top of page

రక్త సంబంధం రక్షా బంధనం పార్ట్ 2


'Raktha Sambandham Raksha Bandhanam Part 2/2' - New Telugu Story Written By Surekha Puli

'రక్త సంబంధం రక్షా బంధనం పార్ట్ 2/2' పెద్ద కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

గోపాల్, సుజన అన్నాచెల్లెళ్లు.

గోపాల్ మతాంతర వివాహం చేసుకొని కుటుంబానికి దూరం అవుతాడు.

తండ్రి గోపాలరావు పక్షవాతానికి గురవుతాడు.

సంఘ సేవకురాలు ఆండాళమ్మ గారి సహాయంతో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది సుజన.

పదేళ్ల తరువాత చెల్లెలి సాయంతో తల్లిని కలుస్తాడు గోపాల్.

కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయినందుకు కోపగించుకుంటుంది అతని తల్లి సుభద్ర.

తండ్రిని కలవాలని కోరుతాడు గోపాల్.


ఇక రక్త సంబంధం రక్షా బంధనం పార్ట్ 2 చదవండి..


పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో మొదటి సారి గోపాల్ భార్య గ్లోరిని చూసింది, వరుసకు వదిన. ఒక మోస్తరు అందగానే ఉంది. బొట్టు పెట్టుకుంటే ముఖంలో కళ వచ్చేదేమో.


స్కూల్ అడ్మినిస్ట్రేటర్ గా అందరి పేరెంట్స్ను పలుకరించి, వారి పిల్లల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి, ఒక నోట్ రాసి అందరి సంతకాలు తీసుకుంది. టీ, బిస్కెట్స్ ఆయాలు ఇచ్చారు.


ఎవరి వంతు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తే అందరికీ తృప్తి.


స్వాతంత్రర దినోత్సవ వేడుకలు అయ్యాక సుజన అమ్మతో పాటు దిలీసుక్ నగర్ లోని గోపాల్ ఇంటికి వెళ్ళింది. “గ్లోరీ హీలింగ్” డాక్టర్ పాల్ అని ఇంటి ముందు చెక్కిన పాలరాతి ఫలకం.


“వీడు పేరూ, మతమూ మార్చుకున్నాడు” అమ్మ నోరు ఆగలేదు.


వేయి గజాల స్థలంలో ఇల్లు, క్లినిక్ ఒకే చోట. గ్లోరి పేరెంట్స్ అడ్మిషన్స్ అండ్ నర్సింగ్ చూసుకుంటున్నారు. అన్ని చోట్లా క్రమశిక్షణ, శుభ్రత. ఇంట్లోకి అడుగు పెట్టగానే కనబడే బొమ్మ కరుణాత్మక తల్లి పొత్తిళ్లలో ఒదిగిన పాప. ఇన్డోర్ మొక్కలు, చిరుచేపల తొట్టి, అనుకూలమైన ఫర్నిచర్, విశాలమైన గదులు. గ్లోరి వాళ్లమ్మగారు టీ, స్నాక్స్ పెట్టారు. సుభద్ర ఏమి ముట్టుకోలేదు.


గోపాల్ చేతిలో గిఫ్ట్ పెట్టినది సుజన. ”మేము వెళ్ళాలి, మా వారు ఒక్కరే ఇంట్లో వున్నారు” అమ్మ అంటుంటేనే గిఫ్ట్ తెరిచాడు గోపాల్ అన్న. పది రాఖీలు! పది సంవత్సరాల ఎడబాటు సంకేతం!!.


సుభద్ర డ్రాయింగ్ రూమ్ నుండి కారిడార్ ద్వారా క్రింద చికిత్స కోసం వచ్చే పోయే జనాలను చూస్తుంది. ఏదో తృప్తి! ఎన్నో దెబ్బలకు ఓర్చుకున్నా, చివరికి కొడుకు డాక్టర్ గా రోగులకు సేవ చేస్తుంటే మనసు ఆహ్లాదంగా వున్నది.


