top of page
Original.png

నిశ్శబ్దపు ప్రతిధ్వని

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #NissabdapuPratidhvani, #నిశ్శబ్దపుప్రతిధ్వని, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nissabdapu Pratidhvani - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 07/02/2026

​నిశ్శబ్దపు ప్రతిధ్వని - తెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


రాఘవ్ ఐటి కంపెనీలో టీమ్ లీడ్, నిరంతరం డెడ్ లైన్లు మరియు మీటింగులతో సతమతమవుతుంటాడు. ఆరోజు రాత్రి పది గంటలవుతున్నా అతను లాప్‌టాప్‌లో మునిగిపోయి ఉన్నాడు. అతని వెనుకనే నిలబడి ఉన్న వాణి చాలా సేపటి నుండి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. రాఘవ్ మొహం లోని సీరియస్ నెస్ చూసి ఆగిపోతూ, చివరకు ధైర్యం చేసి, “రాఘవ్, మా తమ్ముడి పెళ్లికి ఈసారి రెండు రోజులు ముందే వెళ్లాలి.. అత్తయ్యగారు కూడా వస్తానన్నారు, టికెట్స్ బుక్ చేయాలి” అంది.


రాఘవ్ కళ్ళు స్క్రీన్ నుంచి తిప్పకుండానే, “చూద్దాం వాణి, అప్పుడు ప్రాజెక్ట్ డెలివరీ ఉంది. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ వద్దు” అన్నాడు విసుగ్గా.


వాణికి ఆ సమాధానం నచ్చలేదు. “ప్రతిసారీ ఇదే మాట. నా కుటుంబం విషయానికి వస్తే నీకు ఎప్పుడూ ఇంతే నిర్లక్ష్యం. నాకంటూ కొన్ని కోరికలు ఉండవా?” అంది ఆవేదనగా. 


ఆ మాట రాఘవ్‌కి కోపం తెప్పించింది. కీబోర్డ్ మీద వేళ్లు ఆపి, ఒక్కసారిగా వెనక్కి తిరిగి, “నిర్లక్ష్యం కాదు వాణి, ఇది బాధ్యత! నా పని ఒత్తిడి నీకు అర్థం కాదు. అసలు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటేనే నా పని ప్రశాంతంగా సాగుతుంది” అన్నాడు కఠినంగా.


ఆ మాట వాణి గుండెల్లో బాణంలా దిగింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. “సరే, నీ ప్రశాంతత నీకు దక్కుతుంది. నేనింకా నీతో ఒక్క మాట కూడా మాట్లాడను” అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయింది.


మరుసటి రోజు ఉదయం నుండి వారి ఇంట్లో వింత వాతావరణం మొదలైంది. రాఘవ్ నిద్రలేచేసరికి టేబుల్ మీద కాఫీ ఉంది, కానీ వాణి లేదు. టిఫిన్ ప్లేట్ సిద్ధంగా ఉంది, కానీ పిలిచే గొంతు లేదు. రాఘవ్ కూడా తన అహంతో ఆమెను పలకరించలేదు. ఒక రోజు.. రెండు రోజులు.. వారం గడిచింది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా, రెండు వేర్వేరు లోకాల్లో ఉన్నట్లుగా మారిపోయారు. అవసరమైన పనులు యంత్రాల్లా జరుగుతున్నాయి కానీ మనసులు మాత్రం కలవడం లేదు.


ఆఫీస్ నుండి రాగానే ఒకప్పుడు కబుర్లతో నిండిపోయే ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే, గడియారం ముల్లు తిరుగుతున్న చప్పుడు కూడా రాఘవ్‌కి భయాన్ని కలిగిస్తోంది. తనే గెలవాలని పంతం పట్టిన రాఘవ్‌కి, ప్రతిరోజూ ఏదో కోల్పోతున్నాననే వెలితి మొదలైంది.


