వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Papam Pichhi Thalli Mamatha' - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 30/10/2023
'పాపం! పిచ్చితల్లి మమత' తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
మమత! ఈ పేరు వినగానే మమతల తల్లీ! అనే పాట గుర్తుకు వస్తుంది కదా! నిజంగా అలాంటి పిల్లే ఈ మమత. అందరిని పేరు, పేరునా పలకరించడం తన పని తాను చేసుకుపోవటం. ఇంట్లొ ముగ్గురు అమ్మాయిల్లో రెండో పిల్ల ఈ మమత.
అక్కకు పెళ్లి అయిన తర్వాత ఇంట్లో అమ్మకు పనుల్లో చేదోడు వాదోడుగా ఉండటం వూళ్ళో వున్న జూనియర్ కాలేజిలో ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీకి పక్కనున్న సిటీకి వెళ్ళాలి, ఎందుకులే మళ్ళీ డిగ్రీలో జాయినయితే నాన్నకు, డబ్బు, ఖర్చు ఎందుకని ఇంట్లోనే ఉంటుంది.
నాన్న పొలం వెళితే అన్నం తీసుకుని వెళ్ళటం నాన్న పక్కన కొట్టంలో కునుకు తీస్తుంటే కూలీలకు పనులు పురమాయించటం ఇలా! నాన్నకు సాయం చేస్తుండేది. అందరి తల్లితండ్రులు, మమతను చూసి నేర్చుకోండని! వాళ్ల పిల్లలకు చెప్పెట్లుగా! ఉండేది మమత.
నాన్నకు పొలాలు పండక అమ్మ నగలు తాకట్టు పెడుతుంటే ఎంతో బాధ పడేది. 'అదే నేను అబ్బాయి నయితే నాన్నకు ఉద్యోగం చేసి డబ్బు ఇచ్చేదాని కదా!' అని లోపల అనుకునేది. ఇంట్లొ ఒక పది మంది పిల్లలకు టూషన్స్ చెప్పేది. ఏదో వేడినీళ్లకు చన్నీళ్ళ లాగా, ఇంటికి కావాల్సిన కూరనారా, జరిపేది.
ఒకసారి పక్కూరి రైతు- మమత నాన్న సోమయ్యకు ఫ్రెండయిన రామయ్య వచ్చాడు మమత వాళ్ల ఇంటికి. మమతను చూసి ముచ్చట పడి సోమయ్యతో "మీ రెండో అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తావా అని!" అడిగాడు.
"చాల్లే! నువ్వెక్కడ నేనెక్కడ, నాతో ఎకచక్కాలు వద్దు కాని ఇంకో మాట మాట్లా”డన్నాడు సోమయ్య.
"ఓరి నీ బండపడ!.. నిజంగానే అంటున్నా. నాకు ఇద్దరు కొడుకులు, యాబై ఎకరాల పొలముంది. రెండు ఇళ్లున్నాయి, పెద్దకొడుకు పోయాడు. ఆ కొడుక్కు ఒక పిల్లాడు. పెడ్డకోడలు, మనవడు, ఒకింట్లో ఉంటారు.
చిన్న కొడుకు వీడు, వ్యవసాయం చేస్తాడు. వీడు, నేను నా భార్య, ఒకింట్లో ఉంటాం. ఏదో టెన్త్ వరకు చదివాడులే, నీకు ఇష్టమైతే కాని కట్నం వద్దు. లగ్గాలు పెట్టుకుని మాఘమాసంలో పెళ్లి చేద్దా”మన్నాడు రామయ్య.
ఇంట్లోకి వచ్చి సోమయ్య భార్యకు, మమతకు చెప్పాడు. "ఒకసారి రామయ్య వాళ్ల ఊరెళ్లి పిల్లాడు ఎట్లాంటివాడో! వాకబు చేసుకురం”డన్న భార్యతో, "ఏమక్కరలేదు! రామయ్య మంచివాడు, కష్టపడి సంపాదించాడు చాలా ఆస్తి. పైగా కట్నం వద్దన్నాడు. ఇంకేమి చూడకుండా, పిల్లనిచ్చి పెళ్లి చేయవచ్చు. పెద్దపిల్ల పెళ్లికి చేసిన అప్పులింకా తీరలేదు. మూడో పిల్ల పెళ్ళీడుకు వచ్చింది. నేనయితే మమతను వాళ్ల అబ్బాయి కిచ్చి చేస్తే బాగుంటుందనుకుంటున్నా. పిల్ల హాయిగా కాలు మీద కాలేసుకుని తినోచ్చు. ఏమ్మా, మమతా! నీ అభిప్రాయం ఏం”టన్నాడు సోమయ్య.