“నీ పెళ్లి మూలన నాన్నఆరోగ్యం దెబ్బ తిన్నది, వైద్యానికి అమ్మ నగలు అమ్మాము, నేను రేస్ కోర్స్ లో టెంపరరీగా ఉద్యోగం చేస్తూ, ఓపెన్ యూనివర్సిటీలో చదువు సాగిస్తూ, ఇల్లు రెన్నోవేట్ చేయించి ఇదిగో ఇలా వున్నాము. ”


“గతం గతహా! ఇప్పటి నిర్ణయం విను, అమ్మానాన్న నాతోనే వుంటారు, ప్లీజ్ సుజీ, నువ్వే ఏదో విధంగా వాళ్ళని ఒప్పించు”


“సాద్యం కాని పనుల గురించి వూహించకు, వాళ్ళు రారు. నువ్వు మొండిగా ట్రై చేసినా, వాళ్ల గతాన్ని కెలినట్టు అవుతుంది. అమాంతంగా వచ్చి అమ్మానాన్నాల బాధ్యత తీసుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకోరు పైగా గతస్మృతులు బాధపెడతాయి. ”


మారు మాటలేదు. గోపాల్ కు ఏదో చేయాలని, అమ్మానాన్నలను, చెల్లెలిని ఏదో రీత్యా సంతోష పెట్టాలని, వాళ్ల బాధ్యతలో కొంత భాగం పంచుకోవాలని ఉబలాటగా వున్నది.


“నేను చేసింది పొరపాటే, కానీ సరిదిద్దుకునే అవకాశం లేదా?”


“ఎలా సరిదిద్దుకుంటావు?”

“నువ్వు నా రక్షా బంధనానికై పదిలంగా దాచిన పది రాఖీల పారితోషికాన్ని నీకు ఇవ్వాలి, వారి కోర్కె మేరకు నీకు మంచి వరుడ్ని చూడాలి ”.


“ఏమి వద్దు..” కన్నీళ్లకు నిలకడ లేక జారుకున్నాయి.


“అన్నా, నాకు పెళ్లి ముఖ్యం కాదు. మేము హాయిగానే వున్నాము, దయచేసి నా పెళ్ళి గురించిన ఆలోచన మానుకో. ”


మాటలు పెంచి మనసులు దుఃఖభరితం కావద్దని మౌనంగా ఉండిపోయారు.


***


మన పాత ఇంటి దగ్గరే అనుకున్నా, ఇక్కడ కూడా వినాయక చవితి వస్తుందనగానే చందాలు, పూజలు, అన్నదానాలు..” నాన్న మాట్లాడాటానికి ప్రయత్నిస్తున్నారు. సుజనకు చాలా ఆనందంగా ఉంది. అన్న విషయం నాన్న తో పంచుకుంటే, అమ్మొ! మళ్ళీ పక్షవాతం తిరగబడితే, వద్దు, అక్కడ అన్న, ఇక్కడ నాన్న, ఎవరికి వారే అపరిచుతులుగా మిగిలిపోతేనే మంచిది.


మెల్లగా నడుస్తూ రెండు చేతులతో చప్పట్లు కొట్టగల్గుతున్నారు మునుపటిలా అమ్మ దానధర్మాలు మానేసింది.


“టీవీలో చూడ్డమే కానీ ఒక సారి ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహాన్ని చూద్దాం సుజనా”.


“అమ్మా, ఈ తొమ్మిది రోజులు జనంతో రద్దీగా ఉంటుంది, అయినా ఎందుకో ఈ కోరిక, మళ్ళీ ఏమైనా దేవుడికి లంచం ఇచ్చి మంచి చేసుకుంటున్నావా?”


“మనము సామాన్య మనుషులము, కష్టాల్లో నిలదొక్కుకునే ధైర్యం, శక్తి యిచ్చాడు, అంతే చాలు. ఇంట్లో ప్రతీ రోజు పూజలందుకుంటున్న దేవుడిని సదా చూస్తున్నా సరే, పుణ్యక్షేత్రాల్లో వెలసిన భగవంతుని దర్శనానందం వేరేగానే ఉంటుంది. ”


అమ్మ కోరిక మేరకు అన్నతో సంప్రదించిగా, గోపాల్ టొయోట ఫార్చ్యూన్ కార్ ఉదయాన్నే తెచ్చి, కారు ఓనర్ మహర్షిని పరిచయం చేసి నాన్నకు ఎదురు రాకుండానే వెళ్ళిపోయాడు.


