top of page

శకుంతల వదిన

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Sakunthala Vadina' written by Bhagavathula Bharathi

రచన: భాగవతుల భారతి

ఆత్మ విశ్వాసంతో ఉన్న వాళ్లకు ఓదార్పు అవసరం లేదు. ఇతరుల జాలి కోసం ఎదురు చూడరు కూడా . ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు ఈ విషయాన్ని తన కథలో చాలా చక్కగా వివరించారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం

"అక్కా! మనవిజయ్ అన్నయ్య పోయాట్ట" చెల్లి ఫోన్ చేసింది.

అయ్యో! అవునా? ఎలా?" నేను దిగ్భ్రాంతి చెందా.

"ఎలాఏముందీ? డెల్టా వేరియంట్ ట....

మనలోనే ఒకణ్ణి మింగేసింది." బాధతోనే అంది చెల్లి.

"పదిమందికన్నా ఎవరూ ఉండకూడదుగా. అదీగాక... హాస్పటల్ వాళ్ళు శవాన్ని ఇవ్వలేదుట. అటునుండి అటే స్మశానానికి తీసుకుపోయారుట. ఎవరమూ ఎక్కడికీ కదిలేటట్లులేదు ...ఈ వేవ్ తగ్గాక వెళ్ళి పలకరించిరావటమే... " చుట్టాలందరూ

ఫోన్ లోనే సంప్రదింపులూ..

వదిన ఎలాఉందో! ? చదువుకున్నది కాకపోయినా ఆమెలోని ఆత్మవిశ్వాసపు పొరలన్నీ తొలుచుకుంటూ...దు:ఖంతో గతంలోకి జారిపోయాను .

///////////////

"శకుంతలకి యాక్సిడెంట్ అయిందట.మనింట్లో ఫోన్ లేదుగా. ఇందాక మురళిగారు ఫోన్ వచ్చిందని కబురు చేస్తే వెళ్ళాగా! విజయ్ ఫోన్ చేసాడు. "నాన్న గాభరాగా చెబుతున్నాడు.

"అయ్యో! ఎక్కడ ఎప్పుడు? ఎలా? మనిషి ప్రాణాలతోనే ఉందా? "కంగారుగా ఏవేవో ప్రశ్నలు అడిగేస్తోంది అమ్మ.

మేం చిన్నపిల్లలం ఆటలాపేసి ,ఆలకిస్తున్నాం.

"ప్రతీ సంవత్సరం లాగానే, ఈ సంవత్సరమూ, అన్నవరం దైవసన్నిధిలో సత్యనారాయణ వ్రతం చేయించుకోటానికి వెళ్ళారుగా. వ్రతం ఐపోయి, బస్టాండుకు వచ్చారుట పిల్లలతో. విజయ్ కి, శకుంతలకీరెండు చేతుల్లో లగేజ్ లు ఉన్నాయిట. "

"ఐతే! " మేం కూడా ఆసక్తి గా అడిగాం.

"ఐతే ఏముందీ! ప్రత్యూష చిన్నపిల్లగదా! దాన్ని బస్సు ఎక్కించిందిట. పిల్ల మెుదటి మెట్టు మీద ఉండగానే బస్సుకదిలిందిట.

"అయ్యయ్యో! పిల్ల పడిపోతోందీ అనిఅరుస్తూ, చేతుల్లో లగేజ్ ఉందిగా.

ఎడమ మోకాలు మడిచి, బస్సులో ఉన్నపిల్లకు అడ్డం పెట్టిందిట. ఐనా డ్రైవర్ వినిపించుకోకుండా, పోతూనే ఉన్నాడు.బస్సుచక్రం కుడికాలి మీదకెక్కిందిట.

అరుస్తూ పడిపోయిందట, శకుంతల.

గందరగోళంగా అందరిఅరుపులూ వినబడేసరికి, తప్పుదిద్దుకోవాలనే తడబాటులో డ్రైవర్ మళ్లీ పొరపాటు గా బస్సును రెండడుగులువెనక్కి గుంజాడుట, మళ్ళీ కాలిమీంచే పోయిందిట రెండోసారి కూడా. "

"అయ్యో! పాపం ఆ డ్రైవర్ ని పట్టుకు తన్నలా? అందరూ జేరీ! " అమ్మ అడిగింది.

"తన్నులూ గుద్దులూ సరే వీళ్ళెలా ఉన్నారో ఏమిటో! మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తేనే వివరాలు.ఇందాక కంగారుగా బస్టాండులో నుండే చేసినట్లున్నాడు.మనకీ, అన్నయ్యావాళ్ళకీనూ."

అవును ఇప్పటిలాగా అప్పుడు, సెల్ ఫోన్ లు విరివిగా వాడకం లేదు.

ఇక అక్కణ్ణించి మురళి గారింట్లో లాండ్ ఫోన్ ఎడతెరపి లేకుండా మ్రోగుతూనే ఉంది మా చుట్టాలతో....

