top of page
Original.png

పచ్చపూల చెట్టు



బామ్మ ఉమావతమ్మతో కలిసి పచ్చపూల చెట్టును పెంచుతున్న చిన్ననాటి పవన్

Pachapula Chettu- Telugu Family story | Kanakadurga Lakshmirathna

పచ్చపూల చెట్టుతెలుగు కుటుంబ కథ  | కనకదుర్గా లక్ష్మీరత్న

Published in manatelugukathalu.com on 11/08/2026


“పచ్చపూల చెట్టు” బామ్మ–మనవడి అనుబంధం, బాల్య జ్ఞాపకాలు, ప్రకృతి ప్రేమ, మానవత్వం కలగలిసిన హృదయస్పర్శి తెలుగు కథ. ఉమావతమ్మగారు నలుగురికి నీడనివ్వాలనే మంచి ఉద్దేశంతో ఇంటి బయట నాటించిన చిన్న పచ్చపూల మొక్కను ఆమె మనవడు పవన్ ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆ మొక్క కాలక్రమంలో పెద్ద చెట్టుగా ఎదిగి, రోడ్డుపై వెళ్లేవారికి నీడను, దాహార్తులకు నీటిని, పూజకు పూలను అందిస్తూ ఆ ప్రాంతానికే గుర్తింపుగా మారుతుంది. అదే చెట్టు పవన్ బాల్యంలో ఎన్నో మధుర జ్ఞాపకాలకు సాక్ష్యమై, చివరికి తనను నాటించిన బామ్మకు అపూర్వమైన నివాళిగా నిలుస్తుంది.


“సాయిబాబా గుడి ఎదురింటి మహాలక్ష్మమ్మ గారు పచ్చపూల మొక్క ఇస్తామన్నారు, వెళ్లి తెచ్చుకుందాం వస్తావా!” కోడలు శివానీని అడిగారు ఉమావతమ్మ గారు.


“సరే, అత్తయ్య!” అని పెరట్లో ఆడుకుంటున్న అయిదేళ్ల కొడుకు పవన్‌ని పిలిచి

“పవన్! యెల్లో ఫ్లవర్ ప్లాంట్ తెచ్చుకోవడానికి వెళుతున్నాం పద!” అంది.

సరేనని ఒక చేత్తో బామ్మని, ఇంకో చేత్తో అమ్మని పట్టుకుని గెంతుకుంటూ బయలుదేరాడు.


ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా శివాని, పవన్‌కి వేసవి సెలవులు ఇస్తే ఒక నెల అత్తగారింటికి తీసుకొచ్చింది. దొడ్డి నిండా మందారాలు, గన్నేరు, నందివర్ధనాలు, గులాబీలు, రకరకాల చామంతులు ఉన్నాయి. కానీ ఉమావతమ్మ గారికి పచ్చ పూలతో దేవుడికి పూజ చేయనిదే తృప్తిగా ఉండదు.


“మిగతా పూలు దేవుడికి పెడతాము, మనమూ పెట్టుకుంటాం. పచ్చపూలైతే అచ్చగా దేవుడికే పెడతాము” అంటుంటారు. అంతకు ముందు పెట్టిన మొక్క బ్రతకలేదు. మహాలక్ష్మమ్మ గారు వేళ్లతో పచ్చపూల మొక్కని ఇచ్చింది. ఉమావతమ్మగారు ఆప్యాయంగా మొక్కను తడిమి వారింట మహావృక్షంలా పెరిగి విరగబూసిన పచ్చ పూలను పవన్‌కి చూపిస్తూ


“ఇది కూడా పెరిగితే అంత పెద్ద చెట్టయ్యి ఇన్నేసి పూలు ఇస్తుందన్నమాట” అన్నారు.


పవన్ పూలని ఆశ్చర్యంగా చూస్తూ “ఓ! గోల్డెన్ బెల్ ఫ్లవర్స్?” అన్నాడు.

