'Radhaku Nivera Pranam' written by Muralidhara Sarma Pathi
రచన : పతి మురళీధర శర్మ
రాధ వారం రోజులుగా చూడని క్యాలెండరు వైపు చూసింది బితుకు బితుకుగా. తన పాలిట శత్రువైన తేదీ రానే వచ్చేసింది. మార్చ్ 3. ఆయన తిరిగి వెళ్ళిపోయే రోజు.
రాధ భర్త కృష్ణమూర్తిని ప్రమోషన్ మీద బెంగుళూరు వేసేరు. రాధ పిల్లల చదువుల మూలంగా విశాఖపట్నంలోనే ఉండిపోయింది. కృష్ణమూర్తి బెంగుళూరు వెళ్లి జాయిన్ అయి 3 నెలల తర్వాత వారం రోజులు సెలవు మీద వచ్చేడు. రాధ ఇన్నాళ్ళూ భరించిన ఒంటరితనం ఈ వారం రోజుల్లో మర్చిపోయింది. గతించిన 3 నెలల్లో నెలలు తరగడం లేదని క్యాలెండర్ పేజీలు చింపేయాలనిపించిన రాధకు ఈ వారం రోజులూ టేబుల్ క్యాలెండర్లో తేదీ మార్చాలన్నదే గుర్తుకు రాలేదు.
అప్పుడు కాలం వేగంగా గడిచిపోవాలని కాంక్ష అయితే ఇప్పుడు కాలం ఆగిపోతే బాగుండునని ఆకాంక్ష. గడియారంలో ముళ్ళు కదిలిపోతున్నాయని ఆరాటం. ట్రైన్ కు టైం అయిపోతుందని బెంగ. ఆయనకు స్వాగతం పలకడానికి వెళ్ళినప్పుడు తన మనసు లాగే ఆ స్టేషన్ కళకళలాడింది. అదే స్టేషన్ ఇప్పుడు వీడ్కోలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వెలవెలబోయింది. ఆ రోజు ట్రైన్ లేటని నిరాశ. ఈ రోజు ట్రైన్ లేటయితే బాగుండునని ఆశ. ఆ రోజు ట్రైన్ వస్తున్నట్లు స్టేషన్ లో అనౌన్స్మెంట్ ఇస్తే గంతులేసింది. ఈ రోజు అనౌన్స్మెంట్ ఇస్తుంటే కంట నీరు నింపింది పాపం. ఆ రోజు తమ ఇద్దర్నీ కలిపిన ట్రైన్ ఆత్మబంధువు కొంత మందిని విడదీసినా. ఈ రోజు తమ ఇద్దర్నీ విడదీస్తున్న ట్రైన్ పాషాణ హృదయం కల కఠినాత్మురాలు మరి కొంతమందిని కలుపుతున్నాసరే. ఆ నాడు తన కంఠం ఆనందంతో రాగాలు తీసింది. ఈ నాడు తన కంఠంఆవేదనతో మూగబోయింది. ఆ నాడు స్వాగతం పలకడానికి ట్రైన్ ని కనుచూపుమేరనుండీ చూస్తూ వచ్చింది సంతోషంతో. ఈ నాడు వీడ్కోలు చెప్తూ ట్రైన్ కనుమరుగయేవరకూ చేతులు ఊపుతూనే ఉంది విచారంగా. ఆ నాడు అదే వ్యక్తులు. అదే రైల్వే స్టేషన్. ఈ నాడు అదే వ్యక్తులు. అదే స్థలం. కాని సందర్భం వేరు. అది గ్రహించేది మనసొక్కటే.
రాధ ఇంటికొచ్చింది గాని అన్యమనస్కంగానే ఉంది. పిల్లలంటే ప్రాణం పెట్టే రాధ వాళ్ళేదో అడిగితే వాళ్ళ మీద చిరాకు పడింది. తిన్నగా వెళ్లి బెడ్ రూమ్ లో లైటయినా వెయ్యకుండా పక్కమీద వాలిపోయింది బరువెక్కిన మనసుతో.
"ఏమండీ! అక్కడకు వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తారు కదూ! ప్లీజ్ మర్చిపోకండి. ఏమండీ! మిమ్మల్నే!. . . . . . . . . . . . . . .
రాధ మాటలకు ఉలిక్కిపడి లేచేడు కృష్ణమూర్తి. రాధ నిద్రపోతోంది. నెమ్మదిగా తట్టి అన్నాడు "ఎవర్నీ ఫోన్ చెయ్యమంటున్నావ్?”
"ఇంకెవర్ని? మిమ్మల్నే!"నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. "ఏమండీ! మీరు. . . . బెంగుళూరు వెళ్ళలేదా?”
"ఎందుకు వెళ్ళలేదూ? వెళ్ళేను నీ కలలో. వీడ్కోలు చెప్పేసేవు కదా!”
"సారీ అండీ ! అన్నట్టు మీ ప్రయాణం రేపు కదా!" హాయిగా ఊపిరి పీల్చుకుని గువ్వలా ఒదిగిపోయింది కృష్ణమూర్తి ఒడిలో సిగ్గులమొగ్గయి.
( ఈ నా కథ తే. 15. 8. 2016 దీని “తెలుగు వేదిక"అంతర్జాల పక్ష (26 వ) పత్రికలో ప్రచురితమైనది. )
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి పరుగు తెచ్చిన ప్రమాదం ఎవరికెవరు ఏమవుతారో హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్ గురు దక్షిణ నేనూ మనిషినే అత్తారింట్లో దారేదీ ( హాస్య కథ ) యద్భావం తద్భవతి
రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం
Comments