top of page
Original.png

ఓ ఇంటి కథ!

#OIntiKatha, #ఓఇంటికథ, #RonankiDivijaSaibhanu, #రోణంకిదివిజసాయిభాను, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

O Inti Katha - New Telugu Story Written By Ronanki Divija Saibhanu Published In manatelugukathalu.com On 02/12/2025 ఓ ఇంటి కథ! - తెలుగు కథ

రచన: రోణంకి దివిజ సాయిభాను


శృతికు ఇండియాలో ఉన్న తమ్ముడు హరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 

“హాయ్, తమ్ముడూ! ఎలా ఉన్నావు?” అని అడిగింది. అట్నుంచి సమాధానం రాకపోవటంతో, శృతి రెండోసారి అడిగింది. 


“నాన్న గారు కార్డియాక్ అరెస్టుతో చనిపోయారు, అక్కా!, ” అని హరి చెప్పాడు. శృతి కూర్చున్న దగ్గరే కూలబడిపోయింది. పక్కనే ఉన్న శృతి భర్త భరత్ ఫోన్ తీసుకొని, హరితో కాసేపు మాట్లాడి, వచ్చే ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. 


భరత్ హైదరాబాద్ లో ప్రఖ్యాత కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసేవాడు, కంపెనీ వాళ్ళు భరత్‌ని అమెరికా పంపించారు. అప్పటికే శృతితో భరత్ కి పెళ్లి కావటంతో అలా ఇద్దరూ కలిసి అమెరికాలో ఉంటున్నారు. వారిరువురిదీ ప్రేమ వివాహం. 


భరత్ శృతిని ఒకవైపు ఓదార్చే ప్రయత్నం చేస్తూ, మరో వైపు కంపెనీ వాళ్ళకి పర్మిషన్ అడిగి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. ఇద్దరూ ఎక్కువ మాట్లాడుకోకుండా విమానం ఎక్కారు. శృతి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, బ్యాగులో ఉన్న ఆల్బమ్ ఓపెన్ చేసింది. శృతి ఆల్బమ్‌లోని పాత ఫోటోలు ఆమె గతాన్ని చెప్తున్నట్టు అనిపిస్తున్నాయి. 


శృతి పుట్టినప్పుడు, ఆమె తల్లి సుధా ఒక గృహిణి. నంద కుమార్ మంచి పేరున్న పారిశ్రామికవేత్త కావడంతో ఆఫీస్‌ వర్క్స్ లో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. శృతికి పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో సుధా మరణించింది. తెలిసీ తెలియని వయసు అవటంతో ఏమి అర్ధంకాక వెక్కి వెక్కి ఏడ్చింది. తనను ఆపటం ఎవరి తరం కాలేదు. ఆ రోజు నుంచి శృతి జీవితం మారిపోయింది. ఆమెకు తల్లి లేకపోవడం ఒక శూన్యం సృష్టించింది. 


కొన్ని నెలల తర్వాత, నంద కుమార్ శృతికి తల్లి లేని లోటు లేకుండా ఉండాలని, తన ఆఫీస్‌లో పనిచేసే యశోదను పెళ్లి చేసుకున్నారు. యశోద మంచి మనసున్న స్త్రీ, శృతి అంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ శృతికి ఆమెను అంగీకరించడం కష్టమైంది. “నువ్వు నా అమ్మవి కాదు!” అంటూ శృతి తరచూ గొడవ పడేది. యశోద ఓపికగా శృతికి చెప్పటానికి ప్రయత్నించేది. ఆమెను కన్న కూతురిలా చూసుకునేది. 


కొంతకాలానికి యశోద హరిని కన్నది. హరి పుట్టినప్పుడు కుటుంబంలో కొత్త ఆనందం వచ్చింది. హరి చిన్నప్పుడు శృతి అతన్ని ప్రేమగా చూసుకునేది, కానీ యశోదతో మాత్రం దూరంగా ఉండేది. నంద కుమార్ ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చడానికి ఎంతగానో ప్రయత్నించేవారు, కానీ శృతి తన తల్లి సుధా జ్ఞాపకాల్లోనే మునిగిపోయేది. 


