top of page

సాహస

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #Sahasa, #సాహస, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

ree

Sahasa - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 21/10/2025

సాహస - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


"సాహస!, నీ జీవిత లక్ష్యం ఏమిటి?. " ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకొని అడిగింది రమణి. 


"ఆర్మీ ఆఫీసర్ అవ్వడం నా జీవిత లక్ష్యం అమ్మా!. " చిరునవ్వు చిందిస్తూ తల్లిని పెనవేస్తూ సమాధానం ఇచ్చింది సాహస. 


ఆమె సమాధానం రమణి కి కోపం తెప్పించింది. ఆవేశంతో, "సాహస, ఎప్పుడు చూసినా ఆర్మీ గురించే మాట్లాడు తుంటావు. నీకు వేరే వ్యాపకం వుండదా?. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ని అవుతాను అంటున్నావు. వీలు లేదు. అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. అది తప్పించి వేరే ఏ లక్ష్యం అయినా ఎంచుకో. " గద్దిస్తూ చెప్పింది రమణి. 


"నో, నేను ఆర్మీ ఆఫీసర్ అవుతాను. అది నా జీవిత లక్ష్యం. " దృఢంగా చెప్పింది సాహస. 


"ఏంటి, నా మాటకే ఎదురు చెప్తావా?. ఇంత చిన్న వయస్సులోనే తల్లికి ఎదురు చెప్పేంత సాహసం చేస్తున్నావా?. " ఆవేశం అదుపు చూసుకోలేక సాహస చెంప చెళ్లుమనిపించింది. 


ఆప్యాయంగా, ప్రేమతో దగ్గరకు తీసుకొని, ఎన్నో విషయాలు మాట్లాడే అమ్మ ఈ రోజు తన మీద చేయి చేసుకోవడం తో తట్టుకోలేక, కన్నీరు కార్చుతూ అక్కడ నుండి వెళ్లిపోయింది సాహస. 


సాహస బాధపడుతూ వెళ్లిపోవడం తో మౌనంగా అక్కడే కూర్చుంది రమణి. తన ప్రమేయం లేకుండానే తన కళ్ళు కన్నీళ్లు జారవిడుస్తున్నాయి, వాటిని తుడుచుకుంటూ, ‘నేను సాహస మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. కానీ ఏం చెయ్యను. ఆమె సున్నితంగా చెప్తే వినదు కదా. ఆర్మీ అంటే నాకు ఇష్టం లేదు. ఆర్మీ కారణంగా నాన్న ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు సాహస ను కూడా దూరం చేసుకోలేను. ఆమెలో మార్పు వచ్చే వరకు ఈ విషయంలో నేను ఆమె పట్ల కఠినంగానే వుంటాను.’ తనలో అనుకుంటూ నిశబ్దం వహిస్తూ అలానే కూర్చుంది. 


గతంలో చేదు జ్ఞాపకాలు తనని వెంటాడుతూ వున్నాయి. బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంది. 


"నువ్వేనా! ఇలా ప్రవర్తించింది! ఆశ్చర్యంగా వుందే!. " భుజం పై చేయి వేస్తూ అన్నాడు రమణి భర్త కుమార్. 


భర్త మాటలకు రమణి నిశబ్దం వీడి, "ఏం చేయమంటారు?. సాహస నాకు ఇష్టం లేని వృత్తిలో ప్రవేశిస్తాను అంటుంది. " గద్గద స్వరం తో అంది. 


"అంతమాత్రం కే ఆమె మీద చేయి చేసుకుంటావా?. " భార్యను ఓదారుస్తూ అన్నాడు కుమార్. 


"నా ఆవేశాన్ని అదుపు చేసుకోలేక పోయాను. " కన్నీళ్లను తుడుచుకుంటూ సమాధానం ఇచ్చింది రమణి. 


 "నీకు ఆర్మీ అంటే ఎందుకు అంత కోపం?. " అడిగాడు కుమార్ సుతిమెత్తగా. 


"కోపం కాదు భయం. చిన్నప్పుడు నాన్నే నా లోకం. అతను నా దగ్గర వుండేది తక్కువ సమయం మాత్రమే. దేశం కోసం వుండేది ఎక్కువ. కానీ అతను వచ్చిన ప్రతి సారి నాతోనే గడిపేవారు. నాకు చాలా సంతోషంగా వుండేది. కానీ, " ఒక్కసారిగా ఏడుస్తూ, "ఆ దేవుడు మా అనుబంధాన్ని చూసి ఓర్వలేక, నాన్న ను నాకు దూరం చేసాడు.. యుద్ధంలో శత్రు సైన్యాలను అడ్డుకుంటూ నాన్న వీర మరణం పొందారు. " వెక్కి వెక్కి ఏడ్చింది. 


