప్రోగ్రాములలో తప్ప నిన్ను చూసి ఎన్నేళ్లయింది! ఐ ప్రామిస్, ఆ తరువాత నీ దారి నీది, నా దారి నాది.”
దానితో ఆమె మరుపలుకు లేకుండా ఇంటి విలాసం ఇచ్చింది.
రాఘవ వెనువెంటనే దుస్తులు మార్చుకుని చకచకా మేడ మెట్లు దిగాడు. అప్పుడు పరమేశ్వరి ఎదురొచ్చింది.
“ఎక్కడికి వెళ్తున్నారుండీ! మీ కోసం వేడివేడి ఉల్లి పకోడీలు చేశాను. పిల్లలు కూడా ట్యూషన్ నుండి వచ్చేటట్టున్నారు.”
“నేనెక్కడికి వెళ్తానోయ్ నిన్ను విడిచి? ఇలా వెళ్లి అలా వచ్చేయనూ గంటలోపల!” అంటూ ఆమె నుదుట ముద్దు పెట్టుకుని అంగలు వేసుకుంటూ పోర్టికోలో ఉంచిన కారు వైపు సాగిపోయాడతను. పరమేశ్వరి నిల్చున్న పళాన కళ్లప్పగించి చూడసాగింది.
వసంత్ నగర్ లో కారునాపి డోరు తెరుచుకుని కారు దిగి తలెత్తి చూశాడు రాఘవ. అది మామూలు బంగళా కాదు. తెల్లటి సుద్దలా కనిపిస్తున్న విశాలమైన భవంతి. మూడుసార్లు ఫిలింఫేర్ అవార్డులు, నాలుగుసార్లు రాష్ట్ర ఉత్తమ నటిగా బ్లూమింగ్ స్టార్ గా బిరుదులందుకున్న ప్రఖ్యాత నటీమణి శ్వేతాదేవి నివాసం కదా! అలా కాకపోతే మరెలా ఉంటుంది?
గేటు ముందు కాపలా కాస్తున్న వాచ్‌మన్ పేరు అడిగి తెలుసుకుని ఇంటర్‌కామ్ ద్వారా లోపలకు కబురందించాడు రాఘవ.
కబురందుకున్న తక్షణమే ఇద్దరు స్త్రీ సిబ్బంది పరుగున వచ్చి రాఘవకు స్వాగతం పలుకుతూ సాదరంగా లోపలకు తీసుకువెళ్లారు. లోపల మరిద్దరు మేల్ సర్వెంట్లు అటెన్షన్‌లో ఉన్నారు. వాళ్ల నలుగురినీ చూసి రాఘవ అదోలా ఫీలవుతూ అనుకున్నాడు, తను గానీ సమయానికి సరళరేఖలా ప్రమేయం చేసుండకపోతే ఈపాటికి వీళ్ల లేడీ బాస్ ఏమై ఉండేదో వీళ్లకు తెలియదు కదూ!
ఆ లోపల అతడు వచ్చిన అలికిడి విని కాబోలు శ్వేత మేడ మెట్లు చకచకా దిగుతూ వచ్చింది. కొన్ని క్షణాల పాటు మాటా పలుకూ లేకుండా అతణ్ణి తదేకంగా చూస్తూ నిల్చుంది. అతడు కూడా ఆమెను అదే విధంగా మౌనంగా చూస్తూ నిల్చున్నాడు.
ఆమెలో ఆమె మేనిలోని సొగసూ వయసులోని మెరుపూ తగ్గలేదు. ఆరోగ్యం విషయంలో శ్వేత సెన్సిటివ్‌గా ఉంటుందని, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుందని తను ఎక్కడో చదివినట్టు గుర్తు. అలా కాకపోతే స్టార్‌గా నాలుగు కాలాల పాటు ఈ మెరుపుల ప్రపంచంలో గొంతులు కోసుకునే గ్లామరస్ పోటీలో ఎలా నిలదొక్కుకోగలదు?
