top of page

రెక్కలొచ్చిన పక్షి

Writer's picture: Lakshmi Sarma BLakshmi Sarma B

'Rekkalocchina Pakshi' written by Lakshmi Sarma B

రచన : B. లక్ష్మీ శర్మ


కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం.

అంటూ ప్రతిరోజు వెంకటేశ్వరస్వామి సుప్రభాతం చదివి ఆయనను నిద్రలేపకుండా ఏ పని ముట్టదు సావిత్రి. తలారా స్నానం చేసి ముఖానికి పచ్చటి పసుపు పూసుకుని, నుదుటన రూపాయి బిళ్ళంత బొట్టుపెట్టుకుని, చేతులనిండా గాజులు కాళ్ళకు పసుపు గల్లుగల్లున గజ్జెలు చప్పుడు కాగా ఇల్లంతా తిరిగి ధూపం వేస్తుంది. ఎవరైనా సావిత్రిని చూస్తే లక్ష్మిదేవి తిరుగుతుందేమో అనుకుంటారు.అంత అందంగా వుంటుంది.దేవుడి పూజ అయ్యాక భర్తను నిద్ర లేపుతుంది.

“అబ్బా సావిత్రీ, ఇంట్లో ఊపిరాడకుండా చేస్తున్నావు నీ ధూపంతో, ఒక్కరోజైనా విశ్రాంతి ఇవ్వవా ఆ దేవుడికి. తెల్లవారకముందే నిద్రలేపుతావు, పోని అంటే ఈ ధూపం ఒకటి. పాపం ఆ దేవుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో ? అయినా ఏమిటోయ్ నీకు ఈ మధ్యలో చాదస్తం మరీ ఎక్కువయింది” అంటూ భార్య వెనుకాల నడుచుకుంటు వచ్చాడు ప్రభాకర్.

“అయ్యో రామ! అలా అనకండి, అపచారము” అంటూ రెండు చెంపలు వాయించుకుంది.

“సరేలే, నీ ఇష్టం.. నీ దేవుడిష్టం.. మధ్యలో నాకెందుకులే కానీ, నా ముఖాన ఇంత కాఫీ నీళ్ళు ఏమైనా ఇస్తావా లేక ఇంకా పూజచేస్తూనే వుంటావా? అవును.. నీకు ఇంకో విషయం తెలుసా?” అంటూ భార్య ముఖంలోకి చూసాడు ప్రభాకర్.

“ఏమిటండి? ఆ విషయం చెప్పండి” అంటూ కలువ రేకులవంటి కళ్ళను రెపరెపలాడించింది ఆశ్చర్యంగా ప్రభాకర్ వైపు చూస్తూ.

“ అదేనోయ్! భర్తనే వాడిని ఎంత బాగా చూసుకుంటే, ఆ భగవంతుడు కూడా అంత సంతోషిస్తాడట. అంతే కాదోయ్, ఏడు జన్మలవరకు నేనే నీ భర్తగా వుంటానట తెలుసా” అని ఉడికించాడు .

“ఆ హా.. మాకు తెలుసండి. అబ్బో ఈ జన్మకు చాలదన్నట్టు, ఇంకా ఏడు జన్మలే! అమ్మ బాబోయ్.. నా వల్లకాదు మిమ్మల్ని భరించుకోవడం” మూతి తిప్పుతూ చురక అంటించింది.

“అదేమిటోయ్ ఒక్కజన్మకే ముఖం మొత్తేసిందా, పోనిలే ఇంకా నయం నన్నే కావాలంటావేమోనని భయపడ్డాను. నాకు మాత్రం నాజూగ్గా చలాకిగా వుండేవాళ్ళంటే ఇష్టం.” క్రీగంట భార్యను చూస్తూ అన్నాడు.

“అంతేలెండి! మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా మీకు మాత్రం నేను నచ్చలేదు. అయినా మీకేం తక్కువచేసాను? ఆ భగవంతుని కంటే మిమ్మల్నే ఎక్కువగా చూసుకున్నాను. కాకపోతే ఆయనకు ధూపం వేస్తున్నాను, మీకు వెయ్యడం లేదు. అంతే తేడా” అంటూ ప్రభాకర్ చెవి మెలేసింది సావిత్రి.

