ప్రాప్తం
- Dr. C S G Krishnamacharyulu

- 9 hours ago
- 4 min read
#CSGishnamKracharyulu, #CSGకృష్ణమాచార్యులు, #ప్రాప్తం, #Praptham, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Praptham - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu Published in manatelugukathalu.com on 08/02/2026
ప్రాప్తం - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
బాల్య స్నేహితులైన సంతోష్, చంద్ర ఇద్దరూ కలిసి తమ సహోద్యోగి వివాహ వేడుక కోసం నాలుగు రోజుల క్రితం బెంగళూరు నుంచి త్రివేండ్రం వచ్చారు. పెళ్లికి వచ్చిన పూర్వ స్నేహితులను మళ్లీ కలవడం వల్ల వారి ఆనందానికి అవధులు లేకపోయాయి. జ్ఞాపకాలు, నవ్వులు, ముచ్చట్లతో ఆ నాలుగు రోజులు క్షణాల్లో కరిగిపోయాయి.
అయితే వెలుగు వెంట చీకటిలా, వారి సంతోషం వెంట ఒక ఊహించని కష్టం వచ్చిపడింది. సంతోష్ డబ్బుల కట్ట ఒకటి కనబడలేదు. గది అంతా గాలించాడు. పెట్టెలు తెరిచాడు. బట్టల్ని ఒక్కొక్కటిగా వెతికాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. దాంతో తన మీద తనే చికాకుపడుతూ, చంద్రతో ఇలా అన్నాడు: "డబ్బులు పేంట్ సీక్రెట్ పాకెట్లో పెట్టి ఉతకడానికి వేసినట్లున్నాను."
"ఎంత డబ్బుంది ఏమిటి?" ఆసక్తిగా అడిగాడు చంద్ర.
"పదివేల దాకా ఉంది. ప్రయాణంలో కొంత నగదు ఉంటే మంచిదని తీసుకున్నాను. కర్మ కాకపోతే, ఎలా మర్చిపోయాను?" అని బదులిచ్చాడు సంతోష్ కుడి చేతితో నుదుటిని కొట్టుకుంటూ.
చంద్రకి తాత్విక చింతన ఎక్కువ. అందువల్ల అతడు సంతోష్ని ఓదారుస్తూ, "చింతించకు. యద్భవతి తద్భవతి. ఏది జరగాల్సిందో అదే జరుగుతుంది. నీ ప్రమేయం లేని కర్మ అది." అని అన్నాడు.
"అంతే, అంతే. నిన్న సంతోషంగా పెళ్ళిలో డాన్సులు చేశాను. విందు భోజనం చేశాను. ఇప్పుడు ఇలా తల బాదుకుంటున్నాను."
"అలా నిరాశలో మునిగిపోకు. నియతం కురు కర్మ త్వం, కర్మ జ్యాయో హ్యకర్మణః। అని కదా గీత చెబుతోంది. నియతమైన కర్మను చేయకుండా వదిలివేయడం, సరైన పని కాదు. బట్టలు తీసుకెళ్ళిన లాండ్రీ బాలన్ ఇల్లెక్కడో కనుక్కుని, అతడిని అడుగుదాం. మన అదృష్టం బాగుంటే, వాడు నిజాయితీగా డబ్బు ఇచ్చేస్తాడు." అని ఆశ కలిగించే ప్రయత్నం చేశాడు చంద్ర.
"సరే, పద. హోటల్ వాళ్ళ సాయంతో అతని ఇంటికి వెడదాం." అని సంతోష్ బయలుదేరాడు.
@@@
స్నేహితులిద్దరూ కలిసి బాలన్ ఇంటికి వెళ్లారు.
బాలన్, అతని భార్య: "బట్టల్లో డబ్బు లేదు సార్! మా కంటబడితే, వెంటనే పట్టుకొచ్చి ఇచ్చేయమా! మా కులదేవతపై ఒట్టు." అని పదే పదే చెప్పారు.
ఇక చేసేది లేక, నిరాశతో తిరిగి వచ్చారు. తోవలో సంతోష్, తన మనసులో వేదనను వ్యక్తం చేస్తూ చంద్రతో ఇలా అన్నాడు:
"దొరికిన డబ్బు ఇచ్చేందుకు బాలన్ మూర్ఖుడా? ఆలోచిస్తే, బాలన్ దోషమేముంది? పాపం ఆ పేద కుటుంబానికి ఏ అవసరముందో? ఎక్కడ త్రివేండ్రం, ఎక్కడ బెంగళూరు. దాదాపు ఏడొందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది, బాలన్కి, పదివేల రూపాయల నోట్లు అందజేయడానికా?"
"దీనినే ప్రాప్తం అంటారు. యద్ధాత్రా నిజ ఫాలపట్ట లిఖితం, స్తోకం మహద్వాధనం, తత్ప్రాప్నోతి మరుస్థలే" విధాత నుదుట వ్రాసిన కొంచెము ధనమైనా అది ఎడారి యందున్నా లభిస్తుంది." అని అన్నాడు చంద్ర.
"నిజమే. అలా మనల్ని మనమే ఓదార్చుకోవాలి." అన్నాడు సంతోష్ భారంగా నిట్టూరుస్తూ.
"అతీతం నానుశోచేత్, భవిష్యం నైవ చింతయేత్ |
వర్తమానేన కాలేన వర్తయేత్ పండితో నరః ||
పోయినదాన్ని తలచి బాధపడకూడదు, రానున్నదాన్ని ఊహించి భయపడకూడదు. వర్తమానాన్ని సార్థకం చేసుకుంటూ జ్ఞాని జీవిస్తాడని చెప్తారు. అందుకని వర్తమానాన్ని ఆనందించు." అని స్నేహితుడి మనసు మార్చే ప్రయత్నం చేశాడు చంద్ర.
