top of page

పంతం పూచింది




'Pantham Puchindi' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 21/12/2023

'పంతం పూచింది' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"సార్!.. మీ ఆవిడ హారతి కన్నది. కవలపిల్లలు ఆడ.. మగ. బిడ్డలు తల్లీ క్షేమం." హరిని సమీపించి నర్స్ నవ్వుతూ చెప్పింది. కొన్ని క్షణాలు అతని ముఖంలోకి చూచి వెళ్ళిపోయింది.

హరి తన చెవులను తాను.. నమ్మలేకపోయాడు. పరవశంతో కళ్ళు మూసుకొన్నాడు.


"అన్నయ్యా!.. గ్రేట్.. నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను కరుణించాడు." ఆవేశంతో కౌగలించుకొన్నాడు స్నేహితుడు శివ. పసిబిడ్డలా అతని భుజంపై వాలిపోయాడు హరి.


హరి యిల్లాలు హారతి. నొప్పులు ప్రారంభం కాగానే నిన్న మూడు గంటలకు శివ సహాయంతో ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు. అప్పటి నుండీ యిప్పటివరకూ అతని మనస్సులో భయం.. ఆవేదన.. హారతికి అది మొదటి కాన్పు. ఏమౌతుందో!.. ఏమో, అనే భయం.. అలజడి. కాలుకాలిన పిల్లిలా హాస్పటిల్ ముందున్న వరండాలో అటూ యిటూ తిరుగుతూ రాత్రంతా జాగరణ చేశాడు హరి.

వుదయం ఆరుగంటల ప్రాంతం. నర్స్ వేగంగా వరండాలోకి వచ్చింది. తన పేరును పిలిచింది. ఆత్రంగా హరి ఆమెను సమీపించాడు. ఆ శుభవార్తను చెప్పి వెళ్ళిపోయింది.

యిప్పుడు.. హరి మనస్సు ఎంతో నిర్మలంగా.. ఆనందంగా వుంది.


'కవలపిల్లలు ఆడమగ..' నర్స్ చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమ్రోగాయి. వదనంలో ఆనందం మనస్సులో సంతోషం. కళ్ళల్లో ఆనందభాష్పాలు.


“అన్నయ్యా!.. నీవు చాలా మంచివాడవి. నీకు ఎప్పుడూ ఆ దేవుడు మంచే చేస్తాడు.” అన్నాడు శివ ఆనందంగా.


“మనదేముందిరా!.. అంతా ఆ సర్వేశ్వరుని దయ. నా బాధను ఎరిగి ఆ సర్స్ రూపంలో వచ్చి మనకు శుభవార్తను చెప్పి వెళ్ళిపోయాడు. "చేతులు జోడించి తూర్పు వైపుకు తిరిగి వుదయించే బాలభాస్కరునకు నమస్కరించాడు హరి.


నర్స్ వరండాలోకి వచ్చి వీరికి వ్యతిరేక దిశవైపుకు తిరిగింది. హరి పరుగున ఆమెను సమీపించాడు. "సిస్టర్.. హారతిని, బిడ్డలను వార్డుకు ఎప్పుడు తీసికొని వస్తారు?.." ఆత్రంతో అడిగాడు.

"మరో రెండు గంటల తర్వాత, నేను వచ్చి మీకు చెబుతాను.” నవ్వుతూ చెప్పి, నర్స్ ముందుకు వెళ్ళిపోయింది.


ప్రక్కనే వున్న శివ.."అన్నా!.. నిన్న రాత్రి నుంచి యింతవరకూ నీవు మంచినీళ్లన్నా తాగలేదు. రొండు గంటల సమయం వుందిగా. రా, క్యాంటీన్ కు వెళ్ళి.. టిఫిన్ చేసి కాఫీ త్రాగుదాం. నేను యింటికి వెళ్ళి అమ్మను పిలుచుకొని వస్తాను. వదినకు సాయంగా వుంటుంది." అన్నాడు.

హరి ఆనందంగా తల ఆడించాడు. ఆ యిరువురూ క్యాంటిన్ వైపుకు నడిచారు. 

