తప్పు ఎవరిదో
- Peddada Sathyanarayana
- 2 days ago
- 3 min read
#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #ThappuEvarido, #తప్పుఎవరిదో, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Thappu evarido - New Telugu Story Written By - Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 18/10/2025
తప్పు ఎవరిదో - తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
“ఏమండోయి! మనం గుడికి త్వరగా వెళ్లాలి. మీకే తెలుసు గదా — పండగ రోజుల్లో అర్చన చేయించుకోవడానికి భక్తులు బారులు తీరుతారు,” అంది నీరజ.
“సరే, కానీ నీవు చెప్పదలచుకున్నది సూటిగా చెప్పు. నాకు ఇంకొన్ని పనులున్నాయి,” అన్నాడు రమణ.
“పనిమనిషి తోమిన కప్పులు, గిన్నెలు గూట్లో సర్దేయండి. ఈలోపల నా పూజ అయిపోతుంది,” అంది నీరజ.
“అంతేనా? పది నిమిషాల్లో సర్దేస్తాను,” అన్నాడు రమణ. పింగాణీ కప్పులు సర్దుతుండగా, ఒక్కసారిగా చేతిలోంచి ఒక కప్పు జారి కింద పడి పగిలిపోయింది.
పూజ పూర్తయిన నీరజ, పగిలిన కప్పు చూసి కోపంగా, “ఇందుకే మీకు పని చెప్పను. ఏ పని చెప్పినా, ఏదో ఆలోచిస్తూ చేస్తారు. అంత ఆలోచించాల్సిన విషయమేమిటో అర్థం కాదు! ఆ కాఫీ కప్పుల సెట్టు మా నాన్న బాంబే నుంచి వెయ్యి రూపాయలు పెట్టి కొని ఇచ్చారు. అంటే మీరు పగలకొట్టిన కప్పు ధర 180 రూపాయలు! అంత ఓటు చేతి ఏమిటండీ?” అని శ్వాస ఆపకుండా మాటల దండకం మొదలుపెట్టింది.
“అదీ, అనుకోకుండా జారి పగిలిపోయింది. సరే, గుడి మూసేసే టైమ్ అవుతోంది, తయారవ్వు,” అని జారుకున్నాడు రమణ.
ఇంతలో పిల్లలు, “డాడీ, మేము కూడా గుడికి వస్తాం!” అని అరిచారు. యూకేజీలో చదివే రజని, ఒకటో తరగతిలో ఉన్న విశాల్ కూడా సిద్ధమయ్యారు.
“ఓకే, మీరు కూడా రండి. టిఫిన్ తిన్నారా?” అని అడిగాడు రమణ.
“బామ్మ పెట్టింది డాడీ,” అని జవాబిచ్చింది ప్రీతి.
“డాడీ, నాకు ఓ డౌట్!” అన్నాడు విశాల్.
“ఏంటిరా నీ డౌట్?” అని రమణ అడిగాడు.
“డాడీ, బామ్మకి తోక ఉందా?” అన్నాడు విశాల్.
“అదేంటిరా?” అని ఆశ్చర్యపోయాడు రమణ. “నీకు ఎందుకు అలా అనిపించింది?”
“బామ్మ మాకు టిఫిన్ పెడుతూ, ‘మీకిద్దరికీ టిఫిన్ పెట్టే సరికి నాతల ప్రాణం తోకకి వస్తోంది!’ అని కోపపడింది కదా డాడీ!” అన్నాడు విశాల్.
రమణ నవ్వుకుంటూ, “అదే సామెత రా, అర్థం చెప్పుతాను,” అని పిల్లలకు అర్థం చెబుతూ, “సరే, పదండి, గుడికి బయలుదేరుదాం,” అన్నాడు.
నెలరోజుల తర్వాత...
నీరజ ఫోన్‌లో మాట్లాడుతూనే, షోకేసులో ఉన్న తాజ్‌మహల్ గ్లాస్ బొమ్మను తాకగా, అది జారి కింద పడి ముక్కలయిపోయింది.
“నీరజా! జాగ్రత్తగా పని చేయొచ్చుగా!” అన్నాడు రమణ.
“ఏమన్నారు? నేను అజాగ్రత్తగా పని చేస్తున్నానా? మా అమ్మకి కంటి ఆపరేషన్ అయ్యింది.
సెల్‌లో మాట్లాడుతూ ఉండగా జారి పడింది. నేను ఈ బొమ్మ వద్దన్నా మీరు వెయ్యి రూపాయలతో కొన్నారు. ఇప్పుడు అది పగిలిందని నేను నష్టపరిచానంటారా?” అంటూ నీరజ ఏడవడం మొదలుపెట్టింది.