అంతా వింటున్న మమత "మీ ఇష్టమే నా ఇష్టం నాన్నా!" అంది.
'నాన్నకు నేను భారం కాకూడదనుకుంది. నాకు, పెళ్లయితే చెల్లికి పెద్ద చదువులు చెప్పించాలి. దానికైనా మంచి ఉద్యోగం వస్తే నాన్న కున్న అప్పులు తీరుస్తుందనుకుంది మనసులో, మమత.
నెలలోపు మమతకు రామయ్య కొడుకు వీరబాబుతో పెళ్లి జరిగింది. పెళ్లిలో చూడటమే వీరబాబును, మమత. వీరబాబు నల్లగా, హైటుగా కొంచం బట్టతలతో ఉంటే మమత సన్నగా, తెల్లగా, నాజూకుగా పెద్ద జడతో ఉంది. పెళ్లిలో అందరూ కాకి ముక్కుకు దొండ పండనుకున్నారు వీళ్ల జంటను చూసి.
అత్తవారింటికి వచ్చింది మమత. పెళ్లయిన మొదటి రోజే వీరబాబు ఎంతో రెక్లెసుగా నాకన్నా రెండు క్లాసులు ఎక్కవ చదుకున్నానని విర్రవీగవాకని" మమతని పైనుండి, కిందకీ చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు.
"అదేమీ లేదు నా”కంది మమత.
"అద్గది అట్లుండు. మా ఫ్రెండ్స్, మా వదిన చెప్పారు, అందంగా, చదువుకున్న పిల్లలు పొగరుగా ఉంటారని. నువ్వు అట్లా పొగరుగా ఉన్నావంటే నాకు కాలు”ద్దని ఒక వెకిలి నవ్వొకటి, నవ్వి వెళ్ళాడు వీరబాబు.
తోడికోడలు సుధ మమతను తేరిపార చూసి "మా మామ నిన్ను కట్నం తీసుకోకుండా మా మరిది కిచ్చి చేసాడు. నేనేమో ఐదు ఎకరాల పొలం తెచ్చా కట్నం కింద, ఏముందబ్బా!, నీలో తెల్ల తోలు తప్ప, ఏమి లే”దంటూ పైనుండి కిందకు ఒక గర్వపు చూపు చూసి వెళ్ళింది.
అత్తగారు బాయమ్మ, "సుధ మాటలు పట్టించుకోమాకు మమత. సుధ ఆస్తి తెచ్చి గర్వంగా వుంటుందనీ, నిన్ను చూసి కాణి కట్నం వద్దని కోడలుగా తెచ్చుకున్నాము. మమ్ములను, వీరబాబును చూస్తే చాలు. నువ్వు పుట్టింటిలో ఎట్లా ఉన్నావో అట్లాగే వుండిక్కడ. " అంది. 'అత్తగారు మంచిదే మనసులో' అనుకుంది మమత.
మొదటిరాత్రి వీరబాబు తాగి వచ్చాడు. వింతగా చూస్తున్న మమతతో వీరబాబు "లైట్ గానే తాగుతా!? తాగవాకు అని క్లాసులు తీస్తే మటుకు ఎక్కువ తాగుతా! మా అమ్మానాన్నతో చెప్పవా”కని నిద్రపోయాడు.
మొదటిరాత్రి గూర్చి ఎన్ని కలలు కంది. ఇద్దరు కలిసి మాట్లాడు కోవటంలాంటివి, ఎన్ని సినిమాలలో చూసింది. అది గుర్తుకొచ్చి మొదటిసారి రెండు కన్నీటిచుక్కలు మమత కళ్ల నుండి కారాయి.
పొద్దున లేచి ఇంటిముందు కలాపి చల్లి ముగ్గులేసి పూజ చేసి అత్తగారికి మామగారికి, హారతి చూపించింది మమత. రామయ్య, బాయమ్మ సంతోషపడ్డారు. పక్కనున్న ఇంట్లో నుండి సుధ తొమ్మిదింటికి లేచి వచ్చి మమతని అత్తగారు, మామగారు మెచ్చుకుంటుంటే.. చూడలేక, పిల్లాడిని కొట్టటం మొదలెట్టింది.