విషయం పూర్తిగా తెలిసింది సాయంత్రానికి. యాక్సిడెంట్ చేసింది గవర్నమెంట్ బస్సు

కాబట్టి, వాళ్లే విశాఖపట్నం కింగ్ జార్జ్హాస్పటల్ లో చేర్చారట.

"ఔనా! ఐతే పదండిపోదాం! " హుటాహుటినఅమ్మానాన్న, అన్నయ్యను తెలిసినవాళ్ళింట్లో ఉంచి, నన్ను చెల్లిని తీసుకుని బయలుదేరారు.

విజయ్, శకుంతల వదిన, అమ్మకి అక్కైన మా పెద్దమ్మ కొడుకు, కోడలు . అప్పుడప్పుడూ పెళ్ళి ముచ్చట్లు చెప్పేటప్పుడు, శకుంతల వదిన పెళ్ళి రోజు ముచ్చట్లూ, అందరిమధ్యలో చర్చకు వచ్చేవి. మా చెవులలోనూ పడేవి.

"పెళ్ళికి విడిది, ఎక్కడోపాడుబడ్డ బడిలో ఇచ్చారు. అక్కడ కుక్కలు తిరుగుతున్నాయ్. చీకటి పడింది.కానీ లైటే లేదు. పెళ్ళి కొడుకును ఎవరన్నా చీకట్లో ఉంచుతారా... హవ్వ.. తర్వాత ఎవరో లాంతరు తెచ్చి పెట్టారు. పైగా మంగళస్నానాలకు చన్నీళ్ళు పెట్టారు.

మంగళస్నానాలు చన్నీళ్ళతో చేయించకూడదు అని పెద్దమ్మ పోట్లాడితే, ఓ అగ్గిపెట్టె తెచ్చి, పుల్ల వెలిగించి నీళ్ళల్లో ముంచి, ఇలాకూడా చేయవచ్చని సిధ్దాంతి గారు చెప్పారు అని చెప్పారుట వాళ్ళు. "

ఐతే పెళ్ళి కూతురు జడ జానడే ఉంది. దానికి ఇంత పూలచెండు చుట్టారు.బ్లాక్ అండ్ వైట్ పెళ్ళి ఫొటోల్లో నేనూ చూసా . పూలజడన్నా, వేయకూడదా? అని పెద్దమ్మ పోట్లాటట. అన్నీ చిన్న చిన్న కలహాలూ.

ఇక పెళ్ళి మంటపం చూస్తే మతిపోయింది. వధూవరుల బరువునే మోయలేక, ఊగిపోతోందిట.

పెద్దమ్మ పోట్లాటట. అదిచూసి శంకుతల వదిన వాళ్ళ అమ్మ " నా కూతురు గయ్యాళి అత్తగారితో ఎలావేగుతుందో ఏమో " అని కళ్ళు తుడుచుకుందిట. చాలా భయపడిందట.

ఎన్ని అవకతవకలతో పెళ్ళి జరిగినా, వదిన మాతో, పెద్దమ్మ వాళ్ళ కుటుంబంతో కలిసిపోయిన విధానం, పెళ్ళి లోని, గోలలన్నీ మరిచిపోయేటట్లు చేసింది.

బస్సు కుదుపుతో అమ్మవంక చూసాను.

అమ్మ కళ్ళు వత్తుకుంటూ.."నీ వ్రతం కోసమే వచ్చారు పిల్లలు, నువ్వే కాపాడాలి, సత్యనారాయణ మూర్తీ, అది ఇద్దరు పసిపిల్లల తల్లి",అని ప్రార్ధిస్తూనే ఉంది అమ్మ.

గుండెలు పీచుపీచు మంటూ అరచేత పట్టుకుని అక్కడికి చేరేసరికి, పెద్దమ్మా, పెదనాన్నా ఇంకా చుట్టాలూ, వచ్చేసారు.

కానీ గదిలోకి అడుగుపెట్టేసరికి, అక్కడకనిపించిన దృశ్యం ఇప్పటికీ,నా మన:ఫలకంపై,అద్భుతమైన ఆత్మవిశ్వాసపు ముద్రవేసింది. వదిన మంచం మీద కూర్చుని ఉంది. అప్పటికే వైద్యం మెుదలైందిట. ప్రాణానికేం ప్రమాదంలేదు.కానీ ,కాలి మీదనుండి పోవటం వలన పాదంవరకూ నజ్జునజ్జు అయింది,,ఐతే ఆపరేషన్ బల్లమీదకు వెళ్ళాక, ఎక్కడివరకూ,పాడైతే అక్కడివరకూ కాలు తీసేస్తారుట.

