top of page

పెళ్లి చూపులు


'Pelli Chupulu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'పెళ్లి చూపులు' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"రాజీ! రేపే నీ పెళ్లి చూపులు. అబ్బాయి మంచివాడు. సాఫ్ట్ వేరు ఇంజనీరు. మంచి కుటుంబం. రేపు కాస్త ఉదయాన్నే నిద్ర లే" అని చెప్పాడు అప్పుడే బయటినుంచి వచ్చిన తండ్రి రామయ్య పెద్ద కూతురు రాజీతో.


"అయితే రేపు మేము స్కూలుకు వెళ్ళము నాన్న" అన్నారు రమ్య, సాగర్.


రామయ్య, జానకమ్మ దంపతులకు వీళ్ళు ముగ్గురు సంతానం. ఊళ్ళో ఉన్న కొద్దిపాటి పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ పెద్దలు ఇచ్చిన ఇంటిలో గౌరవంగా బ్రతుకుతున్నది రామయ్య కుటుంబం.


తల్లి తండ్రులు రాజీని పదవ తరగతి వరకు చదివించి ఇంక చదివించే స్థోమత లేక చదువు ఆపించారు. ఇప్పుడు రాజీకి పెళ్ళి చేయ తలపెట్టారు.


ఆ మరురోజే రాజీని చక్కగా అలంకరించింది తల్లి. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. పెళ్లి కొడుకు విజయ్ తన తల్లి తండ్రులతో వచ్చాడు. వాళ్ళకు మర్యాదలన్నీ పూర్తయ్యాక పెళ్లి చూపులు ఏర్పాట్లు అయ్యాయి. తొలి చూపులోనే రాజీ, విజయ్ ల చూపులు కలిసి మనసులు కలిశాయి. ఇరు కుటుంబాలు సుమఖత వ్యక్తం చేసి ఆ రోజే మంచి రోజు, అప్పుడే మంచి ముహూర్తం అని తమకు తెలిసిన పురోహితుడిని పిలిచి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇంకా 2 నెలలలో వివాహం. పెళ్ళి లో ఇచ్చిపుచ్చుకోవలసినవన్నీ ఇరు పెద్దలూ మాట్లాడుకున్నారు.


పెళ్ళివారికి వీడ్కోలు చెప్పి లోపలికి వచ్చి కూతురి పెళ్లి కుదిరిందని సంతోషంతో ఉన్నారు రామయ్య దంపతులు. 'అక్క పెళ్ళి' అని ఎగిరి గంతేశారు రమ్య, సాగర్ లు. పెళ్ళి గురించి తలపులతో రాజీ మనసు పొంగిపోయింది. ఇంక ఒక మంచి రోజున వినాయకుడి మీదికట్టు, పసుపు దంపుడుతో పెళ్లి పనులు మొదలయ్యాయి. రాజీకి పెళ్ళి చీరలు, విజయ్ కు పెళ్లి బట్టలు, వియ్యాలవారికి బట్టలు, బంధువులకు, ఇతరులకు పెట్టుబడుల బట్టలన్నీ తీసుకున్నారు రామయ్యా వాళ్లు. పెళ్ళి మంటపం‌, భోజనాల కేటరింగు మొ.. అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నా రు. శుభలేఖల పంపిణీ, పెళ్లి పిలుపులు కూడా పూర్తయ్యాయి.


పెళ్ళి రోజు రానే వచ్చింది. చాలా సంప్రదాయంగా రాజీ పెళ్ళి విజయ్ తో జరిగింది. తమ శక్తి కొలదీ కాపురం సారె పెట్టి రాజీని అత్త వారింట్లో. దించివచ్చారు జానకమ్మ వాళ్లు. రాజీ విజయ్ లు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. కలుపుగోలు స్వభావి అయిన రాజీ మెట్టినింట్లో అందరితో ఇట్టే కలిసిపోయింది. అప్పుడప్పుడు పండుగలకు, పబ్బాలకు రాజీ భర్తతో పుట్టింటికి రావటం, అత్త వారింట అల్లుడుగా విజయ్ కు మర్యాదలు అందటం పరిపాటి అయింది. అక్క, బావతో రమ్య, సాగర్ లకు అనుబంధం పెరిగింది. వాళ్లు ఇంటికి వచ్చారంటే స్కూలుకు డుమ్మా కొట్టి మరీ వాళ్ళ తో సరదాగా గడుపుతారు రమ్య, సాగర్ లు.


రెండు సం.. తర్వాత రాజీ గర్భవతి అయింది. విషయం తెలిసి జానకమ్మ వాళ్ళు విజయ్ ఇంటికి వచ్చి సంతోషంగా రెండు రోజులు వాళ్ళ వద్ద గడిపి తమ ఊరు వెళ్ళి పోయారు. వైద్యులు చెప్పిన విధంగా నెలనెలా చెకప్ చేయించుకుంటూ, తగిన మందులు వాడుతూ రాజీ సంతోషంగా ఉంది. ఏడవ నెల రాగానే రాజీకి సీమంతం జరిపించి పురిటికి తమ ఇంటికి తీసుకువెళ్ళారు జానకమ్మ వాళ్ళు.