డ్రైవింగ్ పక్కసీటులో సుజన, వెనుక అమ్మా, సాయి చెరొక వైపు నాన్నని పట్టుకున్నారు. సిటీకి దూరంగా ఉన్న బాలాపూర్ వినాయకుడి దర్శనార్థం. విగ్రహ ప్రతిష్టకు సగం కిలోమీటరు దూరంలోని సెక్యురిటి కారుని ఆపేశారు. డ్రైవింగ్ సీట్ నుంచి దిగి మహర్షి తన ఐడి, గోవింద్ రావు గారి మెడికల్ రిపోర్ట్స్ చూపించి, పరాలిసిస్ పేషెంట్ అని నిర్ధారణ తరువాత కారును వినాయకుడి స్టేజీ వరకూ పోనిచ్చారు.


భగవంతుడిని ఏం మొక్కాలి, అన్నీ ఉన్నాయి. ఎంతో శ్రమతో నిర్మించిన అలంకరణ చూస్తూ ఉండిపోయింది సుజన. సూర్యోదయసమయం కనుక తొక్కిసలాట లేదు. తిరుగు ప్రయాణంలో అమ్మానాన్నల సంతృప్తి, “బాబూ నీ పేరేమిటన్నావు, ఎక్కడ ఉంటారు, ఏం ఉద్యోగము, మీ ఇల్లెక్కడ?” అమ్మ ప్రశ్నల పరంపర.


అన్నిటి జవాబు ఇచ్చి, “రష్ లేనందుకు తొందరగా వెళుతున్నాము. మీరు కొంచెము రెస్ట్ తీసుకున్న తరువాత వేరే చోట చూద్దాం. ” అని ఫ్లైఓవర్ ఎక్కి మెహదీపట్నం దాటగానే, “ఇక్కడే ఆనంద్ నగర్ లో మాఇల్లు”.


“మా ఇల్లు కూడా ఆనంద్ నగర్లోనే, కాకుంటే మీది ఖైరతాబాద్, మాది మలక్పేట్” నాన్న ఒక్కో అక్షరం ఎంతో ప్రయాసంతో చెప్పాడు.


“అందుకే మనము ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ” రుషి సమాధానం.


కిందంతా పార్కింగ్, పైన రెండూ ఫ్లోర్లు క్లినిక్, ఆపైన ఇల్లు, డాబా అంతా రూఫ్ గార్డెన్. మహర్షి, వాళ్ల నాన్న మహాదేవ్ గారిని పరిచయం చేసాడు. నిలోఫర్ హాస్పిటల్ రిటైర్డ్ పెడియాట్రిషన్. తెల్లగా మెరిసే బట్టతల, మరీ తెల్లటి లాల్చీ పైజామా. హుందాతనానికి నిర్వచనం. 24/7 ఇంటి మనుషులుగా ఉన్న ఓ జంట పనివాళ్ళు, మధ్యాహ్న భోజనాలు వడ్డించారు.


“రుషి, ఒకసారి వార్డు సడన్ విజిట్ చేసిరా. ” టీవీలో మాయాబజార్ సినిమా ఆన్ చేశారు మహాదేవ్. కొంచెంసేపు సినిమా చూసి మాటల్లోకి దిగారు. సమ వయస్కుల ముచ్చట్లకు సమయమే తెలియదు. సుజన మెడికల్ మ్యాగజైన్ చదువుతుంది. మహదేవ్ అన్నారు “గోవింద్ సర్, ఇంతటి సంతోషములో మీ కొడుకూ మీతో ఉండాలని లేదా?”


“ఎందుకు లేదు, ఉంది, కానీ వాడు రాడు, పది సంవత్సరాలు అయినా ఒక్కసారి కూడా మమ్మల్ని చూడ్డానికి రాలేదు”.


