రవ్వ కేసరి
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
youtube Video link

'Ravva Kesari' New Telugu Story
Written By Lakshmi Madan
రచన: లక్ష్మి మదన్
శ్రావణమాసం- నోములకి, వ్రతాలకి ప్రశస్తం. అందరిలోనూ పండగ వాతావరణం కొలువై ఉంటుంది.
శ్రీవల్లి కూడా పొద్దున్నే చాలా హడావిడిగా ఉంది. వంట, పూజ, నైవేద్యం.. అన్నీ కావాలి. పిల్లలకి, భర్తకి బాక్సులు సర్దాలి. అందుకే రోజు కన్నా ముందే లేచి స్నానం చేసుకుని వంట మొదలెట్టింది. త్వరగా అవుతుందని నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి, టమాటో పప్పు, అన్నం, చారు చేయడానికి సిద్ధపడింది.
ముందుగా వంట పూర్తి చే, దేవుడి పూజ చేసి, నైవేద్యం పెట్టేసింది. ఇంతలో పిల్లలు స్నానాలు చేసి స్కూల్ యూనిఫామ్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు.
"అమ్మా! త్వరగా అన్నం పెట్టు. స్కూల్ కి టైం అవుతోంది" అని కూతురు నీరజ, కొడుకు కార్తీక్ ఒకేసారి అడిగారు.
"పెట్టేస్తున్నా! ఒక్క ఐదు నిమిషాలు రా నాన్నా"అంటూ గబగబా ప్లేట్లలో పులిహోర, రవ్వ కేసరి పెట్టి ఇచ్చింది.
"ఎప్పుడు చూసినా పులిహోర, రవ్వ కేసరి.. ఇదే చేస్తావు" అని చిరాకు పడ్డాడు కార్తీక్.
తమ్ముడికి వంత పలుకుతున్నట్టుగా నీరజ కూడా ‘అవును’ అన్నట్లుగా తల ఊపింది.
శ్రీవల్లి "ఏం చేయను.. వుండీలేని సంసారం. అన్నీ చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో చాలా మంది ఉంటారు.... వచ్చిపోయేవాళ్లు.. ఇంత మందిని పోషించాలి. చిన్న ఉద్యోగం భర్త కి.. పాపం పిల్లలకి ఎన్నో తినాలని ఉంటుంది. ఏమీ చేసిపెట్టలేకపోతున్నాను" అని మనసులోనే బాధపడింది…
తర్వాత "అది కాదురా. ఇవైతే తొందరగా అయిపోతాయని.. మీకు స్కూలుకి లేటు కావద్దని ఇవే చేశాను" అని సర్దుబాటు చేసింది.
పిల్లలు గబగబా భోంచేసి టిఫిన్ బాక్సులు తీసుకుని స్కూల్ కి వెళ్ళిపోయారు. తర్వాత భర్తకు వడ్డించి, బాక్స్ సర్ది ఇచ్చింది. అతను మాత్రం ఏమీ కామెంట్ చేయకుండా తినేసి వెళ్లిపోయాడు.. ఎందుకంటే ఇంటి పరిస్థితి అతనికి తెలుసు కాబట్టి.. తర్వాత ఒక్కరొకరుగా భోంచేసి వెళ్లిపోయారు..
ఆ తర్వాత తీరికగా అన్నీ సర్దుకొని, పనులన్నీ చేసుకుని, ముత్తైదువులకు తాంబూలం మిచ్చుకొని, తను కూడా భోజనం చేసింది. కాసేపు నడుము వాలుద్దామని అలా పడుకుంది. పొద్దున సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంది.
పొద్దున రవ్వ కేసరిలో స్పూన్ పెట్టి కార్తీక్ "అమ్మా! ఇందులోంచి స్పూన్ రావడం లేదమ్మా" అని అన్నాడు.
"నువ్వు మరీ.. నా రవ్వ కేసరికు వంక పెట్టకు రా" అని అన్నది శ్రీవల్లి.
"కావాలంటే నువ్వు చూడు" అని చెంచాను బలవంతంగా లాగినట్లు చేసి చూపించాడు కార్తీక్.
అది చూశాక నీరజ, కార్తీక్, శ్రీవల్లి.. ముగ్గురూ నవ్వుకున్నారు. ఇంతలో భర్త వేణు వచ్చి "ఏమైంది? మీరే నవ్వుకుంటున్నారు.. నాకు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా" అన్నాడు.
