top of page
Original.png

స్నేహ హస్తం

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #స్నేహహస్తం, #SnehaHastham, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, కొసమెరుపు


Sneha Hastham - New Telugu Story Written By - Malla Karunya Kumar Published In manatelugukathalu.com On 22/01/2026

స్నేహ హస్తం - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్

"మీకు తెలియంది కాదు, నా బతుక్కి ఆసరా ఈ దుకాణమే. సాయంత్రం పిల్లల రాకతో దుకాణం కళకళలాడుతూ, నా కాసుల పెట్టె కూడా కళకళలాడేది. కానీ ఆ ముదనష్టపు పిల్లాడి రాకతో ఆ కళ పోయింది!" అపార్ట్‌మెంట్స్ ఎదురుగా ఎప్పటి నుండో దుకాణం నడుపుతున్న వీరేశం అపార్ట్‌మెంట్స్ ప్రెసిడెంట్ భూషణంతో తన గోడు విన్నవించుకుంటూ, కిళ్లీ చుట్టడం పూర్తి చేసి భూషణ్‌కు అందించాడు.


కిళ్లీ అందుకొని, బుగ్గన పెట్టుకుంటూ, "నా దృష్టికి కూడా వచ్చింది. మాసిన బట్టలు, విచిత్రంగా చూపు, ఇంకా చాలా వాడి గురించి వర్ణించారు. సరిగ్గా పిల్లలు ఏవో కొనుక్కునే సమయానికి వచ్చి, వాటిని లాక్కొని పాడుచేస్తున్నాడని, అందరూ గగ్గోలు పెడుతున్నారు. కొందరు వాడికి సైకో అని ముద్ర కూడా వేశారు. కానీ నిర్ధారణ కాకుండా ఏ నిర్ణయం తీసుకోలేం కదా. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి?" కిళ్లీ నములుతూ తన మాట పూర్తి చేశాడు.


"జగ్గయ్య క్వార్టర్స్‌లో ఉంటున్నాడయ్యా!"


గట్టిగా వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి చూసాడు. "సీతయ్య! సమాచారంతో వచ్చేశావా?" ఆశ్చర్యంతో అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సీతయ్య వైపు చూస్తూ అడిగాడు.


"రాత్రి పగలు జల్లెడ వేసి కనిపెట్టాను బాబు!" కాస్త ఆయాస పడుతూ చెప్పాడు సీతయ్య.


"మళ్ళీ నీ పనితనమెంటో నిరూపించుకున్నావు. శభాష్! నాకు శ్రమ తగ్గించావు. అపార్ట్‌మెంట్ వాసులతో అక్కడకు వెళ్లి, ఆ చిచ్చర పిడుగుకి నాలుగు చివాట్లు పెట్టి, మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి." సీతయ్య భుజం తట్టి అక్కడ నుండి గబగబా నడిచాడు.


క్షణాల్లో వార్త అగ్నిలా అపార్ట్‌మెంట్ అంతటా వ్యాపించింది. బాధిత వర్గంతో పాటు, ఆ పిల్లాడు ఎవరన్నది గుర్తు పట్టడానికి కొంతమంది బాధిత పిల్లలతో అక్కడ నుండి జగ్గయ్య క్వార్టర్స్ వైపుకు దారి తీసాడు భూషణం.


"ఉంటున్నది ఆ జగ్గయ్య క్వార్టర్స్‌లో కదా! పాడుబడిన బిల్డింగ్‌లో నివాసం వుండి బుద్ధి కూడా బూజు పట్టుంటుంది. అందుకే పిల్లల నోటి దగ్గర తిండిని లాక్కొని పాడుచేసుంటాడు. ఓ తొడపాసం పెడితే ఇటువైపు చూడటానికి భయపడతాడు!" తలో మాట అంటూ ఉప్పెనలా ముందుకు సాగుతున్నారు.


కొంత సమయానికి ఆవేశంతో జగ్గయ్య క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ ముందు సాగుతున్నారు. ఇంతలో ఆ పిల్లాడు వీళ్లకు అనుకోకుండా ఎదురయ్యాడు. ఆ పిల్లాడిని చూసి వీళ్లతో పాటు వచ్చిన పిల్లలు అరుస్తూ, "వాడే! వాడే! మా స్నాక్స్‌ను లాక్కొని పాడుచేసింది." గట్టిగా అరుస్తూ చెప్పారు.


