పాటల పూదోటలో పరవశాల కోయిల…
- Seetharam Kumar Mallavarapu
- 6 days ago
- 3 min read
#పాటలపూదోటలోపరవశాలకోయిల, #GorrepatiSreenu, #గొర్రెపాటిశ్రీను, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Patala Pudotalo Paravasala Koyila - New Telugu Story Written By Gorrepati Sreenu Published In manatelugukathalu.com On 12/11/2025
పాటల పూదోటలో పరవశాల కోయిల - తెలుగు కథ
రచన: గొర్రెపాటి శ్రీను
ఇటీవలే ఇంటర్ పాస్ అయిన దివాకర్ ఉద్వేగంగా తానున్న చోటు నుండి లేచాడు. తానే ఇప్పుడు స్టేజ్ ఎక్కాలి. స్టేజ్‌పై ఎంతో మంది పేరెన్నికగన్న గాయకులు, సంగీత దర్శకులు ఉన్నారు. వారంతా ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలు.
టి.వి.లో సంవత్సర కాలంగా వస్తున్న పాటల కార్యక్రమం — అశేష జనవాహిని. ఎందరో ప్రముఖ న్యాయనిర్ణేతలు కొలువుదీరి ఉన్న చోట తాను పాడాల్సిన సమయం వచ్చింది.
ప్రథమ బహుమతి విజేతకు పదిలక్షల క్యాష్ ప్రైజ్. దాదాపు పన్నెండుగురు పార్టిసిపెంట్స్ స్టేజ్‌పై తమ గాత్రాన్ని వినిపించాలి. తాను పదకొండవ పార్టిసిపెంట్‌గా స్టేజ్ ఎక్కుతున్నాడు.
అందరి వైపు చూస్తూ మైక్ చేతిలోకి తీసుకున్నాడు. అప్పటి వరకు పాడిన వాళ్లందరూ అద్భుతంగా పాడారు. ప్రతి పాటకు ప్రేక్షకులు చప్పట్ల వర్షం కురిపించారు.
తాను వాళ్లందరిలా ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. మెలోడీ, రొమాంటిక్, కామెడీ — ఎలాంటి పాటనైనా పాడడం అలవాటు. సంగీత ప్రధానమైన పాటలు పాడిన వారే గతంలో విజేతలుగా నిలిచారు.
తనకంటే ముందుగా పాడిన కుర్రాడు — “దొరకునా ఇటువంటి సేవ…” బాలు గారి గాత్రాన్ని సరిగ్గా అనుకరిస్తూ పాడాడు. ప్రథమ బహుమతి అతడికే వస్తుందేమో అన్నంత ఘనంగా.
“దివాకర్…” తన పేరు పిలుస్తుంటే ఒక్క క్షణం ఉలికిపాటుతో గుండె కొట్టుకున్నాడు. గొంతు సరిచేసుకున్నాడు. మనస్సులో ఇష్టదైవమైన మహాశివుడిని తలచుకున్నాడు.
తాను పుట్టి పెరిగిందంతా శ్రీశైలం. తండ్రి శివభక్తుడు.
తల్లిదండ్రుల వైపు చూసాడు — తండ్రి చిరునవ్వుతో చూడడం, అమ్మ నయనాల్లో సన్నని ఆనందభాష్పాలు.
“ఓం… మహా ప్రాణ దీపం శివం శివం, మహోంకార రూపం శివం శివం, మహా సూర్య చంద్ర త్రినేత్రం పవిత్రం…”
లీనమై శివుడిని ఆరాధిస్తున్నట్టుగా పాడుతున్నాడు దివాకర్. అక్కడి వాతావరణం అంతా భక్తి భావంతో నిండిపోయింది.
ఒక్కసారిగా అక్కడ మహాశివుడు ప్రత్యక్షమై నట్లుగా వెనుక తెరపై విజువల్స్. చప్పట్లు ఆగకుండా మ్రోగుతూనే ఉన్నాయి.
అత్యద్భుతంగా పాడిన దివాకర్ స్టేజ్ దిగుతుంటే అసంఖ్యాక కరచాలనాలు. ఆటో డ్రైవర్ అయిన తన తండ్రి ఆటోలో ఎప్పుడూ అతడు వినే పాట — కొన్ని వందల సార్లు విని వుంటాడు. నేడు తానే స్టేజ్‌పై ఆ పాటను తన్మయంగా పాడడం తనకే ఆశ్చర్యంగా అనిపించింది.
అన్ని పాటలకు ర్యాంకింగ్స్ ఇవ్వడానికి న్యాయనిర్ణేతలు ఐదుగురు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. ఏకాంబరనాథ్ — తెలుగు పాటల తోటకు రారాజు. అతని నిర్ణయమే ఫైనల్. అతడిని చూడటానికైనా, అతడు పాడే పాట వినటానికైనా ప్రజలు తాపత్రయపడుతుంటారు.
గతం – 2000 సంవత్సరం
తొమ్మిదేళ్ల దివాకర్ తండ్రి చాటుగా నిలబడ్డాడు. తండ్రి ఓ పెద్దాయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
“సార్ లోపల ఉన్నారు. అర్జెంట్ రికార్డింగ్ ఉంది. సార్‌ని ఇప్పుడు కలవడం కుదరదు,” అన్నాడు వాచ్‌మన్.
“ఎందుకు వచ్చారు? ఏ ఊరి నుండి? సార్ మీకెలా తెలుసు? అపాయింట్మెంట్ ఉందా?” ప్రశ్నల వర్షం కురిపిస్తున్న వాచ్‌మన్‌కు సమాధానాలు చెప్పలేక మౌనంగా నిలబడ్డాడు రాఘవయ్య.
“వెళ్ళవయ్యా! అదిగో సార్ కారు వస్తుంది — అడ్డు తప్పుకో!” నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవయ్య.
“అయ్యా! ఒక్కసారి సార్‌ని చూడాలి…”
“అంతేనా? ఇంకేమైనా?”
“సార్ దగ్గర మా వాడికి సంగీతం నేర్పిద్దామని…” అతని మాటలు పూర్తవకముందే వాచ్‌మన్ గట్టిగా లాగాడు.
కొద్ది సేపటికి ప్రముఖ గాయకుడు ఏకాంబరనాథ్ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆరాధనతో చూస్తూనే ఉన్నారు తండ్రీకొడుకులు.
“ఏమయ్యా?”
“సార్, నా పేరు రాఘవయ్య. శ్రీశైలం నుండి వచ్చాను.”
“అయితే ఏంటి విషయం? పిల్లాడికి సంగీతం నేర్పించాలనుకుంటున్నావా? ఎన్ని డబ్బులు తెచ్చుకున్నావు?”
“ఓ పది వేలు సార్.”
“మరి నాకో వెయ్యి రూపాయలు ఇస్తావా? సార్ గారి పి.ఎ.ని పరిచయం చేస్తాను.”
భయంతో వెయ్యి రూపాయలు ఇచ్చాడు రాఘవయ్య. “ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను,” అన్నాడు వాచ్‌మన్.
“అదిగో ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళు, ఆయనే అన్ని విషయాలు చెబుతారు. సార్ వచ్చేది సాయంత్రం. పగలంతా రికార్డింగ్స్, సాయంత్రం పిల్లలకు పాఠాలు. అర్థమైందా?”
“నెలకి పదివేలు ఫీజు,” అన్న ఆ పెద్దాయన మాట విని రాఘవయ్య ఆశ్చర్యపోయాడు.
“సరే, ఓ పని చేద్దాం. నాకు ఐదు వేలివ్వండి, సార్‌తో మాట్లాడి తగ్గింపజేస్తాను. అయితే మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్‌లో పిల్లాడి సాధన ఎలా?”
“మా ఊరు శ్రీశైలం. నా పెద్ద కొడుకు దివాకర్. చిన్నోడికి మూడేళ్లు. నా భార్య కోరిక — నా కొడుకు పెద్ద సింగర్ కావాలి. మాకు ఈ నగరంలో ఎవరూ తెలిసినవారు లేరు. ఇక్కడికి మా ఊరి వ్యక్తి ఉన్నారని తెలిసి వచ్చాను. ఆటో ఎక్కి వచ్చా, కానీ నాలుగు వేల రూపాయలు పోయాయి. చిరునామా దొరకలేదు.”
“సరే, చార్జీల మందం డబ్బులు ఉంచుకుని మిగతా డబ్బులు ఇవ్వు. ఫోన్ చేస్తాను,” అని చీటీ మీద నంబర్ రాసి వెళ్ళిపోయాడు ఆ పెద్దాయన.
“నాయనా, మనం ఇంటికి పోదాం. అమ్మ గుర్తొస్తుంది…” అని పలికిన పసిపాప మాటలతో రాఘవయ్య హృదయం బరువెక్కింది.
ఇద్దరూ ఇమ్లిబన్ బస్‌స్టేషన్ చేరుకున్నారు. ఇదంతా గతం — 2000 సంవత్సరం.
వర్తమానం
2009లో “తెలుగు బెస్ట్ సింగర్ అవార్డు” ప్రకటన.
“మొదటి బహుమతి…” అది తన పేరు కాదు. మరొక పేరు — తనది కాదు. నిరాశ కమ్మేసింది.
విజేతలు స్టేజ్ ఎక్కారు. తల్లిదండ్రుల వైపు చూసాడు — వాళ్ళ కళ్లలో ఆనందం మాత్రమే కనిపించింది. “మన బిడ్డ స్టేజ్‌పై పాడాడు” అన్న గర్వం.
అప్పుడే ఏకాంబరనాథ్ గారు మైక్ అందుకున్నారు. “నేటి ఈ ముగ్గురి కంటే ఉన్నతంగా అని చెప్పలేను, కానీ ఎంతో భక్తిగా మహాశివుడి పై మనస్సంతా లగ్నం చేసి అత్యద్భుతంగా పాడిన చిరంజీవి దివాకర్కి స్పెషల్ ప్రైజ్ ప్రకటిస్తున్నాము. ఈ మొత్తం మొదటి బహుమతితో సమానంగా ఉంటుంది.”
చప్పట్ల వర్షం కురిసింది. శ్రీశైలం మహాదేవుడి సాక్షిగా ఆ ఘనత!
శ్రీశైలం జూనియర్ కాలేజ్ విద్యార్థి దివాకర్ — స్వామి సన్నిధిలో స్పెషల్ ప్రైజ్ విన్నర్‌గా స్టేజ్ ఎక్కాడు. ఏకాంబరనాథ్ గారి నుండి జ్ఞాపిక మరియు బహుమతి అందుకున్నాడు.
తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తుంటే తమ్ముడు, అమ్మ, నాన్న అతన్ని కౌగిలించుకున్నారు. ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తున్న భ్రమరాంభికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి చిరునవ్వుతో దీవిస్తున్న శుభసమయమది.
***
గొర్రెపాటి శ్రీను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
గొర్రెపాటి శ్రీను కలం పేరుతో రచనలు చేస్తున్న నా పూర్తి పేరు నాగ మోహన్ కుమార్ శర్మ .
తల్లిదండ్రులు : శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు
ఉద్యోగం : ప్రైవేటు కంపెనీలో మేనేజర్.
చదువు : డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్)
వెలువరించిన పుస్తకాలు:
"వెన్నెల కిరణాలు" కవితా సంపుటి(2019),
"ప్రియ సమీరాలు"కథాసంపుటి(2023),
"ప్రణయ దృశ్య కావ్యం" కథాసంపుటి(2025).
ప్రస్తుత నివాసం: హైదరాబాద్.




Comments