సంయుక్త కథ
- Harish Babu Pondugula

- 1 day ago
- 5 min read

Samyuktha Katha - Telugu Inspirational Story | Harish Babu Pondugula
సంయుక్త కథ - తెలుగు ప్రేరణాత్మక కథ | హరీష్ బాబు పొందుగుల
Published in manatelugukathalu.com on 17/08/2026
ప్రేమ అంటే ఎప్పుడూ మనసులో ఉన్న భావాన్ని అవతలి వ్యక్తికి చెప్పడమేనా? లేక వారు సంతోషంగా ఉండేలా చేయడమా? ఈ కథలో రమేష్ తన కాలేజీ స్నేహితురాలు సంయుక్తను ఏళ్ల తర్వాత కలుస్తాడు. ఆమె జీవితంలో ఎదురైన ఆర్థిక సమస్యలను తెలుసుకుని, తన ఉనికిని తెలియనివ్వకుండా ఆమె కుటుంబానికి సహాయం చేస్తాడు. భర్తకు ఉద్యోగం వచ్చేలా చేయడమే కాకుండా, సంయుక్తలోని ప్రతిభను గుర్తించి ఆమెకు సొంతంగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తాడు. చివరికి ఆమె ముఖంలో తిరిగి కనిపించిన ఆనందాన్ని చూసి, తన మనసులోని ప్రేమకు అదే పరిపూర్ణత అని భావిస్తాడు. ప్రతిఫలం ఆశించకుండా ఒకరి జీవితంలో ఆనందాన్ని నింపడం కూడా ప్రేమే అనే అందమైన సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
రమేష్ విదేశాల్లో బాగా డబ్బు సంపాదించి చాలా కాలం తరువాత ఇప్పుడే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు.
సిటీలోకి వస్తూనే బస్ స్టాండ్‌లో తన పాత ఫ్రెండ్ "సంయు (సంయుక్త)" కనపడగానే కార్ యూ-టర్న్ తీసుకోమని చెప్పి, అటువైపు నుంచి సంయుని దగ్గరగా చూశాడు.
పలకరించాలని అనుకున్నాడు… కానీ ఆగిపోయాడు…
తన మెడలో మంగళసూత్రం ఉంది, కానీ ముఖంలో ఇంతకుముందు చూసినంత మెరుపు లేదు, కళావిహీనంగా ఉంది.
"సంయుకి పెళ్లయినట్టుంది, మరోసారి కలవవచ్చులే" అని అనుకొని కారు ఇంటికి పోనివ్వమని అన్నాడు.
తన సెక్రటరీ (హనుమంతు)ని సంయు ఇప్పుడు ఏం చేస్తుందో, ఎక్కడ ఉంటుందో ఆ వివరాలన్నీ కనుక్కోమని చెప్పాడు రమేష్.
హనుమంతు బాగా ఎంక్వైరీ చేసి తన బాస్ రమేష్‌కి సంయు గురించి చెప్పాడు.
"సార్, ఎంక్వైరీ సంయుక్త మేడమ్ గురించి చేశాను… మేడమ్ ఇప్పుడు కొన్ని ఆర్థిక సమస్యల్లో ఉంది… సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న తన భర్తకి ఈమధ్యే జాబ్ పోయిందని… ఇంటి కోసం, కార్ కోసం చేసిన అప్పులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాడు… అంతకుముందు సంయుక్త వాళ్ల నాన్నగారు అంతో ఇంతో హెల్ప్ చేసేవారట… కానీ ఆయన కూడా ఈ మధ్య కాలం చేశారట… మరి సంయు తను ఏదైనా ఉద్యోగం చేస్తాను అంటే వద్దంటాడు వాళ్ల ఆయన…" అని రమేష్‌కి చెప్పాడు.
సంయుకి, వాళ్ల ఫ్యామిలీకి ఏదైనా సహాయం చేయాలని మనసులో అనుకున్నాడు రమేష్.
