తెర వెనుక రాక్షసుడు
- Munipalle Vasundhara Rani
- 2 days ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #TheraVenukaRakshasudu, #తెరవెనుకరాక్షసుడు, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

బామ్మ కథలు - 9
Thera Venuka Rakshasudu - New Telugu Story Written By Vasundhara Rani Munipalle
Published in manatelugukathalu.com on 05/01/2026
తెర వెనుక రాక్షసుడు - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
ఆ రోజు ఆదివారం కావడంతో విశ్వ, చింటూ, నీలిమ ముగ్గురూ హాల్‌లోనే ఉన్నారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. విశ్వ తన ఐప్యాడ్‌లో కొత్త యుద్ధ విమానాల గేమ్ ఆడుతుంటే, చింటూ తన ఫోన్‌లో చిన్న చిన్న వీడియోలు చూస్తున్నాడు. నీలిమ తన ట్యాబ్‌లో డిజిటల్ పెయింటింగ్ వేస్తోంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, కేవలం ఆ యంత్రాల నుండి వచ్చే శబ్దాలు తప్ప మనుషుల మాటలు వినిపించడం లేదు.
బయట ఒక్కసారిగా మబ్బులు పట్టి వర్షం మొదలైంది. గాలి వానకు ఉతికిన బట్టలన్నీ తడిసిపోతుంటే బామ్మ వంటగది నుండి, “పిల్లలూ, బయట వర్షం పడుతోంది. త్వరగా వెళ్లి బట్టలు తీయండి. లేకపోతే తడిసిపోతాయి” అని బిగ్గరగా అరిచింది. కానీ ఎవ్వరి దగ్గర నుండి సమాధానం రాలేదు. బామ్మ మళ్ళీ రెండు మూడు సార్లు పిలిచినా పిల్లలు పలకలేదు. ‘అసలు వీళ్ళు ముగ్గురూ ఏం చేస్తున్నారు’ అని బామ్మ గబగబా వసారాలోకి వచ్చింది. అక్కడ ముగ్గురూ ఎవరి లోకంలో వాళ్ళు మునిగిపోయి ఉండటం చూసి బామ్మ ఆశ్చర్యపోయింది.
“పిల్లలూ! బయట వర్షం పడి ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు వచ్చింది చూడండి” అని పిలిచింది.
విశ్వ తల కూడా పైకి ఎత్తకుండా నేను గూగుల్‌లో ఇంతకంటే మంచి ఇంద్రధనస్సు ఫోటోలు చూశాను బామ్మా” అని సమాధానం ఇచ్చాడు.
చింటూ, నీలిమ కూడా తమ స్క్రీన్లకే అతుక్కుపోయారు. బామ్మ వారి పక్కన కూర్చుని మెల్లగా అంది, “పాపం మీ దగ్గర ఉన్న సమయాన్ని ఆ తెర వెనుక రాక్షసుడు దొంగిలిస్తున్నాడని మీకు తెలియడం లేదు. సమయం ఒక్కటే కాదు, మీ కంటి ఆరోగ్యాన్ని, అసలైన ఆనందాన్ని కూడా దొంగిలిస్తున్నాడు.”
ఆ తెర వెనుక రాక్షసుడు పేరు వినగానే పిల్లలు ఒక్కసారిగా తమ గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి బామ్మ వైపు చూశారు. “ఎవరా రాక్షసుడు బామ్మా” అని అడిగాడు విశ్వ.
బామ్మ తన కథను మొదలుపెట్టింది.
“పూర్వం ఒక మాయా లోకంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి మనుషుల కళ్లలో ఉండే కాంతిని, వాళ్ల నవ్వుల్ని చూస్తే చాలా అసూయగా ఉండేది. అందుకే వాడు మనుషుల మధ్య మాయా అద్దాలను పెట్టాడు. మనుషులు ఆ అద్దాల్లో తమని తాము చూసుకుంటూ అందులో కనిపించే రంగుల లోకంలో మునిగిపోయేవారు. అలా వాళ్లు ఆ అద్దాల వైపు చూస్తున్న ప్రతి నిమిషం ఆ తెర వెనుక రాక్షసుడు వాళ్లకు తెలియకుండానే వాళ్ల జీవితంలోని సమయాన్ని దొంగిలించి ఒక పెద్ద చీకటి పెట్టెలో దాచేసేవాడు.
మనుషులు ఆ అద్దాలను చూస్తూ అలాగే ఉండిపోయేవారు. వాళ్ల పక్కన ఉన్న అమ్మ, నాన్న, స్నేహితులు పిలుస్తున్నా వాళ్లకు వినిపించేది కాదు. అలా సమయం గడిచేకొద్దీ వాళ్ల మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోయి మనుషులు ఒకరికొకరు అపరిచితులుగా మారిపోయారు. ఆ రాక్షసుడు ఎంత సమయాన్ని దొంగిలిస్తే వాడు అంత బలవంతుడు అయ్యేవాడు. చివరికి ఆ రాజ్యంలో మనుషులు ఉన్నా మాటలు లేని ఒక నిశ్శబ్ద లోకంలా మారిపోయింది.”
విశ్వ తన ఐప్యాడ్ వైపు చూసి “బామ్మా! ఈ ఐప్యాడ్ కూడా ఆ మాయా అద్దం లాంటిదేనా” అని అడిగాడు.
“అవును విశ్వా” అని బామ్మ అంది.
“ఈ యంత్రాలు మన కళ్ళను కట్టిపడేసి మన చుట్టూ ఉన్న అందమైన లోకాన్ని, మన వాళ్లని దూరం చేస్తున్నాయి.
రాక్షసుడు దొంగిలించేది గడియారంలోని సమయం కాదు, మన జ్ఞాపకాల్లో ఉండాల్సిన సమయాన్ని. రేపు నువ్వు అమెరికా వెళ్లిపోయాక కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు, అప్పుడు అక్కడ ఆడుకుందామన్నా వీళ్లిద్దరూ నీ పక్కన ఉండరు. అప్పుడు నీకు నీ గేమ్ గుర్తుంటుంది కానీ నీ పక్కనే ఉన్న చింటూ, నీలిమలతో కలిసి నవ్వుతూ గడిపిన క్షణాలు మాత్రం గుర్తుండవు” అని బామ్మ వివరించింది.
బామ్మ మాటలు వినగానే విశ్వకు తాను మనుషుల మధ్య ఉండి కూడా ఎంత ఒంటరిగా ఉన్నాడో అర్థమైంది. పిల్లలు ముగ్గురూ ఒక్కసారిగా తమ గ్యాడ్జెట్స్ పక్కన పడేశారు. విశ్వ గబగబా వెళ్లి వర్షంలో తడుస్తున్న బట్టలన్నీ తీసుకుని లోపలికి వచ్చాడు. ఆ రోజు వాళ్ళ జ్ఞాపకాల పెట్టెలో ఆ రాక్షసుడు దొంగిలించలేని ఎన్నో అందమైన క్షణాలు వచ్చి చేరాయి.
***
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.