శివానీని మొక్క నాటటానికి పార తెమ్మన్నారు ఉమావతమ్మ గారు.

“నేను పెడతా! నేను పెడతా!” అన్నాడు పవన్.


“ఉండు. నేను మట్టి తవ్వాక పెడుదువుగాని” అంది శివాని.

“ఎక్కడ పెట్టమంటారు అత్తయ్య?” అడిగింది.


గేట్ తీసి, “బయట గోడకి కొంచెం దూరంలో పెట్టు” అన్నారు.


శివాని, పవన్ ఆశ్చర్యపోయి “ఇంటి బయట ఎందుకు?” అడిగారు.


“ఎండకి నిలవదేమో అత్తయ్య! పైగా గేదెలు, మేకలు తినేస్తాయేమో!” అంది.

“మొక్క పెద్దది అయ్యేంతవరకు కంచె వేస్తానులే! పైగా నేను చూసుకుంటూనే ఉంటానుగా. బయట వేస్తే మొక్క పెరిగి బాగా పెద్దదైతే చక్కటి నీడనిస్తుంది. చల్లటి గాలి వీస్తుంది.


ఎండలో రోడ్డున పోయే రిక్షా తొక్కేవాళ్ళు, సైకిళ్ల మీద వెళ్లేవాళ్ళు నీడ పట్టున కొంచెం సేపు కూర్చుని వెళ్తారు. ఎవరికైనా పూజకి పూలు కావాల్సి వస్తే కోసుకుంటారు. మన చెట్లు మనకే కాకుండా నలుగురికి ఉపయోగపడితే ఎంత బాగుంటుంది? అశోకుడు రోడ్ల మీద ఎన్ని చెట్లని నాటించాడు? పవన్! ముందు ముందు నువ్వు పాఠాల్లో చదువుకుంటావులే” అన్నారు.


“సాధారణంగా మన ఇంటి శోభని పెంచడానికనో, లేదా మనకి మక్కువనో మొక్కలని పెట్టుకుంటాం. కానీ అత్తయ్య నలుగురికి నీడనివ్వడానికి నాటుతున్నారు. ఆవిడ సద్భావనకి మొక్క పచ్చగా వర్ధిల్లాలి” అని మనసులో గట్టిగా అనుకుంది శివాని.


పవన్ తన చిన్న చేతులతో బామ్మ ఆధ్వర్యంలో ఇంటి బయట మొక్కని నాటాడు. తాత లక్ష్మీకాంతం గారు మొక్క చుట్టూతా కంచె కట్టారు. తను ఎప్పుడూ ఆడుకునే వాళ్ల వీధి చివర ఇంటిలో ఉండే రాణికి ఉత్సాహంగా చూపించాడు.


ఇంక రోజూ పవన్‌కి ఇదే తంతు. సాయంత్రం నీళ్లు పోయడం, పొద్దున్నే లేచి పెరిగిందో లేదో చూడడం, గేదెలు, మేకలు తినకుండా మధ్యాహ్నాలు కాపలా కాయడం. పవన్ సెలవులు అయిపోయాయి. తండ్రి రఘురామ్ వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్లడానికి వచ్చాడు. పవన్ తండ్రికి సంభ్రమంగా తను నాటిన పచ్చపూల మొక్కని చూపించాడు. బామ్మ మొక్క నాటటంలో సదుద్దేశ్యం కూడా తండ్రికి చెప్పాడు.

“మనింట్లో కూడా పెట్టుకుందాం నాన్నా!” అన్నాడు.


“మనం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాముగా. పాట్స్‌లో సరిగ్గా పెరగవు” అన్నాడు.

పవన్ వెళ్లేటప్పుడు బామ్మతో చాలా జాగ్రత్తలు చెప్పాడు.


“రోజూ నువ్వు నీళ్లు పోయాలి. గోట్స్ తినకుండా చూడాలి. ప్లాంట్ ఎంత పొడుగు అయిందో చెప్పాలి. గోల్డెన్ బెల్స్ వచ్చాక నాకు చూపించాలి” అన్నాడు.