బాగా ఆలోచించాక, రమేష్ సాఫ్ట్‌వేర్ ఇన్స్టిట్యూట్‌లో ఓనర్ అయిన తన ఫ్రెండ్‌కి కాల్ చేసి, అతనికి "సంయు" భర్తకి కాల్ చేసి ఇలా చెప్పమని చెప్పాడు:
"హలో సర్… మాకు వచ్చిన ఎంక్వైరీస్ అన్నిటినీ ప్రతినెలా డ్రా తీస్తాము సర్… ఈ నెల మీ నంబర్ లక్కీ డ్రాలో పిక్ అయింది… మీరు కనుక మా ఇన్స్టిట్యూట్‌లో ఈ కోర్స్ జాయిన్ అయ్యి కంప్లీట్ చేస్తే… ప్లేస్‌మెంట్ కూడా అరేంజ్ చేస్తాము… కాకపోతే ఒక అబ్లిగేషన్… మీ ఫోటోని ప్లేస్‌మెంట్ లిస్ట్‌లో వాడుకుంటాం… అలా మీకు ఓకే అంటే చెప్పండి, క్లాస్ స్టార్ట్ చేస్తాము" అని కాల్ చేయమని చెప్తాడు రమేష్.
ఆ ప్రపోజల్‌కి సంయుక్త భర్త ఒప్పుకుని సాఫ్ట్‌వేర్ కోర్స్ చేసి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు… అలా సంయుక్త భర్తకి 2 నెలల్లోనే మంచి ఉద్యోగం వచ్చేలా చేశాడు.
ఆ తరువాత ఒక రోజు సంయుక్త వాళ్ల కాలనీ వైపు వెళ్లాడు. అనుకోకుండా సంయుక్తని సూపర్ మార్కెట్ దగ్గర చూసి పక్కకి వెళ్లి దాక్కుని, సంయుక్త ముఖం వంక చూశాడు రమేష్… సంయు ముఖం ఇప్పుడు కాస్త ఆనందంగా కనిపిస్తుంది… సూపర్ మార్కెట్‌లో సంయుక్త వాళ్ల పక్క ఫ్లాట్ ఆంటీతో మాట్లాడుతుండటం గమనించాడు…
"తిరుపతి వెళ్లాలి ఆంటీ… దేవుడి దయవల్ల ఆయనకి ఈమధ్యే మంచి జాబ్ వచ్చింది… నాకు కూడా ఏదైనా జాబ్ ఉండుంటే… ఇలా కష్టకాలంలో దిగులు ఉండకుండా ఉండేది" అనటం విన్నాడు.
అవునా, సంయు జాబ్ చేయాలని అనుకుంటుందా అని తెలుసుకున్నాడు రమేష్. కానీ సంయు అంత టాలెంట్ పెట్టుకుని జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేలా చేస్తే ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది కదా అనుకున్నాడు…
తనకు బాగా గుర్తు, కాలేజీలో ఉన్నప్పుడు రకరకాల వంటలు చేసి అందరికీ తినిపించేది సంయు…
"మీ అమ్మ చేశారా?" అంటే…
"కాదు, నేనే చేశాను" అని గర్వంగా చెప్పేది… తన వంటల మీద ఏదైనా కామెంట్ చేస్తే చాలా సార్లు వాదం కూడా పెట్టుకునేది.
రమేష్‌కి ఒక ఆలోచన వచ్చింది. అంత బాగా వంటలు చేసే సంయు వంటఇంటికి ఎందుకు పరిమితం కావాలి? తన వంట రుచి పదిమంది చూస్తే అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాడు…
ఎలాగో అలా సంయు వాళ్ల పక్క ఫ్లాట్ ఆంటీతో పరిచయం పెంచుకున్నాడు రమేష్.
మాటల సందర్భంలో తాను సంయుక్త కాలేజ్ ఫ్రెండ్‌నని, తనకు సహాయం చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు… అలా చేయడానికి మీ సహాయం కొంత కావాలి అని అంటే… దానికి ఆ ఆంటీ…
"తప్పకుండా బాబు… ఒకరికి సహాయం చేయాలనే మంచి పనికి నేను ఎప్పుడూ రెడీ… నన్ను ఏం చేయమంటావో చెప్పు" అని అంది…
రమేష్ వివరించాడు…
"మీరు ఒక రోజు సంయు ఇంట్లో కాస్త పచ్చడి కోసం వెళ్లండి ఆంటీ… భోజనం చేశాక మళ్లీ వెళ్లి… పచ్చడి చాలా బాగా చేశావమ్మా సంయుక్త… నువ్వే పెట్టావా ఈ పచ్చడి? నీకు ఇంత బాగా పచ్చడి పెట్టడం వచ్చు అనుకోలేదమ్మా… నీకు కుదిరితే మాకు కూడా ఒక కేజీ పెట్టగలవా అని అడగండి… ఆ తరువాత మీ అపార్ట్‌మెంట్, ఇంకా తెలిసిన వాళ్లకు కూడా చేసిపెట్టేలా చేసి… తనని బిజీ చేసేస్తే… తనకిష్టమైనది చేస్తూనే నలుగురికి ఉపయోగపడుతుంది కదా" అన్నాడు.