టిఫిన్.. కాఫీ తీసుకొని, శివ తన యింటికి వెళ్ళిపోయాడు. హరి.. హాస్పటిల్లో ప్రవేశించాడు. డెలివరీ వార్డుకు ముందున్న వేపచెట్టు చుట్టూ వున్న అరుగు మీద కూర్చున్నాడు. మనస్సు గతం వైపుకు పరుగిడింది.


హరి యిండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. తన చిన్నతనంలోనే తల్లి తండ్రి గతించారు. మేనత్త శకుంతల హరిని పెంచి పెద్ద చేసింది. యం.ఎ. యం.బి.ఎ. వరకూ హరి యిష్టానుసారంగా చదివించింది. మూడేళ్ళ క్రిందట బ్యాంక్ వుద్యోగం దొరికింది హరికి.


యితని మేనమామ ముకుందరావు. రాజకీయ నాయకుడు. మంచివారికి మంచివాడు. చెడ్డవారికి చెడ్డవారు.


గడిచిన ఎలక్షన్ లో శకుంతల యితనికి పోటీగా నిలబడింది. యం.యల్.ఎగా తను గెలిచింది. ముకుందరావు ఓడిపోయాడు. హరి తల్లి వనజ ముకుందరావు అక్కయ్య. ఆ ఓటమి కారణంగా శకుంతల హరులపై అతనికి ద్వేషం.. పగ ఏర్పడ్డాయి.


ముకుందరావు చెల్లెలు హారతి.. హరి హారతులు చిన్నతనం నుండి కలసి ఆడుకొని, చదువుకొన్నవాళ్ళు. హరికంటే.. హారతి ఐదేళ్లు చిన్నది. ఆమె బి.ఎ. వరకూ చదివింది. వారిరువురికీ వివాహం జరిపించాలని ముకుందరావు.. శకుంతల ఆ ఎలక్షన్ ముందువరకూ అనుకున్నవాళ్ళే. ఎలక్షన్లో శకుంతల పోటీ చేయడం.. గెలవడం.. రొండూ సహించని ముకుందరావు.. హరిని.. శకుంతలను తన శత్రువులుగా భావించాడు. హారతి వివాహ విషయంలో తన పూర్వపు నిర్ణయాన్ని మార్చుకొన్నాడు. భార్య సావిత్రి మాటలను కూడా లెక్కచేయలేదు. తమకు సంతానం కలుగనందుకు సావిత్రి.. హారతిని కన్నబిడ్డలా పెంచింది. అభిమానించింది.


హారతి.. హరి ప్రేమించుకున్నారని.. ద్వేషాన్ని మరచి వారిరువురికీ వివాహం జరిపించడం మంచిదని భార్య సావిత్రి చెప్పిన మాటలకు.. ముకుందరావు అగ్నిపై పడ్డ ఆజ్యంలా మారిపోయాడు.

పొరుగూరుకు వెళ్ళి.. తనకు నచ్చిన.. తాను మెచ్చిన.. సంబంధాన్ని హారతికి ఖాయం చేశాడు. ముహూర్తాన్ని పెట్టించాడు. హారతిని హౌస్ అరస్టు చేశాడు.


తల్లిలాంటి వదిన సావిత్రి సహాయంతో.. హారతి.. నిశిరాత్రివేళ యింటినుంచి బయటికి వచ్చి హరితో కలసి వెళ్ళిపోయింది. వారి వివాహాన్ని వారి స్నేహితులు రిజిష్టార్ ఆఫీస్ లో సింపుల్ గా జరిపించారు.


విషయం తెలిసిన ముకుందరావు భార్యను అనరాని మాటలన్నాడు. చెల్లెలు హారతి, చచ్చిపోయిందని తీర్మానించుకొన్నాడు.


యీ విషయం తెలియని శకుంతల హరిని కలిసి తనకు చెప్పకుండా హారతిని వివాహం చేసికొన్నందుకు చీవాట్లు పెట్టింది. పగను పెంచే పనిని చేశావని, అసహ్యించుకొంది. ఆవేశంతో.. హరి మాటలను వినిపించుకోకుండా వెళ్ళిపోయింది.