కాసేపు ఒకరినొకరు చూసుకున్న తరువాత ఆమె అతడి చేతిని అందుకుని మేడ మెట్ల వైపు నడిపించింది. ఆమె సరాసరి అతణ్ణి తన పడకగదిలోకి తీసుకువెళ్లి కుదురుగా కూర్చోబెట్టింది.
అక్కడి సినీ వాతావరణంలోని ఆనవాయితీ కాబోలు బీర్ బాటిల్ నుండి ద్రావకం గాజు గ్లాసులో పోసి అందివ్వబోయింది. అతడు తల అడ్డంగా ఆడిస్తూ గ్లాసుని టీపాయ్ పైన పెట్టి ఆమెను తీసుకువెళ్లి తనకెదురుగా కూర్చోబెట్టాడు.
ఆమెను విచ్చుకున్న కళ్లతో తేరిపారా చూసి ఓసారి బరువుగా నిట్టూర్చి అడిగాడు, “మొత్తానికి నువ్వు ఇలాగా నేను అలాగా ఉన్నామన్నమాట చెరొక ప్రపంచంలోనూ! ఊఁ చెప్పు, నీకేమైంది? ఎందుకటువంటి నిర్ణయం తీసుకోబోయావు?”
“అరుపులు చేయకుండా శాంతంగా వింటావు కదూ!”
"ఉఁ" అంటూ తలూపాడతను.
“ఈ మధ్య ఎటు చూసినా ఎక్కడ చూసినా చాలానే ఉన్నట్లనిపించసాగింది. జాయ్ పుష్కలంగా ప్రవహిస్తున్నట్లే అనిపిస్తోంది. కానీ చీకటి పడేసరికి ఏమీ లేనట్లు వెలితి చోటుచేసుకుంటోంది. చాలా వెలితిగా, కళావిహీనంగా, మనం కాలేజీ రోజుల్లో చదివాం కదా, 'వాటర్ వాటర్ ఎవ్రీవేర్, బట్ నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టు డ్రింక్'.
అప్పుడు నాకనిపించింది, నిజంగా అనిపించింది. చాలా రోజుల తరువాత, చాలా రోజులుగా కొంచెం కొంచెంగా అనుభవించాల్సిన ఆనందాన్ని లేత వయసులోనే అనుభవించేశానని.
అప్పట్నించీ నాలోని సర్వ ప్రాణసారమూ ఇంకిపోయినట్లనిపించింది. దాని కారణంగా మాటిమాటికీ కాల్ షీట్లు క్యాన్సిల్ చేసుకోవలసొస్తోంది. తద్వారా ప్రొడ్యూసర్లకు నష్టం కలిగించసాగాను. చుట్టుప్రక్కల ఎవరిని చూసినా అపనమ్మకమే తప్ప ఇసుమంత ఉత్సాహం కూడా కలగడం లేదు. ఆపైన నేనేమి చేశానంటే, వీలునామా రాసి ముగించాను” అని చెప్పడం ఆపి రాఘవ కళ్లలోకి చూసింది.
అతడేమీ అనలేదు. నిష్ణాతుడై వినడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడామె సూటిగా అడిగింది, “ఎవరి పేరిటనో నువ్వడగలేదు రాఘవా!”
“ఇంకెవరి పేరిట? మీ అమ్మానాన్నల పేరిట, లేకపోతే మీ సోదరుల పేరిట, మరికొంత నీ విశ్వాసం పొందిన పనివాళ్లపైన.”
“కాదు, నీ పేరిట. నమ్మలేకపోతున్నావు కదూ!”
రాఘవ ఆశ్చర్యం ప్రకటించలేదు. పెదవులపై తారాడిన దరహాసంతో చెప్పసాగాడు, “ఇక నేను విషయానికి వస్తున్నాను. బాగా చెవులు రిక్కించి మనసుని తెరచి విను. ఇటువంటి వెలితి, అరకులోయంతటి నల్లరేఖ వంటి వెలితి నీకే కాదు. కళారంగంలో ఉన్నవారికి మాత్రమే కాదు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భాన ఎదురవుతూనే ఉంటుంది, వృత్తికీ ఉపాధికీ అతీతంగా.
