సుపారీ... సుఖాంతం కాదు
- Karlapalem Hanumantha Rao

- Jun 9
- 5 min read
తెలుగు క్రైమ్ కథ, వ్యంగ్య కథ, సుపారీ హంతకుడు, గంగులు కథ, తెలుగు సస్పెన్స్ కథ, క్రైమ్ థ్రిల్లర్ తెలుగు, డిటెక్టివ్ కథ, తెలుగు వెబ్ కథలు, హాస్య క్రైమ్ కథ, నేరం మరియు శిక్ష, ఉత్కంఠభరిత కథ, తెలుగు కథ

Suparee Sukhantham Kadu - Telugu Crime Story | Karlapalem Hanumantha Rao
సుపారీ... సుఖాంతం కాదు - తెలుగు క్రైమ్ కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 09/06/2026
నేర ప్రపంచంలో తెలివితేటలు, జాగ్రత్తలు, రహస్యాలు ఎంత ముఖ్యమో చెప్పే ఆసక్తికరమైన వ్యంగ్య కథ "సుపారీ... సుఖాంతం కాదు!". వృత్తిరీత్యా సుపారీ హంతకుడైనా, ప్రవృత్తిరీత్యా సెంటిమెంటల్ మనిషైన గంగులు ఒక హత్య ఒప్పందాన్ని పూర్తి చేయడానికి బయలుదేరుతాడు. కానీ సాక్ష్యంగా తీసుకురావాల్సిన ఒక చిన్న చర్మం ముక్క అతని జీవితాన్నే తలకిందులు చేస్తుంది. ఉత్కంఠ, హాస్యం, వ్యంగ్యం, అనూహ్య మలుపులతో సాగిపోయే ఈ కథ చివరి వరకు పాఠకుడిని కట్టిపడేస్తుంది.
గంగులు వృత్తిరీత్యా సుపారీ హంతకుడు. ప్రవృత్తిరీత్యా పరమ సెంటిమెంటలిస్టు. అందుకే ఏ డీల్ అయినా సరే, అమౌంట్ మీద అదనంగా నూట పదహారు రూపాయలు ఎక్కువ పుచ్చుకుంటాడు.
ఆలెక్క ప్రకారమే మాట్లాడుకున్న సుపారీ మొత్తం 5లక్షల నూట పదహార్లలో సగం, అంటే—రెండు లక్షల యాభై వేల యాభై ఎనిమిది రూపాయలు—పరమేశం నుంచి అడ్వాన్సుగా తీసుకుని రంగంలోకి దిగాడు గంగుల్. మిగతా సగం పని పూర్తయ్యాక.
ఈసారి గంగులుకి వచ్చిన కాంట్రాక్ట్ చాలా విచిత్రమైనది, విలక్షణమైనది. ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ పరమేశం శత్రువుని లేపేయాలి, కానీ లేపేసింది నిజమేనని నమ్మకం కుదరడానికి గంగులు ఒక ఖచ్చితమైన ప్రూఫ్ తీసుకురావాలి.
"చూడు గంగులూ! వాడు చచ్చాడని నాకు ఎలా నమ్మకం? వాడు చనిపోయాక, వాడి కుడి కాలర్ బోన్ మీద ఉండే ఆ రెండు అంగుళాల నల్లటి పుట్టుమచ్చ ఉన్న చర్మం ముక్కని కోసుకురావాలి. అదే నీకు బాలెన్స్ అమౌంట్ తెచ్చిపెట్టే టోకెన్!" అని కండిషన్ పెట్టాడు పరమేశం.
" చర్మం ముక్కే కదా బాబూ... చీరె ముక్కలా కోసుకురాకపోతే నన్ను అడగండి," అని నమ్మకంగా నవ్వి అడ్వాన్స్ డబ్బుల బ్యాగ్ సర్దుకున్నాడు గంగులు.
స్కెచ్ ప్రకారం గంగులు అర్ధరాత్రి వేళ టార్గెట్ ఇంటికి వెళ్ళాడు. ఆ వ్యక్తి గాఢనిద్రలో ఉండగా, తన ప్రొఫెషనల్ స్టయిల్లో శబ్దం రాకుండా గొంతు నులిమి పని ముగించేశాడు. పని పూర్తి కాగానే శవానికి ఉన్న షర్ట్ బటన్స్ విప్పి, లైట్ వేసి చూశాడు. కుడి కాలర్ బోన్ మీద చక్కటి రేగుపండంత నల్లటి పుట్టుమచ్చ మెరుస్తోంది.