గభాల్న రెండు చేతులతో సావిత్రిని దగ్గరకు లాక్కున్నాడు.

“అబ్బా.. ఏమిటండి. స్నానం లేదు ఏమి లేదు. ఇంత పొద్దుటే ఈ సరసాలేంటి? మీకు వయసు వచ్చింది కానీ అల్లరిపోలేదు” అని భర్త పట్టు విడిపించుకోసాగింది.

“బాగుందోయ్ నీ వరస, నేనేదో పరాయి ఆడవాళ్ళను పట్టుకున్నట్టు విసుక్కుంటున్నావు. నా భార్యనే కదా అని సరసాలాడడం కూడా తప్పేనటోయ్. అయినా ఎవరు చెప్పారు నీకు సరసానికి కూడా సమయం వుంటుందని. ఇంకా ఏమన్నావు ? నాకు వయసు వచ్చిందనా, ఎంతనుకున్నావేమిటి? మహా అయితే యాభై! అంతే కదా ! ఆ మాత్రం వయసుకే ముసలాళ్ళం అయిపోతామేంటి, అయినా సావిత్రీ , వయసు వచ్చింది శరీరానికి గాని మనసుకు కాదోయ్” అంటూ ఇంకా గట్టిగా అదుముకుని ముద్దుపెట్టుకున్నాడు భార్యను.

“అయ్యా మహాప్రభు , అయిందా తమరి ఉపన్యాసం. మీతో వితండవాదం పెట్టుకోలేను గాని, వెళ్ళి స్నానం చేసిరండి” అతన్ని విడిపించుకుని దూరం జరుగుతూ అంది.

అదికాదు సావిత్రీ, నిన్ను చూస్తుంటే రోజురోజుకు అందంగా కనిపిస్తున్నావు. మన పెళ్ళినాటి కంటే, ఇప్పుడే ఎంత అందంగా వున్నావో తెలుసా, నీకు వయసు పెరుగుతున్నా నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది నన్నేం చెయ్యమంటావు” అంటూ దగ్గరకు రాబోయాడు.

అమాంతంగా ఆమడదూరం జరిగింది సావిత్రి.

“సావిత్రీ! అసలు ఏమిటో నీ రహస్యం నాకు చెప్పవా ? నువ్వు ఇద్దరి పిల్లల తల్లివి, పైగా నాయనమ్మవు, అమ్మమ్మవు కూడా అయ్యావు. నీతో నేను బయటకు వస్తే, తెలియని వాళ్ళు మీ అమ్మాయా అని అడుగుతున్నారు. నాకు కూడా చెప్పొచ్చుకదా ఆ రహస్యం” అంటూ వాపోయాడు ప్రభాకర్.

“చాల్లెండి సంబరం! నన్ను ఆట పట్టించడానికి కాకపోతే, ఎవరు నమ్ముతారు మీ మాటలు” అని ముసిముసిగా నవ్వుతూ ప్రేమగా భర్త తల నిమిరింది.

“ఏమండి! మీకు తెలియని రహస్యాలు నా దగ్గర ఏముంటాయి చెప్పండి, ఆ భగవంతుడు నాకు అందమైన భర్తను ఇచ్చాడు. నా ఆలనాపాలన చూసుకుంటాడు, కష్టమంటే ఏమిటో తెలియనివ్వలేదు.నా మనసును తన మనసుగా చేసి పదిలంగా చూసుకుంటాడు.చక్కటి పిల్లలనిచ్చాడు , నా కాలికి ముల్లు గుచ్చుకుంటే తనకే గుచ్చినంతగా బాధపడతాడు. నా ఒంట్లో బాగోకపోతే తనే పస్తులుంటాడు నాకు తగ్గేవరకు. ఇంత మంచి భర్త వుండగా , నేను అందంగా వుండకపోతే ఎలా వుంటాను చెప్పండి. మీకు రోజురోజుకు నా మీద ప్రేమ ఎలా పెరిగిపోతుందో మీకోసం నా అందం అలా పెరుగుతుందేమో కదా ! అంతేనంటారా” అంటూ తన రెండు చేతులతో భర్త చుబుకం పట్టుకుని అతని కళ్ళళ్ళో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది గారాబంగా సావిత్రి.