“మీరే అన్నారుగా, ఇల్లు మారి వేరే ఇంట్లో వుంటున్నారని, మరి కొత్త అడ్రస్ తెలియక రాలేదేమో. ”


గోవిందరావు పొందిక సమాధానం “అవును, నిజమే, కానీ మా గోపాల్ చేయాల్సిన సేవ నా కూతురు చేస్తుంది, అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. బాధ కాదు, సంతోషంగా కాలర్ ఎగరేయాలి, కూతురే కొడుకు అయినందుకు”.


సుభద్ర మౌనంగా వుంది, భర్త చాలా రోజుల తరువాత మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితుడు దొరికినందుకు, ఎంత తనవాళ్ళు యోగక్షేమాలు చూస్తున్నా, స్నేహితుల సాన్నిహిత్యం అవసరము.


సూర్యుడు చల్లబడ్డాక, పేరు గాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని చూడ్డానికి అందరూ వెళ్లారు. భక్తులందరికీ తొందరపాటు, క్రమశిక్షణ లోపించిన ప్రజ, ప్రసాదం పేరిట తొక్కిసలాటలో పులిహోర నేలపాలవుతున్నా పట్టించుకునే దానకర్తలు లేరు. క్షేమంగా ఇంటి వరకు వదిలి వెళ్ళాడు రుషి.


గతంలో జరిగిన సంఘటనలతో అవమానంగా బంధులందరికి దూరంగా ఉన్న అమ్మానాన్నాలు ఈరోజు ఆనందంగా బయటి ప్రపంచాన్ని చూడగలిగారు. ప్రత్యక్షంగా మహర్షి, పరోక్షంగా గోపాల్ సహాయంతోనే మనోవికాసం కల్గిందని అన్నకు థాంక్స్ చెప్పాక తెల్సింది, రుషి, గోపాల్ ఫ్రెండ్స్ అని.


ఎలాగైనా నాన్నాతో అన్నను కల్పించాలని సుజన అన్నను, పిల్లల్ని కూడా తనతోబాటు ఇంట్లోకి తీసుకొచ్చింది. గోపాల్ నాన్న కాళ్లు పట్టు కొని “క్షమించమని” ఏడ్చాడు.


‘గ్రాండ్ పప్పా’ అని పిల్లలకు చెప్పాడు. నాన్న పిల్లల్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నారు.


అమ్మ కళ్లనీళ్లు తుడుచుకుంది. “మీరే వచ్చారు మరి నీ భార్య ఏదీ?”


"వస్తుంది నాన్నా, మీరు సమ్మతిస్తే తీసుకొస్తాను. ”


“నేను నిమిత్తమాత్రుడను, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మతం మార్చుకున్నావ్, సంపాదన పరుడైనావు. ఎక్కడా నా ప్రమేయం లేదు. నువ్వు వద్దనుకున్నా, నాకు నా కొడుకు కావాలి కన్నపండూ!” అంటూ అన్నని గట్టిగా పట్టుకుని ఆగని కన్నీటికి ఆనకట్ట పగుల గొట్టారు నాన్నగారు.


“ప్లీజ్ నాన్నా, బాధ పడకండి” సుజన గోవిందరావు వీపుని పట్టుకొని ఓదార్చినది.


అంతటితో ఆగలేదు, "నేను స్వార్థపరుడుని కావద్దు, సుభద్ర లాగే భగవంతుడ్ని కోరికలు కోరుతున్నాను, సుజన పెళ్ళి, దాని పిల్లలు.. నన్ను తాతా అని పిలిపించుకునే భాగ్యం కావాలి నాకు. ”


సుజన “అలాగే, నా పిల్లలు తాతా అనే కాదు, మీరే వాళ్ళని ఆడించాలి, మంచి సభ్యత సంస్కారాన్ని నేర్పించాలి, మీరు ఉద్వేగ పడకండి”.


కొంత సేపటికి, పిల్లలు షోకేస్ లోని బొమ్మలు కావాలన్నారు. గోపాల్ “నో, బాడ్ మనర్స్” అంటూంటే, మెల్లిగా గోవిందరావు ఈజీ చైర్ లోనుండి లేచి అన్ని బొమ్మల్ని ఆడుకొమ్మని ఇచ్చి “నా బిడ్డలు తెల్లని పాలవంటి వారైతే నా మనుమలు కమ్మటి మీగడ వంటివాళ్లు, వాళ్లని కాదనే మూర్ఖడిని కాను. ”


మొదటిసారి పెళ్లి చేసుకోవాలి అనుకుంది సుజన.