కానీ శకుంతల వదిన " రండి! అత్తయ్యగారు, రండి మామయ్యగారూ " అని నవ్వుతూ ఆహ్వానించటం, మా యోగక్షేమాలడుగుతూ గలగలా నవ్వుతూ, మాట్లాడేస్తూ ఉండటం, చూసిన వీళ్ళందరూ ముఖముఖాలు చూసుకున్నారు,యాక్సిడెంట్లో మతిగానీ పోలేదుగదా!

"శకుంతలా! " అన్నారు, గాద్గదికంగా.

"అందరూ ఎందుకంత బాధ పడుతున్నారో నాకేం అర్దంకావట్లా. ఇప్పుడేమయిందనీ?" అంది వదిన.

ఇంతలో డాక్టర్ వచ్చి లోపలికి తీసుకుపోయారు. బయటికి వచ్చి చెప్పాడు డాక్టర్, "ముందు వేళ్ళవరకే తీయాల్సివస్తుందని అనుకున్నామ్. కానీ చూస్తే పాదం మెుత్తం తీయాల్సివచ్చింది. భర్త సంతకం కావాలి. " అని చెప్పగానే మా వాళ్ళ ఏడుపు మిన్ను ముట్టింది.

పాదం తీసేసారు. పుండు మానేవరకూ రెస్ట్ అవసరం అని చెప్పారు. ఇంటికి పంపారు . వారం తర్వాత పరామర్శించటానికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ షాక్ ఇచ్చింది శకుంతల వదిన.మంచందిగి దేక్కుంటూ వెళ్ళి దొడ్లో అంట్లుతోముతూ దర్శనం ఇచ్చింది.

ఇంకేం పలకరింపులూ... ధైర్యానికే, ధైర్యం నేర్పించింది శకుంతల వదిన. కంటిలోంచి చుక్కనీళ్ళు కూడా రానీయలా. ఓదార్పు మాటలు నాకవసరం లేదంది.

జైపూర్ కాలికోసం ప్రయత్నించారు వాళ్ళు.

"ఈ కాలు అడడదిడ్డంగా కట్ అయింది. ఇదిగో ఇక్కడివరకూ తీసేయించండి.మేం ఇచ్చే కాలు సెట్ అవుతుంది. లేదంటే సెట్ అవదు "అని చెప్పేసారు.

"ఇదేమి విడ్డూరం,బలవంతంగా మళ్ళీ కాలు కత్తిరించుకోటమా అని ఆ మెుండి, కుంటి కాలితోనే, తిరుగుతూ పని చేసుకునేది.

కానీ అదీ ఇదీ తగిలి, దెబ్బతగిలి, నెత్తురురావటం, దానికి వదిన మందురాసుకోటం మమ్మల్ని కలిచివేసేది, గానీ, తను మాత్రం బాధపడుతున్నట్లు కనబడలా ఎప్పుడూ.పైగా ఆమె పెద్ద చదువులు చదువుకున్నదేంకాదు.

అన్నయ్య మాత్రం వదినకి ఎంత ఊతం ఇచ్చాడనీ! .. ప్రతి పనిలో, అన్నయ్య సహకారంతో పిల్లలను పెంచటం, వాళ్ళ ఆలనాపాలనా ,పెళ్ళిళ్ళూ,పెద్దమ్మా పెదనాన్నకి, కోడలుగా సేవలూ, అంతెందుకు మా ఇంట్లో పెళ్ళిళ్ళ కీ మా బంధువులవారి పెళ్ళిళ్ళకూ, కుంటుకుంటూనే ఎంతచాకిరీ చేసిందనీ.

మగాళ్ళైతే ఆఫీసుపని వరకే,ఆడవారికి ఇంటాబయటా ఎంత చాకిరీ ఉంటుందీ, అందులోనూ మందులకు బాగా ఒళ్ళు పెరిగిపోయి, షుగర్ రాకుండా చూసుకుంటూ.... చిన్న కష్టమెుచ్చినా, విలవిలలాడి పోయి, ఏడ్చి శోకాలు తీసి ఊరూ వాడా ఏకం చేసేసే చాలా మందికి ,

"అదిగో! ఆ శకుంతలను చూసి నేర్చుకోండి " అనేంత అచంచలమైన ఆత్మవిశ్వాసపు స్ఫూర్తి, శకుంతల వదిన.

కరోనా అన్నయ్యప్రాణం తీసుకుపోతే ,వేవ్ తగ్గాక పలకరింపుకు వెళ్ళి ,తనకన్నీళ్ళను, నా వేళ్ళతో తుడవబోతే,

"ఎందుకే?! భడవకానా ! తుడుచుకోటానికి నాకు వేళ్ళులేవా? నడిపించటానికి రెండో కాలుగా మీ అన్నయ్య ఙ్ఞాపకాలు లేవా?! "అని ఏడుస్తూ కూడా నవ్వేసిన శకుంతల వదిన..

////////////////////

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


381 views2 comments
bottom of page