వీళ్ళ అరుపులతో ఉలిక్కి పడి, వీళ్ళ వైపు చూసి అక్కడ నుండి పరుగుతీశాడు ఆ పిల్లాడు.


పరుగెడుతున్న వాడిని చూస్తూ, "ఎక్కడికి పోతావురా, మేము వచ్చింది నీ తిక్క వదిలించడానికే!" నడకలో వేగం పెంచుతూ, ఆ పిల్లాడి వెంట పడ్డారు తల్లితండ్రులు.


చివరికి వాడు తన ఇంటిలోకి చేరుకున్నాడు. వేగంగా పరుగుతీస్తూ వీళ్ళు కూడా ఆ పిల్లాడి ఇంటిలోకి చేరుకున్నారు.


అప్పటి వరకు ఆవేశంతో వెళ్లిన వాళ్ళు ఒక్కసారిగా నిశబ్దం వహించి ఎదురుగా వున్న వ్యక్తిని చూస్తూ నిలబడి పోయారు.


"బాబు సుందర్! ఏమైంది?" తనని పెనవేస్తూ భయంతో వణికిపోతున్న కొడుకుని అడిగాడు తండ్రి.


అప్పటికే ఇంటిలోకి చేరుకున్న వాళ్ల వైపు చూపిస్తూ ఇంకా గట్టిగా తండ్రిని హత్తుకున్నాడు.


బలవంతంగా తన తలని వాళ్ల వైపుకు తిప్పి, "అయ్యా మీరంతా ఎవరు?" కంగారు పడుతూ అడిగాడు సుందర్ తండ్రి ఈశ్వర్.


"మేమా! నీ కొడుకు చేసిన నిర్వాకానికి బుద్ధి చెప్పాలని వచ్చాం. వాడు ఏం చేశాడో తెలుసా?" అని కోపంతో సుందర్ చేసిందంతా చెప్పారు.


వాళ్ళు చెప్పింది విని కంగారు పడుతూ, సుందర్ వైపు చూసి, "నాన్న ఎందుకు ఇలా చేశావు?" అడిగాడు ఈశ్వర్.


"నువ్వే కదా నాన్న అలాంటి వస్తువులు తినకూడదని చెప్పావు. ఆరోగ్యం పాడవుతుంది కదా, మరి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా." తడబడుతూ చెప్పాడు సుందర్.


కొడుకు మాటలకు తండ్రి కళ్ళు కన్నీటిని వర్షించాయి. వాళ్ల వైపు చూస్తూ, "అయ్యా! నా పేరు ఈశ్వర్. నేను డిగ్రీ వరకు చదువుకున్నా, ఉద్యోగం సాధించలేక పోయాను. ఈ పట్నం వచ్చి దొరికిన పని చేసుకుంటూ పూట గడుపుతున్నాం. అలాగే రంగులు వేసే పని కుదిరింది... సంతోషించాను! కానీ పై అంతస్తుకు రంగులు వేస్తున్న తరుణంలో అదుపు తప్పి పడిపోయాను. ప్రాణాలతో వున్నాను కానీ నా పని నేను చేసుకోలేను, వెన్నుపూస దెబ్బ తింది. ఏ పనికైనా నాకు ఒకరి సహాయం అవసరం. నాకు తోడుగా నా కొడుకు సుందరం ఉంటాడు. నా భార్య కూలికి వెళ్తుంది. ఆమెకు వచ్చే కూలీ మా జీవనాధారం! చిన్న పిల్లాడు కదా చూసిన ప్రతిదీ కావాలంటాడు. అలాగే ఏవో కావాలని అడుగుతుంటాడు. వీడి చిన్ని కోరికలు తీర్చే స్తోమత కూడా నాకు లేదు. ఆ విషయం వాడికి చెప్పినా అర్ధం చేసుకోలేడు. అందుకే అవి తింటే ఆరోగ్యం పాడవుతుంది... నాలా తయారవుతావని చెప్పి వాటి మీద వాడి మనసు విరిచేశాను. అప్పటి నుండి వాడు అలాంటి స్నాక్స్ కావాలని అడగడు. పైగా వేరే వాళ్ళు అలాంటివి కొన్నా వాళ్ళను తిననివ్వడు. ఈ సారికి వాడిని క్షమించండి అయ్యా! మీ చుట్టు పక్కలకు రాకుండా నేను చూసుకుంటాను." బ్రతిమలాడుతూ అన్నాడు ఈశ్వర్.


