top of page

ఓ ఇంటి కథ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link

'O Inti Katha' New Telugu Story


written by Lakshmi Madan


రచన: లక్ష్మి మదన్


ఇంద్రజ ఉదయాన్నే స్నానం చేసి, మడి కట్టుకొని, వంట చేద్దామని పొయ్యి దగ్గర కట్టెలు సిద్ధం చేసుకుని, వంటపాత్రలను దగ్గర తెచ్చి పెట్టుకొని, తర్వాత బియ్యం పప్పులు తెచ్చుకోవాలని చాట పట్టుకొని, దొంతులర్రల్లోకి వెళ్ళింది.


అప్పట్లో అన్నీ కుండల్లో పోసుకునేవాళ్లు. అలా బియ్యం గోళంలో చేయి పెట్టి చూసింది బియ్యం నిండు గానే ఉన్నాయి.. పప్పు చారెడు మాత్రమే ఉంది.

సరే అని పెసరపప్పు డబ్బాలో చేయి పెట్టి చూసింది. పరవాలేదు పప్పు బాగానే ఉంది. వెంటనే కాస్త కందిపప్పు, కాస్త పెసరపప్పు చాటల్లో పోసుకొని తెచ్చుకుంది. దానిలో దోసకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి చేస్తే బాగుంటుందని అనుకుంది. రాత్రి నార తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు తెచ్చిపెట్టుకుంది. కాస్త చింతపండు, చారు కోసం నానబెట్టుకుని పొయ్యి వెలిగించింది.

ఆరోజు సెలవు దినం కావడం వల్ల వరండాలో కూర్చున్న భర్త నారాయణ తాపీగా పేపర్ చదువుతూ కూర్చున్నాడు. లేవగానే ఒకసారి టీ తెచ్చి పెట్టింది ఇంద్రజ. పేపర్ చదవడం పూర్తయిందేమో మళ్లీ ఒకసారి తాగాలనుకుని..

"ఇంద్రజా! చాయ్ తాగాలనిపిస్తుంది మరో కప్పు ఇస్తావా?" అని అడిగాడు.

"సరేనండీ ఇప్పుడే తీసుకొస్తాను" అని చెప్పి గబగబా బొగ్గుల పొయ్యి వెలిగించి, దానిమీద పొద్దున్నే నర్శవ్వ తెచ్చిన పాలను గిన్నెలో పోసి పెట్టింది. మరోపక్క కిరోసిన్ స్టవ్ మీద చాయ్ పెట్టింది. అప్పుడే అత్తగారు కూడా స్నానం చేసి జపం చేసుకుంటూ, జపమాల పట్టుకుని, అక్కడే చాప పరుచుకొని కూర్చుంది.

"అత్తయ్యా! మీకు చాయ్ పెట్టుకుని తీసుకురావాలా? " అని అడిగింది.

" సరేనమ్మా చిన్న గ్లాసులో సగం వరకు మాత్రమే ఇవ్వు. టాబ్లెట్ వేసుకోవాలి. ఓ రెండు బిస్కెట్లు ఉంటే తెచ్చిపెట్టు" అని చెప్పింది.

స్టవ్ మీద టీ పెట్టుకుని రెండు గ్లాసుల్లో పోసి అత్తగారికి ఒకటి, భర్తకి ఒకటి ఇచ్చి వంట ప్రయత్నంలో పడింది...

పప్పు బొగ్గులపొయ్యి మీద పెట్టేసి, తర్వాత కూర కట్టెల పొయ్యి మీద వండి, ఆ తర్వాత అన్నం కోసం ఎసరు పెట్టి, పెరట్లో నుండి పూజ కోసం పువ్వులు కోద్దామని పెరట్లోకి వెళ్ళింది.