పిల్లాడు అమ్మ కొడుతుందని వీళ్ల దగ్గరికి వచ్చాడు. "అక్కా! కొట్టకనీ" మమత బాబుని దగ్గరకు తీసుకుంది. అప్పటినుండి బాబు "పిన్ని మంచిదంటూ" మమతకు దగ్గరయ్యాడు.
వీరబాబు రాత్రులు మందు వేస్తూనే ఉన్నాడు. పగలు పొలంలోనే ఉంటాడు. సాయంత్రం ఇంటికొచ్చి వదిన ఇంట్లోకెళ్లి కాసేపు బాబుతో ఆడుకుని ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి రాత్రి ఎప్పటికో తాగి, ఇంటికొస్తాడు అప్పటికి అమ్మానాన్న నిద్ర పోతారు.
ఒకసారి అత్తవారింటికి వచ్చాడు వీరబాబు మమతతో కలిసి. వీరబాబు వాలకం చూసి సోమయ్యకు డౌటొచ్చి “అమ్మా మమత! నువ్వు అత్తవారింట్లో సుఖంగా ఉన్నావా!? అల్లుడు ఎట్లా చూసుకుంటా”డని అడిగాడు.
నాన్నకు వీరబాబు సంగతి చెప్పకూడదని ఇపుడిపుడే అమ్మనాన్న సంతోషంగా ఉన్నారు. "చాలా బావున్నా నాన్నా" అని చెప్పి ఒక నాలుగు రోజులుండి అత్తగారింటికి వెళ్ళింది. ఇరుగుపొరుగు చెప్పిన మాటలు బట్టి తెలిసిందేమంటే, పెద్ద కోడలు గయ్యాళిదనీ! ఆమె పోరు తట్టుకోలేక పెద్దకొడుకు పురుగు మందు తాగాడని తెలిసింది.
వీరబాబుకు లేనలవాటు లేదని, తెలిసింది. మమత ఎలాగైనా వీరబాబును మార్చాలని చూసింది. వీరబాబు గొడవ చేశాడు.
“నన్ను మందు మానిపించాలని చూడమాకు. నేను మా అన్నలా పురుగు మందు తాగుతానని బెదిరించాడు. నీ ఇష్టమొచ్చినట్లు నువ్వుండు, నా ఇష్టమొచ్చినట్లు నేనుంటా! నా జోలికి రావాకు!, వస్తె బాగోదు”.
ఇక మూర్ఖులని ఎవరూ బాగు చేయలేరని, కాసేపు పనిపాటలు, పూజ, అత్తగారితో మాట్లాడటం బాబుకు, చదువు చెప్పటం ఈ పనులతో బిజీ అయింది. అపుడప్పుడు కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా అమ్మనాన్నతో గడిపి రావటం వీటిలో, ఆనందాన్ని, వెతుక్కునేది మమత.
ఎపుడన్నా! జీవితం గూర్చి ఆలోచిస్తే తను ఏమనుకుంది. ఆస్తి లేకపోయినా భార్యాభర్తలు కలిసిమెలసి ఉండటం వారానికి ఒక సినిమా. ఏడాదికి ట్రిప్ వేసుకుని ఎక్కడికైనా వెళ్లి రావటం.. అవి గుర్తుకొచ్చి కాసేపు కన్నీరు కారుస్తుంది, మమత.
కనీసం తిన్నావా, లేదానీ! కూడా భర్త అడగ నందుకు బాధపడేది. అయినా ఏదో ఆశతో, బతుకుతున్నది మమత. సాయంత్రం బాయమ్మ, జడవేస్తే, దొడ్లో, మల్లెలు, కోసి దండ కట్టుకుని జడలో పెట్టుకుని వీరబాబు కోసం, ఎదురు చూస్తూ కూచునేది, మమత. ఇదంతా చూసి తోడికోడలు సుధా, అసూయగా, మమత వైపు చూస్తూ, మూతి తిప్పుకుంటూ, లోపలికి వెళ్ళేది.
