రీల్స్ - రియల్ లైఫ్

Reels - Real Life - Telugu Social Story | Chalapaka Brahmaji
రీల్స్ - రియల్ లైఫ్ - తెలుగు సామాజిక కథ| చలపాక బ్రహ్మాజీ
Published in manatelugukathalu.com on 27/11/2026
రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే యువతకు “రీల్స్ మారిపోవచ్చు, కానీ రియల్ లైఫ్ ఒక్కటే” అనే సందేశాన్ని అందించే హృదయస్పర్శి కథ ఇది. తల్లిదండ్రుల ప్రేమ, ప్రాణ భద్రత విలువను ఆలోచింపజేసే సామాజిక అవగాహన కథ.
సాయంత్రం ఐదు గంటలకు ప్యాసింజర్ ట్రైన్ నిలబడి ఉంది. గార్డు గ్రీన్ ఫ్లాగ్ చూపించాడు. ట్రైన్ కదిలింది.
లోపల వెళ్ళడానికి స్థలమున్నా డోర్ దగ్గర నలుగురు కుర్రాళ్ళు వేలాడుతున్నారు. ఇంకొకడు ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. వారంతా నవ్వుతున్నారు.
అంతా చూస్తున్న అరవై ఏళ్ల పెద్దాయన - "బాబూ, లోపలికి రండి" అన్నాడు.
"అంకుల్, మీకు తెలియదు. ఇది రీల్స్" అని నవ్వారు.
ఆ నవ్వు విన్న పెద్దాయన గుండెలో ఏదో కలుక్కుమంది. ఎందుకంటే ఆ నవ్వు వెనుక, వాళ్ళకి తెలియని ఒక భయం ఆ పెద్దమనిషిలో కలిగింది. వాళ్ళల్లో ఎవరు చనిపోయినా ఆ తల్లి ఎలా ఏడుస్తుందోనన్న ఆలోచన వారిలో లేదు.
వాళ్ళ సరదా వారిది.
కొండల మధ్య పాములా వంపులు తిరుగుతూ వేగంగా వెళ్తోంది. ఒక చోట వంపు తిరుగుతున్నప్పుడు కంబీ పట్టుకొని వేలాడుతున్న ఒక కుర్రాడి చేయి జారినట్లయింది. చూస్తున్న వారి గుండె ఝల్లుమంది.
మరో క్షణం ఇంకొకడు పట్టుకొన్నాడు. కానీ ఆ కుర్రాడు మాత్రం - "అది కూడా వీడియోలో వచ్చిందా?" అని నవ్వాడు.
చూస్తున్న ఆ పెద్దమనిషికి కోపం రాలేదు. జాలి వేసింది. ఎందుకంటే ఆ కుర్రాడు నటించినా, ఇంకొకడు పట్టుకొనడంలో క్షణం ఆలస్యమైనా పడిపోయి ఉండేవాడు. వాడు చావు చివరి అంచు వరకు వెళ్లి తప్పించుకున్నాడు అనుకొన్నాడు బాధగా.
స్టేషన్ రావడం చూసి అందరూ బోగీ లోనికి వచ్చారు. ఎందుకంటే స్టేషన్ ఆర్.పి.ఎఫ్. (RPF) చూశాడంటే పట్టుకొంటాడు.
"నీ పేరేమిటి బాబూ?"
"అర్జున్" అన్నాడు.
"అర్జున్, మీ స్నేహితుడు నిన్ను పట్టుకొనడంలో ఒక్క క్షణం ఆలస్యమైనా నీవేమయ్యేవాడివో తెలుసా?"
సమాధానం చెప్పడానికి తడబడ్డాడు.
"మీ అమ్మ నీ కోసం ఇంట్లో ఏం చేస్తుంటుంది తెలుసా?" మరలా అన్నాడు.
అర్జున్ మౌనంగా ఉండిపోయాడు.
"మీ అమ్మ ఇప్పుడు వంట చేస్తూ, గడియారం చూస్తూ ఉంటుంది. 'నా కొడుకు ఈ రాత్రి ఏడు గంటలకు ట్రైన్ దిగి ఆకలితో ఇంటికి వస్తాడు. వాడికి ఇష్టమైన కూర చేశాను' అని అనుకుంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడ పడిపోయి ఉంటే, ఆ వంట చల్లారిపోతుంది. ఆ తల్లి జీవితాంతం జీవచ్ఛవంలా బతుకుతూ చస్తుంది."
ఆ మాటలకి అర్జున్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఆ పెద్దమనిషి మరలా, "నేను మా నాన్నని చివరిసారి చూడలేకపోయాను. ఎల్లుండి ఉదయం వస్తానని చెప్పి వెళ్లారు. అమ్మ ఉదయం టిఫిన్ చేసింది.
అందరం కలసి తింటాము అంది. మా నాన్న వస్తారని నేను, అమ్మ ఉదయాన్నే ఎదురుచూడసాగాము. ఆయన మా ఇంటికి రాలేదు.