మందార పూలు, గన్నేరు పూలు, జాజిమల్లెపూలన్ని విరిసి పెరడంతా శోభిల్లుతోంది. అమ్మవారు పెరట్లోనే తిరుగుతోందా అనిపించింది. అమ్మవారు కదంబ వనవాసిని కదా! పూల బుట్టలో పూలు కోస్తూ అటు పనిమనిషి సత్తెమ్మ గిన్నెలు కడుగుతుంటే ఒకసారి ఆ వైపు చూసింది. ఇత్తడి పాత్రలన్నీ చక్కగా ఇసుక కొబ్బరి పీచు పెట్టి తోముతోంది.

ఆమె వైపు ప్రశంసగా చూస్తూ" ఎంత చక్కగా తోముతున్నావే సత్తెమ్మా" అన్నది.

"రోజూ ఇట్లే కడుగుతా కదమ్మా! ఇవాళ ఏందో కొత్తగా అంటున్నావ్" అన్నది.

"ఎందుకో అలా అనాలనిపించిందే” అని లోపలికి వెళ్ళిపోయింది ఇంద్రజ.

ఎసరు మరిగిపోతోంది. అందులో బియ్యం వేసి కలిపి, మూత పెట్టి, మంట సరిచేసి, గూట్లో ఉన్న సామాను చిట్టి తీసుకుంది.

‘నెలాఖరు సామాన్లు ఒక్కొక్కటి అయిపోతున్నాయి. పిల్లల్ని సామాను కోసం పంపించాలి’ అని అనుకొని వాకిట్లో ఆడుకుంటున్న పిల్లలు ఇద్దరినీ పిలిచింది....

"నీలిమా!" కృష్ణా! ఒకసారి ఇలా రండి" అన్నది.

ఆట మధ్యలో పిలిచినందుకు పిల్లలు కాస్త కోపంగా లోపలికి వచ్చి "ఏంటమ్మా ఎప్పుడు ఆడుకోనివ్వవు? ఏంటో చెప్పు” అన్నారు.

"ఇంట్లో సరుకులు నిండుకున్నాయి రా. జగ్గయ్య షాప్ కి వెళ్లి తీసుకొని రండి. ఇదిగో చీటీ, రెండు బ్యాగులు, రెండు క్యాన్లు. ఒకటి నూనె కి, ఒకటి నెయ్యికి. తీసుకొని వెళ్ళండి" అని చెప్పింది..

వాళ్ళిద్దరూ బయలుదేరబోతుంటే..

"ఆగండి రా! రాత్రి చేసిన ఉప్పుడు పిండి ఉట్టిమీద ఉంది. ఇద్దరు చెరోప్లేట్లో పెట్టుకొని, కాస్త నెయ్యి వేసుకొని తినండి " అని చెప్పింది.

పిల్లలిద్దరూ ఉప్పుడు పిండి తిని దుకాణానికి బయలుదేరారు.

దుకాణంలో బోలెడు మంది ఉన్నారు. అందరికీ సామాన్లు జోకి ఇస్తున్నారు. గల్లాపెట్టదగ్గర షావుకారు జగ్గయ్య కూర్చుని ఉన్నాడు.

ఎప్పుడూ సామాను కోసం వచ్చే ఈ పిల్లల్ని చూసి "ఈరోజు సెలవా.. సామాను కోసం వచ్చారు? బాగా చదువుకుంటున్నారా?’ అని అడిగాడు.

"ఆ బాగా చదువుకుంటున్నామండీ" అని చెప్పి సామాను చిట్టీ అతనికి ఇచ్చారు.

అతను సామాను చిట్టీ తీసుకొని పని వాళ్ళకు ఆ చిట్టీ ఇచ్చి..

" పిల్లలకు సామాన్ ఇవ్వండి" అని చెప్పి పిల్లలిద్దరి చేతిలో గుప్పెడు పుట్నాల పప్పు పోసి, అక్కడ కూర్చొని తినండిర్రా! సామాను పొట్లాలు కట్టే వరకు ఆలస్యం అవుతుంది. అంతవరకు కూర్చోండి" అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు జగ్గయ్య.