వీలు కుదిరినప్పుడల్లా విజయ్ వచ్చి భార్యను చూసిపోతున్నాడు. నెలలు నిండగనే పండంటి మగబిడ్డను కన్నది రాజీ. విషయం తెలిసి ఇరుకుటుంబాలు సంతోషించాయి. విజయ్ తల్లితండ్రులతో వచ్చి బాబుని చూసి వెళ్ళాడు. ఇరవైఒకటవ రోజున పిల్లవాడి నామకరణ మహోత్సవం అని విజయ్ ని, అతని తల్లిదండ్రులను ఆహ్వానించాడు రామయ్య. వాళ్ళు వచ్చి సంతోషంగా బారసాల వేడుక చేసుకున్నారు. బాబుకు 'శ్రీకర్ ' అని పేరు పెట్టి కోడలిని, మనవడిని తమ ఇంటికి తీసుకు వెళ్ళటానికి బయలుదేరుతున్నారు విజయ్ తల్లితండ్రులు.


ప్రయాణంలో వాళ్ళకు కావలసిన వన్నీ సర్దింది జానకమ్మ. స్కూలుకు శెలవులివ్వటంతో రమ్య, సాగర్ లు కూడా రాజీ వెంట బయలుదేరారు. అందరూ రైలులో ప్రయాణిస్తున్నారు.


రైలు ప్రయాణం అంటే పిల్లలకు చాలా హుషారు కదా! రమ్య, సాగర్ లు కూడా కబుర్లు చెప్పుకుంటూ చాలా సందడి చేస్తున్నారు. కిటికీ సీటు కోసం ఇద్దరూ గొడవ పడితే ఇద్దరూ చెరో కాసేపు కూర్చునేట్టు వాళ్ళకు సర్దిచేప్పి ఒప్పించింది రాజీ. మధ్య మధ్యలో కిటికీ లోంచి బయటకు చూస్తూ సరదాగా ప్రయాణిస్తున్నారు పిల్లలు. ఇంతలో గుక్కపట్టి బిగ్గరగా శ్రీకర్ ఏడుపు ప్రారంభించేటప్పటికి ఆకలేమో అని రాజీ పాలు పడితే వాడు త్రాగట్లేదు. కడుపు నొప్పేమో అనుకుని సంచీలో ఉన్న గ్రైపు వాటరు పట్టింది రాజీ అత్తగారు.. అయినా వాడు ఏడుపు ఆపట్లేదు. విజయ్ కాసేపు ఎత్తుకుని సముదాయించినా ప్రయోజనం కనబడట్లేదు.


ఒక పక్క చంటిపిల్లాడి ఏడుపు. మరోపక్క

చిన్న పిల్లలైన రమ్య, సాగర్ లు పెద్దగా కబుర్లు, అల్లరి. బాగా చిరాకేసి వాళ్ళని కోపంగా చూస్తున్నాడు విజయ్ వాళ్ళ నాన్న. వాళ్ళని ఏదన్నా కసురుదామంటే రమ్య నొచ్చుకుంటుందని మనసులో అనుకుని చివరకు ఎలాగో వాళ్ళను దగ్గరకు పిలిచి " పిల్లలూ! ఇది రైలు కదా! ఇక్కడ అల్లరి చేస్తే తోటి ప్రయాణీకులు మనమీద రైల్వే టి. సి. కి కంప్లైంట్ చేస్తారు. ఆయన వచ్చి మనకు పెనాల్టీ వేస్తాడు. అదీగాక శ్రీకర్ ఏడుస్తున్నాడు కదా ! మీరు నిశ్శబ్దంగా ఉంటే వాడు హాయిగా నిద్రపోతాడు. చిన్నబాబు కదా ! అందుకని మీరు అల్లరి చేయకుండా బుధ్ధిగా కూర్చుంటే తర్వాత వచ్చే స్టేషనులో రైలు ఆగగానే నేను మీ ఇద్దరికీ మంచి ఐస్ క్రీమ్, పల్లీలు, క్రీమ్ బిస్కెట్లు కొంటాను. సరేనా! " అని చెప్పగానే "అలాగే అంకుల్ " అని వాళ్లిద్దరూ కిటికీలోంచి బయటకు చూస్తూ బుధ్ధిగా కూర్చున్నారు.


కాసేపటికి శ్రీకర్ ఏడుపు ఆపి పాలు త్రాగి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి ఆ తర్వాత స్టేషన్ రాగానే రమ్య, సాగర్ లకు ఐస్ క్రీమ్, పల్లీలు, బిస్కెట్లు కొనిచ్చారు విజయ్ తండ్రి. "ధాంక్యూ అంకుల్ " అంటూ వాళ్ళు సంతోషంగా వాటిని తీసుకుని హాయిగా ప్రయాణం చేశారు. ఇంకో గంట సేపు ప్రయాణం చేసి అందరూ హాయిగా తమ ఇంటికి చేరుకున్నారు.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




73 views0 comments
bottom of page