“అలాగేరా భడవా!” అని నవ్వారు.


హైదరాబాద్ వెళ్లాక కూడా బామ్మకి, తాతకి ఫోన్ చేసి పచ్చపూల మొక్క బాగోగులు అడుగుతుండేవాడు.


రోజులు గడుస్తున్నాయి. మొక్క పచ్చగా పెరిగి అందంగా పుష్పించడం ఆరంభించింది. మళ్ళీ వేసవి సెలవులు వచ్చాయి. పవన్ రిక్షా దిగుతూనే

“అమ్మా! గోల్డెన్ బెల్ ఫ్లవర్స్” అంటూ ఆనందంగా పరిగెత్తాడు.

ఉమావతమ్మ గారు గేట్ తీసి “ఇవాళ తాతకి పూజకి నువ్వు పూలు కోసి ఇద్దువుగానిలే!” అన్నారు.


పవన్ మొక్క దగ్గరే నుంచుని తన్మయత్వంతో చూస్తున్నాడు.

“భడవ లోపలికి వచ్చేటట్లు లేడు. సరే! పూల బుట్ట తెస్తాను, కోద్దువుగాని” అన్నారు. పవన్ తన వేళ్లతో సున్నితంగా పూలను తుంపి బుట్టలో వేశాడు. తాత పూజ చేస్తున్నంత సేపు తనే చేత్తో ఒక్కొక్క పువ్వుని అందించడం మొదలెట్టాడు.


సాయంత్రాలు రాణి పవన్‌తో ఆడుకోవడానికి వచ్చేది. ఇద్దరూ కలిసి పచ్చ పూల మొక్కకి, మిగతా పూల మొక్కలకి నీళ్లు పోసేవారు. ఉదయాన్నే పూలు కోయడం, తాతకి పూజకి అందించడం, కొన్నిసార్లు తనే దేవుడికి పెట్టడం చేసేవాడు.


ఒక్కొక్కసారి మొగ్గ మూడు, నాలుగు రోజులకు గానీ విచ్చుకునేది కాదు. రోజూ విచ్చుకుంటోందో లేదో చూసేవాడు. అప్పుడు రాణి

“అలా మొగ్గలకేసి చూస్తే పూయదు. మనం పడుకున్నప్పుడు రాత్రి విచ్చుకుంటుంది” అని కోప్పడేది. రాణి తన కంటే రెండేళ్లు పెద్దది అవడం చేత ఆ పిల్ల చెప్పినట్టు వినేవాడు.


కాలక్రమేణా మొక్క చెట్టు అయ్యింది. పవన్ పదేళ్ల వాడయ్యాడు. కంచె స్థానంలో ఉమావతమ్మగారు ఒక సిమెంటు బల్ల కట్టించారు, ఎండలో రోడ్డున పోయేవాళ్లు విశ్రాంతిగా నీడ పట్టున కొంచెం సేపు సేద తీరుతారని. నెమ్మదిగా రిక్షా తొక్కేవాళ్ళు, బళ్ల మీద పాత ఇనుపసామాన్లు కొనేవాళ్ళు, కాగితాలు ఏరుకునేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, ఇలా ఒకరేమిటి? ఎందరెందరో ఆ సిమెంట్ బెంచ్ మీద సేద తీరేవాళ్ళు. పవన్ ఉదయాన్నే పాల గ్లాసు తీసుకుని సిమెంట్ బెంచ్ మీద కూర్చుని తాగేవాడు. సాయంత్రాలు, రాణీతో ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఆడుకునేవాడు. ఇద్దరూ బెంచ్ మీద నిలబడి కొమ్మలని పట్టి ఊపి, పూలు రాలగానే ఏరి ఇద్దరూ పంచుకునేవారు.