అలా… ఆ తరువాత తరువాత వాళ్ల అపార్ట్‌మెంట్ మొత్తం తన దగ్గరే పచ్చళ్లు, ఇంకా స్వీట్స్ చేయించుకునేలా చేశాడు…
ఒక రోజు ఆ ఆంటీ "ఇంత బాగా పెడుతున్నావ్, నువ్వే ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు కదా! నీకు టైమ్‌పాస్ అవుతుంది… ఇంకో నలుగురు నీ వల్ల బ్రతుకుతారు" అని సలహా ఇచ్చింది.
ఈ ఆలోచన ఏదో బాగుంది అని సంయు తన భర్త అనుమతి తీసుకుని ఒక స్వగృహ స్వీట్స్ అండ్ పచ్చడ్ల షాప్ స్టార్ట్ చేసింది… ఆనాటి కాలంలోనే ఆ మంచి పేరు వచ్చింది ఆ స్వీట్స్ హౌస్‌కి… అలా అయ్యేలా చేశాడు రమేష్.
ఒక రోజు గుడికి వెళ్తే అక్కడ అనుకోకుండా రమేష్‌కి సంయు ఎదురొచ్చింది…
తనని గుర్తుపట్టి రాయిలాగా ఉండిపోయింది…
రమేష్‌ని చూసి ఒక్కసారి తన ఫ్లాష్‌బ్యాక్ మెమరీస్‌లోకి వెళ్లిపోయింది.
అది విజయవాడ… రమేష్, సంయుక్త ఒకే కాలేజీలో చదివేవారు… రమేష్‌కి సంయుతో చాలా చనువు, స్నేహం కూడా… ఎంత అంటే వాళ్ల ఇంటికి కూడా తీసుకెళ్లేది…
కానీ ఒక రోజు సంయు లేని టైమ్‌లో వాళ్ల ఇంటికి వెళ్తే… వాళ్ల నాన్న తనని చూసి…
"ఏం బాబు, నువ్వు మా అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌వా ఏంటి? ఎప్పుడూ తనతో ఏం పని? నీకు స్టడీ అయిపోయింది కదా… ఇక ఏదైనా ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా… ఇంకోసారి ఇటువైపు కనిపించకు" అంటూ అవమానకరంగా మాట్లాడేసరికి… సంయుక్తకి చెప్పకుండా తమ స్నేహానికి గుడ్ బై చెప్పి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు.
ఆ తరువాత కాస్త చిన్న జాబ్‌లో సెటిల్ అయ్యాక సంయు గుర్తువచ్చి మళ్లీ కలిసే ప్రయత్నం చేశాడు.
కానీ అప్పటికే సంయు వాళ్లు వేరే ఊరు వెళ్లారని తెలుసుకుని బాధపడ్డాడు. ఇక తను ఈ దేశంలో ఉండి ఏం చేయాలని ప్రమోషన్‌తో పాటు విదేశాలకు వెళ్లాడు…
రమేష్ విదేశాల్లో ఉండగానే సంయుక్తకి వివాహం అయిపోయింది…
గతం నుంచి వచ్చి మళ్లీ కళ్లముందు ఉన్న రమేష్‌ను చూస్తోంది సంయుక్త.
అలా అప్పుడు దూరమైన రమేష్ మళ్లీ ఇవాళ కనిపించాడు అని సంయు మనసు పులకరించింది.
"హాయ్ రమేష్, ఎలా ఉన్నావ్?"
"నువ్వు ఎలా ఉన్నావు సంయు?"
"నేను ఇప్పుడు చాలా బాగున్నాను… నాలుగు నెలల ముందు నన్ను కలవాల్సి ఉంది నువ్వు… నేను నేనులా లేను, చాలా ప్రాబ్లమ్స్… సడన్‌గా ఆ దేవుడికి నా మీద చాలా జాలి కలిగినట్టుంది, వన్ ఇయర్‌లో మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారమైపోయాయి… ఈ గుడిలో దేవుడు చాలా మహిమ కలవాడు… నేను ఈ గుడికి వచ్చి ఏం కోరుకుంటే అది జరుగుతోంది… నువ్వు కూడా ఏమైనా కోరుకో, తప్పకుండా జరుగుతుంది."