తెలియకుండానే అందరి కళ్ళు చెమర్చాయి. జీవం ఉన్న జీవచ్ఛవంగా పడి వున్న ఈశ్వర్‌ను చూసి వాళ్ళ మనస్సు తరుక్కుపోయింది.


"ఎంత కాదనుకున్నా చిన్నపిల్లాడు కదా!... మరి వాడికి ఆకలి వేస్తే ఏం చేస్తారు!" అడిగాడు భూషణం తన కళ్లను ఒత్తుకుంటూ.


"ఒకప్పుడు నాకు ఖాళీ దొరికినప్పుడు నేను కొన్ని ప్రయోగాలు చేసే వాడిని! పోషకం కలిగే కొన్ని కూరగాయలతో కొన్ని స్నాక్స్ చేసేవాడిని. ఆ వంటకాల్లో కాస్త నైపుణ్యం కూడా గడించాను. బాగా రుచిగా కూడా ఉంటాయి. ఆ విద్య ఇప్పుడు పనికి వచ్చిందనిపిస్తుంది. నాకు తెలిసినవి మా ఆవిడకి చెప్తే వాటిని చేసి పిల్లాడికి ఇస్తుంది. మా ఇంటిలో వున్న సామానులతో ఆ స్నాక్స్ తయారు చేసి వాడికి పెడుతుంది!" చెప్పాడు ఈశ్వర్.


అంతా విని, 'ఆ పిల్లాడికి నచ్చజెప్పడానికి చెప్పినా, ఈశ్వర్ చెప్పిన విషయంలో నిజం లేకపోలేదు. మన పిల్లలు తింటున్న స్నాక్స్‌లో ఎంత వరకు పోషకాలు ఉంటాయన్నది మనం ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్ళు మనసు పడ్డారని, వాళ్లకు నచ్చినవి కొని ఇచ్చేసి సంతోష పడుతున్నాం. తర్వాత వాటి వలన వాళ్ళ ఆరోగ్యం ఏమౌతుందో అన్న ఆలోచన కూడా చేయడం లేదు. మనం కూడా కొన్ని తింటూ రుచికి ప్రాముఖ్యం ఇచ్చి, పోషకాల గురించి గాలికి వదిలేస్తున్నాం. ఈశ్వర్ ఆర్థికంగా ఇబ్బంది పడినా, తన కొడుక్కి ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తున్నాడు. అభినందించాల్సిన విషయం! మనం కూడా ఈశ్వర్‌కు చేతనైన సహాయం చేయాలి.' అని తనలో అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు భూషణం.


కొంత సమయం తర్వాత, "ఈశ్వర్! నీ పిల్లాడికి ఇలాంటి విషయాలు చెప్పి వాడిని మార్చేశావు. వాడు మా పిల్లల్ని కూడా స్నాక్స్ తిననివ్వడం లేదు. మరి వాళ్ళకు కూడా స్నాక్స్ నువ్వే పెట్టాలి మరి." అన్నాడు భూషణం.


భూషణం మాటలకు కంగారు పడుతూ చూసాడు ఈశ్వర్. మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ వున్నారు.


"కంగారు పడకు ఈశ్వర్! నీ వంటకాలు రుచి మా పిల్లలకు కూడా చూపించు. మేము మీకు సహాయం చేస్తాం. నీ భార్య చేత ఒక స్టాల్ పెట్టిస్తాం. నీ సలహా తో ఆ వంటకాలు ఆమె చేస్తుంది. మేము అందరం నీ దగ్గరే మా పిల్లలకు స్నాక్స్ తినిపిస్తాం." నవ్వుతూ అన్నాడు భూషణం.


భూషణం మాటలు విని మిగతా వాళ్ళు కూడా అంగీకారం తెలుపుతూ ఈశ్వర్‌కు స్నేహ హస్తం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


bottom of page