వంచన
- Dr. C S G Krishnamacharyulu

- Oct 26, 2025
- 4 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #వంచన, #Vanchana, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Vanchana - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 26/10/2025
వంచన - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
సాధన హాల్లో ఒంటరిగా గోడ కానుకుని కూర్చుంది. ఆమె కనులు మూసుకుని అసందర్భమైన ఒక కల కంటోంది. వివాహం కాకముందు ఆమెను వెంటాడిన ఆ కల, బ్రతుకు బండలైన ఈ నాడు కూడా ఆమెను మురిపిస్తోంది. అందుకు చిహ్నమే ఆమె పెదవులపై తారాడే అరనవ్వు.
ఆ కలలో ఒక అందమైన వనం. ఎటు చూసినా పచ్చదనం. పరిమళాలను వెదజల్లుతూ పూల మొక్కలు, ఫల సమృద్ధితో గాంభీర్యం ప్రదర్శించే వృక్ష సముదాయాలు. పక్షుల కిలకిలారావములు, తుమ్మెదల ఝంకారాలు, తామరలతో అలంకరించబడిన సరస్సు, కొద్ది దూరంలో నీలగిరి శ్రేణులు, ఆ గిరి శిఖరాలనుండి జారిపడే చిన్ని చిన్ని జలపాతాల గలగలలు, ఆహ్లాదకరమైన ఆ వనంలో విహరించే తానొక దేవ కన్య. అంతలో గాలిలో తేలుతూ ఒక అందగాడు. ఎవరో?
ఒక పుష్పగుచ్చాన్ని చేత ధరించి, చిరునవ్వుతో ఆమెను సమీపిస్తున్నాడు.
ఊహా ప్రపంచంలో ఆమె పొందుతున్న అనుభూతిని భగ్నం చేస్తూ, "వదినా, ఒక్కసారి రా! అన్నయ్యకి నమస్కరించు." అన్న మరదలి పిలుపు విని ఆమె లేచింది.
సజీవంగా ఒకనాడు, మృతునిగా ఈ నాడు, ఆతడు తన జీవితాన్ని దుఃఖమయం చేశాడన్న ఆక్రోశంతో ఆమె లేచివెళ్ళి, పాడె మీదున్న రవీంద్రకి నమస్కరించింది. తప్పనిసరైన ఆ పరిస్థితిలో ఆమె అక్కడున్న వారికోసం దుఃఖాన్ని నటించింది. శవాన్ని తీసుకుని వెళ్ళారు.
సాధన అత్తగారు రంగనాయకి, గుండెలు బాదుకుంటూ అంతులేని శోకాన్ని ప్రదర్శించింది.
అప్పుడే పరామర్శకు వచ్చిన దగ్గరి బంధువొకామె, "ఎలా జరిగింది?" అని సానుభూతితో ప్రశ్నించింది.
"అంతా నా కర్మ! ఎంతో ఆరోగ్యంగా తిరుగుతూండే వాడు. పెళ్ళయిన రెండేళ్ళకే ఈ ఘోరం జరిగిపోయింది. ఆ అమ్మాయి జాతకంలో ఏ దోషముందో చెప్పలేదమ్మా!" అని గొల్లున ఏడ్చింది రంగనాయకి.
"అమ్మా! దోషం మనది. ఆ అమ్మాయిది కాదు. తనకు కేన్సర్ వ్యాధి వుందన్న విషయాన్ని దాచి, అన్నయ్య వదినను వంచించాడు." అని ఆమె కూతురు బాహాటంగానే తల్లిని మందలించింది.
అయినా రంగనాయకి ధోరణి మారలేదు. ఆమె ఈ రోజు కోడలిని హంతకురాలిగా సమాజ న్యాయస్థానంలో ప్రకటించి తీరాలన్న ధృఢ నిశ్చయంతో వుంది. ఆమె అంతరంగానికి స్వార్థం పట్ల వున్న ఆపేక్ష సానుభూతి పట్ల లేదు. కోడలి బాధ్యత తీసుకోవడం గానీ, ఆస్తిలో ఆమెకు వాటా కల్పించడం కానీ ఆమెకు సుతరామూ ఇష్టం లేదు.