అత్తగారు మామగారు కొన్నాళ్ళు కాశీలో ఉండి వస్తామని వెళ్ళారు. అసలే వూళ్ళో అందరితో మాట్లాడే మమతకు ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్లు లేక జైల్లో ఉన్నట్లుగా ఉండేది. తోడికోడలు సుధ సూటిపోటి మాటలు తప్ప ఏమి మాట్లాడదు.
ఒకరోజు రాత్రి పూట వీరబాబు పక్కమీద లేడు ఎక్కడి కెళ్ళాడని తలుపు తీసి చూస్తే పక్కనున్న వదిన, ఇంట్లోకి వెళ్తున్నాడు. మమత వెళ్ళింది వెనకనే. వీరబాబు వెళ్లి సుధ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు. "ఎంటి ఇంత లేట్ గా రావటం, అన్న వదినతో "ఆ పిచ్చిది ఇప్పటిదాకా, పడుకోలేదు వదినా!, అది పడుకోగానే వచ్చా”నంటూ సుధని ఒళ్లోకి తీసుకున్నాడు.
"అంతేనా! ఆ పిచ్చిదాన్ని ప్రేమిస్తున్నావా! నాకన్నా అందమైనది కదా!" అన్న వదినతో "అబ్బా! అంత లేదులే. ఆ బక్కది, నాకు అసలు నచ్చలేదు. "
"మరెందుకు,!పెళ్లి చేసుకున్నా”వన్న వదినతో, "మా నాన్న పోరుపడలేక, చేసుకున్నాను. నువ్వే నాకు అన్నీను, అట్లా అలగమాకు, నే చూడలే”నంటూ, బతిమాలుతున్నాడు
వాళ్ళని అలా చూడగానే మమతకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుగా అనిపించి, షాకుకు గురయింది. ఛీ తల్లి లాంటి, వదినతో, వీరబాబును, అట్లా, చూసేసరికి, రోతగా అనిపించింది.
మొన్న చాకలి, ‘బాబుగారిని వదిన గారి దగ్గరికి వెళ్ళనీయకం’డన్నది, ఇందుకా! ఇలాంటి బ్రతుకా! నేను కోరుకుంది. దేవుడా! ఉన్నావా? అని తన ఇంట్లోకి వచ్చి మంచం మీద పడి ఏడవటం మొదలెట్టింది.
కొద్దిసేపటి తర్వాత వీరబాబు గదిలో కొచ్చి మమత మీద చేయి వేశాడు. "చేయి తియ్యి, ఆ మలిన పడిన చేతులతో నన్ను ముట్టుకోకనీ! పెద్దగా అరచింది. "ఏంటీ పోగరా! "అంటు కొట్టాడు మమతని. వీరబాబు మీద, ఇంకా అసహ్యం వేసింది మమతకు.
మరుసటి, రోజు, మళ్ళీ, వదిన ఇంటికి, పోతుంటే, “నీకు, సిగ్గుగా, లేదు, వదినతో తిరగటానికి, నువ్వు వెళ్ళటానికి, వీలులే”దంటూ, గుమ్మంకు, అడ్డంగా నిలబడింది మమత.
"యేందే! పెద్ద మాటలు, మాట్లాడుతున్నావు, నా ఇష్టం, నేను తిరుగుతా! ఏం చేస్తావు, లే..!, అడ్డుతొలు”గంటూ! మమతను ఒక్కతోపు, తోసి, వెళ్ళాడు.
"ఛీ, సిగ్గులేని కుక్క! మీ అమ్మానాన్నకు, చెపుతానుండు నీ బాగోతం అనగానే", “యేందే, వాగుతున్నావు” అంటూ వచ్చి, బెల్ట్ తీసుకుని కొట్టాడు వీరబాబు మమతను.
అట్లా ఎన్నో రాత్రులు యేడుస్తునే గడిపింది. ఆ బాధలో, బయటకు, రావటం, మానేసింది. తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కతే రూంలో గడపటం తనలో తను నవ్వుకోవటం, పిచ్చి చూపులు చూడటమవీ! చేస్తున్నది మమత.
కాశికి వెళ్ళిన అత్తామామ తిరిగి వచ్చారు. వాళ్ళని చూసి మమత "వచ్చారా! మళ్ళీ పోరుగా ఎక్కడికి" పిచ్చిగా నవ్వుతూ అన్నది.
