ఉన్నతాశయం

Unnathashayam - Telugu Moral Story | G. S. S. Kalyani
ఉన్నతాశయం - తెలుగు నీతి కథ |G. S. S. కళ్యాణి
Published in manatelugukathalu.com on 17/09/2026
ఉన్నతాశయం కథ మనకు ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది — మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన ఆశయాలు మాత్రం ఉన్నతంగా ఉండాలి. మురికి గొట్టంలో పుట్టిన తెల్లని చిట్టెలుక తన రూపం వల్ల ఎగతాళికి గురైనా, శుభ్రతపై శ్రద్ధను వదల్లేదు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా, తన కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించింది.
G.S.S. కళ్యాణి రచించిన ఈ ప్రేరణాత్మక తెలుగు నీతికథలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, శుభ్రత, ఉన్నతాశయం వంటి విలువలు పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చూపించబడ్డాయి. చిన్నారులతో పాటు పెద్దలు కూడా చదివి ఆలోచించదగిన కథ ఇది.
అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో మురికి నీళ్ళు ప్రవహించే ఒక గొట్టంలో ఒక చిట్టెలుక పుట్టింది. దాన్ని చూడటానికి ఆ ప్రదేశంలో ఉన్న మిగతా ఎలుకలన్నీ వచ్చి ఆ చిట్టెలుక చుట్టూ గుమిగూడాయ్. చిట్టెలుక మెల్లిగా కళ్ళు నులుముకుని తన చుట్టూ కలియచూసింది. ఎలుకలన్నీ తన వంక వింతగా చూడటం గమనించింది చిట్టెలుక. అక్కడున్న అన్ని ఎలుకలూ నలుపు రంగులోనో లేక బూడిద రంగులోనో ఉంటే ఈ చిట్టెలుక మాత్రం తెల్లగా ఉంది మరి!
"ఈ ఎలుకేమిటీ ఇలా ఉందీ?", ఉండబట్టలేక అడిగేశాయి కొన్ని ఎలుకలు. "దెయ్యంలా ఉంది!! ఛీ!", అన్నాయి కొన్ని ఎలుకలు. "ఏదో రోగమనుకుంటా! పిల్లలూ మీరంతా ఈ చిట్టెలుకకు దూరంగా ఉండండి", పిల్ల ఎలుకలను హెచ్చరించింది ఒక పెద్ద ఎలుక.
ఆ మాటలు విన్న చిట్టెలుక ముఖం చిన్నబోయింది. అంతలో ఆ చిట్టెలుక తల్లి వచ్చి, "అబ్బ! ఎంత ముద్దుగా ఉన్నావో! ఎవరేమనుకున్నా నువ్వు మచ్చలేని నా చిన్నారి చందమామవి", అంటూ ఆ చిట్టెలుకని ఎత్తుకుని గారాం చేసింది.
"చందమామ ఎవరమ్మా?", అడిగింది చిట్టెలుక.
"అదిగో! ఆ ఆకాశంలో తెల్లగా అందంగా మెరుస్తున్నాడే... అతడే చందమామ!", గొట్టానికున్న చిన్న కన్నంలోంచీ ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూపిస్తూ చెప్పింది చిట్టెలుక తల్లి. చిట్టెలుక ఆశ్చర్యంగా చందమామను చూసి ఆ తర్వాత తనని తాను చూసుకుంది. నిజమే దాని శరీరం కూడా తెల్లటి పట్టులాంటి బొచ్చుతో మెరుస్తోంది.
'అమ్మ చెప్పిన మాట నిజమే!', అనుకుంది చిట్టెలుక. అంతలో చిట్టెలుక తల్లి కొన్ని పీలికలతో మెత్తటి పక్కను తయారుచేసి చిట్టెలుకను దాని మీద పడుకోమని చెప్పింది. చిట్టెలుక హాయిగా నిద్రపోయింది.
మర్నాడు పొద్దున్నే మెలకువ వచ్చింది చిట్టెలుకకి. అంతలో చిట్టెలుక ఉంటున్న గొట్టానికున్న కన్నంలోంచీ సూర్యరశ్మి చిట్టెలుక శరీరం మీద పడింది. వెలుగులో తనని తాను చూసుకున్న చిట్టెలుకకి గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే తెల్లగా ఉండాల్సిన దాని బొచ్చు మురికితో మాసిపోయింది.
"అమ్మా! అమ్మా!", అని అరుస్తూ కంగారుగా చిట్టెలుక తన తల్లి దగ్గరకు పరిగెత్తింది.
విషయం తెలుసుకున్న చిట్టెలుక తల్లి, "ఇంత చిన్న విషయానికి అంత కంగారెందుకూ? నీకు పక్కగా వేసిన పీలికలకున్న మట్టి నీకంటుకుంది. అంతే!", అంది నవ్వుతూ.
"నాది చందమామలాంటి శరీరమని నువ్వేగా అన్నావ్? నాకీ మట్టి నచ్చలేదు. నేను మళ్ళీ తెల్లగా మారాలి. ఎలా?", అడిగింది చిట్టెలుక.
"అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. మురికి గొట్టాలే మన నివాసం కదా! మురికి అంటకుండా ఎలా బతుకుతావ్? ఒంటినిండా మట్టీ మురికీ నీకు అలవాటు కావాలి", అంది చిట్టెలుక తల్లి.
కానీ చిట్టెలుకకు ఆ మట్టితో ఉండటానికి మనసొప్పలేదు. ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించిన చిట్టెలుక, ధైర్యం చేసి తనకు కాస్త దూరంలో నిద్రపోతున్న ఒక ముసలి ఎలుక దగ్గరకు వెళ్ళి, దాన్ని నిద్రలేపి తన సమస్యను చెప్పింది.
ఆ ముసలి ఎలుక కళ్ళు కూడా తెరవకుండానే చిట్టెలుకతో, "మురికి పోవాలంటే నీళ్ళతో కడుక్కోవాలి. ఈ గొట్టం మొదట్లో వెలుపలకి వెళ్ళే దారి ఉంది. అక్కడ ఒక చిన్న నీటి గుంట ఉంటుంది. అక్కడ నీకంటిన మట్టిని కడిగేసి శుభ్రం చేసుకోవచ్చు. కానీ అక్కడకు అప్పుడప్పుడూ మనుషులు వస్తూ ఉంటారు. జాగ్రత్త!", అని చెప్పింది.
"సరే తాతా! జాగ్రత్తగా ఉంటాలే!", అంటూ చిట్టెలుక హుషారుగా నీటిగుంట దగ్గరకు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసేసి మునుపటిలా తెల్లగా అయిపోయింది.
ఆ తర్వాత అది ఆ దగ్గర్లో కనపడిన ఒక మంచి బట్టను పీలికలుగా చేసి దాన్ని గొట్టంలోకి మట్టి అంటకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఆ రాత్రికి ఆ పీలికలపైన పడుకుంది. అలా చిట్టెలుకకు శుభ్రత అలవాటైపోయింది. మిగతా ఎలుకలు దాని శుభ్రతను ఎగతాళి చేసినా చిట్టెలుక మాత్రం మట్టి అంటినప్పుడల్లా నీటిగుంట దగ్గరకు వెళ్ళి స్నానం చేసేసేది.
అంతేకాదు! గొట్టంలో తను ఉంటున్న ప్రదేశం ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ సువాసనలు వచ్చే పూలతో అలంకరించేది. పాడైన ఆహార పదార్థాల జోలికి వెళ్ళకుండా తాజాగా ఉన్న ఆహారం మాత్రమే తీసుకునేది. దాంతో అటువంటి ఆహారం దొరక్క అప్పుడప్పుడూ పస్తులుండాల్సి వచ్చేది చిట్టెలుకకు.
అది చూసి ఆ చిట్టెలుక తల్లి, "ఏంటో! నువ్వూ నీ చాదస్తం! మిగతా ఎలుకలలా నువ్వు కూడా ఉంటే బాగుంటుంది! ఇలా ఆకలి బాధ పడాల్సిన అవసరం ఉండదు", అంటూ బాధపడుతూ ఉండేది.
అలాంటప్పుడు చిట్టెలుక గొట్టానికున్న కన్నంలోంచీ బయటకు చూసి, "అమ్మా! నా గురించి నువ్వేమీ దిగులుపడకు! నాక్కూడా మంచి రోజులు వస్తాయ్. ఈ గొట్టంలోంచీ బయటపడి ఆ అందమైన ప్రపంచంలో ఆనందంగా తిరిగే రోజు తప్పక వస్తుంది! చూస్తూ ఉండు!", అని అనేది.
చిట్టెలుక నమ్మకం చిట్టెలుక తల్లికి ఆశ్చర్యన్ని కలిగిస్తూ ఉండేది. కానీ, బయటి ప్రపంచంలోకి వెళ్ళే సాహసం చేసి చిట్టెలుక తన ప్రాణాలమీదికి ప్రమాదం ఎక్కడ కొనితెచ్చుకుంటుందోనని భయం కూడా వేసేది.
ఆ భయంతో, "నీ పగటి కలలు మాని వాస్తవంలో బతికితే కడుపు నిండుతుంది!", అని చిట్టెలుక తల్లి చిట్టెలుకని మందలిస్తే, "ఇది పగటి కల కాదమ్మా! నా జీవితాశయం!!", అని బదులిచ్చేది చిట్టెలుక.
ఓసారి చిట్టెలుక ఎప్పటిలాగే స్నానం చేయడానికి నీటిగుంట దగ్గరకు వెళ్ళింది. అదే సమయంలో గొట్టం పక్కనే ఆడుకుంటున్న ఒక చిన్న పాప చిట్టెలుకను చూసి, "నాన్నా! ఆ ఎలుక చూడూ! ఎంత బాగుందో! దాన్ని నేను పెంచుకుంటాను. పట్టుకుని నాకివ్వు", అంది తన తండ్రితో.
