తులసి
- Kannaiah Bandela

- Oct 27, 2025
- 3 min read
#KannaiahBandela, #కన్నయ్యబందెల, #Thulasi, #తులసి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

పర్యావరణాన్ని రక్షించడం అంటే భవిష్యత్ తరాలను రక్షించడం
Thulasi - New Telugu Story Written By Kannaiah Bandela
Published In manatelugukathalu.com On 27/10/2025
తులసి - తెలుగు కథ
రచన: కన్నయ్య బందెల
కలెక్టర్ ఆఫీసు నుండి ఫోన్ రావడంతో కంగారు పడ్డాడు. రిటైర్ అయిన తనకు సన్మానం ఎందుకని ఆలోచించసాగాడు పరంధామయ్య మాస్టారు.
వివరాలు తెలుసుకొని మరుసటి రోజు సాయంకాలం రాధాయిపల్లి గ్రామానికి బయలు దేరాడు. ఇది ఆయన 25 సంవత్సరాల క్రితం పనిచేసిన పాత ఊరే అయినప్పటికీ, బస్సు దిగిన తరువాత ఒక కిలోమీటరు దూరాన్ని నడుస్తూ, దారిపొడవునా కనిపించే ప్రకృతి దృశ్యాలను చూస్తూ ముందుకు సాగాడు.
రెండు రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు — చింత, వేప, మర్రి, మోదుగ, గానుగా వంటి చెట్లు నిలబడి ఉన్నాయి. రోడ్ల మధ్యన పచ్చటి తివాచీ పరిచినట్లు పూలతో నిండిన తోటలు, రంగురంగుల కాగితపు పూలు, గుల్‌మోహర్ చెట్లు — ఇవన్నీ చూసి, “ఈ ఊరు పర్యావరణానికి పర్యాయపదముగా మారిందే!” అనిపించింది మాస్టారికి.
సాయంకాలం అవ్వడంతో పిచ్చుకలు, కోకిలలు, గుడ్లగూబలు, కాకులు, కొంగలు — అనేక రకాల పక్షులు తమ తమ గూళ్లకు చేరుకునే ఆత్రుతతో అరుస్తూ, కేరింతలతో, సందడిగా కదలాడుతూ ఉన్నాయి. పాఠశాల పిల్లలు ఇంటికి పరుగులు తీసినట్లుగా ఆ వాతావరణం ఉల్లాసంగా ఉంది.
“ప్రకృతి ఎంత గొప్పదో! నోరులేని పక్షులకు చెట్లు ఎంత ఆసరా ఇస్తున్నాయో!” అనుకున్నాడు పరంధామయ్య. తాను ఇంతకు ముందు చూసిన ఊరే ఇది, కానీ ఇప్పుడు మరింత అందంగా ఉంది. “ఇంత మంచి చెట్లను పెంచిన వారు ఎవరో!” అని మనసులోనే వారిని అభినందిస్తూ నమస్కారమూ చేశాడు మాస్టారు.
సన్మాన సభ
సన్మాన కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను ఉద్దేశించి కలెక్టర్ గారు మాట్లాడుతూ —
“మనం నివసించే భూమిపై ఉన్న గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ ప్రకృతి కప్పుకున్న దుప్పటి లాంటివి. కానీ మనం స్వార్థంతో, కాలుష్యంతో ఆ దుప్పటిని చించేస్తున్నాం. ఫ్యాక్టరీల పేరుతో, గనుల తవ్వకాల పేరుతో, ఫ్యాషన్ పేరుతో ప్లాస్టిక్ వాడకం, అనవసరమైన ఎరువుల వాడకం వల్ల భూమి వేడెక్కుతోంది. ఫలితంగా ఓజోన్ పొర చితికిపోతోంది. భూకంపాలు, వైరస్ వ్యాధులు, జీవావరణం మార్పులు, పిచ్చుకలు, వానపాములు వంటి జీవులు మాయమవుతున్నాయి. పర్యావరణం కాపాడకపోతే మనమే జాతికి ద్రోహులమవుతాం. ప్రభుత్వ పర్యావరణ కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరం. మనమందరం పచ్చదనం వైపు అడుగులు వేయాలి.”
ఈ మాటలు వినగానే పరంధామయ్య మాస్టారికి తన ఉపన్యాసాల జ్ఞాపకం వచ్చింది. తాను బోధించేటప్పుడు తరచుగా చెప్పే మాటల్లా అనిపించాయి.