*

"అన్నయ్యా!..” శివ పిలుపును విని హరికళ్ళు తెరిచాడు. తల్లి శ్యామలాంబ అతని ప్రక్కనే వుంది.

అతని కళ్ళల్లోని కన్నీటిని చూచి.. “ఎందుకు నాయనా ఈ కన్నీళ్ళు!.." ఆత్రంగా అడిగింది శివతల్లి శ్యామలాంబ.


“యివి కన్నీరు కాదు పిన్నీ!.. ఆనందభాష్పాలు." కర్చీఫ్ తో కన్నీటిని తుడుచుకొంటూ చెప్పాడు హరి.

సర్స్ వచ్చింది. 'హరి సార్.. మీ వైఫ్, పాపలను 'బి' వార్డుకు షిఫ్ట్ చేశాము. మీరు వెళ్ళి చూడవచ్చు." అంది.


ముగ్గురూ వేగంగా 'బి' వార్డు వైపుకు నడిచారు. మంచంపైన హారతి. ప్రక్కనే రొండు పూయలలో పాప.. బాబు..


హారతిని సమీపించి ఆమె చేతిని తన చేతిలోకి ఆప్యాయంగా తీసుకొన్నాడు.


"ఏమండీ.. మీకు సంతోషమేనా!.." నవ్వుతూ మెల్లగా అడిగింది హారతి. ఆనందంతో.. కన్నీళ్ళతో.. హరి మాట్లాడలేకపోయాడు. అవునన్నట్లు తల ఆడించాడు పాప ఏడ్చింది. ఎత్తుకొని హారతి ప్రక్కన పడుకో పెట్టింది శివతల్లి శ్యామలాంబ.


"బిడ్డకు పాలు యీ అమ్మా!..” హారతి పవిటను సర్దింది. పాప పాలు త్రాగడం ప్రారంభించింది.

"అన్నయ్యా.. బాబు వదిన పోలిక, పాప అంతా నీ పోలిక, గమనించావా.." నవ్వుతూ అన్నాడు శివ

"అవును శివా!.." నిట్టూర్చి ఆనందంగా చెప్పాడు హరి.


*

"అమ్మా శకుంతలమ్మగారూ నమస్కారాలు." బలరామశాస్త్రి సవినయంగా చేతులు జోడించారు.

"ఏం శాస్త్రిగారూ కులాసానా?.."


"మీ దయవలన అంతా క్షేమం తల్లీ."


"ఏమిటి విశేషం?..”


"వుంది తల్లీ.. అది చెప్పేదానికే వచ్చాను." 


"చెప్పండి.”


"మన హరి భార్య హారతి ప్రసవించింది. కవలపిల్లలు ఆడ మగ వారి నామకరణ మహోత్సవాన్ని జరిపించి నిన్ననే వచ్చాను. బిడ్డలిద్దరూ బంగారు బొమ్మలు పేర్లు ఏమిటో తెలుసా!.. శకుంతల, ముకుంద వారిరువురూ మీ యిరువురినీ మరిచిపోలేదమ్మా!" అనునయంగా చెప్పారు శాస్త్రిగారు.

శకుంతలమ్మ ఆశ్చర్యపోయింది. ఆమె ముఖ భావాలను గ్రహించిన శాస్త్రిగారూ..