@@@
పదమూడో రోజు కార్యక్రమాలు కూడా ముగిసాయి. రంగనాయకి రవీంద్ర స్నేహితుడి కోసం, అతడు అందించే వీలునామా కోసం, ఎదురు చూస్తోంది. సాధన కుతూహలం వేరు. అది ఆస్తి కోసం కాదు, ఆ వ్యక్తి ఎవరా అని. చివరి రోజుల్లో రవీంద్ర చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది.
"నా స్నేహితుడు అనిల్. ఎంతో మెతక మనిషి. నీకు అతను తెలుసు. అతడు వచ్చి వీలునామా ఇవ్వగానే అమ్మ నిన్ను వదిలించుకోవడమెలా అని ఆలోచిస్తుంది. అందుకే అనిల్ తో ఇల్లు విడిచి నేను నీ కోసం కొన్న క్రొత్త అపార్టుమెంటుకు వెళ్ళిపో. అపార్టుమెంటు విషయం అమ్మకు తెలియకూడదు."
"ఇదొక క్రొత్త వంచన. నా మేలు కోసమే కావచ్చు. కానీ ఒకప్పుడు రోగం విషయం దాచి నన్ను వంచించాడు. ఇప్పుడు ఆస్తి విషయంలో తల్లిని వంచిస్తున్నాడు. తల్లిని బిడ్డ, బిడ్డను తల్లి, భర్తని భార్య, భార్యని భర్త, ఒకరినొకరు వంచించుకోవడమేనా జీవన మార్గం? నమ్మకం సహజ పునాదిగా వుండాల్సిన చోట, వంచన చోటు చేసుకుంటే, మానవ సంబంధాలకి విలువేముంది? కుటుంబ జీవనానికి అర్థమేముంది?" అలా తర్కిస్తున్న ఆమె, వచ్చిన వ్యక్తిని చూసి నిశ్చేష్టురాలైంది.
"అనిల్ అంటే ఇతనేనా? రవీంద్రకు స్నేహితుడా? మెట్రోలో వేర్వేరుగా నిలబడే వీరెలా స్నేహితులయ్యారు? ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క రోజూ తారసపడలేదే? వివాహానికి కూడా రాలేదు."
అని ఆమె యోచిస్తూండగా, అనిల్ వీలునామా పత్రాలు రంగనాయకికి అందచేసాడు.
"మొత్తం ఆస్తి మీ పేరనే వ్రాసాడు. మీ కోడల్ని స్త్రీ సంక్షేమ హాస్టల్లో దిగబెట్టమని, ఒక ఉద్యోగం చూపించమని చెప్పాడు. ఆమె వస్తే తీసుకుని వెళ్ళి దిగబెడతాను." అని చెప్పాడు.
రంగనాయకి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆమె, తన సంతోషాన్ని దాచుకోలేదు.
"సాధనా! బయలుదేరమ్మా! చీకటి పడకముందే హాస్టలుకు వెళ్ళు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూండు" అని కోడలికి వీడ్కోలు పలికింది.
సాధన మౌనంగా తన సామాను తీసుకుని అనిల్ వెంట నడిచింది. త్రోవలో అనిల్, ఆమె కోసం రవీంద్ర, అరవై లక్షల అపార్టుమెంటు, పాతిక లక్షల రూపాయల డిపాజిట్స్ ఏర్పాటు చేసాడని చెప్పాడు.
"నా వెల ఇంతేనా?" అంది ఆమె అకస్మాత్తుగా.
అనిల్ స్తంభించిపోయాడు.
"అదేమిటి?"
"నువ్వు నన్ను ఇష్టపడ్డావు. రోజూ మెట్రో లో నన్ను ప్రేమగా ఓర చూపులు చూస్తూ ప్రయాణించావు. ఆ చూపులు నన్ను తాకి, నాలో పులకింతలు రేపేవి. నేను పిచ్చిదానిలా, నీ ప్రేమ ప్రకటన కోసం ఎదురు చూసాను. కానీ హఠాత్తుగా నువ్వు అదృశ్యమయ్యావు. ఈ రోజు రవీంద్ర స్నేహితుడిగా రంగ ప్రవేశం చేసావు. నాకిందులో ఏదో వంచన కనబడుతోంది."