పిల్లలిద్దరూ వాళ్లు సామాను పొట్లాలు కట్టే విధానాన్ని చూస్తూ కూర్చున్నారు. చక్కగా పేపర్ పొట్లం లో పోసి, దారం కట్టి, ఒక్కటి ఒక్కటిగా బ్యాగ్ లో పెట్టి, ఆ తర్వాత నూనె, నెయ్యి క్యాన్ లలో పోసి పిల్లలకి అందించాడు,

మెల్లిగా షాపు నుండి బయలుదేరారు పిల్లలు. ఇద్దరి బాగులు చాలా బరువుగానే ఉన్నాయి. పిల్లలకి చిన్నప్పటినుండి ఇలా ఇంట్లో పనులు చెప్పడం వల్ల వారికి ఒక అవగాహన వస్తుంది. పని అంటే ఏంటో తెలుస్తుంది. ఖర్చులు ఏ విధంగా పెట్టాలి అని అర్థమవుతుంది. అదే పని చేస్తుంది ఇప్పుడు, ఇంద్రజ పిల్లలని దుకాణానికి పంపించి...

మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ బయలుదేరారు. సగం దూరం వచ్చిన తర్వాత, సంచులు చేతులు మార్చుకొని, మెల్లగా నడుస్తున్నారు. ఇంతలో ఇంటిముందు వ్యవసాయం పనులు చేసుకునే రామయ్య సైకిల్ మీద వెళుతున్నాడు. పిల్లలు ఇద్దరినీ చూసి "ఇంత బరువు మోస్క పోతున్నారా! ఇటీయండి, నేను పట్టుకపోతా. మీరు మెల్లగా నడుచుకుంటూ వచ్చేయండి" అని ఆ సంచులన్నీ సైకిల్ మీద పెట్టుకొని ఇంటికి వెళ్లిపోయాడు.

పిల్లలు ఇద్దరికీ చెప్పలేనంత సంతోషం అయింది. హాయిగా ఆటలాడుకుంటూ, దారిలో ఉన్న దోస్తుల ఇంటికి పోయి కాసేపు ఆడుకొని, ఇంటికి బయలుదేరారు.

అప్పటికే ఇంట్లో నాయనమ్మ ,అమ్మ, నాన్న- ‘పిల్లలు ఇంకా రాలేదేంటి’ అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో పిల్లలు కడపలో కాలు పెట్టారు.

"ఇంత ఆలస్యం అయింది ఎందుకు? అప్పుడే సామాను తెచ్చి పెట్టాడు రామయ్య. ఎక్కడ ఆడుతున్నారు?” అని కాస్త కోపంగా అడిగింది నాయనమ్మ.

'ఆడుకున్నాము లేవే నాయనమ్మా! ప్రతిదానికీ నీకు కోపమే. ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలా?" అని సమాధానం చెప్పి, లోపలికి వెళ్లారు పిల్లలు.

“కాళ్లు, చేతులు కడుక్కొని రండి" అని చెప్పింది" ఇంద్రజ..

వరుసగా పీటలు, కంచాలు, మంచినీళ్లు పెట్టి, అందరికీ వడ్డించారు నాయనమ్మ, అమ్మ.

సెలవు రోజు కావడం వల్ల కాస్త నిదానంగానే భోజనం చేసి రేపటి హోం వర్క్ చేసుకుందామని పిల్లలు హాల్లో కూర్చున్నారు.

అత్తాకోడళ్ళిద్దరూ వంటింట్లో ముచ్చట్లు పెట్టుకుంటూ పనులు చేసుకొని, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకొని, కాస్త నడుము వాలుద్దామని హాల్లో పీట మీద వచ్చి పడుకుంది పెద్దావిడ. ఇంద్రజ గదిలోకి వెళ్లి పడుకుంది.