బాయమ్మ ఇదేమి అర్థం కాక "ఏందిరా! కోడలు ఇట్లా చేస్తుం”దని వీరబాబుని అడిగితే "ఏమో ఎవరికి తెలు”సంటూ నిర్లక్యంగా వెళ్ళిపోయాడు. రామయ్య, సోమయ్యకి కబురు పెట్టాడు.
బాయమ్మకు, డౌటు వచ్చి, చాకలితో “ఏమే రంగి! మా చిన్న కోడలు, ఎందుకో వూరికే నవ్వటం, పిచ్చిచూపులు చూడటమవి చేస్తుంది. ఏ గాలి ధూళి సోకిందో! వచ్చేప్పుడు, మస్తాను దగ్గర, ఒక తాయెత్తు, తెచ్చి పెట్టు” అంది.
“నాకు, తెలవదు అమ్మగారు!, ఒక, వారం నుండి, నన్ను, సూడగానే, నువ్వు చెప్పింది, నిజమని, నవ్వుతున్నారు సిన్నమ్మ గారు. నేను ఆయమ్మతో, ఏమి చెప్పానో! గురుతుకు, రాటం లే”దంది. లోపల, రంగి, నీ సిన్న కొడుకు, పెద్దకోడలి, బాగోతం, సూసి, మైండ్ పోయినట్లుంది నీ సిన్నకొడలుకి, అనుకుంది.
సుధని పిల్చి, అడిగింది, బాయమ్మ “యేంది, సుధా! మమత, ఎందుకు, అట్లా నవ్వుతుంది. కొంచం, మమతను కనిపెట్టుకుని, వుండమన్నాగా! ఏం జరిగింది”.
"ఆ నాకేం, తెలుసు, ఇంత, ప్రేమగా, చిన్న కోడలి గూర్చి, అడుగుతున్నావే, ఒకసారన్నా, నా గురించి ఆలోచించారా! అయినా, మీ ముద్దుల కోడలుకు, చక్కనిదాన్ని, చదువుకున్న దాన్ని అని పొగరు. నాతో ఎపుడూ,! మాట్లాడదు. ఇక, పైగా, వారంనుండి, నన్ను చూస్తూనే, ఛీ, అని, లేచిపోవటం, చేస్తుం”దన్నది, సుధ.
'గ్యారంటీగా మీ బాగోతం చూసి వుంటది, మమతమ్మ. పాపం ఆయమ్మను ఆ దేవుడు, సల్లగా సూడాలని', లోపల అనుకుంది రంగి.
మరెందుకు, ఈ పిల్ల ఇట్లా చేస్తుందనుకొని, బాయమ్మ, మంచిపిల్లకు ఇట్లా అయిందే! అని బాధ పడింది.
సోమయ్య వచ్చి మమతను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాన్నను చూసి మమత. , చెల్లెలికి పెళ్లి చేయకు నాన్నా!, బాగా చదువుకోనివ్వంటూ! పెళ్లి చేస్తే, నాలాగే అవుతుందంటూ! పిచ్చిగా నవ్వటం మొదలుపెట్టింది. కొన్నాళ్ళు మేము తీసుకెళ్తామని సోమయ్య తీసుకెళ్ళాడు మమతని తనతో పాటు.
ఊరికి వచ్చినా.. ఏదో నవ్వుకుంటూ! ఉండేది. వూళ్ళోకి వెళ్లి అరుగుల మీద కూర్చొన్న వాళ్ళతో మీ పిల్లలకు పెళ్లి చేయకండి. నాలాగా! అవుతారు బాగా చదివించండంటూ! పిచ్చి నవ్వులు నవ్వుతూ.. తిరుగుతూ ఉంటుంది.
మమతను ఈ స్థితిలో చూసి బంగారం లాంటి పిల్లకు పెళ్లి చేసి గొంతు కోసారని ప్రతి ఒక్కరూ! జాలి పడటమే. ఆస్తి కోసం మమత గొంతు కోసాడు సోమయ్య.
మమతని ఇదివరకు అందరూ కల్లాకపటం తెలీని, పిచ్చితల్లంటే! ఆ మాట ఇపుడు నిజమయి మమత నిజంగానే! పిచ్చితల్లి! అయింది.
***
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
కథ బాగుంది నేటి పరిస్థితులకు అద్దం పుడుతోంది-అభినందనలు.