శ్రీరామనామ కోటి
- Sudha Vishwam Akondi

- Mar 27
- 2 min read

Sriramanama Koti - Telugu Devotional Article | Sudhavishwam Akondi
శ్రీరామనామ కోటి - తెలుగు భక్తి వ్యాసం | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 27/03/2026
కలియుగంలో రామనామ స్మరణయే ధన్యోపాయం అని భక్తులు చెప్పారు. నారాయణ అన్న నామాన్ని ఏ భక్తి లేకుండా పలికితేనే, ఎన్నో కోట్ల పాపాలు నశించి ఉత్తమగతిని పొంది, చివరకు ముక్తినే పొందుతాడని అజామీళుని చరిత్ర తెలుపుతుంది.
శ్రీరామనామస్మరణ అత్యంత పవిత్రమైనది. అటువంటి రామనామాన్ని పుస్తకంలో కోటి సార్లు లిఖించడమంటే, అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? నిత్యం ఆ శ్రీరాముడిని మనసులో నిలుపుకోవడానికి ఇంతకన్న గొప్ప మార్గం ఏమి ఉంటుంది? ఈ కలియుగంలో రామనామాన్ని కోటి సార్లు పుస్తకంలో రాయడం అనేది మనం చేసే ఒక విశిష్టమైన తపస్సు. ఇది ఒక ఆధ్యాత్మిక యజ్ఞం వంటిది. అయితే, కోటి సార్లు రామనామాన్ని లిఖించడం అనేది సామాన్యమైన విషయం కాదు! దీనికి అచంచలమైన భక్తి, దృఢమైన సంకల్పం అవసరం.
రామకోటి రాయడానికి కులమతాలతో పనిలేదు. శ్రీరామునిపై భక్తిశ్రద్ధలు ఉన్న ఎవరైనా ఈ ఉత్కృష్టమైన వ్రతాన్ని చేపట్టవచ్చు. ఇది ఒక యజ్ఞం! మీ మనసులో రాముడిపై ఉన్న అచంచల భక్తే దీనికి ప్రధాన అర్హత!
నిత్యం ఆ రామయ్యను తలచుకుంటూ, మీ రోజువారీ సమయంలో కొంత భాగాన్ని ఆయన కోసం కేటాయించగలననే నమ్మకం ఉంటే నిరభ్యంతరంగా రామకోటి రాయడాన్ని ప్రారంభించవచ్చు.
రామకోటి రాయడం ఏ రోజైనా మొదలుపెట్టవచ్చు. కానీ శ్రీరామనవమి నాడు ప్రారంభించడం అత్యుత్తమం. ఇంకా ఈ రోజునే కాకుండా హనుమాన్ జయంతి, ముక్కోటి ఏకాదశి, ప్రతి నెలలో వచ్చే పునర్వసు నక్షత్రం, ఏకాదశి, పౌర్ణమి లేదా మంగళ, గురువారాల్లో, కార్తీక మాసం, మాఘ మాసం లేదా వైశాఖ మాసాల్లోని ముఖ్యమైన రోజుల్లో రామకోటి రాయడం మొదలుపెట్టే విశేష ఫలాలు అందుతాయని పండితులు చెబుతున్నారు.
రామకోటి రాయడానికి ప్రత్యేకంగా గళ్లు కొట్టిన పుస్తకాలు మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. మరీ చిన్న గళ్లు కాకుండా, రాయడానికి వీలుగా ఉండే పెద్ద గళ్ల పుస్తకాలను ఎంచుకోవాలి. ఒక్కో పుస్తకంలో లక్ష గడులున్నవి మీకు లభ్యమవుతాయి. ఒకవేళ పుస్తకం దొరకనట్లయితే, తెల్ల కాగితాల పుస్తకంలో గడులు కొట్టుకుని రాయవచ్చు.
పుస్తకాలు తెచ్చుకున్నాక ఒక శుభ ముహూర్తాన వాటికి పసుపు, కుంకుమలు అద్ది, పూజ గదిలో ఉంచి, పుష్పాలతో పూజించి లేదా నమస్కారం చేసుకుని, శ్రీరామచంద్రునికి మనసారా నమస్కరించి, రాయడం మొదలుపెట్టాలి.
నామం రాసేటప్పుడు కేవలం 'రామ' అని కాకుండా 'శ్రీరామ' అని రాయడం విశేషం. దీనివల్ల సీతమ్మవారు, రాముడు ఇద్దరినీ స్మరించినట్లవుతుంది. 'శ్రీ' అంటే అమ్మ. సీతమ్మతో కూడిన రాముడు తండ్రిలా రక్షిస్తాడు.
ఒక లక్ష నామాల పుస్తకం పూర్తి కాగానే ఆ పుస్తకాన్ని భద్రపరచాలి. కోటి నామాలు పూర్తయ్యాక ఆ పుస్తకాలను భద్రాచల క్షేత్రంలో గానీ, లేక రామకోటి పుస్తకాలను స్వీకరించే ఏదైనా రామాలయంలో గానీ సమర్పించాలి. ఏదీ వీలుకాకపోతే పవిత్రమైన నదిలో నిమజ్జనం చేయవచ్చు. అయ్యో, మేము ఎంతో కష్టపడి రాసిన పుస్తకాలను నదిలో వదిలి పెట్టాలా అని అనిపించవచ్చు, కానీ నదిని మించిన పవిత్ర స్థలం ఏముంటుంది? మనసులో శ్రీరాముడిని నింపుకుని రాసిన రామకోటి ఎప్పుడో రాముడికి అర్పితమైందని అర్థం. రామకోటి రాయాలని ఆలోచన మన మనసులో వచ్చినప్పుడే ఆ రాముడి అనుగ్రహానికి పాత్రులమయ్యామని అర్థం!
శ్రీరామ జయరామ.
🙏🙏🙏🙏🙏
అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు 💐 💐 💐
సుధావిశ్వం
***
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, rama koti telugu, sri rama nama koti, rama navami special |




Comments