భార్య బాధను చూసి తల్లడిల్లిపోయాడు. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 


కాస్త తేరుకొని, వణుకుతున్న స్వరం తో, " బాల్యమంతా తండ్రి ప్రేమకు దూరమై దుర్భరంగా సాగింది. నాన్న గురించి అమ్మ గొప్పగా చెప్పేది. దేశం కోసం పోరాడి ఆ తల్లి ఒడిలోకి చేరారని చెప్పేది. కానీ సమాజంలో మాత్రం అతని త్యాగాన్ని ఎవరూ గుర్తించే వారు కాదు. ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడే వాళ్ళు. 


ఎవరైనా మిలట్రీ కి వెళ్ళడం నాకు ఇష్టమని పాఠశాల ఖాళీ సమయాల్లో మాట్లాడుకున్న సందర్భంలో, ‘ఎందుకు రా వీళ్ళ నాన్న లా చనిపోవడానికా?.’ అని కొందరు స్నేహితులు నన్ను చూపించి ఎగతాళిగా మాట్లాడే వారు. 


‘మిలట్రీ అంటే ప్రాణం మీద ఆశ వదులుకోవడమే. అందుకే మా వాడిని నేను పంపించలేదు’ ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో వుండే పక్కింటి అమ్మమ్మ సమయం దొరికినప్పుడల్లా ఈమాటే అనేది. 


బాధ, భయం రెండో నాలో తిష్ట వేశాయి. అలాంటిది ఈ రోజు సాహస కూడా మిలట్రీ కి వెళ్తాను అనగానే, భయంతో, ఆవేశం తో ఆమె మీద చేయి చేసుకున్నాను." తనలో బాధను భర్త తో చెప్పింది రమణి. 


రమణి ఎప్పుడూ ఇంతలా బాధపడటం కుమార్ చూడలేదు. ఎప్పుడూ సంతోషంగా వుంటూ, కుటుంబాన్ని సంతోషంగా వుంచే రమణి బాల్యం లో ఇంత క్షోభ అనుభవించిందా అని అనుకుంటూ ఆమె ను ఓదార్చుతూ, 


"కూల్ రమణి, ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం కదా. సాహస స్కూల్ లు వారు పేరెంట్స్ ను కూడా ఆహ్వానించారు. పైగా మన సాహస కూడా అక్కడ జరిగే కల్చరల్ పోటీల్లో పాల్గుంటుంది. రెడీ అవ్వు. " అసలు విషయం ప్రక్క దారి పట్టిస్తూ, ఈ విషయం ప్రస్తావనకు తీసుకువచ్చి రమణి ని గాబరా పెడుతూ అన్నాడు. 


"నాకు ఇష్టం లేదు, నేను రాను. " అయిష్టాన్ని కనబరిచింది రమణి. 


"నువ్వు ఇప్పుడు రాలేదనుకో. సాహస నీ మీద ఇంకా కోపం పెంచుకుంటుంది. నీతో మాట్లాడటం కూడా మానేస్తుంది. తర్వాత నీ ఇష్టం. " రమణి బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ మాట అన్నాడు. 


"వామ్మో!. కోపంతో చేయి చేసుకున్నాను కానీ, సాహస నాతో మాట్లాడక పోతే, నాకు పూట గడుస్తుందా!. లేదు. లేదు. " అని వేగంగా అక్కడ నుండి లేచింది. 


త్వరగా సిద్దం అవుతూ, పాఠశాలకు వెళ్ళడానికి సిద్దం అయ్యింది రమణి. కొంత సమయం తర్వాత కుమార్ తో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. 


త్రివర్ణ రంగుల అలంకరణ తో ఆ పాఠశాల ప్రాంగణమంతా మెరిసిపోతుంది. కొంత సమయం తర్వాత జెండా వందనం మొదలు పెట్టారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తల్లితండ్రులకు కేటాయించిన కుర్చీల్లో తల్లితండ్రులు ఆశీనులయ్యారు. 