ఆండాళ్ళమ్మ గారు గుర్తు కొచ్చారు. ఇంట్లో చెప్పకుండా, మిశ్రాగారి పెర్మిషన్ తో సగం స్కూల్ కాగానే వెళ్ళింది. అమ్మమ్మ కొంచెం సన్నబడ్డారు. సుజనను చూసి సంతోషపడ్డది. చాలాసేపు మనసు విప్పి మాట్లాడింది. అమ్మకంటే అమ్మమ్మ సాన్నిహిత్యం మధురంగా ఉంది. “రాజు ఫారిన్ నుండి వచ్చాడు, ఒకమారు పరిచయం చేస్తాను. ”

ఎన్నిమార్లు ఇంటికి వెళతానన్న, వెళ్లనీయలేదు.

రానే వచ్చాడు, రాకుమారుడు. ఒకసారి సుజన వైపు చూసి ప్రక్కగదిలోకి వెళ్ళాడు. అతని వెనుకగా అమ్మమ్మ వెళ్ళింది. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి. చాలాసేపు వాదన జరిగింది. సారాంశం రాజుకు మెడిసిన్ చదివిన అమ్మాయితోనే పెళ్లి కావాలి. అమ్మమ్మ వేయినూటపదహార్లు సుజన చేతిలో పెట్టింది. సుజనకు బాధ లేదు, అమ్మమ్మ బాధను అణచుకునే ప్రయత్నం చేసింది.


***


“నేనొక పెళ్ళి సంబంధం చూసాను, అబ్బాయి అన్ని విధాలా నాకు నచ్చాడు, నువ్వు సరే అంటే నాన్నతో ఒక మాట చెప్పి..”


“ఎవరమ్మా! బయట ప్రపంచమే తెలియని నీకెలా వీలైనది సంబంధం చూడ్డానికి?”


“డాక్టర్ మహర్షి”


అమ్మకు ఎలా తెలిసింది, తను పెళ్లి చేసుకోవాలని తల్చినట్లు ఆశ్చర్యపడి, “మనం సరే అనుకోవడం కాదు, అవతలి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. ”


“వాళ్ళే గోపాల్ని అడిగారట”

“అయితే నాన్నకు చెప్పమ్మా”. ఇంటి వెనుక పారిజాతం చెట్టు క్రింద గోవిందరావు సాయి చేత ఒళ్ళంతా నూనెతో మర్దన చేయించుకున్నాడు.


ఉదయించు సూర్యరశ్మి మానవ శరీరానికి ఎంతో అవసరం. సూర్యుడు మనిషికి కనబడే దేవుడు! సూర్యనమస్కారం మన దినచర్యలో భాగమే.


విషయాన్ని ఎవరు, ఎలా చెప్పాలో తెలియడంలేదు.

“గోపాల్ నాకు మీకంటే ముందుగానే ఈ శుభవార్తను చెప్పాడు, అందుకే నాఆరోగ్య సంరక్షణలో శ్రద్ధ తీసుకుంటున్నాను. " మనసు లోతుల్లోని ఆనందం.


“పద్దతి ప్రకారం వాళ్ళని ఒకసారి మనింటికి రమ్మనాలి. ” అమ్మ సూచన.


డాక్టర్ మహాదేవ్ గారు మొదలుపెట్టారు “ఇలా కలుసుకోవటం ఒక సంప్రదాయమే, కానీ కొన్ని మా స్వవిషయాలు మీకు తెలియలి. ”


రుషి కల్పించుకుని “డాడ్ మీరు ఎమోషనల్ కావద్దు, ఆర్ ఎల్స్ నేనే చెబుతాను”.


“నో, రుషి, నన్నే చెప్పనీ, నాకూ కొంచెం మనసు స్థిమితంగా వుంటుంది”


శ్రోతలందరూ ఆశ్చర్యపోయారు, ఏమైవుంటుందని.