మరుసటి వేసవిలో ఉమావతమ్మ గారు పంపు ఉన్న మట్టికుండతో నీళ్లు పెట్టి దానికి తడిగుడ్డ చుట్టి దానిపై చిన్న లోటా పెట్టారు. దాహార్తులు సేద తీరేవారు. పవన్ కుండలో నీరు ఉందో లేదో చూడడం, తిరిగి నింపడం ఉత్సాహంతో చేసేవాడు. చెట్టు పెరిగి దాని కొమ్మలు ఇంటి లోపలికి విస్తరించాయి.


ఉమావతమ్మగారు ఇంటి లోపలి వైపు పూసిన పూలు కోసుకుని, బయట పూసిన పూలని బయట వాళ్లకి వదిలిపెట్టేవారు.


ఏడాదేడాదికి పవన్‌కి పచ్చచెట్టుతో అనుబంధం పెరగసాగింది. ప్రతీసారి ఏదో ఒక మధురమైన అనుభవాలను ఇవ్వసాగింది. ఆ వేసవి సెలవులకి పవన్ పదమూడేళ్ల కుర్రాడు అయ్యాడు.


రాణి సైకిల్ మీద ట్యూషన్‌కి వెళ్లే టైమ్‌కి అక్కడ బెంచ్ మీద కూర్చుని “హాయ్” అని చెయ్యి ఊపేవాడు. తను ట్యూషన్ నుండి వచ్చేంతవరకు మిగతా కుర్రాళ్లతో క్రికెట్ ఆడి, ట్యూషన్ అయిపోయి ఇంటికి వెళ్లే టైమ్‌కి మళ్లీ బెంచ్ మీద వచ్చి కూర్చునేవాడు. రాణి కూడా కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయేది.


ఒక రోజు ఉదయాన లక్ష్మీకాంతం గారు పేపర్ తీసుకోవడానికి లేచినప్పుడు లోపలి వైపు పచ్చ పూలు విరగబూసి ఉన్నాయి. తెల్లారాక పవన్ చేత కోయించవచ్చు అనుకుని లోపలికి వెళ్ళిపోయారు. పూజ వేళప్పుడు ఉమావతమ్మ గారు “పవన్! తాత పూజ వేళ అవుతోంది. పూలు కోసుకురా నాన్నా!” అన్నారు.


పవన్ పడుకుని లేవలేదు. సరేనని బుట్ట తీసుకుని ఉమావతమ్మ గారు వెళ్లారు. ఒక్క పచ్చపూవు కూడా లేదు. మిగతా పూలు కోసి తెచ్చారు.


“పచ్చ పూలు ఏవి?” అడిగారు.

“ఏమో! లేవు. బహుశా ఎవరైనా లోపలికి వచ్చి కోసుకెళ్లారేమో” అన్నారు ఉమావతమ్మ గారు.


“నేను పేపర్ తేవడానికి వెళ్లినప్పుడు చాలా ఉన్నాయే! ఒక్కటి కూడా ఉంచకుండా అన్నీ కోసుకుపోయారా?” అన్నారు ఆశ్చర్యంగా. ఈ సంభాషణ అంతా నిద్రపోతున్నట్లు నటిస్తున్న పవన్ విన్నాడు. ఆ రోజు సాయంత్రం మొక్కలకి నీళ్లు పోస్తూ “బామ్మా! నువ్వు కోప్పడనంటే నీకో విషయం చెబుతాను. అమ్మకి చెప్పకు” అన్నాడు.


“ఏమిటి నాన్నా?”

“తాత పేపర్ తీసుకుని లోపలికి వెళ్లాక గోల్డెన్ బెల్స్ అన్నీ కోసేసి రాణికి ఇచ్చాను. నాకెందుకో రాణికి పూలు ఇవ్వాలనిపించింది. రేపు ఉదయం నువ్వు ట్యూషన్‌కి వెళ్లినప్పుడు ఇస్తానని నిన్న సాయంత్రమే తనతో చెప్పాను” తలవంచుకుని చెప్పాడు.