"అవునా, ఇంతకీ ఇప్పుడు ఏం కోరుకున్నావ్ ఏంటి?"
"ఇప్పుడా… ఇంకా ఏం కోరికలు… ఏమీ లేవు బాబు… జస్ట్ దేవుడికి థాంక్స్ చెప్పుకుని వెళ్దాం అని వచ్చా… మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం… అస్సలు ఇంతకీ ఏం ప్రాబ్లమ్స్ అని అడగవా?"
"అన్నీ దారిలో చెప్దువులే కానీ… ముందు కారులో కూర్చో… నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా… నువ్వు కాదనద్దు, ప్లీజ్…"
"అందులో కాదనడానికి ఏముంది… అయినా డ్రాప్ చేయడం ఏంటి… ముందు నువ్వు మా ఇంటికి పద… నీతో చాలా మాట్లాడాలి, ఏమైపోయావు ఇన్ని రోజులు… నిన్ను మా హస్బెండ్‌కి పరిచయం చేయాలి… నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలి… మా బిజినెస్ నీకు చూపించాలి, ఇంకా చాలా ఉన్నాయి, పద…" అంది సంయు.
ఇద్దరూ గుడి మెట్లు దిగి రమేష్ కార్ ఎక్కారు… కార్ మెల్లిగా వెళ్తోంది…
"హ్మ్మ్… ఇప్పుడు చెప్పు సంయు… ఏం జరిగింది?" (ఎటు నాకు తెలుసు కదా!)
"ఏం జరిగిందంటే…" (అని జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటే చెప్పుకుంటూ వచ్చింది).
"హే, ఇక్కడ ఆపు కార్, ఇక్కడ ఆపు… కారు… దిగు, ఇలా రా" అని వాళ్ల స్వీట్ షాప్ ముందు కార్ ఆపమని చెప్పింది సంయుక్త.
తన బిజినెస్ అంతా హ్యాపీగా చూపించింది.
తరువాత… సంయు ఇంటికి తీసుకుని వెళ్లాడు రమేష్‌ను… తన హస్బెండ్‌కి పరిచయం చేసింది.
వాళ్ల కాలేజీ నుంచి వాళ్లకున్న అనుబంధం గురించి చెప్పింది.
సంయు గ్రాండ్‌గా భోజనం చేయించింది.
తను గుడి నుంచి ఇంటికి వెళ్లే లోపు అంత గ్రాండ్‌గా ఎలా, ఎప్పుడు వాళ్ల పనివాళ్లతో ఏర్పాట్లు చేయమని చెప్పిందో అర్థం కాలేదు రమేష్‌కి… లంచ్ మెనూ అదిరిపోయింది!
భోజనం చేస్తున్నంతసేపు రమేష్ సంయు కళ్లలో ఒక మెరుపు చూశాడు. ఈ మెరుపు కదా నీలో నేను చూడాలని అనుకున్నది!
ఒక హ్యాపీనెస్ చూశాడు… తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎంత చలాకీగా ఉండేదో, ఇప్పుడు అంతే చలాకీగా ఉంది… ఇంకా ఇది చాలు నాకు… నేను మళ్లీ USA తిరిగి వెళ్లిపోవచ్చు అనుకున్నాడు. తన సెక్రటరీని ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్పాడు.
విండో సీట్‌లో రమేష్ ఆకాశం చూస్తుంటే… ఫ్లైట్ గాలిలో ఎగురుతూ… దూరంలో చుక్కల్లో కలిసిపోయింది…
"అవతలి వారికి ఆనందం అందించడమే నిజమైన ప్రేమ…
మీరు ఇష్టపడ్డ వాళ్లకు కూడా ఆనందాన్ని పంచుతున్నప్పుడు అంతే ఆనందం పొందుతావు.
అన్ని ప్రేమలు అంతే, కేవలం బాహ్యమే కానక్కర్లేదు… మానసికంగా కూడా ప్రేమించవచ్చు…"
హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: హరీష్ బాబు పొందుగుల
ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు. వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష .






Comments