అలా కిటికీలో నుండి పెరట్లోకి చూస్తూ చక్కని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండగా కడుపులో నొప్పి మొదలయ్యింది. ఈమధ్య చాలా రోజుల నుండి ఇలా తరచుగా నొప్పి వస్తోంది. ఎన్నోసార్లు భర్తకు చెప్పినా తేలికగా చూశాడు తప్ప సీరియస్ గా తీసుకోలేదు.

నొప్పి ఇంకా ఎక్కువ అవుతోంది. అలాగే లేచి ఒక నొప్పి గోలి వేసుకొని నీళ్లు తాగి కళ్ళు మూసుకుని పడుకుంది. ఒక గంట సేపటికి సర్దుకుంది. లేచి బయటకు వచ్చేసరికి అత్తగారు వత్తులు చేస్తూ కూర్చున్నారు.

"కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా అత్తయ్యా! ఎప్పుడూ పని చేస్తుంటారు" అని చిరు కోపం నటించి, తాను సాయంత్రం కోసం చిరుతిండి తయారు చేస్తానని లోపలికి వెళ్ళింది.

సాయంత్రం మళ్ళీ వంట పని ఎలాగూ ఉంటూనే ఉంటుంది. దీపారాధన చేసుకొని అలా హాల్లోకి వస్తుంటే ఒక్క ఉదుటున నొప్పి ఎక్కువైపోయింది. కింద పడిపోయింది ఇంద్రజ.

అక్కడే ఉన్న అత్తగారు, పిల్లలు, భర్త ఒకేసారి "ఏమైంది ఏమైంది" అంటూ వచ్చి ఆమెను మెల్లిగా లేపి అలా మంచం మీద పడుకోపెట్టారు....

వెంటనే ఇంటి ముందు ఉన్న రామయ్యకు చెప్పి రిక్షాను పిలిపించుకొని, హాస్పిటల్ కి వెళ్ళారు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్స్, ‘ఆపరేషన్ చేయాలి. కడుపులో కంతి లాగా ఉంది’ అని చెప్పారు...

వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్న అత్తగారు ఎంతో మంది దేవుళ్ళకి మొక్కుతున్నారు.

‘పెదవుల మీద చిరునవ్వు చెరగని నా కూతురు.. నా ఇంటి లక్ష్మి.. తనకి ఏమీ కాకూడదు. తన ఆయుషు కూడా పోసుకొని ఎక్కువ రోజులు బ్రతకాలి’ అని భయపడిపోతుంది ఇంతలో కొడుకు వచ్చి "అమ్మా! ఇంద్రజకి ప్రమాదం ఏమీ లేదు ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది నువ్వు కంగారు పడకు" అని దగ్గరకు తీసుకున్నాడు.

ఇద్దరూ ఒకపక్క కూర్చుని బిక్కుబిక్కుమని చూస్తున్నారు. నాయనమ్మ తులసమ్మ, వాళ్ళిద్దరినీ చెరో చేత్తో దగ్గరికి తీసుకొని ఓదార్చింది.


"అమ్మ ఇంటికి వస్తుంది నాన్నా తొందరగా! మీరు బెంగ పెట్టుకోకండి. నేనున్నాను కదా" అని చెప్పింది.

ఒక్కసారి గతం గుర్తొచ్చింది తులసమ్మకి.


కోడలు ఇంద్రజ పెళ్లి అయిన కొత్తలో, తాను తన గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకుందో ఆలోచించుకుంది.. తన అత్త పెట్టిన ఆరళ్లు గుర్తుకు వచ్చి, కోడల్ని కూడా ఇలాగే పెట్టాలి అనుకుంది. తన కొడుకును కొంగున ముడి వేసుకొని తనను నిర్లక్ష్యం చేస్తుంది అనే భయంతో ఏ పని చేసినా వంకలు పెట్టేది. ఒక చిన్న సహాయం కూడా చేయకుండా కూర్చుని అన్నీ చేయించుకునేది. అయినా కూడా కోడలు ఎదురు సమాధానం చెప్పకుండా అన్ని పనులు ఓపికగా చేసేది. ఇంటికి వచ్చిన అతిథులను, ఆడపడుచులను గౌరవంగా చూసేది.