వేదాంత ధోరణి తలకెక్కాక, సంతోష్ మనసు మరింత తేలిక పడింది
"అదీ నిజమే! రేపు సాయంత్రం మన ప్రయాణం. అంతలోగా మనం సమయం వృథా చేయకుండా ఊరు చుట్టేయాలి. పద. అనంత పద్మనాభుని దర్శించుకుని కోవలం బీచ్కి వెడదాం" అని సంతోష్ డ్రెస్ చేసుకుని బయలుదేరాడు.
స్నేహితులిద్దరూ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని కోవలం బీచ్కి బయలుదేరారు. స్వామి దర్శనం వల్ల కలిగిన దివ్యానుభూతిని తలచుకుంటూ చంద్ర ఇలా అన్నాడు:
"జీవితమంటేనే వెలుగు నీడలు. డబ్బు పోయిన దుఃఖంలో ఉన్న మనకు, స్వామి దర్శనం అలౌకిక ఆనందాన్ని ప్రసాదించింది. మనం పోగొట్టుకున్నది పిసరంత; పొందింది కొండంత."
"నిజమేరా! ఈ విచిత్రానుభవం నాకు ప్రాప్తం కాబట్టే, నేను ఇంత దూరం వచ్చాననిపిస్తోంది." అని సంతోష్ వంత పాడాడు.
స్నేహితులిద్దరూ కలిసి నిజమైన ఆనందాన్ని బీచ్లో పొందారు.
@@@
మరునాడు మధ్యాహ్నం బాలన్ బట్టలు తెచ్చి ఇస్తూ, "సార్! డబ్బు దొరికిందా? ఒకసారి అంతా వెదికారా?" అని ఆదుర్దాగా అడిగాడు.
"బాలన్! ఎంత గొప్పగా నటిస్తున్నావురా" అని మనసులో తిట్టుకుంటూ, "అంతా చూశాం. దొరకలేదు." అన్నాడు సంతోష్.
బాలన్ దీనంగా ముఖం పెట్టి, "ఇంతవరకు జీవితంలో ఒక్క చెడ్డ మాట పడలేదు. నేనే దొంగనని మీరు అనుకోవచ్చు. అందుకని నా ప్రార్థన. సార్! నా కోసం ఒక్కసారి అన్ని బట్టలు తీసి చూడండి. సూట్కేసు అరలన్నీ చూడండి."
బాలన్ పోరు పడలేక, సంతోష్ సూట్కేసులోని బట్టలన్నీ తీసి, జేబులన్నీ వెదికాడు. చంద్ర సూట్కేసుకున్న అరలను వెదికాడు. ఒక రహస్య అరలో డబ్బు దొరికింది. చంద్ర సంతోషంతో ఆ నోట్ల కట్టను పైకి ఎత్తిపట్టుకుని, "ఇదేనా?" అని అడిగాడు.
సంతోష్ సంభ్రమాశ్చర్యములతో "అవును, అదే!" అన్నాడు.
బాలన్, "మురుగా! రక్షించావు. డబ్బు దొరికింది!" అని ఆనందంతో దేవునికి నమస్కరించాడు.
సంతోష్ అపరాధ భావంతో, "నీ ప్రోద్బలం వల్ల డబ్బు దొరికింది. ఈ బహుమతి తీసుకో!" అంటూ రెండొందల రూపాయలు బాలన్కి ఇవ్వబోయాడు.
బాలన్ ఒక్క అడుగు వెనక్కి వేసి: "వద్దు సార్! కష్టపడే వాళ్ళం. ఊరికే వచ్చే సొమ్ము వద్దు సార్!" అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
బాలన్ ప్రవర్తనతో సంతోష్ అప్రతిభుడయ్యాడు.
@@@
బెంగళూరు వెళ్ళే రైల్లో కూర్చున్నాక, చంద్ర: "అమ్మయ్య! మన ప్రయాణం సుఖాంతమైంది. థాంక్స్ టు బాలన్!" అని అన్నాడు.
సంతోష్ అతని మాటలను బలపరుస్తూ: "ఈ ప్రయాణంలో మర్చిపోలేని వ్యక్తి బాలన్. నేను డబ్బు పోయిందని బాధపడితే, అతడు తన నిజాయితీకి మచ్చ వచ్చిందని విలవిలలాడాడు. నాకు, అతనికి ఎంత తేడా? చదువుకున్నాను. సంపాదిస్తున్నాను. ప్రపంచాన్ని చూశాను. కానీ సంకుచితంగా ఆలోచించి బాలన్ని దొంగగా భావించాను. అతి తేలికగా, నా అపరాధాన్ని అతనిపై నెట్టివేసి, అతడిని తిట్టుకున్నాను."
మన చేతిలో ఏమీ లేదని, సంతోష్ని సమాధానపరుస్తూ చంద్ర ఇలా చెప్పాడు:
"ద్వాపరయుగంలో కృష్ణుడికే అపనింద తప్పలేదు. బాలన్ ఎంత?
"నిందాస్తుతిర్వ్యసనమృద్ధిసుఖం ప్రసాదః |
కాలేన సర్వమిహ దేవవశేన పుంసాం ||
మనకు వచ్చే నింద అయినా, ప్రశంస అయినా, సుఖం, దుఃఖం, అభివృద్ధి, పతనం అన్నీ
కాలానుసారం, విధి ఆధీనంగా జరుగుతాయి."
"నిజమే. మన చేతిలో ఏముంది? మనకేది ప్రాప్తమో అదే సంభవిస్తుంది." అని సంతోష్ నిట్టూర్చాడు.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).




Comments