top of page
Original.png

పథకం

Telugu crime story, Telugu suspense story, psychological thriller Telugu, Telugu emotional thriller, Telugu murder mystery

భార్య హత్య వెనుక దాగిన కుట్రను గుర్తుచేసుకుంటున్న వ్యక్తి
భార్య హత్య వెనుక దాగిన కుట్రను గుర్తుచేసుకుంటున్న వ్యక్తి

Pathakam - Telugu Crime Story | Dr. C. S. G. Krishnamacharyulu

పథకం - తెలుగు క్రైం కథ | Dr. C..S.G . కృష్ణమాచార్యులు

Published in manatelugukathalu.com on 19/05/2026


జ్యోతి హత్య కేసు మొదట సాధారణ నేరంలా కనిపిస్తుంది. కానీ దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ, ప్రేమ, మానసిక బలహీనతలు, కుట్రలు కలిసిన ఒక ప్రమాదకరమైన పథకం బయటపడుతుంది. చివరి ట్విస్ట్ పాఠకుడిని షాక్‌కు గురిచేసే ఉత్కంఠభరిత తెలుగు క్రైమ్ థ్రిల్లర్.


సాయంత్రం ఆరు గంటల సమయం. వింత వర్ణాలతో మెరిసిపోతున్న ఆకాశంలో, అస్తమిస్తున్న సూర్యుడు ప్రేక్షక జనులకు కనువిందు చేస్తూ సెలవు తీసుకుంటున్నాడు. ఆఫీసు నుంచి బయలుదేరిన ఆనంద్, వాహనాలతో కిక్కిరిసిన వీధుల గుండా తన కారు నడుపుకుంటూ, తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ సముదాయానికి చేరుకున్నాడు.

నాలుగో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్‌ దగ్గరకు చేరుకుని, అక్కడ నిలబడి ఉన్న పోలీసులను, చుట్టూ గుమిగూడిన ఇరుగు పొరుగు వారిని చూసి ఒక్క క్షణం అతడు భయంతో స్తంభించిపోయాడు.


ఏదో ఘోరం జరిగిందన్న అనుమానం అతని మనసును ఒక్కసారిగా కుదిపేసింది.

అక్కడే నిలబడి ఉన్న అతని స్నేహితుడు రవి నెమ్మదిగా ఆనంద్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో విషాదం తాండవిస్తోంది. ఆనంద్ భుజంపై చేయి వేసి, తడబడుతున్న గొంతుతో చెప్పాడు.


“ఘోరం జరిగిపోయిందిరా… జ్యోతిని ఎవరో హత్య చేశారు.”


ఆ మాటలు విన్న ఆనంద్ క్షణం పాటు స్తబ్ధుడైపోయాడు. ఆ తర్వాత తేరుకుని,

“జ్యోతి… హత్యా?” అని విస్తుపోయాడు. ఉదయం ఆరు గంటల సమయంలో తనతో ఫోనులో మాట్లాడిన జ్యోతి, సాయంత్రానికి శవంగా మారిపోయిందన్న వాస్తవాన్ని అతని మనసు ఒప్పుకోలేకపోయింది.


అంతలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ ముందుకు వచ్చాడు. ఎన్నో నేరాలను, ఎన్నో విషాదాలను చూసిన అనుభవం అతని కళ్లలో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది.

“మీరేనా హత్యకు గురైన జ్యోతి భర్త ఆనంద్?” అని ప్రశ్నించాడు.


“అవును సార్…” అని ఆనంద్ భారమైన స్వరంతో చెప్పాడు.


“రెండు రోజుల క్రితం మా కంపెనీ వార్షిక సమావేశం కోసం ఊటీకి వెళ్లాను. ఈ ఉదయమే తిరిగి వచ్చి, నేరుగా ఆఫీసుకి వెళ్లి… ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాను.”


అతని మాటలు అక్కడితో ఆగిపోయాయి. కళ్లలోంచి అశ్రువులు ఉబికి వచ్చాయి.