“మా కుటుంబం చాలా పెద్డది, అటు హోదాలో ఇటు సంఖ్యలో కూడా.. ” నవ్వుతూ మొదలుపెట్టారు. “నేను మెడిసిన్ చదివే రోజుల్లో రుక్మిణి తో లవ్ మ్యారేజ్ అయింది. ఇద్దరిది సేమ్ కాస్ట్ సేమ్ స్టేటస్, కాని పెద్దల నిర్ణయాన్ని కాదన్నామని మమల్ని చేరదీయలేదు. మేమిద్దరమూ నిలోఫర్ హాస్పిటల్లో జాబ్ చేసేవాళ్లము, ఇప్పుడున్న ఇల్లు కొన్నాం, చాలా రోజుల తరువాత మహర్షి పుట్టాడు.


మా ఇద్దరు పేర్ల కలయక వీడి పేరు. బంధువులకు దూరంగా ఉన్నామనే ఫీలింగ్స్ లేకుండా సుఖంగా ఉన్న సమయంలో మొదటి పుట్టినరోజు చూడకుండానే రుక్మిణి కాన్సర్తో చనిపోయింది. సింగల్ పేరెంటుగా రుషిని పెంచాను. ఎంత ఆయాలు, పనిమనుషులు వున్నా నా బాబుని చాలా శ్రద్దగా క్రమశిక్షణతో పెంచాను. తద్దినం ఏటా ఒక్కసారి పెడతారు, కానీ నేను ప్రతీరోజూ రుక్మిణికి భోజనం పెట్టిన తరువాత నేను భోజనం చేస్తాను. లోకానికి రుక్మిణి లేదు కానీ మాతో సదా ఉంది. రుషి మెడిసిన్ అయ్యాక ప్రాక్టీస్ మొదలు కాగానే పెళ్ళి అనే ముసుగులో బంధువులు చేరువకాసాగారు. అందరూ ఉన్న ఒంటరి వాళ్ళము. ” ఆసక్తిగా వింటున్నారు.


రుషి అన్నాడు “మాకు మమ్మల్ని గౌరవించే, ఆత్మీయత పంచే కుటుంబీకులు కావాలి, అందుకే గోపాల్ సుజన గురించి చెప్పగానే సరే అన్నాను”.


గోవిందరావు మనసులో మాట చెప్పాడు “రుషి మాకందరికీ నచ్చాడు. ముఖ్యమైనా వాళ్లు ఉంటే చాలు, ఈ రోజుల్లో శ్రమ లేకుండానే హోటల్స్ లోనే పెళ్లిళ్లు, భోజనాలు, ఇరువైపుల వారి సమ్మతి ముఖ్యం. "


“నేను కొంచెం రుషిగారితో పర్సనల్ గా మాట్లాడాలి”. సుజన మాటలకు సుభద్ర అడ్డుకుంది. “ఏం మాట్లాడతావు, ఇక్కడే మా ముందు మాట్లాడు. ”


మహదేవ్ అన్నారు “వాళ్ళు పరస్పరం మాట్లాడుకోవడం చాలా మంచిది. "


ఇంటివెనుక వేపచెట్టు వద్ద కూర్చునే వీలుగా ఉన్న బండపైన కూర్చున్నారు. “సుజనా, యు అర్ ఫ్రీ.. ” మొదటిసారి దృష్టి సారించి రుషిని చూసి, బాగున్నాడు మనసులో అనుకుంది.


“మంచి సంగతులు ఎన్ని వున్నా, చేదు, ఐమీన్ చెడు సంగతులు నన్ను ఎప్పుడూ తొలుస్తూ ఉంటాయి, గోపాల్ అన్న మతాంతర పెళ్లి షాక్ తో నాన్న పక్షవాతం”.


“నాకు గోపాల్ చెప్పాడు.. ”


“అప్పులో రోడ్డన పడ్డ మా నిస్సహాయత.. ” గొంతు బొంగురు పోయింది.