ఆమాంతంగా హృదయానికి హత్తుకున్నాడు. “సావిత్రి! నేనెంత అదృష్టవంతుడిని? ఇంత మంచి భార్యను ఇచ్చినందుకు ఆ దేవుడికి జన్మంతా ఋణపడి ఉంటా. సావిత్రీ! నిజానికి మన పెళ్ళి అయినప్పటి కంటే ఇప్పుడే హాయిగా వున్నామేమో అనిపిస్తుంది. పిల్లల హడావుడి తగ్గింది, నేను డ్యూటికి వెళ్ళే గోలలేదు. పిల్లలు పెద్దవాళ్ళయి రెక్కలు వచ్చిన పక్షుల్లా వెళ్ళిపోయారు. నాకు నువ్వు నీకు నేను హాయిగా వున్నాము కదా సావిత్రీ” అడిగాడు.

మనసు లోతుల్లో ఎంతో బాధగా వున్నా పైకి మాత్రం ఇద్దరు ఆనందంగా వున్నట్టే వుంటారు. ఒకరికి తెలియకుండా ఒకరు కడుపున పుట్టిన పిల్లలకోసం బాధపడని రోజంటూ వుండదేమో. కాలింగ్ బెల్ మ్రోగడంతో ఇద్దరు తన్మయత్వం నుండి బయటపడ్డారు. గబుక్కున వెళ్ళి తలుపుతీసాడు ప్రభాకర్.

ఎదురుగా వున్న అబ్బాయిని చూస్తూ, “ఒరేయ్ సత్యం నువ్వట్రా, అబ్బ ఎంతకాలమైందిరా నిన్ను చూసి” అంటూ ఆనందంతో అక్కున చేర్చుకుని, లోపలకు వస్తూ “సావిత్రీ! ఎవరు వచ్చారో చూడు అని గట్టిగా కేకవేసాడు .

మంచి నీళ్ళు, కాఫీ కప్పులతో వచ్చింది సావిత్రి. ‘ఏమండీ! మన సత్యమండి.’ ఏరా ఇన్నాళ్ళకు గుర్తుకు వచ్చామా? ఈ అమ్మా నాన్నలను మర్చిపోయావా? ఇన్నాళ్ళుగా ఏమైయిపోయావు, ఎక్కడున్నావు?” ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తూనే తలనిమురుతూ ఆప్యాయంగా అడిగింది ప్రక్కనే కూర్చుంటూ.

“అమ్మా.. క్షమించమ్మా! రాలేకపోయాను. అన్నయ్యలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇన్నాళ్ళు మీకు దూరంగా వున్నాను కానీ , ఇక నా వల్లకాలేదమ్మా! అందుకే వచ్చేసాను. పూర్తిగా మీ కొడుకులా వుండిపోవడానికి. మాష్టారు అమ్మా మీరిద్దరు ఇలా కూర్చోండి మీ కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి” అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, తను తెచ్చిన పట్టుచీర పట్టుపంచెలు ఇద్దరికి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసాడు సత్యం.

“ఓరేయ్ ఏమిట్రా! ఇప్పుడివన్నీ ఎందుకు? నువ్వొచ్చావు మాకది చాలదూ” అంటూ ఆప్యాయంగా లేవనెత్తాడు ప్రభాకర్ సత్యాన్ని. సావిత్రి కళ్ళు ఆనందంతో చెమర్చాయి.

“మాస్టారూ! ఉడుతా భక్తిలా, చంద్రుడికి ఓ నూలుపోగులా నా చిన్ని కానుకను

స్వీకరించండి” అని వేడుకున్నాడు సత్యం.

“ఆ. ఇప్పుడు చెప్పరా సత్యం. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, పెళ్ళి చేసుకున్నావా? పిల్లలెందరు? అన్ని విషయాలు చెప్పు” అడిగాడు ప్రభాకర్ కాఫీ తాగుతూ .

“చెబుతాను మాష్టారూ ! అమ్మా.. మీరు కూడా కూర్చోండి, నా కథ వినరూ” అడిగాడు సత్యం లోపలకు వెళుతున్న సావిత్రిని వుద్దేశించి.

“ఎందుకు వినను , కాకపోతే టిఫిన్ తయారుచేసి తినుకుంటూ విందామని. ఎప్పుడు బయలుదేరావో ఏమో ఆకలేస్తుంది కదా” అంది సావిత్రి.

