top of page
Original.png

ప్రేమమ్...

2 hours ago
5 min read

ప్రేమమ్ తెలుగు కథలో నిమ్మ రైతులకు అండగా నిలిచి మహిళల కోసం కొత్త ఉత్పత్తులు రూపొందించిన వెంకీ మరియు రమ

Premam - Telugu Social Story | Bhaskara Rao B. R. K. V.

ప్రేమమ్... తెలుగు సామాజిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 14/09/2026


"ప్రేమ?"


"టైమ్ వేస్ట్ థింగ్!"


"మనసు?"


"భ్రమ!!"


"మమతానురాగాలు?"


"అభివృద్ధికి ఆరినాపాతాలు!!!"


"వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ మై డియర్! సృష్టిని నడిపించేది ప్రేమే... ప్రేమ దైవ స్వరూపం. ప్రేమే లేకపోతే స్త్రీ, పురుషులు కలసి సుఖంగా జీవిస్తారా? ప్రేమకు ఏదైనా చేసే శక్తి ఉంది.


సంతోషానికి, బాధకు స్పందించే మనసులో జనించే భావాల ప్రకంపనలను పాంచభౌతికమైన శరీరం ప్రదర్శిస్తుంది. తద్వారా శరీరావస్థను ఎదుటివారు గమనించి ప్రతిస్పందిస్తారు.


మమతానురాగాలు మనిషిని ఒక చట్రంలో బంధించి ఆ మనిషి అభివృద్ధికి ఆటంకాలు కానేకావు. కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా మన అన్నవాళ్లు అక్కున చేర్చుకునే అమృత హస్తాలు."


"నువ్వు చెప్పినవన్నీ కంటికి కనిపించనివి. ఇవి ఎవరివి వాళ్లవే, అందుకే వీటిని స్వార్థాలు అంటాను. భౌతికంగా బాధను అనుభవించే శరీరానికి సుఖం కలిగినప్పుడే నువ్వన్నావే కనపడని మనసు, అది ప్రశాంతంగా ఉంటుంది." అని వెంటనే "అమ్మా!" అంటూ తానున్నది పొలం గట్టు పైన అని ఆలోచించకుండా కూర్చుండిపోయింది.


"ఏమైంది?! రమా, కాల్లో నిమ్మముల్లు గుచ్చుకుందా? నన్ను చూడని" అంటూ కలవరపడుతూ తానూ అక్కడే కూర్చునేసరికి "కంగారు పడకు వెంకీ, ఏమీ కాలేదు. ఆడదాని కాళ్లు డిటర్జెంట్లతోను, చేతులు డిష్ వాష్ సబ్బులతోను తడిసి తడిసి ముద్దవ్వాల్సిందే కదా!! 


వాటిల్లో ఉండే రసాయనాల వల్ల చేతివేళ్ల మధ్యన, కాళ్ల వేళ్ల సందుల్లో పుళ్లు నిత్యమూ బాధిస్తూనే

ఉంటాయి. సగటు మధ్యతరగతి స్త్రీకి ఇది అలవాటేలే. పచ్చగడ్డి మోడు వేళ్ల మధ్యన గుచ్చుకుంది." అంటూ బాధతో వేళ్ల మధ్య తుడుచుకుంటూ అంది రమ.


వెంకీ నీళ్లు నిండిన కళ్లతో "నావల్లే బయటకు వచ్చావు. నాకు చాలా బాధగా ఉంది రమా!" అన్నాడు.


"వెంకీ, ఇంత చిన్నదానికే అంతలా ఇదైపోతావెందుకు? మన ఊళ్లో రైతులు పడే బాధల ముందు మన బాధెంత?"


"వాళ్లేమి బాధపడుతున్నారు?"


"మన ఊరితోపాటు చుట్టుప్రక్కల ఇరవై ముప్పయ్ గ్రామాల వరకు నిమ్మతోటల మీద బతుకుతాం. నీకు తెలుసుగా! కానీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి నిమ్మకాయల అమ్మకం ఇంచుమించు తొంభై శాతం పడిపోయింది. డబ్బులేక రైతులంతా కుదేలైపోయి అప్పుల పాలైపోయారు. 


అబ్బాయిలకు చదువులు లేవు, అమ్మాయిలకు పెళ్లిళ్లు లేక ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. అంతెందుకు, మా ఇద్దరి అక్కలకు పెళ్లిళ్లు చేయడానికి నాన్న దగ్గర డబ్బులేక ఎంతో బాధపడి సిగ్గుతో బయటకు రాలేకపోతున్నాడు. మనిద్దరం టెన్త్ వరకు చదువుకున్నాం. 


నీకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఎం.టెక్ చదువుకున్నావు. ఇంటర్ మధ్యలో ఆపేసిన నాతో ఇదిగో ఇలా బయటకు తీసుకువచ్చి ప్రేమ దోమ అంటూ ఏవేవో చెప్తున్నావు" అంటూ వెంకీకి చెయ్యి అందించి లేచి నిల్చుంది.



"నాలా ఎంతోమంది ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఉండిపోయారు. ఇంకో బాధాకరమైన విషయం తెలుసా??? ప్రతి సంవత్సరం రెండుసార్లు చేసే అమ్మవారి జాతర చేసి నాలుగేళ్లు అయ్యింది. ఆ చల్లని తల్లి ఇంకెంత బాధ పడుతోందో?"


రమ మాటలు వినడమే కానీ సమాధానం చెప్పడం లేదు వెంకీ. ఇద్దరూ నిమ్మతోటలో పక్కపక్కనే నడుస్తున్నారు.


వెంకీ చెన్నైలో పీజీ చదివి వచ్చిన తర్వాత చాలాసార్లు పిలిస్తే కానీ రమ బయటకు రాలేదు. కాలేజీలో కన్నా లోకాన్నే ఎక్కువ చదివిన రమ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించే వెంకీ తన మనసులోని మాట చెప్పడానికై తన నిమ్మతోటలోకి పిలిచి తన ప్రేమ గురించి చెప్పడానికి ప్రయత్నించేసరికి ఆమె అభిప్రాయం విన్న వెంకీకి నోటిమాట రాక ఊరి రోడ్డు వరకు నడిచివచ్చాడు మౌనంగానే. 


రమ కూడా పెద్దగా మాట్లాడలేదు. ఇద్దరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.


కళ్లాలు లేని కాలం దౌడు తీయక మానదుగా!


ఏడాది గడిచింది. వెంకీ తన భవిష్యత్తు కోసం టౌనుకు వెళ్లిపోయాడు. రమ గుర్తుకువచ్చినప్పుడు వెంకీ గురించి ఆలోచించినా 'మన తలరాతలు వక్రంగా ఉన్నప్పుడు అతనేమీ చేస్తాడులే' అని సరిపెట్టుకునేది.



నెమ్మది నెమ్మదిగా నిమ్మకాయల ఎగుమతి పెరిగింది. ఊళ్లోని రైతులు తిరిగి తోటలకు వెళ్లడం ప్రారంభించారు. కొద్దో గొప్పో ప్రతి రైతు ముఖంలో ఆనందం కనిపించింది. రమ తండ్రి మంచం దిగి తోటపై లాభాలు రావడంతో పెద్దమ్మాయి పెళ్లి చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. గ్రామదేవత జాతర చేయడానికి పెద్దలు ఓ రాత్రి సమావేశమై ఎప్పుడు చేయాలో నిర్ణయించారు కూడా.


ఓరోజు రమ పసారా సామాన్లు కొనడానికి తండ్రికి ఖాళీ లేకపోతే తానే వెళ్లాంది. యథావిధిగా తీసుకునే డిటర్జెంట్లు, డిష్ వాష్ సోపులకు బదులుగా కొత్తగా వచ్చాయంటూ వేరే బ్రాండ్ల సబ్బులు ఇచ్చి, "మా ఇంట్లో కూడా వాడారమ్మ, వీటిని తీసుకువెళ్లండి! చేతులు కాళ్లు పుళ్లు అస్సలు పడటం లేదు" అని ఇస్తుంటే వద్దని వారించిన రమ, అతను ఎంతో నమ్మకంగా చెప్పేసరికి శాంపిల్‌గా రెండేసి తీసుకుంది.


మరునాడే కొత్తగా తెచ్చిన సబ్బులు వాడటం మొదలుపెట్టింది. చిత్రంగా కొత్తగా పుళ్లు పడటం పోయి పాతవి కూడా తగ్గడం మొదలుపెట్టాయి. 


ఆశ్చర్యపోయిన రమ రెండు రోజులు పోయాక షాపుకు వెళ్లి తిరిగి కొత్త సబ్బులే తెచ్చుకుంది.



