తొలితరం సంఘ సంస్కర్త - కందుకూరి

Tholitharam Sanga Samskartha - Kandukuri - Telugu Social Article | Thokala Rajesham
తొలితరం సంఘ సంస్కర్త - కందుకూరి - తెలుగు సామాజిక వ్యాసం | తోకల రాజేశం
Published in manatelugukathalu.com on 12/11/2026
కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగునాట ఆధునిక సంఘ సంస్కరణకు పునాదులు వేసిన తొలి తరం సంస్కర్త. మహిళా విద్య, వితంతు పునర్వివాహం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఆయన చేసిన సాహసోపేత పోరాటమే ఈ వ్యాసం ప్రధానాంశం.
ఈ దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను మహారాష్ట్రలో 1848లో స్థాపించాడు మహాత్మా జ్యోతిరావు ఫూలే.
సరిగ్గా అదే సంవత్సరం తెలుగునాట రాజమండ్రిలో జన్మించాడు కందుకూరి వీరేశలింగం పంతులు.
ఫూలే మహారాష్ట్రలో నడిపిన గొప్ప సాంఘిక ఉద్యమంలోని అనేక అంశాలు కందుకూరి ఇక్కడ నడిపిన ఉద్యమంలో కనిపిస్తాయి.
విగ్రహారాధనను నిరసించడం దగ్గరనుంచి బ్రిటిష్ వారి సంస్కరణ భావాలను ఆహ్వానించడం దాకా ఈ ఇద్దరిలోనూ అనేక పోలికలు కనిపిస్తాయి.
ఫూలే తపించిన విధంగానే స్త్రీల విద్య కోసం ఉద్యమించాడు కందుకూరి. ఫూలే వలెనే తన భార్య రాజ్యలక్ష్మికి స్వయంగా చదువు చెప్పాడు.
ఆయనలాగే బాలికల కోసం తెలుగునాట మొట్టమొదటి పాఠశాలను తెరిచాడు. కుల వివక్షకు తావీయక అందరికీ చదువు చెప్పాడు.
మహిళలకు విద్యను నిషేధించినంత కాలం అభివృద్ధి గురించి మాట్లాడటం అర్థరహితమన్నాడు కందుకూరి.
సనాతన బ్రాహ్మణ కులంలో పుట్టిన కందుకూరి ఆధునికతను మనసారా ఆహ్వానించాడు.
ఆధునిక భావాల వ్యాప్తి కోసం అటు సాహిత్య రంగంలోనూ, ఇటు సామాజిక రంగంలోనూ చాందసులతో పెద్ద పోరాటమే చేశాడు.
ఈ రెండు రంగాలలో సనాతనంగా అల్లుకుపోయిన అగ్రవర్ణ బ్రాహ్మణీయ భావజాలాన్ని, దాని ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి, దాని స్థానంలో నూతన విలువల స్థాపన చేయడానికి ఆయన తన జీవిత పర్యంతం కృషి చేశాడు.
కందుకూరి నివసించిన కాలంనాటి సాంఘిక పరిస్థితులేమిటో తెలుసుకుంటే గానీ ఆయన చేపట్టిన సంస్కరణ కార్యక్రమాల విలువేమిటో అర్థం కాదు.
మహిళల పట్ల భరింపరాని నిర్బంధం, వారి విద్య పట్ల తీవ్ర వ్యతిరేకత, బాల్యవివాహాలు, వితంతువుల యెడ అమానుషం, భయంకరమైన అస్పృశ్యత లాంటి వాటికి తోడుగా విపరీతమైన మూఢనమ్మకాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్న రోజులవి.
ఈ అన్ని రకాల సమస్యలకు పరిష్కారమార్గాన్ని చూపే ఏకైక దిక్సూచిలా తెలుగునాట నిలబడిన వాడు వీరేశలింగం. అందుకే ఆయనను నార్ల వేంకటేశ్వరరావు "ఆదర్శ దృక్పథం గల కార్యవాది" అన్నాడు.
ఆయన కేవలం ఆదర్శాలు వల్లించి ఊరుకునేవాడు కాదు. చెప్పేదానికంటే ఎక్కువగా కార్యక్షేత్రంలో పనిచేసినవాడు.
తన డైరీలో "కేవలం పుస్తకాలు రాసి ప్రచురించడంలో ప్రయోజనం లేదు. మనం నమ్మిన సత్యాన్ని లోకానికి చాటి కార్యరూపంలో చూపగల ధైర్యసాహసాలను ప్రదర్శించడం చాలా అవసరం" అని రాసుకున్న ఆయన మాటలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి.
ఆయన ప్రజలకు ఏం చెప్పాడో దానిని నిజజీవితంలో ఆచరించి చూపాడు. ముఖ్యంగా మూఢనమ్మకాల విషయంలో ఆయన ప్రజలను చైతన్యం చేయడానికి తన జీవితంలో అనేక సంఘటనలను ఆసరాగా తీసుకుని, ఆ విశ్వాసాలకు వ్యతిరేక పద్ధతిలో ప్రవర్తించి వారిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించాడు.
తన తల్లి గగ్గోలు పెట్టినా వినకుండా అమావాస్య రోజే ప్రధానోపాధ్యాయులుగా వృత్తి బాధ్యతను స్వీకరించాడు. ఇంటి ఆవరణలో తేనెటీగలు తుట్టె కట్టడం అశుభమని ఊళ్ళో వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా దానిని అలాగే ఉంచి తేనె సేవించాడు.
అందరూ సుడులున్న గుర్రం కొనవద్దని చెప్పినా కావాలని దానినే కొన్నాడు. దయ్యాలు, భూతాలు లేవని నిరూపించడం కోసం అర్ధరాత్రి స్మశానవాటికకు వెళ్ళేవాడు.