విషయం చెప్పాడు కార్తీక్.
అప్పుడు "మీ అమ్మ వంట ఎప్పుడు బాగా చేసిందని" అని వెక్కిరింపుగా ఎప్పటిలానే చురుక్కుమనిపించేలా మాట్లాడాడు.
ఇలా శ్రీవల్లి ఏ పండుగ వచ్చినా రవ్వ కేసరి లేదా సేమియా చేస్తుంది. సేమియా బాగా చేస్తుంది. కానీ రవ్వ కేసరి మాత్రం ఎన్నిసార్లు చేసినా ఇలాగే కుదురుతుంది. ఎన్నోసార్లు అనుకుంది.. ‘ఎందుకు నాకు రవ్వ కేసరి చేయడం రావడం లేదు’ అని. అయినా దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు శ్రీవల్లి చేసుకునేది. అప్పుడు కూడా ఇలాంటి రవ్వ కేసరినే....
ఇలా ఏళ్ళు గడిచిపోయాయి. పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. రవ్వ కేసరి గట్టితనం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మరింత రాయిలా అవుతుంది తప్ప నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మాత్రం కుదరడం లేదు... చివరికి ఆ రవ్వ కేసరిని పని మనిషికి ఇవ్వాలన్న భయపడే పరిస్థితి వచ్చింది..
ఒకసారి ఇలాగే పనిమనిషికి ఇస్తే "ఏందమ్మా గిది.. గా కాయితాలు అంటుపెట్టేదా?" అని అన్నది.
" కాదే అది స్వీటు" అన్నది.
"ఓయమ్మో గిది స్వీటా? నేనెప్పుడూ గీసువంటిది తినలే. నాకొద్దు అమ్మ" అన్నది.
"కార్తీక్! రవ్వ కేసరి చేస్తున్నారా "అని చెప్పింది
"వామ్మో మళ్లీ రవ్వ కేసరినా? వద్దమ్మా ఇంకేదైనా చెయ్" అని భయంగా మొహం పెట్టి అన్నాడు ఇంట్లో అందరూ నవ్వడం మొదలుపెట్టారు.
కార్తీక్ అన్నాడు "నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ రవ్వ కేసరి ఆర్డర్ చేసుకుంటే నేను నవ్వుకున్నాను. రవ్వ కేసరి కూడా ఆర్డర్ చేసుకొని తింటారా అని. కానీ అక్కడ తిన్న తర్వాత ‘అబ్బా! ఇంత అద్భుతంగా ఉంటుందా’ అని అనుకున్నాను. నాకు ఇంట్లో రవ్వ కేసరి గుర్తొచ్చి అట్లా రాయిలా ఉంటుందేమో అనుకున్నా. కానీ ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. మన ఇంట్లో మాత్రం అదే బండరాయి" అన్నాడు..
ఉక్రోషంతో శ్రీవల్లి ఈసారి యూట్యూబ్లో చూసుకుని కరెక్ట్ గా అదే పద్ధతిలో చేసింది. దేవుడి నైవేద్యం అయిన తర్వాత అందరికీ గిన్నెలో వేసి ఇచ్చింది.
కార్తీక్ మాత్రం"నన్ను వదిలేయ్ అమ్మ” అన్నాడు.
"ఈ ఒక్కసారి తిని చూడు. మళ్ళీ అడగను" అని అంది శ్రీవల్లి.
‘సరే’ అని మొహం రకరకాలుగా పెట్టుకొని నోట్లో ఒక స్పూన్ రవ్వ కేసరి వేసుకున్నాడు. మొత్తం ముఖ కవళికలు మారిపోయాయి.
"అమ్మా! చాలా అద్భుతంగా ఉందమ్మా. నిజంగా చెప్తున్నా. ఇంత బాగా చేస్తావని అనుకోలేదు. అయినా రవ్వ కేసరి నేర్చుకోవడానికి నీకు 30 ఏళ్లు పట్టిందా అమ్మా" అని అన్నాడు.
ఇంట్లో అందరి నవ్వులతో పువ్వులే విరిసాయి. మొత్తం మీద శ్రీవల్లి రవ్వ కేసరి కథ సుఖాంతం అయింది.
***శుభం ***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మా నాయనమ్మ - మొదటి భాగం *ఉప్పుడు పిండి*

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి
కలం పేరు : లక్ష్మీ మదన్
హైదరాబాద్ లో ఉంటాను.
500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.