అందరికీ కాకపోయినా కనీసం కొందరికైనా అప్పుడప్పుడు పైకి చేరిపోతే బాగుండుననిపించవచ్చు. కానీ అది పరిష్కార మార్గం కానేరదు. ఇంకా చెప్పాలంటే సమస్యలు మరింత జటిలమవుతాయి. ఆ మాటకు వస్తే ఎవరి జీవితమూ నల్లతేరుపై నడక కాజాలదు కదా!
అలా అయి ఉంటే బుద్ధుడు జీవితాన్ని దుఃఖభాజితం అని ప్రకటించేవాడు కాడు. నీ విషయంలో రెండు పొరపాట్లు జరిగినట్లు స్పష్టంగా తోస్తోంది. ఒకటి, జీవితం నుండి మరొక అవకాశం ఇక రాదేమో అన్నంతగా ఆశించడం. రెండవది, అతి ముఖ్యమైనది, పరుల వైపు పరిసరాల వైపు ముఖ్యంగా పోటీగా ఎదగబోతున్న తోటి సినీ స్టార్ల వైపు పరీక్షగా చూడటమే తప్ప, నీలోకి నువ్వు చూసుకోవడం మరచిపోవడం.
ఇకపోతే ఎవరినీ నమ్మకుండా ఉండటం, నమ్మలేకపోవడం అన్నది ఒక జాడ్యం వంటిది. దీనినుండి బయటపడటం చాలా అవసరం.”
“ఇంతకీ నన్నేమి చేయమంటావు రాఘవా?”
“నిన్ను నువ్వే అడుక్కోమంటున్నాను. నీలోకి నిన్ను చూసుకోమంటున్నాను నిష్కల్మషమైన మనసుతో.”
“చూసుకున్నాను నాలోకి నేను పదే పదే, నన్ను నేను అడుక్కున్నాను పదే పదే. అప్పుడే తెలిసొచ్చింది నాకు ఒకరు తోడుండాలని. ఆ తోడు నువ్వే అయివుండాలని, అప్పుడు గానీ నాకు నేనుగా తేరుకోలేనని.”
అతడేమీ అనలేదు. ఆమె వెనుక ఉన్న బీరువా స్టాండు వైపు నిశితంగా చూశాడు. పాయిజన్ బాటిల్ జుత్తు విరబోసుకున్న ప్రేతాత్మలా కనిపించింది. ఏది ఏమైనా, ఎప్పుడేమి జరిగి ఉన్నా ఎలా జరిగి ఉన్నా, ఆమె తన అతి కఠినమైన కాలఘట్టంలో తన బ్రతుక్కి ఆలంబనగా నిలిచిన స్త్రీ, నీడనిచ్చిన స్త్రీ. అది గానీ మరచిపోతే తనిక మనిషిగా బ్రతకలేడు. ఆమెకు ఆనాడు పడ్డ రుణం తీర్చుకునే సమయం ఇదేనేమో! ఆ రీతిన సౌమ్యంగా సమభావనతో ఆలోచించకుండా ఇక్కడి గడప దాటి వెళ్లిపోవడం సబబేనా?
ఒకనాడు తనకు ఘోర అవమానం జరిగిందన్న ఆక్రోశంతో తన చేతిని అందించకుండా అటువైపు విదిలిస్తూ వెళ్లిపోతే పిమ్మట ఏమవుతుంది? విషం బాటిల్ ఖాళీ అవుతుంది. ఒక బంగారు కళాత్మక హంస మంటగలిసిపోతుంది. దానికి తను కారకుడు కాకూడదు. ఇప్పుడామె నాలుగు రోడ్ల కూడలి మధ్య నిస్సహాయంగా ఒంటరిగా నిల్చుంది తన చేతి ఆసరా కోసం ఎదురుచూస్తూ.
అతడు లేచి ఆమెను సమీపించాడు. సమీపించి గుండెలోతుల్లోనుంచి, “నీకు నిరంతరం నీడగా తోడుగా నేనుంటాను” అంటూ ఆమెను లేవనెత్తి గుండెలకు హత్తుకున్నాడు.
శుభం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.







Comments