“మరి తీసుకుందా?” నవ్వుతూ అడిగారు ఉమావతమ్మ గారు.


తలవంచుకునే “ఊ... అమ్మకి చెప్పకే” అన్నాడు.

“సరేలేరా భడవా!” నవ్వారు.


తరువాతి వేసవులకు రాణి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోచింగ్‌కి దూరం సెంటర్‌కి వెళ్లడంతో పవన్‌కి రాణీతో మాట్లాడే అవకాశం తగ్గిపోయింది. రోజూ తనే మంచిగా విచ్చుకున్న పూలను తీసుకుని, పూలు ఇచ్చే నెపంతో వాళ్ళింటికి వెళ్లి రాణీకిచ్చి వచ్చేవాడు.


ఆ తరువాతి సంవత్సరం రాణిని కలవడం పడలేదు. తనకి వైజాగ్ లో ఇంజనీరింగ్‌లో సీట్ వచ్చిందని ఉమావతమ్మగారు చెప్పారు. పవన్‌కి కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. ఇంక మిగతా కుర్రాళ్లతో క్రికెట్ ఆటతో కాలక్షేపం చేశాడు.


ఆ ఏడాది పవన్ ఇంటర్‌లోకి వచ్చాడు. మెడికల్ ఎంట్రన్స్ కోసం కోచింగ్‌లో పెట్టారు. తాత, బామ్మల ఊరు వెళ్లడం పడలేదు. పూర్తిగా చదువులో నిమగ్నమైపోయాడు. సెలవులంటూ లేకుండా పోయాయి. పవన్‌కి మెడిసిన్‌లో సీట్ వచ్చింది. చేరేలోపు రెండు, మూడు రోజులకి తాత, బామ్మని చూడటానికి వెళ్లాడు. రిక్షా వాడికి లక్ష్మీకాంతంగారి అడ్రస్ చెబితే “పచ్చపూల చెట్టు ఇల్లా?” అని అడిగాడు.


ఆ వీధిలో వాళ్లకి, రిక్షా, ఆటో వాళ్లకి, తాత ఇల్లు “పచ్చపూల చెట్టు” ఇల్లుగా సుపరిచితం అని పవన్‌కి అర్థం అయింది. చెట్టు కింద సేద, దాహార్తి అన్నీ ఇదివరకు లానే కొనసాగుతున్నాయి. ఆ రోజు సాయంత్రం చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద తాత, బామ్మ మధ్య కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు.


కాలం గిర్రున తిరిగింది. పవన్‌కి ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. అతను డాక్టర్ అయ్యే క్రమంలో తాత, బామ్మల ఊరు వెళ్లడం పడలేదు. మధ్యమధ్యలో రఘురామ్, శివాని వెళ్లి, తల్లిదండ్రులను చూసి వస్తుండేవారు. ఏవైనా ఫంక్షన్లు ఉంటే పెద్దవాళ్లే వచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్లేవాళ్లు. ఒకసారి వచ్చినప్పుడు ఉమావతమ్మగారు పవన్‌తో


“పవన్! పచ్చపూల చెట్టు కొమ్మలు బాగా విస్తరించడంతో కరెంటు తీగలకు అడ్డొస్తోందని మునిసిపాలిటీ వాళ్లు కొన్ని కొమ్మలు కట్ చేసేసారురా!” అన్నారు.

“అయ్యో!” నిట్టూర్చాడు పవన్.


రోడ్లు ఊడ్చేవాళ్లు కూడా “పూలన్నీ రాలి పడిపోతున్నాయి, పోగేయలేక చస్తున్నాము” అని సణుగుతుంటే తాత అందినంతవరకు కోసేసి రోజూ గుడికి వెళ్లి ఇస్తున్నారు” అని చెప్పారు.


“బామ్మా! రాణి ఇప్పుడు ఎక్కడుంది?” అడిగాడు కుతూహలంగా.


“అది పై చదువులకు అమెరికా వెళ్ళింది. అక్కడే ఉద్యోగంలో చేరింది” అన్నారు.