“నాకు తెలుసు, ప్లీజ్ టాక్ సమథింగ్ డిఫరెంట్ రిలేటెడ్ టు బోథ్. ”


“రేస్ కోర్సులో పంచ్ ఆపరేటర్ గా డైలీ బేసిస్ జాబ్, విన్ అండ్ ప్లేస్ లో టికెట్ పంచింగ్, నా వర్క్ స్పీడ్ చూసి జాక్పాట్ సెక్షన్కు మార్చారు. అక్కడ మిశ్రా గారి దయతో స్కూల్లో జాబ్, మిశ్రా గారి వద్దనే లోన్ తీసుకొని ఇంటి రిపేర్..”


“ఇవన్నీ కామన్.. ” రుషికి వినాలని లేదు.


"స్కూల్లో మిశ్రా గారికి నాకు ఏదో లింక్ అని..రూమర్.. ”


“సుజన అనే, ఎడ్యుకేటెడ్, ఇంటెలిజెంట్ లేడీ.. అంతే నాకు తెలుసు, ప్లీజ్ లీవ్ ఆల్ నాన్సెన్స్”.


“నా పెళ్లి అయితే అమ్మానాన్న గోపాలన్న వద్దకు వెళ్ళరు, నేను వాళ్లని ఒంటరిగా వదలి.. సో మ్యారేజ్ తరువాత మీరు మా ఇంట్లో వుంటారా?”


“ఇల్లరికమా?”


“కాదు.. అవును.. అదే నేను మిమ్మల్ని డామినెట్ చేయను, మనతో పాటె నా పేరెంట్స్ వుంటారు, ఇది ఇల్లరికము కాదు. ”


“ఈ మాటలు సెపరేట్గా కాదు అందరి ముందు డిస్కషన్ చేద్దాం. ”


“అమ్మో.. వద్దు.. ”


“వై.. నీకు కనీసం ముగ్గురి తోడు వుంది, ఐఆమ్ విత్ సింగల్ రిటైర్డ్ డాడ్.. నువ్వూ, నీ పేరెంట్స్ మాతో ఉండండి, నాకు అమ్మ ప్రేమ దొరుకుతుంది, డాడ్స్ ఇద్దరూ ఒకే చోట, గుడ్ కంపెనీ..”

“మరి ఈ ఇల్లు.. ”


“లెట్స్ థింక్ గ్రాడ్యుయలీ”.


"మా వాళ్ళు ఒప్పుకోరు”.


“అడిగి చూద్దాం”.


ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. రుషి డైరెక్టుగా అడిగాడు “మా ఇద్దరిది కంబైన్డ్ క్వశ్చన్ మీ ఆన్సర్ కావాలి. "


“షూర్.. క్వశ్చన్ ప్లీస్” మహదేవ్ ఉత్సాహంగా అన్నాడు.

వివరించాడు రుషి.


సుభద్ర గోవిందరావులకు మాటలు దొరకలేదు.


మహదేవ్ “నెమ్మదిగా ఆలోచించి తెలియజేయండి. ”


“ఆలోచన దేనికి, అమ్మానాన్నా సుజనతో పాటు మీఇంట్లోనే వుంటారు. ” గోపాల్ చటుక్కున అన్నాడు.


“లేదు గోపాల్, పెద్ద వాళ్ళు, వాళ్ల నిర్ణయం మాకు ముఖ్యం. ” మహదేవ్ నిర్మొహమాటంగా అన్నారు.


గోపాల్ అందరికి జ్యూస్ అందించాడు. ఆమాట, ఈ మాటలు అయ్యాక వెళ్లిపోయారు.


“సుజనా, నీ కాబోయే భర్త, మామగారు ఇబ్బంది పెడుతున్నారు. మంచి సంబంధం వదులుకోలేము. ఆలోచించకుండానే ఇన్నాళ్లు జీవితం గడిపాము, ఇప్పుడు ఆలోచించే సమయం వచ్చింది, కాబోయే అల్లుడి మాట కాదనము. ” నిశ్చింతగా అన్నాడు గోవిందరావు.


పెళ్లి తరువాత ఆండాళ్ళమ్మ గారి ఆశీస్సులు తీసుకోవాలి అని డైరీలో రాసుకుంది సుజన. రాఖీల బహుమానం లభించింది.

========================================================================

సమాప్తం

========================================================================

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


42 views1 comment
bottom of page