ఊహాతీతం

'Uhatheetham' - New Telugu Story Written By Pudipeddi Venkata Sudha Ramana
Published In manatelugukathalu.com On 12/10/2023
'ఊహాతీతం' తెలుగు కథ
రచన, కథా పఠనం: పూడిపెద్ది వెంకట సుధారమణ
కామాక్షి మొక్కలకు నీళ్లు పోస్తూ ఆలోచనలో పడింది. అది గమనించిన వెంకట్ " అమ్మా.. ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు " అన్నాడు.
" ఏం లేదురా, బంధువర్గం అంతటిని ఒకే కప్పు కిందకి తేవడం ఎలా అని ఆలోచిస్తున్నా " అంది నవ్వుతూ.
" ఓస్, అంతేనా, బంధువర్గం అనే గ్రూప్ పెట్టేస్తే సరి " అన్నాడు సింపులుగా.
అంతే, మరుక్షణంలో అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, వారి పిల్లలు ఇలా అందరితో బంధువర్గం అనే గ్రూప్ తయారైపోయింది.
ఇంకేముంది, టింగ్ టింగ్ మంటూ మెస్సేజెస్ రావటం మొదలయ్యి, అందరి గొంతులు వినిపించడం మొదలయ్యింది.
“చాలా మంచి పనిచేసారు”, “ అబ్బో వేరీ నైస్”, “ఇక అందరం ఈ గ్రూపులో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు”, “ఇంత మంచి బుద్ది పుట్టింది ఏంట్రా బాబు వెంకట్ నీకు గుడ్ గుడ్”, అంటూ చాలా మెస్సేజెస్ వచ్చేయి. ఇక రోజూ “శుభోదయం” అంటూ మొదలై ఎన్నో విషయాలుతో ఆ గ్రూప్ అంతా కళ కళ లాడిపోతోంది. చర్చలు, వాదనలు, అలకలు, కోపాలుతో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆరు నెలలుగా ఆ గ్రూపు అలరారుతోంది.
కొందరు వెంట వెంటనే, కొందరు తీరిక వేళలో, మరికొందరు అప్పుడప్పుడు, ఇంకొందరు ఎప్పుడో ఒకసారి స్పందిస్తున్నారు. కొందరు ఉత్తమ శ్రోతలుగా ఉండిపోతున్నారు. ఇలా కొనసాగుతున్న ఆ గ్రూపులో ఒకరోజు ఉదయాన్నే ఎనిమిది గంటలకు ఎప్పుడోగాని స్పందించని ఒకామె ‘ మెస్సేజు’ ప్రత్యక్షం అయ్యింది..
" ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి నేను ఒక వీడియో పెడతాను, చూడండి " అని.
అది వినగానే బంధువర్గంలో కలకలం రేగింది. ఏమై ఉంటుందనే ఆలోచన అందరి మనస్సులో పరిగెడుతోంది, ఫలితంగా గ్రూపు అంతా టింగ్ టింగ్ శబ్దాలతో మోగిపోతోంది. ఒక్కొక్కరి మెస్సేజ్ వస్తోంది. అందరి గొంతులు కంగు కంగుమని మ్రోగుతున్నాయి.,
"ఏమై ఉంటుంది”.,
" మొన్నామధ్య వాళ్ళబ్బాయి అమెరికా వెళ్లి వచ్చేడు కదా పదిహేను రోజులు ఏదో ఆఫీసు పని మీద అప్పుడు అక్కడ ఏదైనా వీడియో చేసి తెచ్చేడేమో".,
“అబ్బే, ఆ విషయం అయ్యుండదు”.,
“మరి అమ్మాయి పెళ్లి కుదిరిందేమో, పెళ్లి కొడుకు ఫోటో వివరాలు అన్నీ పెడుతుందేమో”.,
“వీడియో అని చెప్పింది కదా అందుకని అది అయ్యుండదు”.,
“ఈ మధ్య వాళ్ళ బావగారి మనవడిని ఉయ్యాల్లో వేశారు కదా ఆ వీడియో అయ్యుంటుంది”.,
“అబ్బే అది కాదేమో”.,
ఇలా అందరి మెస్సేజెస్తో గ్రూపు నిండిపోతుంటే " ఓయ్, అత్తోయ్... త్వరగా గ్రూపులోకి వచ్చి ఆ వీడియో పెట్టు".,
" ఏమిటిరా వెంకట్... ఆ తొందర, మనం ఎంత అరచి గీ పెట్టినా, మూడు అని చెప్పింది కదా, అప్పుడే వస్తుంది ఆ వీడియో ఏదో “.,
" అమ్మాయి పెళ్లిగాని అయిపోయిందేమో”.,
“అయ్యుండొచ్చు, ఈ కాలం పిల్లల్ని నమ్మలేకపోతున్నాం”.,
“అబ్బాయి అమెరికా వెళ్ళేడు కదా ఏ దొరసాని పిల్లనో పెళ్ళాడి, తీసుకొచ్చేసేడేమో”.,
“ఏమో, అయినా అవ్వొచ్చు చెప్పలేం".,
“ అయ్యో, అవునా “.,
ఇలా గ్రూపులో ఊహజనితమైన చర్చలు జరిగిపోతున్నాయి.