గంగులు తన జేబులోంచి పదునైన సర్జికల్ బ్లేడ్ తీశాడు. కాలర్ పక్కనే ఉన్న ఆ చర్మం ముక్కని కసకసా కోసేశాడు. రక్తం అంటకుండా దాన్ని ఒక ప్లాస్టిక్ జిప్‌లాక్ కవర్‌లో పెట్టి, జీన్స్ ప్యాంట్ కుడి జేబులో భద్రంగా దాచుకున్నాడు.
ఆ బిల్డింగ్ వెనుక సందులోంచి తప్పించుకుందామని గంగులు గోడ దూకుతుండగా, అనుకోకుండా ఆ ఏరియా నైట్ పెట్రోలింగ్ పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. గంగులు కంగారుపడ్డాడు. గోడ పైనుంచి కింద ఉన్న ముళ్లపొదల్లోకి దూకేశాడు. ప్రాణం ముఖ్యం కదా! వగరుస్తూ, చీకట్లోకి పరుగు తీసి ఎలాగోలా తన రూమ్‌కి చేరుకున్నాడు.
రూమ్‌కి వచ్చి, తలుపులు గడియపెట్టి, ఊపిరి పీల్చుకుని జేబులో చేతులు పెట్టాడు గంగులు.
జేబు ఖాళీగా ఉంది! గంగులు గుండె ఆగినంత పనైంది. రెండు లక్షల యాభై వేల యాభై ఎనిమిది రూపాయలు కళ్ళముందు ఆవిరైపోతున్నట్టు అనిపించింది. ఆ చర్మం ముక్క లేకపోతే పరమేశం రూపాయి విదల్చడు!
'ఎక్కడ పడిపోయి ఉంటుంది? కచ్చితంగా ఆ గోడ దూకిన చోటే, ముళ్లపొదల్లోనే పడిపోయి ఉండాలి.' అనుకున్నాడు గంగులు, పొదలోని ముళ్ళకు తగిలి చిరిగిపోయిన పాకెట్ తడుముకుంటూ.
సమయం తెల్లవారుజామున నాలుగు కావస్తోంది. ఇప్పుడు వెళ్ళకపోతే పొద్దున్నే ఎవడో ఒకడు చూస్తాడు, లేదా కాకులు, కుక్కలు ఎత్తుకుపోతాయి. ప్రాణానికి తెగించి, చేతిలో ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకుని మళ్ళీ అదే స్పాట్‌కి బయలుదేరాడు గంగులు.
చీకటి ఇంకా విడిపోలేదు. గంగులు ఆ బిల్డింగ్ వెనుక సందులోకి పిల్లిలా అడుగులు వేస్తూ వచ్చాడు. తను దూకిన గోడ దగ్గరికి వచ్చి, మోకాళ్ల మీద కూర్చుని టార్చ్ లైట్ వేసి వెతకడం ప్రారంభించాడు.
"ఎక్కడుంది రా నాయనా... నా రెండున్నర లక్షల చర్మం ముక్క!" అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటూ ఎండుటాకులు, ముళ్లపొదలు పక్కకు జరుపుతున్నాడు.
అదే సమయంలో, సరిగ్గా గంగులు వెనుక ఒక నీడ వచ్చి నిలబడింది. ఆ నీడ చేతిలో లాఠీ ఉంది. గంగులు వెతకడంలో మునిగిపోయి వెనుక ఎవరో వచ్చారనే సంగతి గమనించలేదు.
"ఏయ్! ఎవడ్రా నువ్వు? ఈ టైంలో అక్కడ ఏం పీకుతున్నావ్?" అన్నాడు ఒక గంభీరమైన కంఠంతో సబ్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్. ఆయన నైట్ డ్యూటీ ముగించుకుని జీప్ పక్కన ఆపి, అటుగా నడుచుకుంటూ వస్తున్నాడు.
గంగులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. భయంతో తడిసిపోయాడు కానీ, కాస్త సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు.
మొఖం మీద అమాయకత్వాన్ని పులుముకుని, "అది... అది... సార్! నా పర్సు పడిపోయింది సార్. రాత్రి ఇటుగా వెళ్తుంటే పడిపోయింది, అందుకే వెతుకుతున్నా," అన్నాడు వణుకుతున్న స్వరంతో.
ఎస్.ఐ. శివప్రసాద్ కి గంగులు మీద అనుమానం వచ్చింది. ప్యాంట్ చిరిగి ఉంది, చేతులు వణుకుతున్నాయి. "పర్సా? నిజంగా పర్సేనా? జేబులు..." అంటూ ఎస్.ఐ. టార్చ్ లైట్ తీసుకుని కింద ఉన్న పొదల్లోకి వేశాడు. అక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ మెరుస్తూ కనిపించింది.