“అమ్మా! మిమ్మల్ని చూస్తూనే కడుపునిండిపోయింది. నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా వుందో మాటల్లో చెప్పలేను మాష్టారూ!” అన్నాడు కళ్ళనీరు తుడుచుకుంటూ.

ప్రభాకర్ మూతి ముడుచుకున్నాడు తనకు కాదు చెబుతున్నది అన్నట్టుగా అటువైపు తిరిగాడు.

“ఏమైంది మాష్టారూ, అటువైపు తిరిగారు? నా మీద కోపం ఇంకా పోలేదా మీకు” అడిగాడు సత్యం.

“లేకపోతే ఏమిటి? ఆవిడేమో అమ్మట నేనేమో మాష్టారునా? నన్ను నాన్న అని పిలవొచ్చు కదా!”అని బుంగమూతి పెట్టాడు చిన్నపిల్లాడిలా.

సావిత్రికి ఒకవైపు నవ్వురాగా మరో వైపు పిల్లలు గుర్తుకు వచ్చి దుఃఖం తన్నుకొచ్చింది.

“నాన్నా! నాకు ఆ అధికారం ఇస్తున్నారా?” అంటూ ఆనందంతో ప్రభాకర్ రెండు చేతులుపట్టుకుని కళ్ళకద్దుకుంటూ, “నాన్నా! నేను మీ దగ్గరనుండి వెళ్ళాక చాలా కష్టాలుపడ్డాను. పిడకెడు తిండి దొరకక, వుండడానికి జానెడు చోటు లేక నానా అవస్తలు పడ్డాను. వుద్యోగం చేద్దామంటే అప్పటికింకా నా చదువు పూర్తవలేదు. ఎలాగోలా ఇంజనీరింగ్ కష్టపడి పూర్తి చేసాను. ఇప్పుడు మంచి వుద్యోగం వచ్చింది అందుకే మీ దగ్గరకు వచ్చాను. నేను మీ మీద భారపడకూడదని వుద్యోగం వచ్చేవరకు నా ముఖం మీకు చూపెట్టకూడదనుకున్నాను. అందుకే ఇన్నాళ్ళు ఆగవలసివచ్చింది. నన్ను క్షమించండి” అని రెండు చేతులు జోడించాడు సత్యం.

సావిత్రికి కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి.

“అంటే నువ్వు సంపాదించి తెస్తేగాని నీకు తిండిపెట్టలేని పరిస్తితి

వుందనుకున్నావా మీ నాన్నకు?” నిష్టూరంగా అన్నాడు ప్రభాకర్.

“అలా బుద్దిపెట్టండి వాడికి” అంటూ కళ్ళు తుడుచుకుంది సావిత్రి.

“నాన్నా! నేనొకటి అడుగుతాను నిజం చెబుతారా” అడిగాడు సత్యం.

“సత్యం! నువ్వడిగేదేమిటో నాకు తెలుసు. పిల్లలెవరు కనిపించడం లేదనేగా? వాళ్ళెప్పుడో మమ్మల్ని విడిచివెళ్ళిపోయారు. వాళ్ళకు మేమంటూ వున్నామన్న సంగతి కూడా గుర్తుండి వుండదు. రెక్కలొచ్చాయి వెళ్ళిపోయారు అంతే.” ముఖం అటువైపు తిప్పుకుని అన్నాడు, గుండెల్లో బాధ బయటకు కనపడకుండా.

“ అదేమిటి నాన్నా అలా అంటున్నారు? అన్నయ్యలకు మీరంటే పంచప్రాణాలు. మీరు ఒక్క క్షణం కనపడకపోతే, ‘అమ్మా నాన్నెక్కడ’ అంటూ అమ్మ కొంగుపట్టుకుని అడిగేవాళ్ళు. మీరు నన్ను చేరదీసి, నన్ను వాళ్ళతో సమంగా చూస్తుంటే, వాళ్ళకు నా మీద చాలా కోపంవచ్చేది. మా నాన్న ప్రేమ మాకే స్వంతం అని నాతో చాలా సార్లు అన్నారు కదా! మరి మిమ్మల్ని విడిచి ఎలా వెళ్ళిపోయారు” అడిగాడు సత్యం.

