top of page
Original.png

విజేత

విజేత, Telugu corporate story, Telugu psychological story, modern Telugu fiction, corporate life Telugu, Telugu emotional satire

లాటరీ గెలిచినా ఖాళీగా కూర్చున్న యువతి
లాటరీ గెలిచినా ఖాళీగా కూర్చున్న యువతి

Vijetha - Telugu Emotional Story | M K Kumar

విజేత - తెలుగు భావోద్వేగ కథ | ఎం. కె. కుమార్

Published in manatelugukathalu.com on 17/05/2026


డబ్బు, గెలుపు, కార్పొరేట్ జీవితం…ఇవన్నీ మనిషికి నిజంగా స్వేచ్ఛనిస్తాయా? లేక మరో బంగారు బంధనంగా మారిపోతాయా?

ఒక సాధారణ మధ్యతరగతి యువతి అకస్మాత్తుగా ఐదు వందల కోట్ల లాటరీ గెలుచుకుంటుంది. కానీ ఆమె జీవితంలో ఆనందం మాత్రం రావడం లేదు. కార్పొరేట్ ప్రపంచపు నిస్సారత, “విజయం” అనే మాయ, మనిషి లోపల దాగి ఉన్న ఖాళీతనాన్ని గట్టిగా ప్రశ్నించే ఆలోచింపజేసే ఆధునిక కథ — “విజేత”.



నా పేరు నిసిత. వయసు ఇరవై ఎనిమిది. ఊరు తిరుపతి, కానీ ఇప్పుడు బతుకుతున్నది బెంగళూరులో, ఒక పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు ఉండే ఒక అగ్గిపెట్టె లాంటి పీజీ రూమ్‌లో.


నిన్న రాత్రి నా ఫోన్ స్క్రీన్ మీద ఆరు నంబర్లు మెరిశాయి. ఆ ఆరు నంబర్లు నా లాటరీ టికెట్‌ మీద ఉండే నంబర్లతో అచ్చు గుద్దినట్టు సరిపోయాయి. కింద పసుపు రంగు అక్షరాల్లో "యు ఆర్ ద విన్నర్ - బహుమతి 60 మిలియన్ డాలర్లు" అని రాసి ఉంది.


అంటే మన లెక్కల్లో సుమారు ఐదు వందల కోట్లు.

ఐదు వందల కోట్లు


సాధారణంగా సినిమాల్లో అయితే ఈపాటికి నేను గట్టిగా అరిచి, గంతులేసి, నా పక్కనున్న పీజీ పిల్లల్ని లేపి కౌగలించుకొని ఏడ్చేయాలి. కానీ నేనేం చేశానో తెలుసా? సగం తిని వదిలేసిన స్విగ్గీ చికెన్ బిర్యానీ బాక్స్ వంక చూశాను.


అది అప్పటికే చల్లబడిపోయి, నూనె గడ్డకట్టి, చూడటానికే అసహ్యంగా ఉంది. నాకు ఆ బిర్యానీ మీద ఉన్న ఏహ్యభావం, ఈ ఐదు వందల కోట్ల మీద ఉన్న ఆనందం... రెండూ ఒకేలా అనిపించాయి. నా లోపల ఏ మూలా ఒక్క చిన్న కదలిక లేదు.


"అబ్బా, భలే గెలిచానే" అనే సంబరం లేదు. నా కళ్లు ఫోన్ స్క్రీన్ మీదే అతుక్కుపోయాయి. మనసు మాత్రం పక్కనున్న గోడ మీద పాకుతున్న బల్లిని చూస్తూ, అది ఆ దోమను ఎలా పట్టుకుంటుందో అని లెక్కలేస్తూ ఉంది.


మా ఆఫీస్ నన్ను ఎంత మొద్దుబార్చుతుందంటే, నువ్వు యాభై రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్‌కు ఐదు వందల కోట్లు తగిలినా సరే, "రేపు పొద్దున్నే పదింటికి స్క్రమ్ కాల్ ఉంది కదా, మేనేజర్ ఏమంటాడో" అనే భయమే మైండ్‌లో దొర్లుతూ ఉంటుంది.