విమానంలో ఆల్బమ్ చూస్తుండగా, శృతి కళ్లు చెమర్చాయి. ఆ ఫోటోల్లో నంద కుమార్ గారి నవ్వు, హరి చిన్నప్పటి చేష్టలు, యశోద దూరంగా నిలబడి చూసే ఫోటోలు అన్నీ ఉన్నాయి. యశోదను చూశాక శృతి గుండెల్లో ఎక్కడో మూలాన అపరాధ భావం వెంటాడుతుంది. తన తండ్రి అంటే ఆమెకు చాలా ఇష్టం. భరత్ శృతి భుజం తట్టి, ధైర్యం చెప్పాడు. శృతి తను చేసింది చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయింది. 


ఇండియా చేరుకున్న తర్వాత, భరత్ తమ్ముడు సుశాంత్ వారిని ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి, నంద కుమార్ గారి పార్థివ దేహం ఇంట్లో ఉంది. శృతి తన తండ్రిని అలా చూసి కన్నీరుమున్నీరైంది. యశోద మౌనంగా కూర్చుని ఉంది, ఆమె కళ్లలో తీవ్రమైన బాధ ఉంది, ఏడ్చి ఏడ్చి తడారిపోయి ఉన్నాయి. మొదటిసారి ఆమె పట్ల శృతికి ఒక రకమైన సానుభూతి కలిగింది. కానీ ఆమెతో ఏమీ మాట్లాడలేదు. 


హరి చేతుల మీద అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత, అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. కార్యక్రమాలన్నీ ముగిశాక, తిరిగి అమెరికా వెళ్దామని ముందే నిశ్చయించుకున్నారు. శృతి ఎన్నోసార్లు యశోదతో మాట్లాడాలని అనుకుంటున్నా, ధైర్యం చేయలేకపోయింది. 11వ రోజు కార్యక్రమం ముగిశాక, యశోద శృతిని పిలిచింది. 


“శృతి, నీ నాన్న గారు నిన్ను ఎంతో ప్రేమించేవారు. ఆయన చనిపోయే ముందు నీకు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వమన్నారు” అంటూ ఒక ఫైల్ ఇచ్చింది. 


ఆ ఫైల్‌లో డాక్యుమెంట్లు ఉన్నాయి. నంద కుమార్ తన కూతురు శృతికి రాసి పెట్టిన ఆస్తులు. శృతి ఆశ్చర్యంగా చూసింది. కానీ అంతకంటే ముఖ్యమైనది, ఆ ఫైల్‌లో ఒక లెటర్ ఉంది. అది నంద కుమార్ రాసినది. శృతి ఆ లెటర్ తెరిచి చదవడం మొదలుపెట్టింది. 


"డియర్ శృతి, 

ఈ లెటర్ నువ్వు చదివేసరికి నేను నీతో ఉండనురా!ఎందుకంటే ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండటం లేదు. సుధా మరణించినప్పుడు, నా జీవితం ఒక శూన్యంలా తోచింది. నీ కోసం ఆలోచించిన ప్రతిసారీ నాకు చాలా భయం వేసింది. నీకు తల్లి లేని లోటును తీర్చడం కోసం నేను యశోదను పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు ఆమెను అంగీకరించలేదు. కానీ శృతి, యశోద నీకు తల్లి కంటే ఎక్కువ. ఆమె నీకోసం తన ఉద్యోగాన్ని వదులుకుంది. ఒకసారి గుర్తుచేసుకో – నీకు పదవ తరగతిలో చివరి పరీక్ష అయినప్పుడు, నీకు వైరల్ జ్వరం విపరీతంగా ఉండేది. నేను ఆఫీస్‌లో బిజీగా ఉండి రాలేకపోయినా, ఎక్కడ నువ్వు నిద్రలో ఇబ్బంది పడతావేమో అని యశోద రాత్రంతా నీ పక్కనే కూర్చుని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నువ్వు ఉదయం ఎప్పట్లానే లేచి, పరీక్ష చక్కగా రాసి వచ్చావు. స్కూల్ ఫస్ట్ వచ్చావు, ఆ క్షణం ఆమె ఆనందం మాటల్లో చెప్పలేనిది.