"సత్యం! నువ్వింకా అమాయకుడివిరా! నీకు లోకం పోకడ తెలియదు” అంది సావిత్రి.

“అమ్మా! అందరు వున్నప్పుడు ఇల్లు ఎంత సందడిగా వుండేది. అన్నయ్యలు ఏం చేస్తున్నారు ? ఎక్కడున్నారు అందరికి పెళ్ళిళ్ళు అయ్యాయా చెప్పమ్మా. ఇల్లంతా కళకళలాడుతూ వుండేది. మీరేమో వంటగదికే పరిమితమయ్యేవారు. మా అందరికి అన్ని చేసిపెట్టేవాళ్ళు. మీ పిల్లలకు మాకు తేడా లేకుండా చూసారు. నాలాంటి దిక్కులేనివారిని ఎందరినో చేరదీసారు మాష్టారు. మీరుగానీ మాష్టారు గాని ఎప్పుడు బాధపడడం నేను చూడలేదు. ఏమిటో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అన్నీ పోగుట్టుకున్నావాళ్ళలా వున్నారు. అసలేం జరిగిందో చెప్పమ్మా” అంటూ సావిత్రిని బ్రతిమాలాడు సత్యం.

“ సత్యం! మీరంతా రెక్కులు వచ్చిన పక్షులు. మేము రెక్కలు విరిగిన ముసలివాళ్ళం అవునా. పిల్లలకు వుద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడే వుంటే ఈ ముసలి వాళ్ళను ఎవరు చూడాల్సివస్తుందేమోనని ఫారిన్ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినప్పటినుండి ఇప్పటివరకు వాళ్ళనుండి మాకే సమాచారం లేదు. కడుపున పుట్టిన పిల్లలకే మేము అక్కరలేకపోయినాము. ఏ రక్తసంబంధం లేని మీరు మాతో వుంటారా, పోనిలే ఇన్నాళ్ళకైనా నీకు గుర్తుకు వచ్చాము. మా పిల్లలైతే ఎప్పుడో మర్చిపోయారు మమ్ములను. అందుకే మేమే ఒకరికొకరం చిన్నపిల్లల్లా పోట్లాడుకుంటాము, నవ్వుకుంటాము కలిసిమెలసి వుంటున్నాము. ఆ భగవంతుని దయ వల్ల మా తుది శ్వాస వరకు ఇలానే వుండాలని కోరుకుంటున్నాము” అంటూ ప్రభాకర్ చెబుతుంటే గొంతు పూడుకపోతుంది.

సత్యం కళ్ళు ధారలు కురవసాగాయి. సావిత్రికి దుఃఖం పెల్లుబికిరాగా పవిటచెంగు నోటికి అడ్డంగా పెట్టుకుంది.

“అంతే కాదురా సత్యం. ఇప్పటివరకు ప్రతిరోజు వాళ్ళు వస్తారని ఎదిరి చూస్తూనే వున్నాము. కాలింగ్ మ్రోగినా , లెటర్ వచ్చినా వాళ్ళ దగ్గర నుండి వచ్చిందేమోనని ఆత్రుతగా ఎదిరి చూస్తాము. అదే కాదు , ఈ పిచ్చితల్లి ఒక్కోసారి వాళ్ళు అన్నం తింటారని పళ్ళెంలో అన్నం వడ్డించి పెడుతుంది తెలుసా! ఏం చెప్పమంటావురా సత్యం. అందుకే పక్షులు రెక్కలు వచ్చేవరకే బిడ్డలను తమ దగ్గర వుంచుకుని రెక్కలు రాగానే వాటిని పంపివేస్తాయి. నోరులేని అవి ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాయో చూసావా! అన్నీ తెలిసివుండి మనం అర్ధం చేసుకోలేకపోతున్నాము. మాకు భగవంతుడున్నాడు అది చాలు” అంటూ చెప్పడం ఆపాడు ప్రభాకర్. గొంతులో గరళం మింగుతున్నట్టుగా.

సావిత్రి భర్త మనోధైర్యానికి ఆశ్చర్యపోయింది. సత్యానికి గుండె చెరువయింది.

“నాన్నా! నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడకు వెళ్ళను. నేను మీతోపాటే వుంటాను. మీ సేవ చేసుకునే భాగ్యం నాకు ఇవ్వండి. నాకెలాగు పెళ్ళి చేసుకునే యోగం లేదు. పుట్టుకతోనే ఒంటరివాణ్ణి, అందుకే బంధాలు పెట్టుకోలేదు. ఇప్పుడు నాకు మీరున్నారు నేను ఒంటరి వాణ్ణి కాను. మనందరం కలిసే వుందాము ఏమంటారు మాష్టారు” అంటూ అడిగాడు సత్యం.

ప్రభాకర్ ముఖం అటువైపు తిప్పుకుని ఏదో ఆలోచిస్తున్నాడు.

“ఆదేంటి మాష్టారు? మీకు ఇష్టం లేదా నేనుండడం” బాధపడుతూ అడిగాడు సత్యం.

“ఓరేయ్ సత్యం! నీకింకా అర్ధం కాలేదురా, నువ్వు పొరపాటున మాష్టారు అని పిలిచావు కదా! అందుకే ఆయనకు కోపం వచ్చింది. నువ్వు నోరారా అమ్మ నాన్న అని పిలవరా” అని సత్యం దగ్గరకు వచ్చి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సావిత్రి.

“ నాన్నా.. అమ్మా..” అంటూ ఇద్దరిని అక్కున చేర్చుకున్నాడు ఆనందంతో. గువ్వ పిట్టల్లా

ఒదిగిపోయారిద్దరు సత్యం ను కౌగిలించుకుని.

‘మీ కెలా చెప్పను నా మనసులో రగులుతున్న ఆవేదన. కళ్ళళ్ళో ప్రాణాలుపెట్టుకుని రాని, లేని , కొడుకుల కోసం మీరు పడే ఆరాటాన్ని చూస్తూ మీకు చెప్పలేకపోతున్నాను. చెప్పొద్దని ఒట్టుపెట్టించుకున్నారు మీ కొడుకులిద్దరు. వాళ్ళు వెళ్ళిన విమానం సముద్రంలో పడిపోయింది. వాళ్ళ ఆచూకి కూడా తెలియలేదు. వాళ్ళు వెళ్ళేముందు నన్ను కలిసి అమ్మా నాన్న ను నువ్వు కంటికి రెప్పలా కాపాడాలి అని నా చేత ఒట్టు వేయించుకున్నారు. ఒకవేళ మాకేదన్న జరగరానిది జరిగినా వాళ్ళకు తెలియనివ్వద్దన్నారు. వాళ్ళ నోట ఆ మాట ఎందుకు వచ్చిందో నాకర్ధం కాలేదు. ఆ దేవుడే అలా పలికించాడేమో. ఈ బడబాగ్ని తట్టుకునేందుకు నాకింత కాలం పట్టింది. అందుకే వెంటనే మీ ముందుకు రాలేకా చాటునుండి ఇన్నాళ్ళుగా మీకే లోటు రాకుండా ఏర్పాటు చేసాను.’ అని మనసులో మధనపడసాగాడు సత్యం.

“సావిత్రీ! మనకు నిజంగా ఇప్పుడే బాబు పుట్టినంత ఆనందంగా వుంది కదా ! ఈ శుభ సందర్భంలో నోరు తీపి చేసుకుందాము. శర్కర తీసుకురా” అంటూ హడావుడి చేసాడు ప్రభాకర్.

“అవునండి! నాకు కూడాఅలానే వుంది”. అంటూ గబగబా లేచి సత్యం తెచ్చిన స్వీట్ తెచ్చి ముగ్గురు నోరు తీపి చేసుకున్నారు.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను, నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడమన్నా,చదవడమన్నా చాలా ఇష్టం. 1991 నుండి రాయడం మొదలుపెట్టాను. ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను. కానీ ఎవరికి చూపలేదు, చెప్పుకోలేదు. ఈమధ్యనే మా అమ్మాయిలు, మావారు చూసి కథలు బాగున్నాయి కదా, ఏదైనా పత్రికకు పంపమంటే పంపిస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రికలో నేను రాసిన కవితలు, కథలు చాలా వచ్చాయి. నాకు ఇద్దరమ్మాలు, ఒక బాబు. అందరూ విదేశాల్లోనే వున్నారు. ప్రస్తుతం నేను, మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము


95 views0 comments

Comments


bottom of page