పుట్టుకతో వచ్చింది పుడకలతో కాని పోదు

Puttukatho Vachindhi Pudakalatho Kani Podhu - Telugu Moral Story | Patrayudu Kasi Viswanadham
పుట్టుకతో వచ్చింది పుడకలతో కాని పోదు - తెలుగు నైతిక కథ | పట్రాయుడు కాశీవిశ్వనాథం
Published In manatelugukathalu.com On 07/10/2026
“పుట్టుకతో వచ్చింది పుడకలతో కాని పోదు” అనే సామెత వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేసే చక్కని తెలుగు నైతిక కథ ఇది.
ఒకరోజు సాయంత్రం లచ్చవ్వ, రామవ్వ వీధిగుమ్మంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. బడినుంచి వచ్చిన రుద్రాంశ్ వాళ్ల పక్కనే కూర్చుని బొమ్మలు గీస్తున్నాడు.
"లచ్చవ్వా! మన ఊరి వరహాలుశెట్టి దుకాణంలో పనిచేసే వీరేసు గురించి విన్నావా?" అంది రామవ్వ.
"ఏమైంది వాడికి?" ఆసక్తిగా అడిగింది లచ్చవ్వ.
"వీరేసు చాలాకాలంగా శెట్టి దుకాణంలో పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దుకాణంలో డబ్బు దొంగిలిస్తూ శెట్టికి దొరికిపోయాడు. శెట్టి కోపం తెచ్చుకోకుండా అతడిని క్షమించి, 'ఇంకెప్పుడూ ఇలా చేయకు. నమ్మకంగా పనిచేసుకో' అని చెప్పి వదిలేశాడు.
ఈ విషయం తెలిసిందే కదా!"
"ఔను. శెట్టిది మంచి మనసు," అంది లచ్చవ్వ.
"అంతటితో అయిపోయిందా!?"
"ఆ మధ్య వీరేసు బాగా జబ్బు పడ్డాడు. శెట్టి సొంత మనిషిలా చూసుకుని, తన డబ్బుతో వైద్యం చేయించాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అతడి పెళ్లాం, పిల్లల పరిస్థితి చూసి మళ్లీ దుకాణంలో పనిలో పెట్టుకున్నాడు. ఇది కూడా తెలుసుకదా!"
"నిజమే. అయితే ఇప్పుడు ఏం జరిగింది?" అని అడిగింది లచ్చవ్వ.
"అదే బాధ! నిన్న రాత్రి మళ్లీ గల్లాపెట్టెలో ఉన్న డబ్బంతా తీసుకుని పారిపోయాడట."
"అయ్యో! తనను క్షమించిన శెట్టినే మోసం చేశాడా?" అంటూ లచ్చవ్వ నిట్టూర్చింది.
అప్పటివరకు బొమ్మ గీస్తున్న రుద్రాంశ్ పెన్సిల్‌ను పక్కనపెట్టి వాళ్లవైపు చూశాడు.
"అవ్వా! శెట్టి అంత మంచిగా చూసినా వీరేసు ఎందుకు మారలేదు?" అని అడిగాడు.
"తమను తాము మార్చుకోవాలని అనుకోని వాళ్లకు ఎన్ని మంచి మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. అలాంటి మనుషుల గురించే వేమన చెప్పాడు," అంటూ రామవ్వ పద్యం చదివింది:
"పాలు పంచదార పాపర పండ్లలోచాలబోసి వండ చవికిరాదుకుటిల మానవులకు గుణమేల గల్గురావిశ్వదాభిరామ వినుర వేమ!"
రుద్రాంశ్ శ్రద్ధగా విని, "అవ్వా! ఈ పద్యం అర్థం ఏమిటి?" అని అడిగాడు.
"చేదు పండులో పాలు, పంచదార కలిపి వండినా దాని సహజమైన చేదు పోదు కదా! అలాగే చెడు స్వభావం ఉన్న మనిషికి ఎన్ని మంచి మాటలు చెప్పినా, అతడిలో చెడు స్వభావం మారడం కష్టం. ఎందుకంటే మార్పు రావాలంటే ముందుగా అతడికే మారాలనే కోరిక ఉండాలి," అని రామవ్వ వివరించింది.
రుద్రాంశ్ కాసేపు ఆలోచించాడు.
"అంటే వరహాలుశెట్టి వీరేసును క్షమించాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆదుకున్నాడు. మళ్లీ పనిలో పెట్టుకున్నాడు. అయినా వీరేసు తన చెడు స్వభావాన్ని మార్చుకోలేదన్నమాట!" అన్నాడు.
"అవును రుద్రా!" అంది లచ్చవ్వ.
"ఇలాంటి వాళ్లను ఉద్దేశించే ఒక సామెత కూడా ఉంది," అంది రామవ్వ.
"ఏమిటది?" అని అడిగాడు రుద్రాంశ్.
"'పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు'."
"పుడకలు అంటే ఏమిటి అవ్వా?" అన్నాడు రుద్రాంశ్.
"పుడకలు అంటే చితిమీద పేర్చే కట్టెలు. పుట్టుకతో వచ్చిన చెడు స్వభావం చితివరకు కూడా పోదనే భావంతో ఈ సామెతను అంటారు," అని రామవ్వ చెప్పింది.
రుద్రాంశ్ కాసేపు మౌనంగా ఉండి, "అంటే చివరివరకు తమ చెడు స్వభావాన్ని మార్చుకోలేని వాళ్లను ఉద్దేశించే ఈ సామెత చెబుతారన్నమాట!" అన్నాడు.
"అవును రుద్రా!" అంటూ లచ్చవ్వ అతని తల నిమిరింది.
సమాప్తం
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి కొన్ని ఇతర రచనలు:
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
కాశీవిశ్వనాథం పట్రాయుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన బాలసాహితీవేత్త, రచయిత, ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు నారాయణరావు (లేటు), లక్ష్మీనరసమ్మ. వృత్తిరీత్యా పాఠశాల సహాయకులు (ఆంగ్లం).
వివిధ పత్రికల్లో 500కు పైగా బాలల కథలు, 200 బాల గేయాలు, 300 కవితలు, 50 సాంఘిక కథలు, 10 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు 12 పుస్తకాలు ముద్రితమయ్యాయి. అనేక సంకలనాల్లో రచనలు చోటు పొందడంతో పాటు పలు రచనలు బహుమతులు పొందాయి.
సహస్ర కవిమిత్ర, సహస్ర లేఖా సాహిత్య మిత్ర, సహస్ర వాణి, శత స్వీయ కవితా కోకిల, శతశ్లోక కంఠీరవ, సూక్తిశ్రీ, కవి విశారద, వేగావతీ భారతీ, బాలకథా తపస్వి, సామెతల సామ్రాట్ తదితర బిరుదులు పొందారు.
గురజాడ పురస్కారం, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జాతీయ ఉత్తమ బాలసేవక్ పురస్కారం, జాతీయ విశిష్ట సేవా పురస్కారం, బాలమిత్ర పురస్కారం, పెందోట బాలసాహిత్య పురస్కారం, అష్టమ సాహితీ పురస్కారం, తపస్వి మనోహరం ఉత్తమ బాలకథా రచయిత పురస్కారం. తదితర గౌరవాలు అందుకున్నారు. 2020లో వికీపీడియాలో ప్రముఖ బాలసాహితీవేత్తల సరసన వీరి పేరు నమోదైంది.










Comments