
'Prathivadi Bhayankara Venkatachary' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
'ప్రతివాది భయంకర వేంకటాచారి' తెలుగు కథ
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
భరతావని ఎల్లడలా స్వాతంత్య్ర సమర జ్వాలలు ఉప్పెనలా ఎగసిపడుచున్న కాలమది. పెద్దా, చిన్నా, స్త్రీ పురుష భేదం లేకుండా ముందుకు అడగు వెయ్యడమే కాని ఏ ఒక్కరూ వెనుకడుగు లేదు.
గాంధీగారి అడుగుజాడలలో నడుస్తూ సత్యాగ్రహాలు, నిరహారదీక్షలతో కొంతమంది హోరెత్తిస్తూంటే, అది నచ్చని బోస్, భగత్ సింగ్ ల ప్రభావంతో బందూక్ లూ, తుపాకులు పేలుస్తూ, బాంబు దాడులతో భయస్ఫోటాలు కలిగిస్తూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పునాదులు కదిలేటట్లు, వైశాఖమాసపు సుడి, వడ గాలుల వలె మధ్యాహ్న మార్తాండుల వలె విజృంభిస్తూ ఐరోపా ఖండం వరకూ ఆ బడభాగ్నులను ప్రజ్వరిల్లజేస్తున్నారు.
ఆ సమయంలో బ్రిటీష్‌పాలనను సాయుధంగా ఎదురు కొనదలచిన తెలుగుజాతి పౌరుషం, తెలుగుబిడ్డ, తెలుగోడును వినిపించిన వారు మన విప్లవ సింహం
ఆత్మగౌరవ రణభేరి-ప్రతివాదిభయంకర వేంకటచారి.
జననం-28. 08. 1910.
తెల్లవారిగుండెల్లో బాంబులు పేల్చిన ఘనుడు మనోడు. పంతొమ్మిది ఏటనే ఉప్పుకటారులపై దాడి చేసిన వీరకిశోరం. సామర్లకోట నుండి ఉద్భవించినవాడు. బాంబులు పేల్చి బ్రిటీష్‌వారిని పారద్రోలలాలని తలంచి ఆచరణలో పెట్టి సుధీర్ఘ కాలం జైలుశిక్ష అనుభవించిన విప్లవకారుడు.
కుటుంబయోగక్షేమాలు త్యాగం చేసి తీవ్రవాదం ద్వారా బ్రిటీష్‌పాలకులను బెంబేలు పుట్టించిన ప్రతివాద "భయంకర" వేంకటచారి. వేదాంతం సదానందం తో కలిసి ' హిందుస్థాన్ సేవాదళ్ లోట్రైనింగ్ పొందారు.
చరితార్థలైనప్పటికీ చరిత్రలో పదివాక్యాలకు కూడా నోచుకోని చరిత్ర పురుషులు భరతావని నిండా ఎందరో ఉన్నారు. ప్రతివాదిభయంకర వేంకటచారి లేదా భయంకరాచారి అలాంటి చరిత్రపురుషుడు. సాహసి. త్యాగమూర్తి. రచయిత. గొప్ప వక్త.
సంస్కతపండితుల కుటుంబంలో పుట్టారాయన. అయినా ఆంగ్ల చదువులు చదివారు. సొంతూళ్ళో పదవతరగతి చదివి విశాఖపట్టణం ఏవిఎన్ కాలేజీలో ఇంటర్మీడియెట్ లో చేరారు. అప్పుడే ఆంధ్రవిశ్వవిద్యాలయ విద్యార్థీ సంఘానికి అద్యక్షునిగా ఎన్నికయ్యారు.
దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరావు గారి ప్రోద్భలంతో జాతీయోద్యమము లోకి వచ్చారు. 1928 కాలంలో ఆయన కాశీనాథుని గారిని కలుసుకున్నారు. వారు ఆంధ్రపత్రిక యజమాని. వారిని ఆ రోజులలో కవులు కలుసుకుని తమ రచనలను ప్రచురించమని కోరేవారు. మన భయంకరచారి గారు కూడా ఆయన రచించిన "ప్రమద్వర పరిణయం” గ్రంథం అచ్చు వేయమని కోరారు.
ఆ రోజల్లో మద్రాస్‌ప్రెసిడెన్సీకి ప్రధాన అనువాదకుడిగా మరియు పరీక్షల నిర్వహణాధికారిగా ఉండేవారు. పుస్తకంలో అభ్యంతకర అంశాలు లేవని, పుస్తకం బ్రిటీష్ ప్రభుత్వమునకు వ్యతిరేకము కాదని భానుమూర్తి ఆమోదముద్ర వేశేవారు. ఆ పత్రం తెచ్చాక పుస్తకం ప్రచురణ అయ్యేది. నిజానికి పుస్తక ప్రచురణ కంటే భయంకరాచారి వ్యక్తిత్వం మీదే కాశీనాథుని ఎక్కువ ఆసక్తి చూపారు. ఆ తరువాతే భయంకరాచారి జాతీయోద్యమంలో ప్రవేశించారు.