 దేశం కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళిగా ఒక వీడియో అక్కడ అమర్చున్న తెరమీద వేశారు. 


వీడియో మొదలైన పది సెకన్లు లోపే రమణి కళ్ళలో నీరుతిరిగడం మొదలయ్యాయి. 


"పుట్టిక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. " బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తూ తయారు చేసిన వీడియో అది. అందులో రమణి తండ్రి ఫోటో వేస్తూ, అతను చేసిన సాహసాలు అన్నీ వినిపిస్తూ వున్నారు. ఆమె గుండె పులకించి పోయింది. కళ్ళు చెమర్చాయి. ఎంతో ఆనందం కలిగింది. అలా అందరి ముందు తన తండ్రి గురించి వేయడం, తాను వినడం ఆమెకు చాలా గర్వంగా అనిపించింది. మొదటి సారి చాలా గర్వంగా అనిపించింది. 


తర్వాత ఆ పాఠశాలలో చదివిన విద్యార్ధులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు తరుపు దేశం కోసం సేవలు అందించిన వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు, వారి సేవలు గురించి సేకరించి చేసి వీడియో రూపంలో వేస్తున్నారు. చివరికి కుమార్ స్నేహితుడు అయిన వీర ప్రతాప్ వీడియో కూడా రావడం తో, కుమార్ ఆశ్చర్యపోయాడు, అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండి పోయాయి. 


వీడియో ముగిసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ లేచి మౌనంగా నిల్చున్నారు అమర వీరులకు నివాళులు అర్పిస్తూ, 


"ఈ అమర వీరుల త్యాగం ఫలితంగానే మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము. వాళ్ల త్యాగం మనం మరవకూడదు. దేశం కోసం నిలబడాలంటే ఎంతో ధైర్యం కావాలి. వీళ్ళందరు ఎంతో ధైర్య వంతులు. ఇలాంటి పుణ్య దినం రోజున అమర వీరులను తలుచు కోవడం అదృష్టంగా భావిస్తున్నాను. 


అలాగే సరిహద్దులో సైనికులు అహర్నిశలు పోరాడుతూ దేశాన్ని కాపుకాస్తుంటే. దేశం లోపల అరాచకాలు, అల్లర్లు సృష్టిస్తూ, మానవత్వం మరిచిపోయి కొందరు ప్రవర్తిస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. 


ఇక ఈ వీడియో కాన్సెప్ట్ విషయానికి వస్తె, ఇలాంటి చక్కటి ఆలోచన మా దృష్టికి తెచ్చి, మాలో కూడా ఆలోచన కలుగజేసిన సాహస కు ప్రత్యేక అభినందనలు. " అని ప్రిన్సిపాల్ సాహస ను పొగుడుతూ తన ప్రసంగం ముగించారు. 


తర్వాత కల్చరల్ పోగ్రామ్స్ ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రదర్శనల తర్వాత సాహస ప్రదర్శన కూడా వచ్చింది. 


మిలట్రీ క్యాంప్ వాతావరణం సృష్టించి శత్రువులను ఎదుర్కుంటున్న జవాన్ లా తన అద్భుతంగా నటిస్తుంది. నటన కాదు ఆమె రక్తం లో నిండిపోయిన దేశభక్తి కారణంగా ఆమె అలా నటించగలుగుతుంది. 

 

అప్పుడే రమణి లో ఏమూలనో మూసుకు పోయిన జ్ఞాన చక్షువు తెరుచుకుంది. సాహస స్వేచ్ఛ ను హరిస్తున్నాననే భావన రమణి లో కలుగుతుంది. కొంత సమయం తనలో తాను ప్రశ్నోత్తరాలు వేసుకుంటుంది. 


ఇంతలో రమణి ని కుమార్ తడుతూ, 

"రమణి! చూసావా మన సాహస, శత్రువుల్ని ఎలా చీల్చి చెండాడుతుందో!. నువ్వు ఆమె అభీష్టానికి చేయూత ఇచ్చావంటే, ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది. అదుగో చూడు ఆమె ప్రతాపం!. నీ భయం పోగొట్టేలా నేను ఒక మాట చెప్పనా, నీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఆమె ఎలా ఓడిపోతుంది. ఆమె పరాశక్తి రూపం కదా ఆమె ఎప్పుడైనా ఓడిపోతుందా?. " సాహస సాహసాన్ని చూపిస్తూ చెప్తున్నాడు కుమార్. 