"అమ్మా!.. మీకు తెలియని విషయం అంటూ లేదు. హరి.. హారతులు మీ యోగక్షేమాలను గురించి ఎన్నిసార్లు అడిగారో చెప్పలేను. వారిరువురికీ మీరంటే ఎంతో గౌరవం.. అభిమానం.. తమ నమస్కారాలను మీకు తెలియజేయమని.. ప్రాధేయపూర్వకంగా చెప్పారు. పరిస్థితుల రీత్యా.. మీకు చెప్పకుండా వారు పెళ్ళి చేసికొన్నారే తప్ప.. మీ విషయంలో వారు వేరే ఏ తప్పూ చేయలేదుకదమ్మా!.. మీరు మంచి మనస్సుతో వారిని మన్నించాలి. వెళ్ళి ఆ పుట్టిన బిడ్డలకు మీ ఆశీర్వాదాలను తెలిపి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు భయపడి హారతి ప్రసవించిన విషయాన్ని మీకు తెలియజేయలేకపోయానని హరి ఎంతగానో బాధపడ్డాడమ్మా.. కావలికి నెల్లూరికి ఎంత దూరం?.. మీరు తలచుకొంటే ఒక్క గంటలో అక్కడికి వెళ్ళి వారిని చూచిరాగలరు. మీరు, ముకుందరావు యింకా ఎంతకాలం పంతంతో జీవియాత్ర సాగిస్తారమ్మా!.. హారతి హరి.. ఎవరు?.. మీ బిడ్డలు. మీరంతా కలిసేదానికి వారి 'పంతం పూచింది' అమ్మా. యివే మాటలు ఆ ముకుందానికి కూడా చెప్పి యిక్కడికి వచ్చానమ్మా!.. అతనూ మెత్తబడ్డాడు. సావిత్రమ్మ ఎంతగానో సంతోషించింది. వెళ్ళి ఆ పూఛిన పూలను వీక్షించడం మీ ధర్మం కదా అమ్మా!..” ప్రాధేయపూర్వకంగా చెప్పి శాస్త్రిగారు శకుంతలమ్మ కళ్ళల్లోకి చూచారు. 


శకుంతలమ్మ నయనాల్లో అశ్రువులు.

“అమ్మా!..” ఆశ్చర్యంతో పలికాడు శాస్త్రిగారు.

“యివి కన్నీరుకాదు శాస్త్రిగారు. ఆనందభాష్పాలు.” పవిటతో కళ్ళు ఒత్తుకుంటూ అంది శకుంతల.

*

కాలింగ్ బెల్ మ్రోగింది. హరి వెళ్ళి తలుపు తెరిచాడు. ముందున్న.. శకుంతల.. ముకుందరావు.. సావిత్రిలను చూచి ఆశ్చర్యపోయాడు.


"రేయ్!.. ఎక్కడరా నా మనుమడు మనుమరాలు.” నవ్వుతూ అడిగింది శకుంతలమ్మ.


“హరీ!.. నా కోడలిని అల్లుణ్ణి నాకు చూపించవూ!.." దీనంగా పశ్చాత్తాపంగా అడిగాడు ముకుందరావు..


హరి..వంగి ఆ ముగ్గురి పాదాలు తాకాడు. వారు అతన్ని ఆశీర్వదించారు. హారతి యిద్దరి బిడ్డలనూ పొత్తిళ్ళలో ఎత్తుకొని వారి ముందుకు వచ్చింది.


ఆ ముగ్గురూ ఆనందంగా హారతిని సమీపించారు. మార్చి మార్చి బిడ్డలను ఎత్తుకొని మురిసిపోయారు.

ఆ ముగ్గురి ఆనందపారవశ్యాన్ని చూచి.. హరి హారతి ఆనందంతో పొంగిపోయారు.


"ఒరేయ్ ముకుందా!.. వీడు అచ్చం నీ పోలికేరా” అంది శకుంతలమ్మ ముకుందరావుకు ఆ మొగబిడ్డను చూపుతూ.


“అత్తా!.. యీ బిల్లి అంతా నీ పోలికే!..” నవ్వుతూ తన చేతిలోని పాపను శకుంతలమ్మకు చూపించాడు ముకుందరావు.


వారి మధ్యన వున్న సావిత్రి.. “ఆ బిడ్డల బోసి నవ్వులు చూడండి. మిమ్మల్ని పలకరిస్తున్నారు..” భర్త వంక. శకుంతలమ్మ వంక చూచి పారవశ్యంతో ఆనందంగా నవ్వింది.


ఆ పెద్దలు ముగ్గురి ముఖాల్లోని ఆనందాన్ని చూచి హరి.. హారతిలు తమ బిడ్డల అదృష్టాన్ని తలచుకొని పరవశించారు.


***


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



50 views0 comments

Comentarios


bottom of page