"నాకు రవీంద్రకి మధ్య ఒక ఒడంబడిక వుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ విషయం నేనే నీకు చెప్పాలనుకున్నా".
"వంచనలో ఒక క్రొత్త విషయం అనే ఒక, కథ చెబుతావా? సరే నీ మాట నేనెందుకు కాదనాలి?
తర్వాతే చెప్పు"
ఆ మాట అనిల్ కి సూటిగా తగిలింది. మారు మాట లేకుండా అతడు విషణ్ణ వదనంతో కారుని అపార్టుమెంటు దిశగా పోనిచ్చాడు.
@@@
వారం రోజులు తర్వాత, సాధన, అనిల్ గుండెల్లో బాంబు పేల్చింది.
"నాకు చెన్నైలో జాబ్ వచ్చింది. అక్కడ నా స్నేహితురాలుంది. ఆమెతో వుంటాను”. అని చెప్పింది. "నేనంటే నీకు ప్రేమ లేదా?" అతని కంఠంలో నిరాశ.
"అది ఒకప్పటి మాట. అనూహ్యంగా, రవీంద్ర నీ స్థానంలోకి వచ్చాడు. నా తల్లిదండ్రులని ఒప్పించాడు. తను రోగిష్టిననే నిజం దాచి, నా జీవితానికి ఉరిత్రాడు వేసాడు. ఆందోళనతో సాగిన మా కాపురం, విషాదంగా ముగిసిపోయింది. ఈ ఆస్తిని తన వంచనకు పరిహారంగా ఇచ్చాడా? లేక సేవలకు వెల కట్టాడా?"
ఆమె సూటిగా, కటువుగా అడుగుతున్న ప్రశ్నలకు అనిల్ బిత్తర పోయాడు. ఒక్క క్షణం మౌనంగా వుండిపోయి, ఆ తర్వాత, ధైర్యం కూడగట్టుకుని, ఇలా అన్నాడు.
"నీ దగ్గరకు రావాలనుకుంటున్న సమయంలో రవీంద్ర వచ్చి, “నేను మహా అయితే ఏడాది కన్నా బ్రతకను. నాకు సాధన అంటే వ్యామోహం, ప్రేమ. నా మరణానంతరం నువ్వు ఆమెను నీ భార్యగా చేసుకో, “ అని పదే పదే బ్రతిమిలాడాడు. జాలి పడి నా ప్రేమను త్యాగం చేసాను."
"నీది త్యాగమనరు. ద్రోహ మంటారు. ఒక అమాయక స్త్రీ జీవితంతో, మీరిద్దరూ కలిసి ఆడుకున్నారు మాచ్ ఫిక్సింగ్ చేసారు. నేను క్రికెట్ ఆటను కాను. మానాభిమానాలున్న ఒక యువతిని"
"దయతో నన్ను క్షమించలేవా?" అతడు ప్రార్థనా పూర్వకంగా అడిగాడు.
"క్షమిస్తాను. దానికి మార్గం నిన్ను మరిచిపోవడమే. ఈ సొమ్ము నాకు వద్దు. నీ త్యాగానికి మూల్యంగా నువ్వే వుంచుకో. నా మానాన నన్ను పోనివ్వు."
"నీ నిర్ణయం మారుతుందన్న ఆశతో నీకోసం ఎదురు చూస్తూ, జీవిస్తాను."
"ఆ పొరబాటు చేయకు. పెళ్ళి అంటే బొమ్మలాటకాదు. దాని ప్రభావం జీవితం మీద ఎంతగా వుంటుందో నీకు తెలియదు. అందులో వంచన పెళ్ళి ఇది. నువ్వు, రవీంద్ర, పెళ్ళి, కాపురం... అన్నీ చేదు జ్ఞాపకాలే. వీటి నుంచి ఎప్పటికైనా బయట పడతానో, లేదో తెలియదు.”
ఆ మాట చెప్పాక, ఆమె అతని ముఖం చూడకుండా వెళ్ళిపోయింది. మారుమాటాడే అవకాశం లేని అనిల్ మౌనాన్ని ఆశ్రయించాడు. జీవితంలో ఓడిపోయానని వేదన చెందాడు.
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).




Comments