గాంధీమార్గం నుంచి బాంబుల వైపు. 1929 ( డిశంబర్) నాటి లాహోర్ జాతీయ సభలకు కాశీనాథుని తో పాటు భయంకరాచారి వెళ్ళారు. అప్పటికి ఆయన వయస్సు 19 ఏళ్ళు. అక్కడే పూర్ణ స్వరాజ్యం గురించి నేతలు ప్రకటించారు. అక్కడే ఆయన గాంధీని కలుసుకున్నారు.
ఆ పిదప కాకినాడలో బులుసు సాంబమూర్తి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహంలో పాలుగొన్నారు. 1930 మే నెలలో గురజనపల్లిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాలుగొని జైలుకు వెళ్ళారు. బళ్ళారి జైలులో ఉండగానే బెంగాల్ విప్లవకారులతో పరిచయాలయ్యాయి. వారంతా లాహోర్ కుట్ర కేసులో ఉన్నవారే.
“యవతను ఉరితీస్తూ, ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్ళు మూసుకుని కూర్చోలేదు. ఎదురుతిరిగి విప్లవించాలి. అందుకు అవసరమైన ఖర్చులకోసం బ్యాంకులు దోచాలి. " అన్నది ఆయన సిద్దాంతం.
ఉప్పు సత్యాగ్రహంలో నాటి తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్, బులుసుసాంబమూర్తి తల పగలగొట్టాడు. భయంకరాచారికి గూడా గట్టిదెబ్బలే తగిటలాయి. ఆ సందర్భంగా జైలుకు వెళ్ళినప్పుడు ఆయన అతివాద తీవ్ర జాతీయోద్యమం వైపు మొగ్గు చూపారు. గాంధీజీ అహింసా ఉద్యమానికి ఆయన వీడుకోలు పలికారు. ఆ తరువాత జరిగిందే కాకినాడ బాంబు కుట్ర కేసు.
కాకినాడ బాంబు కుట్రకేసు:
జలియన్‌వాలాబాగ్ లో కాల్పుల ఘటన భరతావని నిండా యువతా యంతా ఒక్కసారి భగ్గుమంది. ఎక్కడి కక్కడే అనేక విప్లవ సంఘాలు, పార్టీలు ఏర్పాడ్డాయి. వాళ్ళధ్యేయము చంపడమో, చావడమో. ఇటువంటి సంఘాలు ఎక్కువగా బెంగాల్, పంజాబ్ లో ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే పంజాబ్‌కేసరి లాలాలజపత్‌రాయ్ ను తీవ్రంగా కొట్టడం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మరణించారు.
ఈ చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడమే భరతజాతి ఆత్మగౌరవమని నమ్మారు. ఆ యువకులకు అప్పటి వరకూ ఎటువంటి నేరమూ చేసిన వారు కారు. వారి స్వభావం కూడా అతి కోమలమైనది. అలాంటి తీవ్ర నిర్ణయానికి రావడానికి ముందు వారికీ ఒక ఉద్యమ నేపథ్యం ఉందనీ మనము మరవకూడదూ. అలాంటి నిర్ణయానికి ఆయనను తీసుకువచ్చిన పరిణామాలు వేరు.
బ్రిటీష్‌ఇండియా పోలీసు జులుంకు పెద్దాపురం ఘటన( డిశంబర్16, 1930) గొప్ప ఉదాహరణ. ధనుర్మాస సంతర్ఫణ కోసం దాదాపు ఎనభై మంది పెద్దలు, పిన్నలు బొక్కా నారాయణ మూర్తి అనే రైతు తోటకు వచ్చారు. వత్సవాయి జగపతి వర్మ(జమీందారు), క్రొవ్విడి లింగరాజు, దువ్వూరి సుబ్బమ్మ, పెద్దాడ నారాయణ వంటి ప్రముఖులూ పాల్గొన్నారు. ఉద్యమం గురించి చర్చించాలనుకున్నారు.
సర్కిల్ ఇనస్పెక్టర్ డప్పుల సుబ్బారావు హెచ్చరికలు ఇచ్చినా, సమయం ఇవ్వకుండా లాఠీచార్జి చేశారు. వాడపల్లి రథయాత్రలో కాల్పులు(మార్చి30, 1931) జరిగాయి. నలుగురు చనిపోయారు.
