సంతాప మౌనం!

Santhapa Mounam! - Telugu Emotional Story | Bhattu Venkata Rao
సంతాప మౌనం! - తెలుగు భావోద్వేగ కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 28/09/2026
‘సంతాప మౌనం!’ భట్టు వెంకటరావు రచించిన హృదయాన్ని తాకే మానవీయ కథ.ఒక నిమిషం మౌనంలో సాధారణంగా వినిపించని శబ్దాలు ఒక వ్యక్తి అంతరంగాన్ని ఎలా కదిలించాయో ఈ కథ చెబుతుంది.
'ఆయన ఆత్మ శాంతి కోసం మనం అందరం లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటిద్దాం!' -
అని గది సీలింగులో ఎక్కడో ఏర్పాటు చేయబడున్న స్పీకరులో నుంచి మాటలు వినపడిగానే, ఆ గదిలో ఉన్న ఆ ఇరువురు వ్యక్తులు లేచి నిలబడ్డారు. తలవంచి మౌనంగా కళ్ళు మూసుకుని నిశ్శబ్దం పాటించారు.
ఒక ఆత్మ శాంతి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించబడుతోంది ఆ కాంపస్ లోని అలాంటి చాలా గదులలో.
ఆ గదిలో అకస్మాత్తుగా ఆవరించిన నిశ్శబ్దంలో, ఆ గదిలో ఉన్న ఇరువురు వ్యక్తులలో ఒకరికి, ఆ గదిలో పైన సీలింగుకు తిరుగుతున్న ఫాను రెక్కల చప్పుడు వినపడసాగింది. సాధారణంగా ఎప్పుడూ వినపడని గాలి వీచే శబ్దం స్పష్టంగా వినపడసాగింది.
తాను లోపలికి తీసుకుని విడిచే శ్వాస కదలిక వినపడసాగింది. మూసుకుని ఉన్న కళ్ళ అడుగున చీకట్లో కనిపించనిదేదో కదలాడసాగింది. కిటికీ రెక్క, గాలికి కదిలి చేసిన 'కీచు' మనే శబ్దం తన పక్కనుంచే అన్నట్లుగా వినిపించింది.
గది బయట గానుగ చెట్టు కొమ్మల్లో కూర్చుని కాకి ఒకటి 'కావు కావు' మని కర్ణ కఠోరంగా అరిచింది. ఆపుకోలేని దగ్గవచ్చినట్లు, దూరం నుంచి ఎవరో దగ్గిన దగ్గు, క్షయవ్యాధి సోకిన మనిషి దగ్గులాగా వినిపించింది.
వినిపించినది మొదలుగా ఆ దగ్గు ఇక ఆగదేమో అన్నంతగా పెరిగిపోసాగింది. ఏదైనా వేరే శబ్దం ఆ దగ్గును చుట్టిముట్టి తనలో ముంచేస్తే బాగుండునేమో అనిపించడం మొదలయింది. ఇంతలో మైకులోంచి 'ధాంక్యూ జెంటిల్మెన్!' అని ఎవరో చెప్పినది వినపడింది.
ఆ గదిలోని ఇరువురూ కళ్ళు తెరిచి, తలలు పైకెత్తి తాము అంతకు ముందు కూర్చునున్న చోట్లనే, కించిత్భారమైన శ్వాసలు పీల్చి విడుస్తూ కూర్చున్నారు.
నిమిషం నిశ్శబ్దం తరువాత మళ్ళీ శబ్దం యధావిధిగా గదిలో నిండిపోయింది. ఫాను రెక్కల చప్పుడు వినపడడం మానేసింది. అలాగే మిగతావాటి శబ్దం కూడా వినపడడం మానేసింది.
కానీ దూరం నుంచి అ దగ్గుతున్న మనిషి దగ్గు మాత్రం ఇంకా వినపడుతూనే ఉంది. చాలా బాధాకరంగా ఉంది చెవులకు ఆ దగ్గు శబ్దం. అది ఆగిపోతే బాగుండుననిపించింది. కానీ ఆ దగ్గు శబ్దం ఆగలేదు.
చెవులకు విపడుతూనే ఉంది. ఆ ఇద్దరిలో అతడు గది వాకిలి దగ్గరకు వెళ్ళి, అక్కడ నిలబడి అన్ని వైపులా పరిశీలనగా చూశాడు. బయట ఎవరెవరో, వారి వారి పనుల మీద తిరుగుతున్నారు తప్ప, వారిలో ఎవరూ దగ్గుతున్నట్లుగా అతడి కనులకు కనపడలేదు.
అతడి చెవులకు మాత్రం ఎవరో బాధాకరంగా దగ్గుతున్న శబ్దం ఇంకా వినపడుతూనే ఉంది.
ఎవరో మరి?! రోడ్డు మీదికి వెళ్ళి చూస్తే గాని తెలియదు - అనుకుంటూ మళ్ళీ గదిలోకి వచ్చి కూర్చుని, ఆ దగ్గు పెడుతున్న బాధను తలుచుని, ఏకాంతంగా కళ్ళు మూసుకుని "దేవుడా, ఆ దగ్గుతున్న వ్యక్తికి ఊరటనివ్వు!" అని మనసులో ప్రార్థిస్తూ కూర్చున్నాడతడు.
ఒక నిమిషం తరువాత ఆ దగ్గుశబ్దం వినపడడం ఆగిపోయింది. అతడికి మనసు కుదుటపడింది. 'హమ్మయ్య!' అనుకుని స్థిమితపడి కూర్చున్నాడు.
కొంత సమయం గడిచింది.
"క్షయవ్యాధితోనే ఆయన చనిపోయాడట, పాపం!" అని గది ముందు కారిడార్ లో నడుస్తూ, ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వెళుతుండడం, లోపల కూర్చునున్న అతడి చెవులకు వినిపించింది.
సమాప్తం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.





Comments