హరి పుట్టిన తర్వాత కూడా, ఆమె నిన్ను తన కూతురిగా చూసుకుంది. హరి మొదటి పుట్టిన రోజు ఫంక్షన్ లో ఆమెను నువ్వు అందరి ముందూ అవమానించావు, ఐనా ఆమె నిన్ను పల్లెత్తు మాట అనలేదు. ఎంత ప్రయత్నించినా నీకు దగ్గర కాలేకపోతున్నందుకు నాతో చెప్పుకుని చాలా బాధ పడేది. నువ్వు భరత్ ను తీసుకొచ్చి, "ఇతన్నే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పినప్పుడు నేను మొదట ఒప్పుకోలేదు కదరా. అయినా, నీ మీద నమ్మకంతో యశోద నన్ను ఒప్పించింది. మన శృతి ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది అని నాకు సర్దిచెప్పింది. ఆమె లేకపోతే, మన కుటుంబం ఇలా ఉండేది కాదు. తల్లి అంటే రక్త సంబంధం మాత్రమే కాదు, ప్రేమ మరియు త్యాగం. ఆమెను ఇప్పటికైనా అర్థం చేసుకో, ప్రేమించు. ఇదే నా చివరి కోరిక రా. "


లెటర్ చదివిన తర్వాత, శృతి కళ్ల నుంచి అప్రయత్నంగా నీళ్లు వచ్చాయి. యశోద తన జీవితంలో ఎంత పెద్ద పాత్ర పోషించిందో అర్థమైంది. 


శృతి యశోద దగ్గరికి వెళ్లి, “అమ్మా… నన్ను క్షమించు, నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా ప్రేమించావు, ఈ రోజు ఈ లెటర్ చదవకపోయి ఉంటే నీ విలువ నాకెప్పటికీ అర్థం అయ్యేది కాదు” అంటూ కాళ్ల మీద పడింది. యశోదకు ఆ క్షణం ఒక కలలా అనిపించింది. “శృతి… నువ్వు నా కూతురివి. ఎప్పుడూ నా కూతురివే. ఇన్నాళ్ళు నువ్వు నన్ను తల్లిగా అంగీకరించకపోయినా, నీపై నా ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. నువ్వు సంతోషంగా ఉంటే, అదే నాకు ముఖ్యం, ” అని యశోద అంది. 


ఇప్పుడు శృతి ముఖంలో కొత్త ప్రశాంతత, అపరాధ భావం నుంచి విముక్తి లభించిన సంతృప్తి కనిపించాయి. హరి ఆనందంగా వారిద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు. 

“అక్కా! అమ్మా! మనందరం ఇన్నాళ్లు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందొచ్చు, నాన్న గారి కోరికను నెరవేర్చొచ్చు, ” అని అన్నాడు. హరి మాటలకు శృతి, యశోద నవ్వారు. 


రాత్రి భోజనం తర్వాత, శృతి, భరత్, యశోద, హరి నలుగురూ కూర్చుని, పాత జ్ఞాపకాలను, సరదా సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తండ్రి లేఖ, తల్లి ప్రేమ, కుమార్తె నవ్వు ఈ మూడు ఒకటై, ఎన్నాళ్ల నుంచో చీలిపోయిన బంధాన్ని ఏకం చేశాయి. ఇన్నాళ్లు వారిని దూరం చేసిన అడ్డు గోడ తొలగిపోయింది. ఆ ఇంట్లో మళ్లీ ఒక చక్కని కుటుంబ వాతావరణం, నవ్వులు వినబడ్డాయి. గోడ పైన ఫోటోలో ఉన్న నంద కుమార్ కూడా వారిని చూస్తూ అలాగే నవ్వుతూ ఉండిపోయారు. 


రోణంకి దివిజ సాయిభాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

నా పేరు రోణంకి దివిజ సాయిభాను. తెలుగు భాషాభిమానిని. తెలుగు భాషలో కవితలు మరియు కథలను రాస్తుంటాను. మనసును నింపిన ప్రతి భావాన్ని పదాలతో అల్లుతూ ఇప్పటివరకు ఎన్నో కవితలను రాసాను. నా కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఎన్నో సాహిత్య పోటీల్లో పాల్గొని, విజయాలు సాధించడం నాకు మరింత ప్రేరణనిచ్చింది. భావాలకి, కలలకి మాట దొరికేలా చేసే ఈ సాహిత్యయాత్రలో నిరంతరం కొత్త అంచులను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page