top of page
Original.png

విశ్వనాథం ఛానల్ ప్రహసనం

తెలుగు హాస్య కథ, YouTube channel story, యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా వ్యామోహం, రిటైర్డ్ జీవితం, కుటుంబ హాస్యం, humorous Telugu story, comedy Telugu story, travel vlog comedy, Telugu literature, contemporary Telugu story, digital age humor, Telugu writer Kanakadurga Lakshmiratna, family entertainment story, YouTube creator life, Mana Telugu Kathalu, వినోదాత్మక కథ, హాస్య రచన, retirement life comedy

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'విశ్వనాథం ఛానల్ ప్రహసనం' కథలో విశ్వనాథం యూట్యూబ్ వీడియో చిత్రీకరిస్తుండగా, కుటుంబ సభ్యులు నవ్వుతూ చూస్తున్న హాస్యభరిత దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'విశ్వనాథం ఛానల్ ప్రహసనం' కథలో విశ్వనాథం యూట్యూబ్ వీడియో చిత్రీకరిస్తుండగా, కుటుంబ సభ్యులు నవ్వుతూ చూస్తున్న హాస్యభరిత దృశ్యం.

Viswanatham Channel Prahasanam - Telugu family Comedy Story | Kanakadurga Lakshmirathna

విశ్వనాథం ఛానల్ ప్రహసనం తెలుగు కుటుంబ హాస్య కథ | కనకదుర్గా లక్ష్మీరత్న

Published in manatelugukathalu.com on 18/06/2026


రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఆస్వాదిస్తూ గడపాల్సిన విశ్వనాథం, యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలనే కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. తన మాటతీరు, ఆత్మవిశ్వాసం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రారంభమైన "విశ్వనాథం ఛానల్" ప్రయాణం అనుకోని మలుపులు తిరుగుతుంది. వ్యూస్ కోసం ఎదురుచూపులు, యాత్రల వీడియోలు, సరదా పొరపాట్లు, ట్రోలింగ్స్, కోతి ఎత్తుకెళ్లిన ఫోన్ వంటి హాస్యభరిత సంఘటనల మధ్య సాగిన ఈ కథ, నేటి సోషల్ మీడియా యుగంలో మనుషుల మనస్తత్వాన్ని వినోదాత్మకంగా ప్రతిబింబిస్తుంది. నవ్విస్తూనే ఆలోచింపజేసే ఈ కథను ఆస్వాదించండి.


ఈ మధ్యనే రిటైర్ అయిన విశ్వనాథం యూట్యూబ్లో వివిధ ఛానెల్స్ చూడటం మొదలెట్టాడు. వార్తలు, వంటలు, విహారయాత్రలు, దేవాలయాలు, స్టాక్మార్కెట్, రియల్ ఎస్టేట్ - ఒకటేమిటి! మొత్తం చుట్టబెట్టేస్తాడు. దానికి విపరీతంగా ప్రభావితుడై తను కూడా యూట్యూబ్లో ఒక ఛానెల్ పెట్టుకుంటే ఎలావుంటుందీ అన్న ఆలోచన కలిగింది. దానికి భార్య కామాక్షి ప్రోద్బలమూ తోడైంది. కామాక్షి ప్రోత్సాహం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కారణాలేమిటి? ఒక చిన్న కధే ఉంది.


విశ్వానికి దేశ రాజకీయాలు, జరుగుతున్న పరిస్థితుల పట్ల మంచి అవగాహనే కాకుండా, సైన్స్, సాంకేతికత పట్ల మంచి పట్టు కూడా ఉంది. దేనిమీదైనా అనర్గళంగా మాట్లాడేయగలడు. ఇక్కడే పెద్ద సమస్య. తాను మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళ స్థితిగతులు అస్సలు పట్టించుకోడు. అసలు వాళ్ళకి ఆ ఫలానా విషయం పైన ఆసక్తి ఉందా లేదా, మనసుకు పట్టించుకుంటున్నారా లేదా ఏమీ అక్కర్లేదు. ఒక ధోరణిలో చెప్పుకుంటూ పోతుంటాడు. ఎదుటివారి తెలివితేటల మీద ఎప్పుడూ ఒకింత తక్కువ అంచనాలో ఉంటాడు. అర్ధం కాదేమోనని చెప్పిందే చెబుతుంటాడు. ఎవరికి ఏది చెప్పాలో కూడా అవగాహన ఉండదు. బ్రహ్మజ్ఞానం అందరికీ వంటపట్టదు కదా!


వంటిట్లో పోపు పెడుతున్న కామాక్షిని పిలిచి

“Chat GPTని ఏవైనా ప్రశ్నలు అడుగు” అన్నాడు.


“పోపు మాడిపోతోంది” అంది కామాక్షి.


“అదే మరి! నాలుగు కొత్త విషయాలు నేర్చుకుని నలుగురు ముందు మాట్లాడితే నీకెంత గొప్పగా ఉంటుంది? ఎంత సేపూ కందా బచ్చలిలో ఆవ ఎప్పుడు పెట్టాలి? కందిపచ్చడిలో అమ్మ చింతపండు వేసేదా? అమ్మలక్కలతో ఇవేనా మాటలు? ఎప్పటికప్పుడు వచ్చే కొత్త మార్పులకి మనల్ని మనం అప్డేట్ చేసుకోవద్దూ?” అని బోధ మొదలెట్టాడు. 


ఇక కామాక్షితో లాభం లేదనుకుని కొడుకు పట్టాభిరామ్ వెంటబడి

“ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి చెబుతాను రారా” అని పిలిచాడు.


వాడు ”నేను అసైన్మెంట్ చేసుకోవాలి డాడీ“ అంటూ అయిష్టంగా వచ్చాడు. అయిదు నిమిషాలు కాగానే ఆవలింతలు మొదలెట్టాడు.


విశ్వానికి తిక్క రేగిపోయింది. “ఏడవండి! నేర్పిస్తాను మొర్రో అంటే వద్దనే వాళ్ళని మిమ్మల్నే చూసాను” అంటూ చుట్టూ చూసి టీవీ రిమోట్ కనిపిస్తే అది విసిరికొట్టాడు. పట్టూ (వాడి ముద్దు పేరు) చిన్నబుచ్చుకుని “నీకు అంత కోపం వస్తే నేను వినను డాడీ” అని లేచి వెళ్ళిపోయాడు.


“మీలాంటి శ్రద్ధాశక్తులు లేని వారికి చెప్పి కంఠశోష పడేకన్నా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని నాలుగు విషయాలు నలుగురికి చెబితే, అటు అవసరమైన వారికి ఉపయోగపడుతుంది, ఇటు నా జిజ్ఞాస కూడా తీరుతుంది” అన్నాడు ఆవేశంగా.


కామాక్షికి అప్పుడే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే అంది.

“అవును మీ చేతిలో విద్యని వృధా పరచడం ఎందుకు? చక్కగా యూట్యూబ్ లో ఒక ఛానెల్ పెట్టుకోండి. అందులో  విద్య - విజ్ఞానం, ఇంకా మీకు ప్రవేశం వున్నవిషయాల గురించి పోస్ట్ చేయండి”  ప్రోత్సాహిస్తూ అంది.


తను  కోపంలో ఎదో అంటే ఏమిటీ కామాక్షి నిజం అనుకుంటోంది, అని ఆశ్చర్యపోతూ

“ఏమిటీ? వెటకారమా” కోపంగా అన్నాడు.


“వెటకారం ఏమిటీ? పోనీ కదా అని ప్రోత్సహిస్తుంటే? మీకు చక్కటి వాక్శుద్ధి, భాషలో ప్రావీణ్యము, గొంతులో గాంభీర్యము, అన్నీ వున్నాయి. పైగా చమత్కారి కూడానూ! ఇంకేమి కావాలి ఛానెల్ పెట్టడానికి?” అంది. 


“అవుననుకో!” కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేడు.


“ఏమైనా డబ్బులు కట్టాలా ఛానల్ పెట్టడానికి” అడిగేడు.


“ఏమీ అక్కర్లేదు. ఫ్రీనే . నేను కూడా రోజూ చేసే వంటలను ఒక కుకింగ్ ఛానెల్ పెట్టుకుని అందులో పోస్ట్ చేయవచ్చు” అంది.


“అంటే నాకు పొటీగా నువ్వు కూడా కుకింగ్ చానెల్ పెట్టేస్తావా? ఉండు. ముందు నన్ను నిలదొక్కుకోనీ! ఆనక పెట్టుకుందువులే!” కొంచెం గాభరాగా అన్నాడు.


“బాగానే వుంది. ఇంకా ఆరంభమే కాలేదు, అంతలోనే  అసూయ కూడానూ”, కూర కలపడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది.


ఒక శుభముహూర్తాన  యూట్యూబ్ లో “విశ్వనాథం ఛానల్” పురుడుపోసుకుంది. ప్రారంభంలోనే చదువు, సంధ్యలు మొదలెట్టయ్యకుండా  అందరినీ ఆకర్షించడానికీ, ఆసక్తి రేకెత్తించడానికీ  తనకి చిన్నప్పటి నుండీ కంఠస్థం వచ్చిన దానవీరశూరకర్ణలో మయసభ డైలాగ్స్ ఏకబిగిన పది నిమిషాలు గుక్కతిప్పుకోకుండా చెప్పేసేడు, కామాక్షి సలహా మీద, పట్టూ వీడియో తీస్తుంటే. బాగా వచ్చిందని సంతృప్తి చెందేక తన ఛానెల్లో పోస్ట్ చేసేడు. 

తన ఫామిలీ వాట్సప్ గ్రూప్లో కూడా అందరికీ తెలియజేసేడు. ఒక అరగంట పోయేక ముంబై నుండి కజిన్ ఫోన్ చేసి ”అన్నయ్యా! అంత కష్టమైన డైలాగ్స్ ఎంత ధారాళంగా చెప్పేసేవు! వెంటనే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చూడమని చెప్పేసేను” అంది. 


ఆరంభమే వచ్చిన మంచి ఫీడ్బ్యాక్ కి ఉబ్బితబ్బిబ్బయిపోయి విశ్వానికి మాటలు రాలేదు. ఇంక ఫామిలీ గ్రూప్ లో మెస్సేజ్ల పరంపర మొదలైంది. “బాగుంది అన్నయ్యా” అంటూ కజిన్సూ, “బాగుందిరా అబ్బాయి, పాత రోజులు గుర్తు చేసేవు” అంటూ బాబాయిలు ఇచ్చిన ప్రోత్సాహంతో తనపైన కొంచెం ధీమా పెరిగింది. ఇంక విశ్వానికి రోజూ ఎన్నివ్యూస్, లైక్స్ వచ్చాయో మాటిమాటికి చూసుకోవడం ఒక తంతైపోయింది.


ఒక రోజు అర్ధరాత్రి మూడు గంటలకు కామాక్షికి మెలకువ వచ్చింది. హాల్లో లైటు వెలుగుతుండటంతో అటుకేసి వెళ్ళింది. విశ్వం సోఫాలో కూర్చుని చేతిలో ఫోన్ కేసి గుడ్లు మిటకరించి చూస్తున్నాడు. 


ఎవరికైనా ఒంట్లో బాగోలేదని ఫోన్ వచ్చిందేమోనని గాభరాగా

“ఏమైంది”  అడిగింది. 


విశ్వం ఫోన్ లోంచి తల తిప్పకుండ గానే “వ్యూస్ ఏమైనా మారుతున్నాయేమోనని చూస్తున్నాను” అన్నాడు. 


ఒళ్ళు మండింది కామాక్షికి.

“ఇంత అర్ధరాత్రి, అపరాత్రి ఎవరు చూస్తారు? అతికాకపోతేనూ” విసుక్కుంది. 


“అమెరికాలో ఇప్పుడు పగలేగా “ అన్నాడు.


అదిఅమాయకత్వమో, అత్యుత్సాహమో లేక అత్యాశో అంతు పట్టలేదు కామాక్షికి.

“మీరు మయసభ డైలాగ్స్ పెట్టేరని ప్రపంచం అంతా నిద్రా,నిప్పులూ మానేసి చూస్తూ కూర్చుంటుందా ఏమిటీ? వచ్చిన వ్యూస్,లైక్స్ చాలు గాని పోయి పడుకోండి” అంది.


తెల్లారే మళ్లీ ఫోన్ చూసుకున్నాడు. కొత్తగా కొన్ని వచ్చేయి. వచ్చిన వాటిల్లో చాలా వరకు విశ్వం బంధువులు, కామాక్షి బంధువులవే.  వ్యూస్,లైక్స్ పెరగడంతో పాటు ఆనందం, దానితో పాటే  ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చేయి.


ఒకసారి వరుసగా నాలుగు రోజులు సెలవలు కలిసి వస్తే రామేశ్వరం, కన్యాకుమారి వెళ్లి వద్దామన్నాడు విశ్వం. కాశీ నుండి తెచ్చుకున్న రాగిచెంబులోని గంగా జలాన్ని రామేశ్వరంలో అభిషేకానికి వాడాలని అత్తగారు చెప్పిన మాటలు గుర్తుంచుకుని  మర్చిపోకుండా పెట్టుకుంది కామాక్షి. ప్యాకేజీ టూర్లో బయలుదేరేరు. ఈ యాత్రా విశేషాలు అన్నీ తన ఛానెల్ లో చూపించేయాలని విశ్వం ఉబలాటపడ్డాడు. 


ప్రయాణీకుల్లో వివిధ భాషలు వాళ్ళు వున్నారు.  బస్సులో రికార్డింగ్ మొదలెట్టేడు, తాము ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నదీ, ఏమేమి చూడబోతున్నదీ, తాను ఏమేమి చూపించబోతున్నదీ తదితర విషయాలతోను, ప్రకృతి సోయగాలు చూపించడానికి మధ్య మధ్యలో ఫోన్ ని బస్సు కిటికీ లోంచి బైట పెట్టి  యధాప్రకారం తన ధోరణిలో ఏకబిగిన మాట్లాడుకుంటూ పోతున్నాడు. 


ఇంతలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కింద పడబోతున్న ఫోన్ ని ఎలాగో పట్టుకుని  ఎందుకొచ్చిందిలే అని  అప్పటికి వీడియో రికార్డింగ్ ఆపేసేడు. తను తీసిన వీడియోని మురిపెంగా చూసుకుంటున్నాడు. తీరా చూస్తే  ప్రకృతి సోయగాలు రాలేదు కానీ, తోక ఊపుతూ ఒక కుక్క, చుట్ట కాలుస్తూ చెట్టు కింద ఒక ముసలాయన, తన ముందు సీటు మనిషి వీపు భాగం, బస్సు రాడ్డు ఇవే పడ్డాయి.  


అది చూసి కామాక్షి

“ఏమిటీ ఇప్పుడు ఈ దృశ్యాలు మీ ఛానెల్ లో పోస్ట్ చేస్తారా” పరిహాసంగా నవ్వుతూ అంది.


“డాడీ! నువ్వు రికార్డు చేసేటప్పుడు  అన్నీ సరిగ్గా వస్తున్నాయో లేదో ఫోన్ లో చూసుకుంటూవుండాలి. అటూ, ఇటూ చూస్తూ నీ మాటలకే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ అసలు ఏమి రికార్డు చేస్తున్నావో చూడటం లేదు. అసలు ముందు నువ్వు వీడియో రికార్డింగ్ నేర్చుకో” అన్నాడు.


“పర్వాలేదు లేరా! నా మాటలే వింటారు“ అన్నాడు.


“ అసలు నీ మాటలకి, నువ్వు చూపించేది రెలెవెంట్ గా ఉండాలిగా” అన్నాడు పట్టూ.


తన వ్యాఖ్యానం మీద ఎక్కువ అంచనాలతో వున్నవిశ్వం పట్టూ మాటలు పెడ చెవిన పెట్టి ఛానెల్లో పెట్టేసేడు.  ఇంక మధ్యమధ్యలో ఎవరైనా బాగుందని మెస్సేజ్ పెట్టేరేమో చూసుకోవడం, పదే పదే మురిపెంగా తన మాటలు వినడం ఇదే తంతు అయిపోయింది. అప్పుడప్పుడు  బస్సులో గైడ్  ఏవో ప్రదేశాలు చూపిస్తూ  వివరిస్తున్నాడు. అది కూడా తలకెక్కించుకోవడంలేదు. 


ఒక గంట పోయేక హైద్రాబాద్ నుండి విశ్వం కజిన్ ఫోన్ చేసి

“ అన్నయ్యా! నీ వీడియో సరిగ్గా రాలేదు చూసుకో” అని చెప్పింది.


విశ్వం అది పట్టించుకోకుండా “నా వ్యాఖ్యానం విన్నావా లేదా”  అడిగేడు.


” బాగా మాట్లాడేవు అన్నయ్యా” అని ఫోన్ పెట్టేసింది. 


చాలాసేపటికి ఒక  కామెంట్ వచ్చింది, “సార్, మీ వీడియోలో కుక్క, తోక, చుట్ట, చెట్టు, వీపు, ఒక బట్టతల తప్పా మీరు చెప్పిన ఏ సోయగాలు రాలేదు. ముందు మీరు వీడియో రికార్డింగ్ నేర్చుకోండి” అని కుండ బద్దలు కొట్టినట్లు  చెప్పేడు.


విశ్వం వ్యాఖ్యానానికి ఏ మెచ్చుకోలూ  రాలేదు. తన వ్యాఖానానికి లైకులు అవే వచ్చి పడతాయి అనుకున్నాడు. గర్వభంగం అయింది.  రామేశ్వరం జెరేదాకా మరి ఫోన్ బైటకి తీయలేదు విశ్వం.


సాయంత్రానికి  రామేశ్వరం జేరేరు. గైడ్ అందరు ఫ్రెష్ అయ్యేక సముద్ర స్నానానికి తీసుకెళతానని, మూడు మునకలు అయ్యేక, 24 బావుల స్నానానికి, అటు పిమ్మట దైవ దర్శనం అని చెప్పేడు. అందరూ సముద్ర స్నానానికి బయలుదేరేరు. సముద్ర స్నానం, బావుల్లో స్నానం ఉండటం చేత  గైడ్ అందరి ఫోన్లు తీసేసుకుని తనవద్ద పెట్టుకున్నాడు. ఇంక విశ్వం చేతికి పని పోయింది. బావుల్లో స్నానం అయ్యేక   గైడ్ ఎవరి ఫోన్లు వాళ్లకి ఇచ్చేసేడు.


రామేశ్వరం ఆలయ ప్రాంగణం అద్భుతంగా వుంది. సువిశాలమైన కారిడార్ కట్టేరు. కామాక్షి అలసిపోయి ప్రాంగణం గట్టు మీద కూర్చుంది. పట్టూ అటూ, ఇటూ తిరుగుతూ ఫోటోలు తీసుకుంటున్నాడు. విశ్వం ప్రాంగణంలోని శిల్పకళకి ముగుడైపోయి “శిలలపై శిల్పాలు చెక్కినారూ” అంటూ పాట అందుకుని వీడియో తీస్తున్నాడు. 


ఎక్కడినుండి వచ్చిందో చటుక్కున కోతి వచ్చి ఫోన్ లాక్కుపోయింది. ఈ హఠాత్పరిణామానికి విశ్వం విస్తుపోయేడు. ఇదంతా చూస్తున్న కామాక్షి కంగారుగా

“పట్టూ! కోతి డాడీ ఫోన్ పట్టుకుని పరిగెత్తుకు పోతోందిరా”! అని, విశ్వం దగ్గరకి వచ్చి చేయి చూస్తూ

“కోతి గీరలేదు కదా”! అడిగింది. 


“నలభై వేల రూపాయల ఫోన్ ని కోతి లాక్కుపోయిందని నేను వర్రీ అవుతుంటే,  రక్కిందా? కరిచిందా? అని  పిచ్చి ప్రశ్నలు వేయకు” అని చిరాకునంతా కామాక్షి మీద చూపించేడు.


పట్టూ కోతి వెళ్లిన వైపు పరిగెత్తేడు. కోతుల్లో ఆంజనేయస్వామిని చూసుకునే కామాక్షి పరిగెత్తుతూ

“ఆంజనేయా! మా ఫోను మా కిచ్చేయి నాయనా ”! అని బ్రతిమాలుతోంది.


ఉదర భారం వల్ల విశ్వం పరిగెత్తలేక పరుగు లాంటి నడకతో వారిని అనుసరించేడు. కోతి చేతిలోంచి ఫోన్ తీసుకోవడానికి పట్టూ దానికి వాటర్ బాటిల్ చూపించేడు. అది నోరుతెరిచి పళ్లతో వెక్కిరిచ్చినట్లు ఆ ..అని మళ్ళీ ఫోన్ కేసి చూస్తోంది. 


ఇంతలో విశ్వం అక్కడికి చేరుకుని ఆయాసపడుతూ

” కోతి నా ఫోన్ ఇచ్చిందా” అన్నాడు అదేదో పెద్ద అడగ్గానే ఇచ్చేసేటట్లు.


పట్టూ “లేదు డాడీ! అది నీ ఛానెల్ చూస్తున్నట్లుంది” అన్నాడు నవ్వుతూ.


“ఏంట్రా వేళా పాళా లేకుండా ఆ జోకులు” అన్నాడు విశ్వం కోపంగా.


కోతి నోటితో ఫోన్ వెనుక కవర్ లాగటానికి ప్రయత్నిస్తోంది. ఇంక ఏ పార్టుకాపార్టు పీకిపారేస్తుందేమోనని విశ్వం భయపడ్డాడు. ఇంతలో కామాక్షి బుర్ర పాదరసంలా పనిచేసింది.


“సీతాపతే ! ఆపద్భాన్దవా! మా ఫోన్ మాకిప్పిచ్చు తండ్రీ”! అంటూ బ్యాగ్ లోంచి కొబ్బరిచిప్ప తీసి కోతి ముందుంచింది.  


ఒకసారి కోతి తలపైకెత్తి కొబ్బరి చిప్పకేసి చూసి ఫోన్ విసిరేసి, చిప్ప పట్టుకుని పరిగెత్తింది. “అమ్మయ్యా”! అని ఫోన్  చటుక్కున తీసుకున్నాడు విశ్వం. స్క్రీన్ గార్డ్ పగిలింది.


“ఇంక తీసిన వీడియోలు, చేసిన పోస్టులు చాలు. ఫోన్ లోపల పెట్టుకోండి” కోపగించుకుంది కామాక్షి.


మర్నాడు ఉదయాన్నే కన్యాకుమారికి  బయలుదేరేరు. పంబన్ బ్రిడ్జి మీదుగా వెళుతూ అక్కడ ఆపి ఫోటోలు తీసుకోమన్నాడు గైడు. ఇంక విశ్వం విజృంభించేడు. పంబన్  బ్రిడ్జి చరిత్ర, దాని అందాలు, దాని పై కొత్తగా తెరిచిన రైలు మార్గం మొదలైన విశేషాలే కాకుండా, పుష్ప సినిమా అక్కడే తీసేరని అందులో డైలాగ్స్ చెబుతూ  ఒక సుదీర్ఘమైన వీడియో తీసి బస్సు ఎక్కుతూనే ఛానెల్ లో పెట్టేసేడు.


“ డాడీ! అంత పెద్ద పెద్ద వీడియోలు తీస్తే ఎవరూ చూడరు. వన్ మినిట్ షార్ట్స్ అన్నా పెట్టూ లేదా ఐదు మిమిషాలకి మించకుండా చూసుకో” అన్నాడు పట్టు. 


“ఏమిట్రా! నువ్వు, మీ అమ్మ నన్ను ఎప్పుడూ ఎదో విమర్శిస్తుంటారు? చూసే వాళ్ళే చూస్తారులే! చూడకపోతే వాళ్ళ ఖర్మ! దానికి మనమేమి చేస్తాం ?” అన్నాడు విశ్వం.


తల్లీ, కొడుకు మొహామొహాలు చూసుకుని నోరు మూసుకున్నారు. 


ఎట్టకేలకి కన్యాకుమారి చేరేరు. ఎండ ప్రచండంగా వుంది. దానికి తోడు వేడి గాలులు. అందరూ వడదెబ్బ కొట్టిన వాళ్ళల్లాగ వున్నారు. మొదటగా సన్సెట్ పాయింట్ కి తీసుకెళ్ళేరు. సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం ఒక అద్భుతం. విశ్వం సుబ్బరంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక రాయి మీద కూర్చుని సూర్యాస్తమయం దృశ్యాన్ని తదేకంగా చూస్తున్న కామాక్షిని “ఇటు తిరుగు, నీకు కూడా తీస్తాను” అన్నాడు.


కామాక్షి ”నేను తిరగను. ఎండకి నా మొహం ఏభై పూరీలు వేయించిన నూనెలాగ వుంది. సూర్యాస్తమయం తిలకిస్తున్న నా పెళ్ళాం అంటూ నాకు వీడియో తీసి ఛానెల్లో పెట్టకండి” నిక్కచ్చిగా చెప్పింది.


మరుసటి రోజు వివేకానందరాక్, తిరువళ్ళువార్ విగ్రహం కొత్తగా వేసిన గ్లాస్ బ్రిడ్జికి స్పీడ్ బోట్ లో వెళ్ళేరు. విశ్వం బోట్ లో మనుషులను చూపిస్తూ వీడియో తీస్తున్నాడు. బోట్ లో వాళ్ళ ముందు కూర్చున్నావిడ విశ్వం తనకి వీడియో తీస్తున్నాడెమోనని భయపడింది, విశ్వం తాను  వ్లాగ్  చేసుకుంటున్నానని ఆవిడకి తీయడంలేదని చెప్పేడు. 


బైట సముద్రానికి తీయడం మొదలెట్టేడు. స్పీడ్ బోట్ వలన నీటి తుంపర్లు ఫోన్ మీద పడుతున్నాయి. ఫోన్ పాడైపోతుందేమోనని భయపడి  లోపల పెట్టేసుకున్నాడు. తరువాత వివేకానంద రాక్, తిరువళ్ళువార్ విగ్రహం, గ్లాస్ బ్రిడ్జి దగ్గర వీడియో తీసి ఛానెల్లో పోస్ట్ చేసేడు.  రాత్రి బయలుదేరి మర్నాడు ఎవరి ఇళ్ళకి వాళ్ళు జేరేరు. కోతి చేసిన హడావిడి మినహాయించి మొత్తానికి యాత్ర మధుర స్మృతులనే మిగిల్చింది. కామాక్షి కొత్త స్నేహితులను చేసుకుంది. విశ్వం తన ఛానెల్లో వీడియోలు నింపేసేడు.


మరునాడు విశ్వం ఏమైనా వ్యూస్, కామెంట్స్ వచ్చేయేమో చూసేడు. పంబన్ బ్రిడ్జి వీడియో కి అక్కడ విపరీతమైన గాలి వలన మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. లైక్స్ అసలు లేనే లేవు. వ్యూస్ వచ్చేయి కానీ కామెంట్స్ విశ్వాన్ని కొంచెం ఇబ్బంది పెట్టేయనే చెప్పాలి.  


వివేకానందా రాక్ వద్ద మెట్లు ఉండటంతో విశ్వం ఆయాసపడుతూ మాట్లాడటం వలన అతని “శ్వాస శబ్దమే వినిపిస్తోందని, తనికెళ్ళ భరణిని అనుకరించడానికి ప్రయత్నించవద్దని, తమ ఒరిజినాలిటీకి ఏమైందని, పుష్పాలో డైలాగ్ చెప్పిన వీడియోకి ఇంక తగ్గు, తగ్గు…. తగ్గేదెలా! అనడానికి నువ్వేమీ అల్లు అర్జున్ కాదు” అంటూ రకరకాల ట్రోలింగ్స్ వచ్చేయి. 


ఇంక విశ్వానికి వచ్చిన ఆ కామెంట్లు చూసి కామాక్షి, పట్టూకి కష్టం కలిగింది.


“ఇంక మీరు ఏ వీడియోలు పోస్ట్ చేయకండి. మీదేమైనా వేళాకోళాలు ఎదుర్కునే వయసా? మనకింక ఆ ఛానెల్ వద్దు” అంది కామాక్షి.


“అవును.డాడీ! వాళ్ళ కామెంట్స్ నిన్ను డిస్కరేజ్ చేయవచ్చు. నువ్వు ఫ్యామిలీ గ్రూప్ లోనే పోస్ట్ చేసుకో” అన్నాడు పట్టూ.



విశ్వం వాళ్ళిద్దరికీ ఫోన్ లో వ్యూస్ చూపిస్తూ “ చూసేరా! వ్యూస్ ఎలా పెరుగుతున్నాయో! విమర్శలతో నన్ను తగ్గిస్తూనే, వ్యూస్ లో నన్ను పెంచుతున్నారు.  నాకు వ్యూస్ ముఖ్యం కానీ, వాళ్ళ వ్యంగ విమర్శలు కాదు. ఎదో అంటారు సరదాకి, అవన్నీ పట్టించుకోకూడదు. నేను చాలా సార్లు నిన్ను వంటలో ఉప్పు తక్కువ, కారమెక్కువ, అన్నం బిరుసైతే  తలంబ్రాల బియ్యంలా ఉంది అనేవాడిని.  


అలా అంటానని  నువ్వు వంట చేయడం మానేసేవా? అభ్యంతకరంగా లేనంతవరకు మనకి నచ్చిన పని  మనం చేసుకుపోవడమే!” అని పట్టూ కేసి తిరిగి“నేనేమీ డిస్కరేజ్ కాను లేరా”! అని భుజం మీద చరచి ఫోన్ తీసి,

“ఇది క్షాత్రపరీక్షే కాని, క్షత్రియ పరీక్ష కాదే” అంటూ దానవీరశూరకర్ణలో దుర్యోధనుడి డైలాగ్స్ చెబుతూ రికార్డు చేసుకోవడం మొదలెట్టేడు.


***

కనకదుర్గా లక్ష్మీరత్న గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: కనకదుర్గా లక్ష్మీరత్న

నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

మళ్ళీ మళ్ళీ చదివినా నవ్వు తెప్పించేలా ఉంది. ఆ క్యారెక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళకి అన్వయించుకుంటూ, వారిని visualize చేసుకుంటూ చదువుకుంటే తనివితీరా నవ్వుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది వారికి తోచిన కంటెంట్ యూట్యూబ్ లో పెట్టేస్తూ, వారికి నచ్చితే లోకం అంతటికీ నచ్చాలి అనుకుంటూ పెట్టేస్తున్నారు. ఈ కధ వారికి బాగా వర్తిస్తుంది.

Like

Rated 5 out of 5 stars.

రత్నగారి విశ్వనాథం చానెల్ కథ ఆద్యంతం హాస్యరసస్పూర్తితో చదువర్లను ఆకట్టుకుంటుంటుంది. విశ్వనాథం వీడియోల హడావిడి, లైక్స్ కోసం తాపత్రయం, కామాక్షి రామభక్తి, కోతికి ప్రార్ధన, పట్టూ ఎగతాళి అన్నీ కళ్ళకు కట్టినట్లు వరించారు. కథా, కథనం నల్లేరు మీద బండినడకలా హాయిగా సాగింది. సంభాషణలు ద్రాక్షాపాకంలా సాగుతూ గుర్తుండిపోతాయి. మరిన్ని కథలు ఆవిడ కలం నుండి ఆశిద్దాం.

Like

Srinivas Sistla
Srinivas Sistla
5 hours ago
Rated 5 out of 5 stars.

Viswanatham character is very funny!! Enoyed the real family comedy!!🙃

Like
bottom of page