ఇలా ప్రజల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసి విజయం సాధించాడు.
సెప్టెంబర్ 08, 1878 నాడు "సంఘ సంస్కరణ సమాజం" స్థాపించాడు పంతులు. అప్పటివరకు ఉత్తరభారతంలో మాత్రమే ఇలాంటి సంస్థలు, సాంఘిక సంస్కరణా కార్యక్రమాలు నడుస్తుండేవి.
వీరేశలింగం మీద ఉత్తరం వైపు ఆనాడు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సంస్కర్తల ప్రభావం ఉన్నది. మహిళల విద్య కోసం వీరేశలింగం నడుంకట్టిన సందర్భం వెనుక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్ఫూర్తి పనిచేసింది.
నిజానికి ఆయన ఈ రంగంలోకి వచ్చిందే ప్రసిద్ధ సంస్కర్త కేశవ చంద్రసేన్ గారి ఉపన్యాసాల సంకలనం చదివి.
బహుశా పంతులు స్థాపించిన సంస్థ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిది కావచ్చు.
అయితే తాను చేస్తున్న సంఘ సంస్కరణ కార్యక్రమాలకు మద్దతు కూడగట్టడం కోసం, సంస్కరణ ఆవశ్యకతను తెలియజెప్పడం కోసం కొన్ని పత్రికలు కూడా నడిపించేవాడు.
అవి 'సతీహిత బోధిని', 'వివేక వర్ధిని', 'హాస్య సంజీవని'. ఈ పత్రికల ద్వారా సంస్కరణ భావాలను వ్యతిరేకించే పండితులతో సుదీర్ఘ వాదోపవాదాలు చేసేవాడు. తన భావాల ప్రచారం కోసం పత్రికలు నడుపుతూనే వందకు పైగా రచనలు చేశాడు.
వీరేశలింగం సంస్కరణ ప్రధానంగా మహిళా లోకాన్ని దృష్టిలో పెట్టుకుని నడిపించిందే. ఆ కాలంలో బాల్యవివాహాల మూలంగా భర్త చనిపోయిన స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండేది.
వాళ్లకు పునర్వివాహం చేసుకునే హక్కు ఉండేది కాదు. వాళ్ళ మీద తీవ్రమైన ఆంక్షలుండేవి.
ఈ నేపథ్యంలో వారి జీవితాల్లో వెలుగులు నింపాలని వారికి పునర్వివాహాలు జరిపించాడు కందుకూరి.
ఇది ఆ కాలంలో పెద్ద విప్లవం. ఇలా వివాహాలు జరిపించినందుకు ఆయన మీద సనాతనులు దాడులు చేయించారు. ఆ వివాహ వేడుకలకు హాజరైన వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేశారు.
అయినా పంతులు గానీ ఆయన అనుచరులు గానీ వెనుకంజ వేయలేదు. పంతులు దాదాపు 29 వితంతు వివాహాలను జరిపించాడు.
వారికోసం రాజమండ్రిలో, మద్రాసులో వితంతు శరణాలయాలు నెలకొల్పాడు. ఈ సంస్కరణలను వ్యతిరేకించిన బ్రాహ్మణ పండితులు కొక్కొండ వెంకటరత్నం పంతులు, వేదం వేంకటరాయశాస్త్రి మొదలైన వారితో యుద్ధమే చేశాడు.
1906లో తన కులాన్ని త్యజించాడు. అందుకు గుర్తుగా యజ్ఞోపవీతాన్ని వదిలివేశాడు.
దాదాపు నూటయేభై ఏళ్ల కిందట వీరేశలింగం చేసిన ఇలాంటి సాహసోపేత కార్యక్రమాలు నేటికీ మన కళ్లకు మిరుమిట్లు గొలుపుతాయి.
ఆయన చివరి శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రజలలో చర్చకు పెడుతూనే బతికాడు. ప్రజలను చైతన్యం చేస్తూనే బతికాడు.
చనిపోయే ముందు తన మిత్రునికి వినిపించిన ఆఖరి సందేశంలో— "మన ప్రజల్లో అధిక భాగం అజ్ఞానం, మూఢనమ్మకాల భారంతో కృంగిపోయి జీవితంలోని మంచివాటిని అనుభవించలేకపోతున్నారు.
వారికి విద్యను, వికాసాన్ని, సంస్కృతిని, స్వాతంత్ర్యాన్ని, సమతను, న్యాయాన్ని సమకూర్చడం మీ విద్యుక్త ధర్మం.
నోరూ వాయీ లేని ప్రజా సమూహానికి మీ శక్తి కొద్దీ తోడ్పడమని మిమ్ము ఆర్థిస్తున్నాను" అని వేడుకున్నాడు.
ఆయన కృషి ఫలితంగానే తెలుగునాట మహిళా హక్కుల పట్ల, వారి చదువు పట్ల సుముఖత ఏర్పడింది.
అనేక మూఢనమ్మకాలు రంగం నుంచి తప్పుకున్నాయి. సాహిత్య రంగంలోనూ ఆధునిక పోకడలు ఒక అవసరంగా చొచ్చుకువచ్చాయి.
దీనికి కారణం సమాజం కోసం వీరేశలింగం తన జీవితాన్ని ధారపోసేయడమే. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు కందుకూరి వారికి నివాళిగా రాసిన పద్యం అక్షరసత్యం:
కం.
తన దేహము తన గేహము
తన కాలము తనధనమ్ము
తన విద్య జగజ్జనులకు వినియోగించిన
ఘనుడీ వీరేశలింగ కవి జనులారా!
- తోకల రాజేశం
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
తోకల రాజేశం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు తోకల రాజేశం.
తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024),ఆట సాగుతూనే ఉంటది(వచన కవిత్వం-2026)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.










Comments