కొంతకాలానికి ఉమావతమ్మ గారు కాలం చేశారు. పవన్, అమ్మ, నాన్నలతో తాత ఊరు వెళ్లాడు. ఆటో వాడు ఇంటి అడ్రస్ చెప్పగానే “ఓ! పచ్చపూల చెట్టు ఇంటికా? పాపం ఆవిడ పోయారు. మీరేమవుతారు?” అడిగాడు.


“మా అమ్మగారు” దుఃఖం దిగమింగుకుంటూ చెప్పాడు రఘురామ్.

కొడుకుని చూసి లక్ష్మీకాంతం గారు “రోజూ ఉదయాన్నే పూజకి పూలు కోసి ఇచ్చేది. ఏ బాధా లేకుండా నిద్రలోనే ప్రశాంతంగా వెళ్లిపోయిందిరా మీ అమ్మ” గద్గద స్వరంతో వణుకుతూ రఘురామ్ చేతులు పట్టుకున్నారు.


ఉమావతమ్మగారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఉన్నారు. పవన్ మౌనంగా ఉన్నాడు. శివాని మామగారిని ఓదారుస్తూ వచ్చిన బంధువులను చూసుకుంటోంది. తెలిసిన వారితో పాటు, చెట్టు కింద సేద తీర్చుకున్న జనం కూడా వచ్చారు. ఉమావతమ్మ గారిని బయటకి తీసుకొచ్చి చెట్టు కింద పెట్టారు. “మహాతల్లి” అని అంతా దణ్ణం పెట్టారు. పవన్ ఉమావతమ్మ గారి కేసి చూస్తూ


“నువ్వు నలుగురికి నీడనివ్వాలని ఎంతో సదుద్దేశ్యంతో పచ్చపూల మొక్కని నా చేత ఇంటి బయట నాటించావు. నువ్వు కోరినట్లుగానే ఈ చెట్టు చల్లని నీడనిచ్చింది. ఎండన పడినవారికి సేద తీర్చింది. పూజకు పూలిచ్చింది. నాకు ఎన్నో మధుర స్మృతులను ఇచ్చింది. ఇప్పుడు నిన్ను కూడా తన నీడన చేర్చుకుంది” అనుకున్నాడు.


“పచ్చపూలైతే అచ్చగా దేవుడికే పెడతాము” అన్న బామ్మ మాటలు అప్రయత్నంగా గుర్తుకొచ్చి ఇన్ని పచ్చపూలని కోసి దోసిలితో బామ్మ కాళ్ల దగ్గర పెట్టి “నీకు ఇంతకు మించిన శ్రద్ధాంజలిని నేనేమివ్వగలను” అని దణ్ణం పెట్టాడు.

చల్లటి గాలికి కొమ్మలూగి, తనకి ఇన్నేళ్లుగా నీరుపోసి పెంచి పెద్ద చేసిన తల్లికి నివాళిగా కొన్ని పచ్చపూలు ఉమావతమ్మగారి మీద రాలాయి.



***

కనకదుర్గా లక్ష్మీరత్న గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కనకదుర్గా లక్ష్మీరత్న
కనకదుర్గా లక్ష్మీరత్న

రచయిత పరిచయం: కనకదుర్గా లక్ష్మీరత్న

నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

హృదయాన్ని కదిలించే చక్కటి కథ. తమకే కాక నలుగురికి పదికాలాలపాటు పనికివచ్చేలా వేసిన పచ్చపూల చెట్టుతో మనవడి ఆత్మీయ అనుబంధము, చెట్టుకింద రాణితో పెరిగిన ఇది అని చెప్పలేని స్నేహబంధం, చివరికి పచ్చపూల సుగంధంతో కలిసిపోయిన ఉమావతమ్మగారు కథకి ఆత్మీయతల సౌరభాన్ని అద్దాయి. అభినందనలు రత్నా గారు.

Like
bottom of page