రోడ్డు ప్రమాదంలో పైలోకానికి వెళ్లారు. ఆ బాధ నాకు జీవితాంతం ఉంది. ఇంకా మా అమ్మ మానసికంగా కోలుకోలేదు. ఇప్పుడు మీ అమ్మ కూడా నీ కోసం ఎదురుచూస్తుంది.
నువ్వు ఒక్క నిమిషం రీల్ కోసం, లేని సాహసం చేసి మీ అమ్మ గుండెల్లో మంటలు పెడతావా? ప్రమాదం వేరు, పిచ్చి సాహసం వేరు. నీవు చేసింది సాహసం అనరు" చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు.
ట్రైన్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ కుర్రాళ్ళు తల దించుకున్నారు.
ఆ రాత్రి అర్జున్ ఇంటికి వెళ్ళాడు. తల్లి అన్నం పెట్టింది. అర్జున్ అన్నం తినకుండా, తల్లిని చూస్తూ ఉండిపోయాడు.
"ఏమైందిరా, రోజూలా లేవే?" తల్లి అడిగింది.
అర్జున్ తల్లి చేతులు పట్టుకున్నాడు - "అమ్మా, నేను ఈ రోజు ట్రైన్‌లో రీల్ కోసం ఒక సాహసం చేశాను.
కంబీ పట్టుకొని వేలాడుతున్నట్లు, జారిపడిపోతున్నట్లు, వెంటనే పక్కనున్నవాడు పైకి లాగినట్లు తీశాము. ఒక్క క్షణం ఆలస్యమయి ఉంటే నేను చనిపోయే ఉండేవాడిని.
అంతవరకు ఆ సంఘటన చూసిన ఒక పెద్దమనిషి మాకు బాగా గడ్డి పెట్టాడు" అన్నాడు.
తల్లి ఒక్క క్షణం స్తబ్దుగా ఉండిపోయింది.
తర్వాత అర్జున్‌ని గట్టిగా కౌగిలించుకుని, ఏడ్చేసింది - "నా కొడుకు లేకుండా నేను బతకలేనురా. నువ్వు నాకు కావాలి.
నీ రీల్స్ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు ఏమిట్రా? మీ నాన్న తాగుడికి బానిసై మరణించాడు. మీ నాన్న లేకున్నా నేను నీకోసం బ్రతుకుతున్నానురా. నీకేమైనా అయిందంటే మరుక్షణమే నేను బతకనురా" అంటూ బోరుమని ఏడుస్తూ చెప్పింది.
ఆ రాత్రి అర్జున్ తన ఫోన్‌లో ఉన్న ఆ వీడియోని డిలీట్ చేశాడు.
"సాహసోపేతమైన రీల్స్ చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగినా, మరణించినా రీల్స్‌లో లైక్స్ కొట్టేవాళ్ళు ఒక్క రోజు బాధపడి మర్చిపోతారు.
కానీ తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తారు. పిచ్చి సాహసం వైపు వెళ్లకుండా సున్నితమైన హాస్యంతో, అవగాహన కలిగించే రీల్స్ తీద్దాం" అని తన స్నేహితులందరికీ మెసేజ్ చేశాడు.
మరుసటి రోజు అదే ట్రైన్‌లో కంబీ పట్టుకొని ఎవరూ వేలాడలేదు, అదే కుర్రాళ్ళు. ఈసారి డోర్ దగ్గర కాదు, లోపల కూర్చున్నారు.
రీల్స్ అంటే 30 సెకన్లు. రియల్ లైఫ్ అంటే జీవితాంతం.
రీల్స్‌లో నీకు లైక్ కొట్టేవాడు నిన్ను గుర్తుపెట్టుకోడు. కానీ ఇంట్లో నీ అమ్మ నీ కోసం జీవితాంతం ఎదురుచూస్తుంది.
ప్రాణాన్ని పణంగా పెట్టి తీసే రీల్ సాహసం కాదు, అది పిచ్చి సాహసం.
నిజమైన సాహసం అంటే - ప్రాణాన్ని కాపాడుకోవడం, తల్లిదండ్రులని నవ్వించడం, ఇంకొకరికి మంచి చెప్పే రీల్ తీయడం.
రీల్స్ మారిపోవచ్చు, కానీ రియల్ లైఫ్ ఒక్కటే. దాన్ని కాపాడుకుందాం.
(సమాప్తం)
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
చలపాక బ్రహ్మాజీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చలపాక బ్రహ్మాజీ
నా పేరు చలపాక బ్రహ్మాజీ.
నేను చెన్నైలో ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్ గా పనిచేస్తున్నాను.
నా స్వస్థలం విశాఖపట్నం.
నేను B.A B-Ed చదివాను. B.A. లో స్పెషల్ తెలుగు చదివాను.
ఇది కథలు రాయడంలో నా మొదటి ప్రయత్నం.
యువ రచయితలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.










Comments