సీతానగరం గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని (19. 01. 1932) పోలీసులు ధ్వంసం చేశారు.
ఒక సందర్భంలో భయంకరాచారి యూనియన్ జాక్‌ను తగులబెట్టారు. అప్పుడు జరిగిన లాఠీచార్జ్ లో గాయపడిన భయంకరాచారి ఎనిమిది గంటలపాటు స్పృహ కోల్పోయారు. ఆ పై కొన్ని రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. వీటన్నింటికీ మూలకారకులు పోలీస్ సూపరింటెండెంట్ ముస్తఫా ఆలీఖాన్, సర్కిల్ ఇనస్పెక్టర్ డప్పుల సుబ్బారావు..
ఆ ఇద్దరి అకృత్యాలకు హద్దేలేకుండా పోయింది ఆ రోజులలో. జాతీయ కాంగ్రెస్ నాయకుల మీద, స్వరాజ్య సమరయోధుల మీద ఈ ఇద్దరూ కక్ష గట్టారు. మనవారు కూడా కొంతమంది ఎంగిలికూటికి ఆశపడి ఉచ్ఛనీచాలు లేకుండా ప్రవర్తించేవారు. అందుకే ముస్తాఫా ను చంపాలని భయంకరాచారి పథకరచన చేశారు.
పడవలో బాంబులు:
మరొక ఎనిమిది మందితో కలిసి ముస్తాఫాను కడతేర్చలని పథకరచన చేశారు. కాకరాల కామేశ్వరరావు, బోయిన సుందరం, చల్లా అప్పారావు, వడ్లమాని శ్రీరామమూర్తి, చిలకమర్రి సత్యనారాయణా చార్యులు, నండూరి నరసింహాచార్యులు- ఈ బృందం లో సభ్యులు. ప్రధాన పాత్ర మాత్రం భయంకరా చారి, కామేశ్వరరావు, వడ్లమాని శ్రీరామ మూర్తి లదే.
కలకత్తా, పుదుచ్ఛేరి, బొంబాయి ల నుంచి బాంబుల తయారీకి కావలసిన పదార్థాలు సేకరించారు. బాంబులతో బ్రిటీష్ వారి పునాదులు కదిపి భయోత్పాతాలు సృష్టించ గలమన్న నమ్మకం భయంకరాచారి కి ఉంది.
కానీ ఈ ప్రయత్నం సజావుగా సాగడానికి కాకినాడ లోని జగన్నాధపురం లో "సీహెచ్‌ఎన్‌చారి అండ్ సన్స్ "అనే పేరుతో ఒక దొంగ కంపెనీ ప్రారంభించారు.
మొదట ముస్తఫా నివాసం కదలికలు గురించి కష్టపడి కనుక్కున్నారు. కాకినాడ లోని ఉప్పుటేరు సమీపంలో ఉంటున్నాడతను. అక్కడే బ్రిటీష్ సంస్థ రిప్లయి కంపెనీ ప్రాంగణంలో నివాసం. అతడి నివాసం ఎదురుగానే బొమ్మల జెట్టి దగ్గర భారీ నావలు ఉంటాయి. ఇవన్నీ స్ట్రాస్ అండ్ కంపెనీ కి చెందినవి.
ఉప్పుటేరు కు అవతల గట్టున నున్న జగన్నాథపురానికి జాలీ బోట్ల ( చిన్నవి) లో వెళతాడని తెలిసింది. అందుకే ఆ పడవలోనే బాంబు పెట్టాలని నిశ్చయించారు. ప్రణాళిక 1933 ఏప్రిల్ మొదటి వారంలో అమలు చేయడం ప్రారంభించారు. తొలిగా 6న, తరువాత 14న, బాంబులు పెట్టారు. ఆ రెండు రోజులు కూడా అతను రాలేదు
15 వ తేది వేకవజామున మళ్ళీ బాంబు పెట్టారు. ఈ సారి కూడా ముస్తాఫా జాడలేదు. ఆ రోజు బాంబులన్నీ సంచీ లో పెట్టి ఒక పడవలో దాచి సమీపంలో నే ఉన్నహోటల్ కు భయంకరాచారి కూడా ఉన్న వాళ్ళు వెళ్ళారు. ఇంతలో బాంబుల మ్రోత.
16 వ నంబరు బోటులో దాచిన బాంబుల సంచిని సరంగు తీయడంతో పేలాయి. తొమ్మిది మంది కూలీలు గాయపడ్డారు. పేలుడు శబ్దానికి అక్కడికి చేరుకున్న వారిలో సాక్షాత్తు ముస్తాఫా కూడా ఉన్నాడు.
అక్కడ పేలకుండా మిగిలిన మూడు బాంబులు దొరికాయి. ఐదు రోజుల తరువాతగాని అది విప్లవకారుల కుట్ర యని, తనని అంత మొందించేందుకు జరిగిన పన్నాగమని అతడికి తెలియలేదు. కాకినాడ కి చెందిన ఒకరు ఎస్. ఐ కి విషయం చెప్పడం తో కుట్ర బయటపడింది. ఒక్కొక్కరినీ పట్టుకోవడం ప్రారంభించారు. అప్పటికి తప్పించుకున్నా, భయంకరా చారి ని సెప్టెంబర్ 11 న ఖాజీపేట రైల్వేస్టేషన్ లో పట్టుకున్నారు.
అండమాన్ కు:
తూర్పు గోదావరి జిల్లా సెషన్స్ కోర్ట్ కేసు విచారించి అందరికీ శిక్ష విధించింది. దీనిమీద అప్పీలుకు వెళ్ళారు. మద్రాసు కు చెందిన ప్రముఖ న్యాయవ్యాది వీ. ఎల్. యతిరాజు కేసు వాదించారు. కామేశ్వరరావుకు, వడ్లమాని శ్రీరామమూర్తి లకు నాలుగేళ్ళు కఠిన జైలు శిక్ష విధించారు. ఆ శిక్షలు రాజమండ్రి సెంట్రల్ జైలులో అమలు పరిచారు. భయంకరా చారి ఏడేళ్ళు ద్వీపాంతర వాస శిక్ష విధించి అండమాన్ జైలుకు పంపించారు. భయంకరాచారి నరకం చూశారు.
ఈ కారాగారాన్ని ' ప్యారడైజ్' అని మద్రాస్ ప్రెసిడెన్సీ హోం మెంబర్ హెన్రీ క్రేక్ వ్యంగంగా అంటూ ఉండేవాడు. 1937 లో జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తరువాత భయంకరాచారి విడుదల అయ్యారు. ఆపై ఆయన తన జైలు అనుభవాలను అక్షరరూపం ఇచ్చారు. దీనికి ఆయన పెట్టిన పేరు ' క్రేక్స్ ప్యారడైజ్, లైఫ్ ఇన్ అండమాన్స్'. సండే టైమ్స్ సంపాదకులు కామత్ ప్రచురించారు. చక్రవర్తుల రాజగోపాలా చారి ముందు మాట వ్రాశారు. అండమాన్స్ లో శిక్ష అనుభవించిన ఎందరో తీవ్ర జాతీయవాదుల ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి.
భయంకరా చారికి అప్పటికింకా పెళ్ళి కాలేదు. అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రముఖుడు అనంతశయనం అయ్యంగార్ భయంకరాచారిని నెహ్రూకు పరిచయం చేశారు. వెంటనే నెహ్రూ ఆయన ఆశయాల మేరకు పనిచేయడానికి అనుమతి నిస్తూ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్‌గా నియమించారు. తరువాత పెళ్ళి చేసుకుని ప్రశాంత జీవనం సాగించారు. అయితే ఒక దశలో ప్రభుత్వాన్ని విమర్శించి నందుకు ఉద్యోగం నుంచి తీసివేశారు.
మళ్ళీ నెహ్రూయే కలగజేసుకుని మళ్ళీ బాధ్యతలు ఇప్పించారు. పాత్ర ముగిసినా రంగస్థలం మీదే ఉండిపోయిన పాత్ర యని పి. రాజేశ్వరరావు తన ' ది గ్రేట్ ఇండియన్ పేట్‌రియాట్స్' లో భయంకరా చారి గురించి వ్యాఖ్యనించారు.
1975 భార్య కన్ను మూసింది. తరువాత వీరి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. భయంకరాచారి తుదకంటూ జాతీయవాది గానే ఉన్నారు. ప్రకాశం పంతులు గారితో సన్నిహితంగా ఉండే వారు. దేశం కోసం త్యాగం చేయడం జీవితాన్ని వృధా చేయడం కాదు. అన్న సావర్కార్ వ్యాఖ్యకు నిలువెత్తు రూపం ప్రతివాది భయంకర వేంకట చారి. అండమాన్ లో కూడా ఆయనకు తోటి ఖైదీ వినాయక్ దామోదర్ సావర్కార్.
“స్వాతంత్య్ర అమృతోత్సవములు జరుపుకుంటున్న సందర్భముగా మహోన్నత మూర్తులకు, చరిత్రకందని అజ్ఞాత వీరులకు నివాళులు అర్పిస్తూ”.
ఈ విప్లవవీరులలో “ వడ్లమాని శ్రీరామమూర్తి”గారు మా చినతాతగారు. మాఅమ్మగారికి పినతండ్రి.
---------------జైహింద్ -------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments