తిక్క తీరిందా.. తింగరోడా!
- Nallabati Raghavendra Rao

- 1 day ago
- 8 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #తిక్కతీరిందాతింగరోడా, #ThikkaTheerindaThingaroda, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Thikka Theerinda Thingaroda - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 28/01/2026
తిక్క తీరిందా తింగరోడా - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
భలేభలేరావు ఆ టౌన్లో రోడ్డుమీద పరుగు పెడుతున్నాడు. పరుగు పెట్టలేక అతనికి ఆయాసం వస్తుంది. దారిలో కనిపించిన తన మిత్రుడు అప్పారావుని సైకిల్ అడగాలని ఆపుచేసి కాళ్లు పట్టుకోవడానికి అహం అడ్డువచ్చి చేతులు పట్టుకొని బ్రతిమలాడినప్పటికీ అతను సైకిల్ ఇవ్వకపోగా అతని దగ్గర సైకిల్ బలవంతంగా లాక్కొని చాలా వేగంగా తొక్కుతున్నాడు భలేభలేరావు.
రిక్షాలో వెళుతున్న ఆ అమ్మాయిని రక్షించాలి. ఆమెతో పాటు ఆమె కట్టుకున్న బంగారపురంగు శారీని కూడా రక్షించాలి. జరగబోయే ప్రమాదం తప్పించాలి. ప్రతి సంవత్సరం ఆ టౌన్లో ఉన్న "సాహసం సేయరా డింభకా" అనే స్వచ్ఛంద సేవాసంస్థ సాహసాలు ప్రదర్శించిన యువకులకు 'సాహసయువత' అవార్డుతో పాటు లక్ష రూపాయలు బహుమతి ఇస్తుంటారు. అదిగో అది పట్టేయాలని భలేభలేరావు ప్రయత్నం అన్నమాట. రెండు సంవత్సరాల నుండి అదీ అతని తపన.
ఆ టౌన్లో చాలామందికి అతని గురించి తెలుసు కనుక భలేభలేరావు రోడ్డుమీద ఎన్ని సాహస ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా వాళ్లెవరూ అంతగా పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఎవరు తనను పట్టించుకోకపోయినా తను మాత్రం వాళ్ళందరినీ పట్టించుకుంటూనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆరు నెలల క్రితం వాటర్ ట్యాంకు పైకి ఎక్కేసిన అబ్బాయి క్రిందకు దూకేయకుండా రక్షించాలని జేబులో ఉన్న బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుని గబగబా 500 మెట్లు ఉన్న వాటర్ ట్యాంకు చాలా కష్టపడి, ప్రయాసపడి ఎక్కాడు. తీరా పైకి ఎక్కాక అతను వాటర్ ట్యాంకు రిపేరు చేస్తున్న అబ్బాయి అని తెలుసుకుని నీరసపడిపోయాడు.
'''అయ్యో నీకేం కష్టాలు లేవా? దూకడానికి ప్రయత్నించడం లేదా? కిందపడి చావాలని నిర్ణయించుకో లేదా? అట్టాకాదు కానీ.. గతంలో సమస్యలు ఏమైనా ఉన్నాయేమో గుర్తుకు తెచ్చుకుని కొంచెం ప్రయత్నించవయ్యా బాబు." అంటూ క్రిందకు వంగి ఆ అబ్బాయి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడి అడిగేశాడు.
'అసలు వీడు ఎవడ్రా బాబు.' అన్నట్టు పిచ్చివాడిని చూసినట్టు చూశాడు ఆ ట్యాంకు రిపేరు చేసే అబ్బాయి భలేభలేరావు వైపు.
"ఇదిగో అబ్బాయి నువ్వెవరో నాకు తెలియదు తెలియవలసిన అవసరం కూడా లేదు. అలాగే నేనెవరో నీకు తెలియదు నీకు తెలియవలసిన అవసరం కూడా నీకు అసలు లేదు. ఏతావాతా.. కత్తిపీట కందదుంప.. కరివేపాకు కాకరకాయ.. ఈ చెత్తాచెదారం మాటలు మనకెందుకు కానీ నేను చెప్పినట్టు ఇప్పుడు నువ్వు చేశావ్ అనుకో ఫిఫ్టీ ఫిఫ్టీ" అన్నాడు భలేభలేరావు.
''ఇదేదో బాగుందండి. ఎవరైనా మిమ్మల్ని చితకగొడితే అందులోనూ కూడా నాకు ఫిఫ్టీ ఫిఫ్టీయా?'' ఓ తలతిక్క ఫోజుతో అడిగాడు ఆ అబ్బాయి
''ఈ శుభసమయంలో కామెడీ వద్దు గానీ ఇదిగో నిజంగా చావవద్దు కానీ నువ్వు పైనుంచి దూకేస్తున్నట్టు నటించు. నేను నిన్ను రక్షిస్తానన్నమాట. అవార్డు రివార్డు ఇద్దరం చెరి సగం.''\n\n
''అదా విషయం. కూసంత అర్థమైందండి ఇప్పుడు.\n\nఈ టౌన్లో అందరూ విచిత్రంగా చెప్పుకునేది మీ గురించే అన్నమాట. ఒకవేళ మీ ప్రయత్నం మిస్ అయి నేను కిందపడి రెండు కాళ్లు విరిగిపోతే అప్పుడు మీది ఒక కాలు నేను ఇరగగొట్టవచ్చా? ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు కదా." గుర్రం ఇకిలించినట్టు ఇకిలిస్తూ అడిగాడు ఆ అబ్బాయి.
''అదెలా కుదురుద్ది. ఇదిగో నా మీద నమ్మకం లేకపోతే ముందు బయనాగా ఈ ఐదు రూపాయలు ఉంచు. నేను చెప్పినట్టు చెయ్యి.'' బ్రతిమలాడాడు భలేభలేరావు ఆ అబ్బాయిని.
ఆ అబ్బాయి ఒప్పుకోకపోవడంతో కోపం వచ్చి ఆ అబ్బాయి వీపు మీద రెండు పెసరట్లు వేసి పరిగెత్తుకొని వాటర్ ట్యాంకు మెట్లు క్రిందకు దిగుతూ దిగుతూ కాలు జారిపడ్డాడు. రెండు కుట్లు పడ్డాయి.
గతం గతః
మూడు నెలల క్రితం ఒక పాత పెంకుటిల్లుకి నిప్పు అంటుకుంటే అందులో ఉన్న వాళ్ళని రక్షించి బయటకు తీసుకురావాలని జనం అందరూ చూస్తుండగా ధైర్యసాహసాలతో లోపలకు ప్రవేశించాడు. కాలిపోతున్న గదులు అన్ని తిరిగి తిరిగి చూశాడు. ఎవరైనా తన సాహస కార్యక్రమం బయటనుండి సెల్ కెమెరాలో వీడియో తీస్తున్నారేమోనని దాన్ని పేపరు వార్తల్లో, టీవీలో ఉపయోగించుకోవచ్చునని కిటికీలోంచి తొంగి తొంగి చూశాడు. అబ్బేఅబ్బే ఆ ప్రయత్నం ఆవకాయ బద్ద అంత కూడా జరగడం లేదని గ్రహించాడు భలేభలేరావు.
అది పక్కన పెడితే అసలు బూడిదగుమ్మడికాయలో బూడిద లేనట్లు, దానిమ్మపండులో నిమ్మకాయ లేనట్లు, వెంకటేశ్వరుడిలో ఈశ్వరుడు లేనట్లు ఆ ఇంట్లో మనుషులే కాదు పిచ్చుకలు, బల్లులు, తేళ్లు, జెర్రులు కూడా లేవు. అందులో ఎవరూ కాపురం ఉండడం లేదని తెలుసుకుని ఒళ్ళంతా కాల్చుకొని బయటకు వచ్చాడు. ఎవరు కూడా అయ్యోపాపం అని అనలేదు కానీ పకపక, కిలకిల, గలగల నవ్వుకుంటూ వెళ్లిపోయారు తనను చూసి. హాస్పిటల్ ఖర్చు ఆరువేలుతో ఆ కథ పరిసమాప్తం అయింది.
ఈ గతం కూడా గతః
అయితే ఈరోజు ఈసారి మాత్రం తను చేసేది రాంగ్ ప్రయత్నం కాదు అని భలేభలేరావు నిశ్చయించుకుని తన ముందు తనకు కొంచెం దూరంలో రిక్షా ద్వారా జరగబోయే అతిపెద్ద ప్రమాదం, భయంకరమైన పెను ప్రమాదాన్నించి అందులో ప్రయాణిస్తున్న యువతిని రక్షించి రేపటి వార్తల్లో తను సాహస యువకుడిగా గుర్తింపు పొందెయ్యాలనేది భలేభలేరావు ప్రస్తుత సాహసప్రయత్నం.
సరే అప్రస్తుతంలో నుండి ప్రస్తుతంలోకి వచ్చేసాం కదా. ఇక ఇప్పుడు కథ మొదలవుతుంది అన్నమాట.
ఈరోజు ఐదు నిమిషాల ముందు ఆ టౌన్లో పాన్ షాప్ దగ్గర భలేభలేరావు నిలబడినప్పుడు.. ఎర్రచీర కట్టుకున్న ఆ అందమైన అమ్మాయి రిక్షాలో కూర్చుని వెళ్లడం చూశాడు భలేభలేరావు. కానీ ఆమె కట్టుకున్న చీర పైటచెంగు రిక్షా పక్కకు పడిపోయి రిక్షా చక్రంలో చుట్టుకుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు పాపం ఆ అందమైన అమ్మాయి గుర్తించడం లేదు అన్న విషయం గుర్తించాడు భలేభలేరావు.
ఆ టౌన్ నిండా ఆటోలు బోల్డన్ని. ఆటోలో వెళ్లవచ్చు కదా ఆ అందమైన అమ్మాయి. ఈ రిక్షాలో వెళ్లడం దేనికి అని అతను ఏ మాత్రం అనుకోలేదు.. భలేభలే చౌక బేరం.. అనుకుంటూ క్రిందకు జారుతున్న తన ప్యాంటు గబగబా పైకి లాక్కొని జరగబోయే ప్రమాదం ఊహించి భలేభలేరావు కంగారుపడి ఆమెను రక్షించాలని రిక్షా వెనుక చాలాదూరం పరుగు పెట్టి ఇక పరుగుపెట్టలేక దారిలో తన మిత్రుడు అప్పారావు దగ్గర సైకిల్ బ్రతిమలాడి లాక్కొని ఇప్పుడు ఆ రిక్షాను సమీపించడానికి సైకిల్ వేగంగా తొక్కుతున్నాడన్నమాట. అయినా అందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రిక్షావాలా చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు.
''అమ్మో.. ఆ అందమైన అమ్మాయి ఎర్రచీర పైటచెంగు రిక్షాచక్రంలో అలా అలా గుండ్రంగా చుట్టుకుపోతే.. ఆమె క్రిందకు పడిపోతే.. ఇలా ఎన్నిచోట్ల జరగలేదు. ఆ తర్వాత ఆమె మీద రిక్షా పడిపోతే.. ఆ రిక్షా వెనుక వేగంగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్‌లు వీళ్ళ మీద పడిపోతే.. ఆ వెనక మహావేగంగా వస్తున్న సిటీబస్సు వీళ్ళ అందరి మీదనుండి వెళ్ళిపోతే అమ్మో.. వామ్మో.. ఐబాబోయ్.. ప్రళయ భయంకర బీభత్సం! జరగబోయే ఆ జుగుప్సాకరకరకరమైన ప్రమాదం తను ఆపగలిగితే చాలు తన జన్మ ధన్యం.'' అనుకుంటున్నాడు మనసులో భలేభలేరావు. అందుకనే కసికసిగా తను సైకిల్ తొక్కుతున్నాడు ఆ రిక్షాను ఆపాలని.
ఎలాగైతేనే తన గుర్రం గెలిచింది. రిక్షా కన్నా తన సైకిల్ ముందుకు వెళ్ళింది. వెంటనే భలేభలేరావు సైకిల్ క్రిందకి దిగి దాన్ని రోడ్డు పక్కకు తోసేసి చేతులు అడ్డుపెట్టి రిక్షాను ఆపుచేశాడు. పరుగున రిక్షా దగ్గరగా సమీపించి అతి కష్టం మీద చక్రంలో పడడానికి సిద్ధంగా ఉన్న ఆ అందమైన అమ్మాయి ఎర్రచీర పైటచెంగును ఒడిసి పట్టుకొని రిక్షాలో కూర్చున్న ఆమె వైపు విజయగర్వంతో చూస్తూ.. ''మేడం ప్రమాదం తప్పింది. మీరు ఏ మాత్రం భయపడకండి. ఈ భలేభలేరావు మీకు అండగా ఉన్నాడు. ఇదిగో మీ ఎర్రచీర పైటచెంగు చక్రంలో పడకుండా తప్పించాను'' అంటూ ఆమెకు అందించాడు.
అప్పటికే బిలబిలమంటూ వందలాది జనం, వాహనాలు తిరునాళ్లతీర్థంలా ఆ చుట్టూ మూగిపోయాయి.