పది రోజుల తర్వాత, ఒక రాత్రి రాఘవ్‌కి తీవ్రమైన జ్వరం వచ్చింది. వణుకుతో ఒళ్లంతా కాలిపోతోంది. నీళ్లు తాగుదామని లేవబోయాడు కానీ శరీరం సహకరించడం లేదు. పక్కనే పడుకున్న వాణిని పిలవాలని నోరు తెరిచాడు, కానీ గొంతు పెగలడం లేదు. పది రోజులుగా అలవాటు చేసుకున్న ఆ మౌనం ఇప్పుడు అతని గొంతును నులిమేస్తోంది. పిలిస్తే నేను ఓడిపోయినట్లేనా? అన్న అహం ఒక పక్క, ప్రాణం పోతున్నట్లున్న భయం మరోపక్క.


అతికష్టం మీద పక్కనే ఉన్న వాణి చెయ్యి పట్టుకున్నాడు. ఆమె ఉలిక్కిపడి లేచింది. రాఘవ్ ఒళ్లు తగిలి ఆమె ఆందోళనతో “రాఘవ్! ఏమైంది మీకు?” అని అరుస్తూ లేచింది. రాఘవ్ మాట్లాడలేకపోయాడు, ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళతోనే సాయం కోరాడు.


వాణి వెంటనే తడిగుడ్డతో అతని నుదురు తుడిచి, మందులు వేసి, తెల్లవార్లూ కంటి మీద కునుకు లేకుండా అతని పక్కనే కూర్చుంది.


తెల్లారి రాఘవ్ కళ్లు తెరిచేసరికి వాణి అలసటతో అతని కాళ్ల దగ్గరే నిద్రపోతోంది. రాఘవ్‌కి అప్పుడు జీవిత సత్యం అర్థమైంది. మనిషిని శిక్షించడానికి మౌనం ఒక ఆయుధం కావచ్చు, కానీ అది మనల్ని ప్రేమించే వారికే ఎక్కువ గాయం చేస్తుంది.


ఆ క్షణం ఉద్యోగం, డబ్బులు ఇవి మాత్రమే జీవితం కాదు; నన్ను నమ్ముకుని నా మీద ప్రాణం పెట్టుకున్న నా జీవిత భాగస్వామి ఇష్టాలను, కోరికలను తీర్చవలసిన ప్రేమ, బాధ్యత కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా తెలుసుకున్నాడు.


ఆమె మెల్లగా కళ్ళు తెరవగానే రాఘవ్ ఆమె చేతులు పట్టుకుని, వాణి.. నన్ను క్షమించు. నీ మాట వినకుండా మౌనంగా ఉండి మన మధ్య పెద్ద గోడ కట్టేశాను. ఈ పది రోజుల్లో నాకు అర్థమైంది ఒక్కటే.. మాట్లాడటం వల్ల గొడవలు రావచ్చు కానీ, మాట్లాడకపోతే మనుషులే దూరమైపోతారు. గెలవాల్సింది మన పంతం కాదు, మన బంధం అన్నాడు కళ్ళనీళ్లతో.


వాణి ఆశ్చర్యపోయి, చూస్తుండగా రాఘవ్ తన ఫోన్ తీసి, అలాగే మీ తమ్ముడి పెళ్ళికి వారం రోజుల ముందే వెళ్ళేటట్లు మన ముగ్గురికీ టికెట్స్ బుక్ చేస్తాను. నాకు ఈ బిజీ లైఫ్ తో విసుగు వస్తోంది. ఈ రొటీన్ నుంచి మన ఇద్దరికీ ఒక మార్పు చాలా అవసరం అన్నాడు. నమ్మలేనట్టు చూస్తున్న వాణి కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె ఏడుస్తూ అతని గుండెలకు హత్తుకుంది. ఆ క్షణం వారి మధ్య ఉన్న నిశ్శబ్దపు గోడలు కూలిపోయి, మళ్ళీ ఆ ఇల్లు మాటల ముత్యాలతో నిండిపోయింది.


*** 

సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page