ఇలా చేస్తున్నా తనకి కోపం రావడంలేదని ఇంకా కసితో ఎక్కువ మాటలు అనేది. ఇలా ఒకరోజు కాఫీ బాగాలేదని గట్టిగా అరుస్తూ అరుస్తూ వెనక్కి జారి పడిపోయింది తులసమ్మ. అప్పుడు కోడలు చెయ్యిపట్టి తనని పైకి లేపి, ఉయ్యాల బల్లపై కూర్చోబెట్టి, కాళ్లు చేతులకి నూనె పెట్టి మర్దన చేసింది. దగ్గర ఉన్న ఆయుర్వేదం డాక్టర్ ఇంటికి వచ్చి చూసి, ఒక 15 రోజులు నడవకూడదని చెప్పారు.

ఆ పదిహేను రోజులూ కోడలు ఇంటి పనులతో పాటు తనకు దగ్గరుండి ఎన్నో సపర్యలు చేసింది. ఒక్కసారి కూడా తను తిట్టినవి, తను అన్న మాటలు గుర్తుపెట్టుకోకుండా ఎంతో ఆప్యాయంగా చూసుకున్నది. ఆ పడుకున్న 15 రోజులు తులసమ్మ మదిలో అంతర్ మథనం జరిగింది.


"నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను కోడల్ని" అని ఎంతో పశ్చాత్తాప పడింది.

ఆమెకు ఈ సమయం కోడల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఒకరోజు కోడలు మందులు ఇచ్చి అత్తగారిని పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్తుంటే చేయి పట్టుకొని కోడల్ని ఆపి కళ్ళ నీళ్లు పెట్టుకొని "నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా! ఇంత మంచి మనసున్న నువ్వు నా కోడలుగా రావడం నా అదృష్టం. ఇకపై నిన్ను పల్లెత్తు మాట కూడా అనను. నా కంటిపాపలా నిన్ను చూసుకుంటాను" అని చెప్పింది.

కోడలు కూడా "అలా ఏమీ లేదు అత్తయ్యా! మీరు విశ్రాంతి తీసుకోండి" అని చెప్పింది. ఎన్నోసార్లు కూతుర్ని వెనకేసుకొని కోడల్ని నానా మాటలు అన్నా కూడా కోడలు, మనసులో ఏమీ పెట్టుకోలేదు. అదే కూతురు తనకు పెట్టాల్సిన కట్నం పెట్టలేదని ఇప్పటివరకు చూడటానికి కూడా రాలేదు. తులసమ్మ మనసు ఇప్పుడు తేలికపడింది. అప్పటినుండి కోడలితో ఆప్యాయంగా మసులుకుంటోంది. అదంతా గుర్తొచ్చి నవ్వుకుంది తులసమ్మ.

నాలుగురోజుల్లో ఇంటికి వచ్చిన కోడల్ని కాలు కింద పెట్టకుండా చూసుకొని, తన ఆరోగ్యం బాగు కావడానికి ఎంతో సేవ చేసింది తులసమ్మ.

అత్తగారిని చూసి "నాకు మరో అమ్మ" అని మనసులో అనుకొని అత్తగారి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది ఇంద్రజ.

అది చూసిన భర్త నారాయణ “ఎప్పుడూ మీ ఇద్దరూ ఒకటే. ఇంకెవరూ అవసరం లేదు కదా మీకు" అని అన్నాడు.

వెంటనే పిల్లలు వచ్చి "అవును నాన్నా! ఎప్పుడూ వాళ్ళిద్దరే ఒకటి. మనల్ని అస్సలు పట్టించుకోరు, ఈ నాయనమ్మ, అమ్మ" అన్నారు.

ఇంట్లో అందరూ నవ్వేసుకుని సంతోషంగా ఉన్నారు.


***శుభం ***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.


124 views0 comments

Hozzászólások


bottom of page