“నీరజా, తప్పు నాదే. నీవు వద్దన్నా పిల్లల కోసం కొన్నాను. అయిందేదో అయ్యింది, ఇక ఏడవకు,” అన్నాడు రమణ సాంత్వనగా.
తర్వాత రోజు నీరజ తల్లి కంటి లేసర్ ట్రీట్మెంట్ అయి ఇంటికి వచ్చింది.దిగులుగా ఉన్న నీరజతో “నీవు అలా బాధపడడం అక్కర్లేదు. అది చిన్న ట్రీట్మెంట్ మాత్రమే,” అన్నాడు రమణ.
“మీకేమీ తెలియదు! అమ్మను చూసి రావాలనుంది,” అంది నీరజ.
“నీరజా, గుర్తుందా? మా నాన్నకి కంటి ఆపరేషన్ చేసినప్పుడు నీవేమన్నావో?” అని రమణ అడిగాడు.
“గుర్తుంది లెండి. కానీ అమ్మ విషయమంటే వేరే,” అంది నీరజ.
“సరే, నీ ఇష్టం,” అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు రమణ.
కొన్ని రోజులకు...
“ఏమండోయి! ప్రీతీ పుట్టినరోజుకి డ్రెస్ కొన్నాను. బాగుందా?” అని అడిగింది నీరజ.
“చాలా బాగుంది. ఇంతకీ నీ చీర ఏది? మన ఇల్ల్లో ఎవరి పుట్టినరోజైనా చీర కొనుక్కోవడం ఆనవాయితీ కదా?” అన్నాడు రమణ.
“మీరు దెప్పి పొడుస్తారనే ఈసారి కొనలేదు. ఈసారి నాకు బట్టలు పెట్టుకునేందుకు గోద్రెజ్ అలమారా కొనండి,” అంది నీరజ.
“ఇప్పటికే నీకు రెండు అలమరాలు ఉన్నాయి గదా, అవే సరిపోవవు?” అన్నాడు రమణ.
“సరిపోవడం లేదు. ఇంకోటి కావాలి,” అంది నీరజ.
“గోద్రెజ్ అలమారా అంటే కనీసం 25,000 అవుతుంది. ఇప్పట్లో కష్టమయ్యే పని.”
“పొనీ, లోకల్ కంపెనీది పదిహేను వేలకే వస్తుంది. కనీసం అదైనా కొనండి,” అంటూ బతిమాలింది నీరజ.
“ఇప్పట్లో సాధ్యం కాదు. కావాలంటే రెండు వేల రూపాయలతో చీర కొనుక్కో,” అన్నాడు రమణ.
“సరే, పర్వాలేదు. నేను చూసుకుంటాను,” అని వెళ్లిపోయింది నీరజ.
మరుసటి రోజు రమణ ఆఫీస్ నుంచి వచ్చి చూసాడు — తన బట్టలన్నీ కిటికీ దగ్గర ఉన్నాయి!
“నీరజా! నా పాంట్లు, షర్ట్లు కిటికీ దగ్గర ఎందుకు పెట్టావు?” అని కోపంగా అడిగాడు.
“మీ అలమరాలో నా బట్టలు సర్దుకున్నాను. మీవి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు,” అని ప్రశాంతంగా జవాబిచ్చింది నీరజ.
“నీ బట్టలు కిటికీ దగ్గర పెట్టుకుంటే సరిపోయేది కదా?” అన్నాడు రమణ.
“అలా పెడితే ఎవరు వచ్చినా చూస్తారు. అవమానం మీకే కదా!” అని తర్కించింది నీరజ.
మరుసటి నెలలో రమణ కొత్త అలమారా కొనక తప్పలేదు.
ఒకరోజు బామ్మర్ది ప్రసాద్ ఇంటికొచ్చాడు. “అమ్మ ఎలా ఉంది?” అని అడిగాడు రమణ.
“ఇప్పుడు బాగుంది. వాకింగ్‌కి కూడా వెళ్తోంది,” అన్నాడు ప్రసాద్.
“సరే, మీరు మాట్లాడండి. నేను కాఫీ తెస్తాను,” అని నీరజ వంటింట్లోకి వెళ్లిపోయింది.
రమణ అప్పుడు ప్రసాద్ ని చూసి, “నీ అక్కయ్య మనసు అర్థం కావడం లేదు,” అన్నాడు.
“బావా, ఆడవాళ్ల మనసు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ల చేతులు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ల మనసు అర్థమవుతుంది,” అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.
“థాంక్యూ! ఇక నీ చేయి ఎందుకు వాచింది?” అని అడిగాడు రమణ.
“బావా, ఎదుటివారికి సలహా ఇవ్వడం తేలికే... కానీ దాన్ని పాటించడం కొంచెం కష్టమే!” అని ప్రసాద్ నవ్వాడు.
ఇద్దరూ హాస్యంగా నవ్వుకుంటారు.
***
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
Comments