"అదేంటి?" అంటూ ఎస్.ఐ. వంగి ఆ కవర్ ని తీసుకున్నాడు. అందులో రక్తం అంటిన ఒక చర్మం ముక్క, దాని మీద నల్లటి పుట్టుమచ్చ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
శివప్రసాద్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. "ఇదేంట్రా? చికెన్ ముక్కా? మటన్ ముక్కా? పొదల్లో దాచావ్?"
గంగులు తల గొక్కుంటూ, "అది... అది... నా మెడకు దెబ్బ తగిలి చర్మం ఊడిపోతే ప్లాస్టిక్ కవర్ లో దాచుకున్నా సార్. హాస్పిటల్ కి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందామని..." అని ఒక సిల్లీ అబద్ధం చెప్పాడు.
"నీ మెడ చర్మం ముక్క ఇంత లావుగా, రెండు అంగుళాల సైజులో ఉంటుందా? నడు నడు... స్టేషన్ కి నడు. అక్కడ మాట్లాడదాం," అని గంగులుని జీపులోకి నెట్టాడు ఎస్.ఐ.
స్టేషన్‌కి తీసుకెళ్ళి బెల్ట్ ట్రీట్‌మెంట్ మొదలుపెట్టేసరికి, గంగులు తట్టుకోలేక నిజం కక్కేశాడు. "నేను సుపారీ హంతకుడిని సార్. పరమేశం అనే ఆయన ఐదు లక్షల నూట పదహారు రూపాయలు ఇస్తానంటే ఈ పని చేశా. నన్ను నమ్మండి సార్, ఆ పరమేశమే నన్ను వాడుకున్నాడు. ఈ చర్మం ముక్క చూపిస్తే మిగతా డబ్బులు ఇస్తానన్నాడు," అని బావురుమన్నాడు.
సరిగ్గా అదే సమయానికి స్టేషన్ ఫోన్ మోగింది. కానిస్టేబుల్ కనకాంబరం ఫోన్ ఎత్తి, ఎస్.ఐ. వైపు చూసి, "సార్, గంగులు చెప్పిన ఏరియాలోనే ఒక మర్డర్ జరిగిందట సార్. శవం కాలర్ బోన్ దగ్గర చర్మం కోసేసి ఉందట!" అన్నాడు.
ఎస్.ఐ. శివప్రసాద్ నవ్వుతూ గంగులు వైపు చూశాడు.
"ఒరేయ్ గంగులూ! నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్ వి అనుకున్నా కానీ, పరమ అమాయకుడివిరా. ఆ పరమేశంగాడు నిన్ను చర్మం కోసుకురమ్మని ఎందుకు అన్నాడో తెలుసా, ఆ చర్మం ముక్కతో నిన్ను ఈ మర్డర్ కేసులో ఇరికించాలని ప్లాన్. కానీ నువ్వే తప్పు చేయబోయే తొందర్లో పప్పులో కాలేశావ్!”
గంగులు అర్ధం కానట్టు మొఖం పెట్టాడు. "నేనేం చేశాను సార్?"
ఎస్.ఐ. నవ్వు ఆపుకుంటూ, "నువ్వు వెదికి వెదికి హతుడి కాలర్ బోన్ మీద చర్మం ముక్క కోశావు కదా... కంగారులో బ్లేడ్ తో ఇంకాస్త పక్క దాకా కోసేసావు. హతుడి షర్ట్ కాలర్ లోపలి క్లాత్ ముక్క ఆ చర్మానికి అంటుకుందని నీకు తెలీదు! అది లాండ్రీ షాప్ నుండి ఇస్త్రీ అయి వచ్చిన షర్ట్. ఆ షాప్ వాడు కంపెనీ మార్కర్ తో కాలర్ లోపల తన షాప్ పేరు, గుర్తు కోసం , క్లయింట్ ఫోన్ నెంబర్ కూడా రాశాడు!"
గంగులు షాక్!
ఎస్.ఐ. లాఠీ తిప్పుతూ, "నువ్వు ఒకవేళ ఆ చర్మం ముక్క పరమేశానికి ఇచ్చినా... వాడు నిన్ను పట్టించే లోపే, ఆ షర్ట్ ముక్క మీద ఉన్న లాండ్రీ షాపు పేరు, హతుడి నెంబర్ చూసి మే పరమేశాన్ని, నిన్ను ఇద్దరినీ బొక్కలో వేసేవాళ్ళం. కానీ నువ్వే అంతకంటే ముందే ఆ ముక్క కోసం వచ్చి మా డ్యూటీ సులువు చేశావు!”
గంగులు తల పట్టుకున్నాడు. ఐదు లక్షల నూట పదహారు రూపాయల సుపారీ డీల్ కాస్తా... లాండ్రీ వాడి పుణ్యమా అని జైలు పాలు చేసేసింది. పాపం …. గంగులు!
***
సమాప్తం.
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.









Comments