నేను పని చేసే కంపెనీ పేరు 'సినర్జీ డేటా అనలిటిక్స్'. నేను చేసే పోస్ట్ పేరు "సీనియర్ ఆప్టిమైజేషన్ ఎగ్జిక్యూటివ్". ఇదొక పెద్ద బూటకం. 


నేను రోజంతా చేసేది ఏమంటే... ఎక్సెల్ షీట్లు ఓపెన్ చేసి, ఆ గడుల్లో ఉండే నంబర్లను ఎడమకు కుడికి, కుడికి ఎడమకి మార్చడమే. నేను ఈ పని చేయకపోయినా ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు.


కానీ, మా కంపెనీ సీఈఓ మాత్రం, మేమేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము, క్యాన్సర్‌కి మందు కనిపెడుతున్నాము అన్నట్టు మీటింగుల్లో బిల్డప్ ఇస్తాడు.


నిన్న ఆఫీసులో "మంత్లీ టౌన్ హాల్" జరిగింది. అందర్నీ ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టి, స్లైడ్లు చూపిస్తున్నారు.


"ఈ క్వార్టర్లో మనం టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనం ఇంకా కష్టపడాలి. వి ఆర్ ఏ ఫ్యామిలీ" అని మా హెచ్.ఆర్ ఆవిడ అరుస్తూ ఉంది.


నా పక్కన కూర్చున్న రాహుల్, ఇంక నెలకైతే ఈఎంఐలు ఎలా కట్టాలి అని గోళ్లు కొరుక్కుంటూ ఉన్నాడు.


నిజానికి, ఈ కార్పొరేట్ ప్రపంచంలో "గెలుపు" అంటే ఏమిటో తెలుసా? నెల తిరిగేసరికి వాళ్లు పడేసే జీతం ముక్క తీసుకుని, ఆ డబ్బులతో మళ్లీ వాళ్లు అమ్మే వస్తువులనే కొనుక్కోవడమే కదా!


రోజూ తొమ్మిది గంటలు పని చేసి, వీకెండ్ రాగానే "హమ్మయ్య" అనుకుని మాల్స్ చుట్టూ తిరుగుతాము. మాల్స్‌లో ఆఫర్లు చూసి గెలిచామని అనుకుంటాము. కానీ గెలిచేది ఆ బ్రాండ్ల వాళ్లు, మనం కాదు. మనం ఎప్పుడూ ఓడిపోయేవాళ్లమే.


ఇప్పుడు నాకు ఐదు వందల కోట్లు వచ్చాయి కదా. అంటే నేను వీళ్లందరి కంటే గెలిచినట్టేనా? గెలుపు అనేది ఒకడి కష్టం వల్లనో, టాలెంట్ వల్లనో వచ్చేది కాదు. అదొక లాటరీ. కంపెనీలో ఎవడికి ప్రమోషన్ రావాలనేది కూడా ఒక లాటరీనే.


బాస్‌కు ఎవడి మీద మోజుంటే వాడికే ప్రమోషన్. ఈ క్యాపిటలిస్ట్ ప్రపంచంలో ప్రతిదీ ఒక క్యాసినో లాంటిదే. కాకపోతే, టై వేసుకుని డెస్కుల ముందు కూర్చుని ఆడతాము, అంతే తేడా.


లాటరీ డబ్బులు చూసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు. ఆలోచనలు వెనక్కి, తిరుపతికి పోయాయి.


మా నాయన ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉండేవాడు: "నిసితా, లోకంలో రెండే రకాల మనుషులుంటారు. కొట్టేటోడు, తిన్నేటోడు. మనం కొట్టేటోళ్ల సైడ్ ఉండాలి. స్కూల్లో ఫస్ట్ రావాలి. కాలేజీలో ఫస్ట్ రావాలి. ఎప్పుడూ గెలుస్తూనే ఉండాలి."


మా నాయన గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. ఆయన తన జీవితంలో ఎప్పుడూ ఏదీ గెలవలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద రుద్దేవాడు.


నేను తిరుపతిలో క్యాంపస్ స్కూల్‌లో చదివేటప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను ఏడో తరగతి అనుకుంటా. జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ జరిగింది. అందరు పిల్లలు ఏవేవో తయారు చేసుకొచ్చారు.


నేను ఒక అట్టపెట్టె తీసుకుని, దానికి రంగులేసి, లోపల బేకింగ్ సోడా, వెనిగర్ వేసి అగ్నిపర్వతం మోడల్ చేశాను.


తీరా జడ్జీలు నా దగ్గరికి వచ్చేసరికి, ఆ వెధవ అగ్నిపర్వతం పేలలేదు. లోపల రియాక్షన్ జరగలేదు. నా గుండె ఆగిపోయినంత పనైంది. 


తీరా జడ్జీలు నా దగ్గరికి వచ్చేసరికి, ఆ వెధవ అగ్నిపర్వతం పేలలేదు. లోపల రియాక్షన్ జరగలేదు. నా గుండె ఆగిపోయినంత పనైంది.


జడ్జీలు నా వంక ఏకతాళిగా చూశారు. అప్పుడు నేను ఏడవకుండా, గభాల్న నా ముఖంలో ఒక నకిలీ కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాను.


"సార్, ఈ అగ్నిపర్వతం ఎందుకు పేలలేదో తెలుసా? భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు కదలకుండా ఉండడం వల్ల లావా బయటకు రాలేదు. నేను ప్రకృతి పర్యావరణాన్ని రక్షించడానికి, అగ్నిపర్వతాలు పేలకుండా ఎలా ఆపాలో చూపిస్తున్నాను సార్" అని అబద్ధం చెప్పాను.


"వావ్! అమ్మాయి ఆలోచన ఎంత డిఫరెంట్ గా ఉందో చూశారా?" అనుకుని నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు.


ఆరోజు నాకు ఫస్ట్ ప్రైజ్ తీసుకునేటప్పుడు నా చేతులు వణికాయి. లోపల అపరాధభావం. నేను గెలవలేదు, మోసం చేశాను అని.


కానీ స్టేజ్ మీద అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే, మా నాయన మీసం మెలేస్తూ ఉంటే, నా ఫోటో పేపర్‌లో వస్తే... నాకు నెమ్మదిగా ఆ ఫేక్ గెలుపు రుచి మరిగిపోయింది. ప్రపంచానికి నిజం అవసరం లేదు. కేవలం "విన్నర్" అనే ట్యాగ్ మాత్రమే కావాలి అని ఆరోజే నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది.


ఇప్పుడు, ఈ ఐదు వందల కోట్లు రావడం కూడా అలాంటిదే. నేను ఏ కష్టపడలేదు. రాత్రి పూట ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్ చూస్తూ, బోర్ కొట్టి ఆన్‌లైన్‌లో దొరికిన ఏవో నంబర్లు క్లిక్ చేశాను.


అల్గారిథమ్ దేవుడు నా వైపు చూసి నవ్వి, నా నెత్తిన ఈ డబ్బులు కుమ్మరించాడు.


ఇప్పుడు నేనేం చేయాల?


పొద్దున్నే లేచి, మా బాస్‌కు ఫోన్ చేసి "ఒరేయ్ వెధవా, నీ యాభై వేల జీతానికి, నీ చెత్త ఎక్సెల్ షీట్లకు దండం రా, నేను పోతున్నాను" అని చెప్పాలా?


బెంజ్ కారు కొనుక్కుని కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌కు పోయి, అక్కడినుంచి పారిస్ ఫ్లైట్ ఎక్కేయాలా?


లేదా తిరుపతికి పోయి, స్వామి గుడికి ఒక కోటి రూపాయలు విరాళం రాసి ఇచ్చి, మా నాయన ముందు కాలరెగరేయాలా?


ఇవన్నీ చేస్తే... నేను "గెలిచినట్టు" ప్రపంచానికి ప్రూవ్ అవుతుందేమో కానీ, నా లోపల ఆ ఖాళీతనం అలాగే ఉంటుంది.


ఎందుకంటే, మనకి నేర్పించిన అతి పెద్ద అబద్ధం ఏమంటే... "డబ్బు వస్తే నీకు స్వేచ్ఛ వస్తుంది" అని.


కానీ, ఆ డబ్బే నిన్ను ఇంకో పెద్ద జైలులో పడేస్తుంది.

నిన్నటిదాకా నా సమస్య "నెల ఆఖరికి రెంట్ ఎలా కట్టాలి?" అనేది.


ఈరోజు నా సమస్య "ఈ ఐదు వందల కోట్లను ఏ బ్యాంకులో పెట్టాలి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎవడొచ్చి నన్ను చంపేస్తాడో? ఏ ఇన్‌కమ్ టాక్స్ వాడొచ్చి నా మెడ మీద కత్తి పెడతాడో?" అనేది.


గెలుపు అనేది ఒక జబ్బు. అది మనల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఆఫీసులో ప్రమోషన్ కోసం నా పక్కన పని చేసే సుమతి మీద నేను చాడీలు చెప్పినప్పుడు నాలో ఎంత స్వార్థం ఉండిందో, ఇప్పుడు ఈ ఐదు వందల కోట్లు నా ఒక్కదానికే దక్కాయి, నా ఫ్రెండ్స్‌కు ఎవరికీ చెప్పకూడదు అనుకునేటప్పుడు కూడా నాలో అంతే స్వార్థం ఉంది.


మనిషి మారలేదు. కేవలం అకౌంట్‌లో సున్నాలు మాత్రమే మారాయి.


తెల్లారింది. బెంగళూరు సిటీ యథావిధిగా బతికిపోతూ ఉంది. కింద రోడ్డు మీద ఎవడో క్యాబ్ డ్రైవర్ హారన్ కొడుతూ ఉన్నాడు. పీజీలో పక్క రూమ్ అమ్మాయి బాత్రూమ్ కోసం తలుపు బాదుతూ ఉంది.


నేను లేచి, ముఖం కడుక్కున్నాను. ల్యాప్టాప్ ఆన్ చేసినాను. నా మెయిల్ చెక్ చేసినాను.


"అర్జెంట్: కైండ్లీ అప్డేట్ ద షీట్ బై 10 ఎ ఎమ్" అని మేనేజర్ మెయిల్ ఉంది.


నాకు నవ్వొచ్చింది. పిచ్చి నవ్వు. అకౌంట్‌లో ఐదు వందల కోట్లు గెలిచిన ఒక "విజేత", ఇప్పుడు పది గంటలకల్లా ఎక్సెల్ షీట్ అప్‌డేట్ చేయబోతూ ఉంది.


ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే, ఈ సిస్టమ్ నాకు అదే నేర్పించింది. మనకి స్వేచ్ఛ దొరికినా, దాన్ని ఎలా వాడుకోవాలో మనకి తెలియదు. మనకి ఎప్పుడూ ఎవరో ఒకరు ఆర్డర్లు వేస్తూ ఉండాలి. మనం ఒక యంత్రం లాగా పనిచేస్తూ ఉండాలి. అదే మన బతుకు.


నేను లాటరీ సైట్‌ను క్లోజ్ చేశాను. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను. సెల్ A1 నుంచి సెల్ B2 కి ఒక ఫార్ములా కాపీ చేశాను.


"నిసితా! నువ్వు గెలిచావులే!" అని నా లోపల ఎవరో అరిచినట్టు అనిపించింది.


"ఎక్కడ గెలిచాం రా నాయనా? ముసుగేసుకుని పడుకోకుండా ఈ షీట్లు ఏరుకుంటున్నాము," అని నేనే నాకు సమాధానం చెప్పుకున్నాను.


బిర్యానీ బాక్స్‌ను డస్ట్ బిన్‌లో పడేసి, కాఫీ కలుపుకోవడానికి కిచెన్‌లోకి పోయాను. ఈ ఐదు వందల కోట్లు ఎక్కడికీ పోవులే.


ఆరు నంబర్లు నావి. నా గెలుపు నాది. కానీ ఈ నిస్సారమైన, అబద్ధపు ప్రపంచంలో... నిజమైన విజేత అనేవాడు ఎవ్వడూ లేడు. అందరం ఒక పెద్ద నాటకంలో యాక్టర్లమే. నేను కూడా అంతే.


సమాప్తం

ఎం. కె. కుమార్ గారి కొన్ని ఇతర రచనలు:


ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page