ఉదయం వీడియో పెడతానన్న సదరు ఆవిడగారు సరిగ్గా మూడు అవ్వగానే పనులన్నీ ముగించుకొని ఫోన్ చేతిలోకి తీసుకొని అలవాటు ప్రకారం అన్నీ గ్రూపుల్లోని మెస్సేజెస్ ఒక్కొక్కటి చూసుకుంటూ, ఈ గ్రూపు దగ్గరికి వచ్చి ఓపెన్ చెయ్యబోతు, 264 అన్ రెడ్ మెస్సేజెస్ అని చూసి, ఆమ్మో ఇన్ని మెస్సేజెసా అనుకుంటూ ఆశ్చర్యపోతు, ఒక్కొక్కటి విని, బాప్రే అంటూ " సారీ గైస్, వేరే గ్రూపులో పెట్టవలసిన ఆ ’ వీడియో గురించి ” మెస్సేజ్ ఇందులో పెట్టేసాను పొరపాటున, అది మా కిట్టీ గ్రూపుకి సంబందించిన వీడియో. అందరూ నన్ను క్షమించాలీ " అంది సింపులుగా.
సమాప్తం.
*****
పూడిపెద్ది వెంకట సుధారమణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/sudha
నా పేరు వెంకట సుధా రమణ పూడిపెద్ది. నేను రాంభట్ల వారింట పుట్టి, పూడిపెద్ది వారింట మెట్టాను. నేను ఎప్పటినుంచో కథలు, కథానికలు రాస్తున్నా, ఈ మధ్యనే వాటిని పత్రికలకి పంపడం ప్రారంభించాను. నేను ఇంకా ఓనమాలు దిద్దుతున్నాను రచనావిభాగంలో.
నా అక్షర ప్రయాణానికి అడుగులు పడిన మా ఇంటి నేపధ్యం.. Dr . రాంభట్ల నృసింహ శర్మ (ప్రముఖ కవి ) నాకు స్వయంగా అన్నయ్య మరియు Dr . రాంభట్ల వెంకట రాయ శర్మ ( పద్యకవి. రచయిత ) నాకు స్వయానా మేనల్లుడు, అలాగే, మెట్టినింటి నేపధ్యం ఏంటంటే, శ్రీశ్రీ గారు,పూడిపెద్ది లక్ష్మణ మూర్తి గారు (పూలమూర్తి గారు ) (శ్రీశ్రీగారికి స్వయానా తమ్ముడు), ఆరుద్రగారు, మొదలగు ప్రముఖులు నాకు తాతగార్లు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉగాది వసంత పూడిపెద్ది నాకు స్వయానా పిన్ని.
ఓనామాలతో ప్రారంభమైన నా ఈ అక్షర ప్రయాణం, సుదూరయానంగా మారాలని ఆశిస్తున్నాను.
జన్నస్థలం: కుప్పిలి, శ్రీకాకుళం జిల్లా
జననీ జనకులు: వెంకట రత్నం, బాలకృష్ణ శర్మ.
విద్యార్హతలు : ఎం. ఏ తెలుగు, ఎం. ఏ పాలిటిక్స్, బి. ఈ డీ
వృత్తి : ఉపాధ్యాయిని గా 15 సంవత్సరాలు.
ప్రస్తుతం: గృహ నిర్వహణ
భర్త : వెంకటరామ్, రిటైర్డ్ ఆఫీసర్, హెచ్. పి.సి ఎల్
సంతానం : అబ్బాయి డాక్టర్, ( స్వంత హాస్పిటల్ )
అమ్మాయి సాఫ్టవేర్ ఇంజనీర్, U. S. A
అభిరుచులు : సాహిత్యం పై మక్కువ, పుస్తక పఠనం, కథలు వ్రాయటం.
అభిలాష : నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని,
వీలైనప్పుడు దైవ దర్శనం, బంధు దర్శనం చేసుకోవడం.
చిరునామా : విశాఖపట్నం