ఆమె ప్రదర్శన రమణి లో ఏదో తెలియని శక్తిని నింపింది. "అవును. ఆమె పరాశక్తి రూపమే, ఆమె శక్తి నేను గుర్తించ లేకపోయాను. ఆమె ఆర్మీ ఆఫీసర్ అయితే నా దేశం బాగుపడుతుంది. ఆమె ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది మహిళలు ఆర్మీ లో ఉన్నతి పదవులు చేపడతారు. మహిళా అంటే చులకనగా చూసే అరాచక శక్తుల జోరు తగ్గుతుంది. " రమణి లో భయపు ఛాయలు పోతూ ధైర్యం మెల్లమెల్లగా కలుగుతుంది. 


చివరికి తాను తీసుకున్న నిర్ణయాన్ని కుమార్ కు చెప్పింది. రమణి చెప్పిన విషయం విని చాలా సంతోషించాడు కుమార్. ఈ సన్నివేశాల కారణంగా తన స్నేహితుడు వీర ప్రతాప్ గుర్తుకు వచ్చాడు కుమార్ కు. 


జీవితం అంటే బాధ్యత లేకుండా, స్త్రీలు అంటే గౌరవం లేకుండా తిరిగే వాడు కుమార్. ఇతని ప్రవర్తన చూసి ఎవరూ కూడా అతనితో స్నేహం చేసేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో వీర ప్రతాప్ కుమార్ కు పరిచయం అయ్యాడు. 


ఆ పరిచయం స్నేహంగా మారింది. 

వీర ప్రతాప్ ఎన్నో విషయాలు కుమార్ తో పంచుకునే వాడు. మనుషులు పట్ల, స్త్రీల పట్ల ఎలా గౌరవంగా మెలగాలో చెప్పే వాడు. జీవితం అంటే పరమార్థం ఏమిటో వీర ప్రతాప్ ను చూసిన తర్వాత కుమార్ కు అర్దం అయ్యింది. అప్పటి నుండి జీవితం మీద శ్రద్ద పెట్టాడు. 


అదే సమయంలో వీర ప్రతాప్ ఆర్మీ కి సెలెక్ట్ అయ్యాడు. కుమార్ చాలా సంతోషించాడు. కానీ వీర ప్రతాప్ తనకు దూరం అవుతాడన్న ఆలోచనల తనని సతమతం చేసేది. 


కుమార్ కు సర్ది చెప్పి, 

"నేను ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చే సరికి నువ్వు కూడా ఏదోక ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. " అని చివరి మాటగా చెప్పి వెళ్ళిపోయాడు వీర ప్రతాప్. 


ప్రతాప్ చెప్పిన మాటలు మదిలో ఉంచుకొని, కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించాడు. 


కాలం వేగంగా నడవ సాగింది. ప్రతాప్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో విధుల్లో చేరాడు. కుమార్ కూడా తన ఉద్యోగంలో బిజీ గా వున్నాడు. తర్వాత పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. అక్కడకు సంవత్సరం తర్వాత ప్రతాప్ తన భార్యతో వచ్చి కుమార్ దంపతులను కలిసాడు. అప్పటికి కుమార్ భార్య గర్భవతి, ప్రతాప్ భార్య కూడా గర్భవతి. ఇద్దరూ ఇరువురి గురించి తెలుసుకొని సంతోషించారు. 


ఆ రోజే తమ బంధువులను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి తన భార్యతో పాటు వెళ్ళాడు ప్రతాప్. 


ఆ రోజు రాత్రికి కుమార్ భార్యకు నొప్పులు ప్రారంభం అవడం తో హాస్పిటల్ లో జాయిన్ చేశాడు కుమార్. కొంత సమయం తర్వాత పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. మృత శిశువు జన్మించింది అని తెలిసి కుమార్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన భార్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు నిజం తెలిస్తే బ్రతుకుతుందా అని కంగారు పడుతున్నాడు. 


కుమార్ కంగారు చూసి, అతనికి బాగా తెలిసిన నర్స్ రమ్య కుమార్ దగ్గరకు వచ్చి, "మీ బాధను నేను అర్దం చేసుకోగలను. నిజం తెలిస్తే మీ భార్య ఏమౌతుందో అని కదా మీరు కంగారు పడుతున్నారు. నా దగ్గర ఒక ఉపాయం వుంది. " ఆమె అంది. 