“ఇలా జరిగిందంటే… నేను తట్టుకోలేకపోతున్నాను సార్…” అని భారమైన స్వరంతో చెప్పి, ముఖాన్ని చేతులతో కప్పుకున్నాడు.


ఇన్‌స్పెక్టర్ నిశ్శబ్దంగా అతన్ని గమనిస్తూ నిలబడ్డాడు.

ఇది నిజమైన దుఃఖమా… లేక చాకచక్యంగా ఆడుతున్న నాటకమా? అన్న ప్రశ్న అతని మనసులో మెదిలింది. అనుభవం అతనికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. దర్యాప్తు ప్రారంభ దశలో ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు. అతను గంభీర స్వరంలో అడిగాడు,

“మీకు ఎవరిపైనా అనుమానం ఉందా?”


ఆనంద్ లేదన్నట్లు నెమ్మదిగా తల ఊపాడు.

“లేదు సార్… అసలు ఎవరి మీద అనుమానం పెట్టుకోవాలో కూడా అర్థం కావడం లేదు. జ్యోతి చాలా మంచిది. మా అపార్ట్‌మెంట్‌లో ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె పని చేసే కళాశాలలో కూడా అందరూ ఆమెను గౌరవిస్తారు. ఇంటి దగ్గర ఇంటర్ చదివే పిల్లలకు ట్యూషన్ చెబుతుంది. 


అలాంటి ఆమెపై ఎవరికైనా కోపం ఎందుకు ఉంటుంది సార్?”


ఇన్‌స్పెక్టర్ ప్రశాంతంగా అతని మాటలు వింటున్నట్టే కనిపించాడు. కానీ అతని మనసులో మాత్రం వేరే ఆలోచనలు నడుస్తున్నాయి. కొన్నిసార్లు అత్యంత దగ్గర వాళ్లే నిజాలను దాచిపెడతారు. ఎవరిపైనా అనుమానం లేదనడం… నిజంగానే సాధ్యమా? అతని చూపు నెమ్మదిగా ఇంటి లోపలికి మళ్లింది. ఆ గోడల మధ్య ఎవరికీ తెలియని ఏదో రహస్యం దాగి ఉందని, అది త్వరలోనే వెలుగులోకి వస్తుందని అతనికి అనిపించింది.

అంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి చెప్పాడు.


“సార్, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఉదయం ఏడు గంటల సమయంలో ‘ఆర్య’ అనే కుర్రాడు ఇక్కడికి వచ్చి వెళ్లాడు. వాచ్‌మన్ చెప్పిన ప్రకారం, అతను జ్యోతిగారి ట్యూషన్ విద్యార్థి.”


అదే సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చి,

“సార్, ఆమె ఫోన్‌లో అనుమానాస్పద సందేశాలు గానీ, ఫోటోలు గానీ ఏమీ కనిపించలేదు” అంది.


ఇన్‌స్పెక్టర్ క్షణం పాటు ఆలోచించాడు. తర్వాత గంభీరంగా ఆదేశించాడు.

“శవాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపండి. ఆ కుర్రవాడిని వెంటనే స్టేషన్‌కు తీసుకురండి” అని చెప్పి, నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

@@@

పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, హత్య ఉదయం ఏడు గంటల ప్రాంతంలోనే జరిగినట్లు తేలింది. ఆ సమయంలో ఇంట్లో జ్యోతి, ఆర్య తప్ప మరెవ్వరూ లేరు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, ఆ సమయంలో జ్యోతి ఇంట్లోకి ప్రవేశించిన ఏకైక వ్యక్తి ఆర్యేనని దర్యాప్తులో స్పష్టమైంది. ఆర్య ప్రవర్తన కూడా అతనిపై అనుమానాన్ని మరింత బలపరిచింది. ఘటన జరిగిన వెంటనే అతడు ఊరు విడిచి పారిపోవడం, రహస్యంగా దాక్కోవడం — ఇవన్నీ అతని నేరాన్ని సూచిస్తున్నట్లే కనిపించాయి.


పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. పెద్దగా శ్రమపడకుండానే ఆర్యను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోకి అతన్ని తీసుకొచ్చిన క్షణమే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు అందరి చూపు అతనిపైనే నిలిచింది.


ఆర్య తల వంచుకుని చెప్పడం ప్రారంభించాడు. అతని మాటల్లో భయం, అపరాధ భావం, మానసిక వేదన స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి.


“నాకు… మేడం మీద ఒక రకమైన ప్రేమ పుట్టింది సార్. అది తప్పని నాకు తెలుసు. కానీ పోర్న్ చిత్రాలు చూస్తూ ఉండటం వల్ల, అలాంటి అనుభవం కావాలనే కోరిక నా మనసులో బలపడింది. ఒక రోజు భయపడుతూనే ఆ విషయం ఆమెకు చెప్పాను. నేను ఊహించినట్టు ఆమె నన్ను తిట్టలేదు… కోపపడలేదు. పైగా నవ్వుతూ, ‘ప్రేమంటే ఇదేనా?’ అని అడిగి, నన్ను కౌగిలించుకుని… ముద్దు పెట్టింది. ఆ రోజు మేడం అలా చేయకుండా ఉండి ఉంటే… నాకీ గతి పట్టేది కాదు సార్…” అని రోదించాడు.

ఇన్‌స్పెక్టర్ మౌనంగా అతన్ని గమనిస్తూ కూర్చున్నాడు. ఆ కుర్రవాడి మాటల్లో వ్యక్తమవుతున్న మానసిక క్షోభ అతనికి అర్థమైంది. క్షణం పాటు అతని మనసులో ఒకింత జాలి కూడా కలిగింది.


“ప్రత్యేక ట్యూషన్ పేరుతో ఆమె నన్ను ఒంటరిగా రమ్మనేది. ఆనంద్ సార్ ఇంట్లో లేని సమయంలో, మేమిద్దరం కలిసి గడిపిన క్షణాలు మాకెంతో ఆనందాన్ని ఇచ్చేవి. కొద్ది రోజుల్లోనే మా మధ్య బంధం మరింత బలపడింది. తప్పు చేస్తున్నానన్న భయం లోపల వెంటాడుతూనే ఉన్నా… ఆ సుఖాన్ని వదులుకోలేకపోయాను. అలా ఆరు నెలలు గడిచిపోయాయి.”


అలా ఆరు నెలలు గడిచిపోయాయి.

గత నెలలో నా వయసుకు తగిన ఒక అమ్మాయి నాకు పరిచయమైంది సార్. ఆమెతో ఉన్నప్పుడు భయం లేదు… దాపరికం అవసరం లేదు… జీవితం సహజంగా అనిపించింది. అప్పుడు మెల్లగా మేడం నుంచి దూరమవడం ప్రారంభించాను. అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అయిపోయింది.


ఆమెకు భయంకరమైన కోపం వచ్చింది.

‘నువ్వు నన్ను వదిలేస్తే… మన సంబంధం గురించి నీ తల్లిదండ్రులకు చెబుతాను,’ అని బెదిరించింది.


ఆ మాట విన్న క్షణంలో నా గుండెల్లో భయం మొదలైంది. నా చదువు… నా కుటుంబ గౌరవం… నా భవిష్యత్తు—అన్నీ ఒక్కసారిగా నాశనం అయిపోతాయని అనిపించింది.

ఆ దిగులుతో రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. రోజురోజుకీ నా మనసులో పేరుకుపోయిన భయం… చివరకు కోపంగా మారిపోయింది.”


ఆర్య కళ్లను తుడుచుకుని, మళ్లీ తన కథను కొనసాగించాడు.