ఆ గుంట పక్కనే మొక్కలు నాటుతున్న ఆ పాప తండ్రి చిట్టెలుకను చూసి పట్టుకోబోయాడు. మొదటిసారి మనుషులను చూసిన చిట్టెలుక కంగారులో ఇటూ అటూ పరిగెత్తి కాలుజారి తలకిందులుగా పడిపోయింది. అది తేరుకునేలోపు పాప తండ్రి చిట్టెలుకను చేతుల్లోకి తీసుకుని తన దగ్గరున్న గుడ్డతో తుడిచి ఒక చిన్న పెట్టెలో పెట్టి పాపకు ఇచ్చాడు.
పాప పెట్టెలో ఉన్న చిట్టెలుకను దగ్గరగా గమనించింది. ఎప్పుడూ తనితాను శుభ్రం చేసుకోవడంవల్ల ఆ చిట్టెలుక బొచ్చు పట్టులా మెరుస్తోంది. దాని పాదాలు లేత గులాబీ రంగులో ఉన్నాయి. చిట్టెలుక కూడా పాపవంక చూసింది.
పాప చిట్టెలుకను తన బుజ్జి వేళ్ళతో తాకి, "ఎంత మెత్తగా ఉందో!", అంది. "అది ఎవరో పెంచుకుంటున్న ఎలుక కాబోలు. లేకపోతే ఎలుకలు అంత శుభ్రంగా ఎందుకుంటాయీ? నీకు నచ్చితే పెంచుకో", అన్నాడు పాప తండ్రి.
"అలాగే నాన్నా! ఈ ఎలుక చంద్రుడల్లే ఉంది కాబట్టి దీనిపేరు చంద్ర అని పెడతా", అని చిట్టెలుకను ముద్దాడుతూ తనతోపాటూ ఇంటికి తీసుకెళ్ళింది పాప.
ఆ చిట్టెలుకకోసం ప్రత్యేకంగా ఒక పెద్ద గదిలాంటి పెట్టెను సిద్ధం చేశాడు పాప తండ్రి. పాప ఆ డబ్బాను ఖరీదైన మెత్తటి బట్టలతో అందంగా అలంకరించి అందులో చిట్టెలుక కోసం ఆటవస్తువులు కూడా పెట్టింది. పాప చిట్టెలుకకు క్రమం తప్పకుండా మంచి రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని ఇచ్చేది. దానితో రకరకాల ఆటలాడేది. ఆ చిట్టెలుకను ఎప్పటికప్పుడు వైద్యుడి దగ్గరకు కూడా తీసుకెళ్ళి టీకాలు ఇప్పించేది. చిట్టెలుకకు స్వర్గంలో ఉన్నట్లనిపించింది.
ఒకరోజు పాప చిట్టెలుకను చిన్నపెట్టెలో పెట్టి తనతోపాటూ నీటిగుంట దగ్గరకు తెచ్చి ఆడుకుంటోంది. సరిగ్గా అప్పుడే అటుగా వేరే ఎలుకలతో వచ్చిన చిట్టెలుక తల్లి, "అమ్మో! మనుషులు!!! అంతా దాక్కోండి!", అంటూ పొదల మాటుకు వెళ్ళిపోయింది. చాటునుంచీ పాప చిట్టెలుకను ఎంతో మురిపెంగా చూసుకోవడం గమనించాయి చిట్టెలుక తల్లితో సహా అన్ని ఎలుకలు.
ఎలుకలన్నీ మనుషుల కంటపడకుండా తిరిగి గొట్టంలోకి వెళ్ళాక, "ఆహా! జీవితమంటే ఆ చిట్టెలుకదే! రాజులా భోగభాగ్యాలను అనుభవిస్తోంది. ఒక మురికి గొట్టంలో పుట్టిన ఎలుకకి అంతటి మహర్దశ ఎలా కలిగిందో!", అంది పెద్ద ఎలుక.
అందుకు చిట్టెలుక తల్లి, "మన జీవితంలో ఆశయాలను ఉన్నతంగా పెట్టుకుని అందుకు తగినట్లు కష్టపడితే విజయం మనదే అవుతుందని నిరూపించింది చిట్టెలుక!
అది ఎప్పుడూ శుభ్రతకు ప్రాధాన్యతను ఇచ్చింది. మీరంతా అన్న సూటీపోటీ మాటలను చిట్టెలుక ఎప్పుడూ లెక్కచెయ్యలేదు. ఈ గొట్టంలోంచీ ఎలాగైనా బయటకు వెళ్ళి ఆనందంగా బతకాలని ఆశించి, ఆ ఆశయాన్ని సాధించింది! జీవితంలో ఉన్నతాశయం పెట్టుకుంటే కలిగే లాభం కూడా ఉన్నతంగానే ఉంటుంది", అంది.
పెద్ద ఎలుకతోసహా అన్ని ఎలుకలూ చిట్టెలుక తల్లి అన్న మాటలతో ఏకీభవించాయి.
సమాప్తం.
G. S. S. కళ్యాణి గారి కొన్ని ఇతర రచనలు:
G. S. S. కళ్యాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం' కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను.










Comments