ఏమిటి అన్నట్టుగా తన కళ్ళు తుడుచుకుంటూ ఆమె వైపు చూసాడు. 


"గంట క్రితమే ఒక యాక్సిడెన్ట్ కేస్ వచ్చింది. భార్య భర్తలు ఇద్దరూ చనిపోయారు. కానీ ఆమె గర్భవతి చాలా కష్ట పడి పాపను రక్షించగలిగారు డాక్టర్ గారు. " ఆమె చెప్పింది. 


"ప్లీజ్, ఆ పాపను మాకు ఇవ్వండి. మా ఆవిడ ను బ్రతికించండి. " ప్రాధేయ పడుతూ అడిగాడు కుమార్. 


"అలాగే డాక్టర్ తో నేను మాట్లాడుతాను. నాతో పాటు రండి. " అంటూ ఆ దంపతుల మృత దేహాలు దగ్గరకు తీసుకు వెళ్ళింది. దూరంగా వున్న ఉయ్యాలలో వున్న పాపను చూపిస్తూ, "అదుగో ఆ పాపే. " అని చూపించింది రమ్య. 


ముందుకు అడుగు వేయబోయి, ఆగుతూ "నేను ఒకసారి ఆ దంపతులను చూడవచ్చా?. " అడిగాడు కుమార్. 


"అలాగే. " అని అంటూ, కప్పిన క్లాత్ వాళ్ళ ముఖం మీద నుండి తప్పించింది రమ్య. 


వాళ్ళను చూసి ఒక్కసారిగా కుప్పకూలాడు కుమార్, విలపిస్తూ, "వీర!" గావు కేక పెడుతూ, వణుకుతున్న స్వరంతో, "మళ్ళీ వస్తానని చెప్పి, ఇలా వెళ్ళిపోయావా?. " గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. 


అప్పటి వరకు బాగానే వున్న కుమార్ ఇలా ఏడవడం చూసిన రమ్య కంగారు పడుతూ, కుమార్ దగ్గరకు చేరుకొని అతన్ని సముదాయించి వివరం అడిగి తెలుసుకుంది. బాధాతప్తమైన స్వరం తో వివరాలు చెప్పాడు. 


"అవునా!, విధి ఎంత కఠినమైనది. పాపం ఇతని తప్పు ఏమీ లేదంట. అడ్డంగా ఒక పాప రావడం తో వేగంగా వస్తున్న వెహికల్ ను అదుపు చేసి, ఆ పాప ను గుద్దకుండా పక్కకు కారు తిప్పారంట. ఇలా తమ ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ప్రమాదం నుండి కూడా బయట పడి ఈ పాప బ్రతికిందంటే ఈమె నిజంగానే సాహసవంతురాలు, మృత్యుంజయురాలు. " అని అంది రమ్య. 


గుండెలు బాదుకుంటూ, "నాకు జీవితం ప్రసాదించింది నువ్వే, ఇప్పుడు నా భార్యకు కూడా నీ పాప కారణంగానే నాకు దక్కుతుంది. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను. నా జీవితంలో వెలుగు నింపావు. ఎప్పుడూ నువ్వు నాతో అంటుండే వాడివి కదా, నాకు కూతురు పుట్టాలి అని, ఇప్పుడు నీకు కూతురే పుట్టింది రా. కానీ ఆమె ను చూడటానికి నువ్వు లేవు. " వెక్కి వెక్కి ఏడుస్తూ, 

"నీ కూతుర్ని ఆర్మీ ఆఫీసర్ చేయాలని అంటుండే వాడివి. నువ్వు దూరం అయినా నీ కోరిక నేను తీరుస్తాను. ఈ పాపను ఆర్మీ ఆఫీసర్ ను చేస్తాను. " అని ఆ పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు. 


గతమంతా గుర్తుకు రావడం తో ఒక్కసారిగా తన హృదయం బాధతో నిండి పోయింది. 


"ఇప్పుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చి అందరి మనసులు దోచుకున్న సాహస కు బహుమతి ప్రధానం చేయడం అవుతుంది. " అని అనౌన్స్ చేయడం తో, ఒక్కసారిగా తేరుకుంటూ, ఆనందంతో చప్పట్లు కొడుతూ అటువైపు కు చూసాడు కుమార్. 


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments


bottom of page