సన్మానాలు ముగిసాక కలెక్టర్ స్వయంగా మాస్టారుదగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కరించడంతో సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు.
“మాస్టారు, నేనెవరో గుర్తుందా?” అని చిరునవ్వుతో అడిగింది కలెక్టర్.
“చిన్నప్పుడు ఆకలితో ఉదయాన్నే ఏమీ తినక పాఠశాలకు రానప్పుడు, మీరు తెచ్చుకున్న పెరుగన్నం నాకిచ్చి నా ఆకలిని తీర్చేవారు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండమని చెప్పేవారు. పుట్టినరోజు రోజు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, అది చెట్టుగా పెరగాలంటే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేవారు. ఇప్పటికైనా గుర్తొచ్చిందా మాస్టారు? నేను సుమ — మీ శిష్యురాలు సుమ!”
ఇది విని మాస్టారు ఒక్క క్షణం మౌనంగా నిలిచిపోయాడు. అతని మస్తిష్కంలో తెల్లగా, సన్నగా ఉన్న చిన్నారి రూపం కదిలింది.
“బాగున్నావా అమ్మా!” అన్నాడు సంతోషంగా. “ఎప్పుడో నీవు నేర్చుకున్న పాఠాలు గుర్తు పెట్టుకుని ఈ ఊరిని హరిత వనముగా మార్చినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ పర్యావరణం మీద దృష్టి పెడితే రాబోయే తరాలను కాపాడినవాళ్ళం అవుతాం; లేకపోతే జాతికి ద్రోహులమవుతాం,” అంటూ తన దీవెనలు అందించాడు పరంధామయ్య మాస్టారు.
సుమ నమ్రతగా సమాధానమిచ్చింది — “నేను చేసింది తక్కువే మాస్టారు. దేశాన్ని ఉద్ధరించలేకపోయినా, మా గ్రామాన్ని పచ్చదనంగా మార్చగలిగితే చాలు. మీరు బోధించిన మాటలే నేను మాట్లాడాను; ఇవి నా సొంత మాటలు కావు.”
సభ చప్పట్లతో మారుమోగింది.
మాస్టారుకు శాలువా, సర్టిఫికెట్‌తో పాటు ఒక తులసి మొక్కను అందించింది సుమ. “ఇది మీ పుట్టినరోజున మీరు మన పాఠశాలలో నాటిన తులసి మొక్క గుర్తుందా?” అంది చిరునవ్వుతో. “ఇంకా ఒక సర్ప్రైజ్ ఉంది మాస్టారు!” అంటూ తన స్నేహితులను ముందుకు తీసుకొచ్చింది.
“మీరు ఎప్పుడో — ‘మన ఊర్లో కనీసం పదిమంది ఉద్యోగస్తులు అవ్వాలి’ అని చెప్పేవారు. ఇప్పుడు మేము 11 మంది ఆ కలను నెరవేర్చాం మాస్టారు! ఇది మీ ఆశీస్సుల ఫలితం!”
అని చెబుతూ మాస్టారు చేతిలో తులసి మొక్కను పెట్టి, అందరూ కాళ్లకు నమస్కరించారు.
మాస్టారు పరంధామయ్య కళ్ళు తడిచిపోయాయి. “పిల్లలు మొక్కల్లాంటివారు... మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు,” అని మనసులో అనుకుంటూ, తన కళ్లద్దాల వెనక నుండి తృప్తిగా శిష్యులను చూశాడు. ఆ సంస్కారం, ఆ మానవత్వం చూసి అతని మనసు నిండిపోయింది.
***
కన్నయ్య బందెల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: కన్నయ్య బందెల
గ్రామం: గిద్ద
మండలం: రామారెడ్డి
జిల్లా: కామారెడ్డి.
వృత్తి: ప్రధానోపాధ్యాయులు
చదువు: M. A:BE d,
హాబీస్: కథలు చదవడం, రాయడం.




Comments