రెండు నెలల తర్వాత ఉన్నట్టుండి వెంకీకి ఊళ్లో మంత్రిగారి చేత సన్మానం అని తెలుసుకున్న రమతో పాటు ఊరంతా ఆశ్చర్యపోయింది. ఆ రోజు రానే వచ్చింది. ఊరి నడిబొడ్డులో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. ఊరంతా వెంకీ తల్లిదండ్రులు పూలతో, టెంట్లతో అట్టహాసంగా అలంకరించారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆహ్వానించారు. రమ కూడా కొద్దిసేపట్లో సభ ప్రారంభమౌతుందనగా ఉత్సుకత ఆపుకోలేక వెళ్లింది. ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంత

జనం.


సభ ప్రారంభమయ్యింది. ఎంతోమంది పెద్దలు వేదికపై ఆశీనులయ్యారు. ఓ మూలగా కూర్చున్న రమ కళ్లు వెంకీ కోసం వెతికాయి.


చాలామంది వక్తలు వెంకీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. చివరిగా మంత్రిగారు "వెంకీ లాంటి సంఘ శ్రేయస్సు కోరే వ్యక్తి మీ ఊరిలో పుట్టడం మీ అదృష్టం. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. వెంకీ మీ ఇంట్లో మనిషి లాంటివాడు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ల కష్టాలు గుర్తించని భర్తలు ఉన్న ఈ రోజుల్లో మన తల్లి, చెల్లి, భార్య వాడే బట్టల సబ్బుల వల్లనూ, డిష్ వాష్ సబ్బుల వల్లనూ ఏర్పడే గాయాలను కూడా గమనించి వాటికి శాశ్వత పరిష్కారం చేయాలనే సదుద్దేశంతో రసాయనాలు లేకుండా రెండు రకాల సబ్బులు తయారుచేశాడు. 


అది కూడా ఎంతో కాలం నుంచి తన చుట్టుప్రక్కల రైతులు నిమ్మసాగు చేసి నష్టపోయి బాధలు పడుతున్న సమయంలో వారి దగ్గరే నిమ్మకాయలు కొనుగోలు చేసి వాటితో రసాయన రహిత సబ్బులు తయారుచేసి వారిని ఆదుకున్నాడు. రైతుల ముఖాల్లో వెలుగు చూసి, స్త్రీల వదనాల్లో ఆనందం చూసిన సేవామూర్తిని సత్కరించడం నా బాధ్యత." అని అప్పటివరకు వేదిక ముందు వరుసలో కూర్చున్న వెంకీని పైకి ఆహ్వానించారు.


అప్పటికే సిద్ధం చేసిన దర్బారు కుర్చీపై వెంకీని కూర్చోపెట్టి ఘనంగా సన్మానం చేశారు మంత్రి, మిగిలిన పెద్దలు. ఇదంతా గమనిస్తోంది రమ. ఊరి పెద్దల కోరిక మేరకు వెంకీ మాట్లాడుతూ

"మనిషి తాను అనుకున్నది సాధించాలంటే సంకల్పసిద్ధి ఉండాలి. దానికి ప్రేరణగా ఓ బలమైన సంఘటన గాని, వ్యక్తి గాని కారణమై ఉంటుందని నా నమ్మకం. నా ఈ విజయానికి వెనుక ఓ వ్యక్తి అపనమ్మకం నన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది. 


ప్రేమ అంటే సమయం వృథా అన్న ఓ అమ్మాయితో ప్రేమకు ఏదైనా చేసే శక్తి ఉంటుందని చెప్పి, నాకు ఆమెపై ఉన్నది నిజమైన ప్రేమ అని ఆమె చేతే ఒప్పించాలని నిర్ణయించుకుని ఎంతో కష్టపడి ఈ ప్రొడక్టులను తయారుచేసి మీకు ఇవ్వగలిగాను. 


నాకు సరైన సమయానికి నిమ్మకాయల్ని అందించి సహాయపడినందుకు మీకు కృతజ్ఞతలు. వేదికను అలంకరించిన వారికి, ఇక్కడకు విచ్చేసిన వారందరికీ నా నమస్కారములు." అని ముగిస్తుండగా కళ్ల నుంచి ధారాపాతంగా కారుతున్న నీటితో తాను ఉన్న చోటును కూడా మర్చిపోయిన రమ ప్రజల మధ్యనుంచి పరుగెత్తుకుంటూ వచ్చి వేదిక ఎక్కి ఒక్కసారిగా వెంకీ కాళ్లపై పడిపోయి "నన్ను క్షమించు వెంకీ, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను." అంటూ తన కన్నీటితో అతని పాదాలను అభిషేకించేసరికి వెంకీ ఆమెను లేవనెత్తి గట్టిగా హత్తుకుని "ఈవిడే నా విజయసారథి" అని ప్రజలకు చూపించాడు.


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page