అతని గొంతు బరువెక్కింది. కన్నీళ్లు చెక్కిళ్లపై జారాయి.

“ఆ రోజు ఉదయం ఆమెతో మాట్లాడి, ఈ సమస్యకు ముగింపు పలకాలని వెళ్లాను. ఆమె నన్ను వదులుకోవడానికి ఇష్టపడలేదు. నా గుట్టు రచ్చ చేస్తానని, పోలీసు కేసు పెడతానని బెదిరించింది. ఎంతగా కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమిలాడినా ఒప్పుకోకపోవడంతో, అప్పుడు పట్టలేని కోపంతో ఏం చేస్తున్నానో కూడా తెలియలేదు. బెదిరించడానికని తీసుకుని వెళ్ళిన కత్తితో ఆమెని పొడిచాను. చంపాలన్న ఉద్దేశం నాకు లేదు సార్… ఒళ్ళెరుగని కోపంతో చేసిన పని అది.”


స్టేషన్‌లో నిశ్శబ్దం అలుముకుంది. ఆ మాటలకు అందరి మనసులు బరువెక్కాయి.

@@@

జ్యోతి హత్యకేసు విచారణ త్వరితంగా ముగిసింది. ఆర్య మైనర్ కావడంతో, అతడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ, జువెనైల్ హోంకు తరలించాలని న్యాయాధిపతి తీర్పు ప్రకటించారు.


తీర్పు వెలువడిన రోజు ఆనంద్, ఒంటరిగా ఇంట్లో విస్కీ తాగుతూ, ఇలా గొణుక్కున్నాడు.


"మావయ్యా…


“నేను శ్యామలను ప్రేమిస్తున్నానని చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. నీ కూతురినే పెళ్లి చేసుకోవాలని మొండిగా పట్టుబట్టావు. వద్దని నేను ఎంతగా బ్రతిమిలాడానో నీకూ తెలుసు… ఆ దేవుడికీ తెలుసు. నీ కూతురికి ఎందరో బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని, ఆమె నాతో కుదురుగా కాపురం చేయదని ఎంతగా చెప్పానో! కానీ నువ్వు నా మాట వినలేదు. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని నన్ను బెదిరించావు. ఆ భయంతో… గత్యంతరం లేక… నీ కూతురుని పెళ్లి చేసుకున్నాను.


కానీ అదే రోజు నా మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. నీ కూతురు ఇంటర్ చదివే విద్యార్థులకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పాలని నేనే ప్రోత్సహించాను. అందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలూ నేనే కల్పించాను. అంతే… అంతకు మించి నేనేమీ చేయలేదు.

ఆమెను నేను ప్రేమగానే చూసుకున్నాను. నిజం చెప్పాలంటే… ఆమె బ్రతికి ఉంటే, సింగపూర్ చూడాలన్న ఆమె కోరికను కూడా నేనే నెరవేర్చేవాడిని.

పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా?

ఏం జరిగిందో నువ్వే చూసావు కదా! ఇది తప్పని నీకు అనిపిస్తే…

నన్ను క్షమించు మావయ్యా!”

@@@


C..S.G . కృష్ణమాచార్యులు  గారి కొన్ని ఇతర రచనలు:


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 4 out of 5 stars.

“పథకం” కథ ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రారంభమై, మానవ బలహీనతలు, అనుమానం, మరియు మనసులో దాచిన భయాల్ని ఆవిష్కరించే మానసిక నాటకంగా మారింది. రచయిత సస్పెన్స్‌ను చివరి వరకూ నిలబెట్టడమే కాకుండా, సంభాషణల ద్వారా పాత్రల అంతర్మథనాన్ని సహజంగా బయటపెట్టారు. భావోద్వేగం, ఉత్కంఠ, మరియు మానవ సంబంధాల లోతు కలిసి ఈ కథను గుర్తుండిపోయే పఠన అనుభవంగా నిలబెట్టాయి.

Like
bottom of page