భలేభలేరావు మహా ఆనందంగా ప్రజలు అందరి వైపు తిరిగి గాలిలో చెయ్యి పైకి ఎత్తి సాహస యువకుడిగా విజయచిహ్నం చూపించాడు అందరికీ.
మరుక్షణం.. ఆ అమ్మాయి రిక్షా నుండి వేగంగా క్రిందకు దిగి భలేభలేరావు చెంపలు పగులకొట్టింది. అతని రెండు చెంపలు ఎర్రగా కమిలిపోయాయి.
సెల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది ఆ అమ్మాయి.
దగ్గరలో ఉన్న ఆ టౌన్ అధ్యక్షురాలు ఆండాళమ్మ గారు గబగబా మరో 10 మందితో అక్కడ ప్రవేశించింది.
"ఒక అందమైన అమ్మాయి ఎర్రచీర, ఒక పరాయి మగవాడు పట్టుకుని లాగడమా? హిస్సి.. ఇది పోలీస్ స్టేషన్లోనూ, కోర్టులోనూ తేల్చుకోవలసిన సమస్య కాదు. ఈ క్షణమే ఇదే జనం ముందు దీని రిజల్ట్ తేలిపోవాలి." అనుకుని వచ్చిన మహిళామణులు అందరూ కలిసి భలేభలేరావు భరతం పట్టేసారు.
"అది కాదు మేడం గారు.. రిక్షా చక్రంలో ఆ అమ్మాయి ఎర్రచీర... " అంటూ తన సాహస ప్రయత్నం చెప్పడానికి ఆవగింజంత అవకాశం కూడా లేకుండా పోయింది భలేభలేరావుకు. చుట్టూ చూశాడు. ఒకటి కాదు రెండు కాదు వందలాది సెల్ కెమెరాలు తననే గురిపెట్టి చూస్తున్నాయి... భలే మంచి చౌకబేరము అన్నట్టుగా. కలలో కూడా పగవాడికి కూడా ఇటువంటి అవమాన భారం జరగకూడదు దేవుడా అనుకుంటూ క్లోజప్ ఫోటో కోసం అడిగిన వాళ్లకు కూడా అవకాశం ఇచ్చాడు భలేభలేరావు.. తప్పించుకోలేని తప్పని పరిస్థితులలో.
ఆ అమ్మాయి తనకోసం వచ్చిన మహిళామణులందరికీ అభినందనలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి
హగ్ చేసుకుని, ముద్దాడింది. ఆమె కోసం వచ్చిన మహిళామణులు కళకళ తళతళ మిలమిల మెరిసిపోతూ గుంపుగా వెళ్లిపోయారు
ఆ అమ్మాయి మళ్ళీ రిక్షా ఎక్కి యధావిధిగా తన పైటచెంగును రిక్షాచక్రంలో పడేటట్టుగా అలా అలా జారవదిలింది. రిక్షా రివ్వున ముందుకు దూసుకుపోయింది.
భలేభలేరావుని తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు పళ్ళు ఎదుటివారికి కనపడకుండా తమలో తామే నవ్వేసుకుంటూ.. కనీసం అతడిని పైకి లెగదీసే ప్రయత్నం కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు.
''మోటార్ బండి మీద కూర్చున్నప్పుడు అలా పైటచెంగు గాలిలో ఎగిరేలా వదిలేయడం.. రిక్షాలో ప్రయాణిస్తున్నప్పుడు పైటచెంగు రిక్షాచక్రంలో పడేటట్టుగా అలా అలా జారవదలడం.. అందమైన కొందరు అమ్మాయిలకు ఇప్పుడు అదో ట్రెండు, ఫ్యాషన్!...
అనవసరంగా ఆ మేడం గారి చేత చెంపలు వాయగొట్టించుకున్నాడు గురుడు.'' అంటూ ఒకరు.
''మొత్తానికి ఈ శతాబ్దంలో గొప్ప అత్యద్భుత హాస్య సంఘటన ఇదే అనుకుంటాను గురు." అనుకుంటూ మరొకరు.
''రేపటి యూట్యూబ్ షార్ట్‌కి భలే ఐటమ్ దొరికింది.'' అనుకుంటూ ఇంకొకరు.
అలా అలా వెకిలిగా నవ్వుకుంటూ వెళ్తున్న జనం మాటలు భలేభలేరావు రెండు చెవి కర్ణభేరీలలో.. భేరీనాట్యం చేస్తున్నాయి.
**
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments