కచ దేవయానిల వృత్తాంతంతో ముడిపడ్డ యయాతి వార్ధక్యం
Kacha Devayanila Vruthanthamtho Mudipadda Yayaathi Vardhakyam - Telugu Moral Story | R C Kumar
కచ దేవయానిల వృత్తాంతంతో ముడిపడ్డ యయాతి వార్ధక్యం - తెలుగు నీతి కథ
రచన: ఆర్ సి కుమార్
Published In manatelugukathalu.com On 07/10/2026
కచ దేవయానిల వృత్తాంతంతో ముడిపడ్డ యయాతి వార్ధక్యం
మొదటి భాగం
కశ్యప మహర్షి సమస్త జీవకోటికి మరియు మానవ పరిణామానికి మూలపురుషుడిగా పరిగణించబడతారు. ఆయన బ్రహ్మదేవుని మానస పుత్రుడైన మరీచి కుమారుడు.
కశ్యపుడికి దితి, అదితి అనే ఇద్దరు భార్యలు. ఇందులో దితి అనే ఆమెకు రాక్షసులు పుడతారు, అదితి అనే ఆమెకు దేవతలు పుడతారు.
ఈ రాక్షసులకు, దేవతలకు మధ్య ఎల్లప్పుడూ వైరం కొనసాగుతూ యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. ఒకసారి వీళ్లు, మరొకసారి వాళ్లు గెలుస్తూ ఉంటారు.
రాక్షసుల గురువు శుక్రాచార్యులు. దేవతలకు గురువు బృహస్పతి. వీరిద్దరూ గొప్ప జ్ఞానులు, దూరదృష్టి గలవారు. అయితే వీరి స్వభావాలు, శక్తులు వేర్వేరుగా ఉంటాయి:
బృహస్పతిని 'వాచస్పతి' (మాటలకు అధిపతి) అని కూడా అంటారు. తండ్రి పేరు అంగీరస మహర్షి.
దేవతలకు మార్గదర్శకుడు, సత్త్వగుణ సంపన్నుడు. ఈయన వేదాలు, శాస్త్రాలు, మంత్రాలలో అఖండమైన పాండిత్యం కలవాడు. బుద్ధి బలానికి, సలహాలకు ఈయనే మూలం.
దేవతలకు ఎల్లప్పుడూ ధర్మబద్ధమైన మార్గాలను బోధిస్తారు. శుక్రాచార్యులు రాక్షసులకు గురువు, రజోగుణ ప్రాధాన్యత ఉన్న గొప్ప తపస్వి.
తండ్రి భృగు మహర్షి, తల్లి కావ్యమాత. ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడైనప్పటికీ, దేవతల వల్ల జరిగిన కొన్ని అన్యాయాల కారణంగా రాక్షసుల వైపు నిలిచారు. కేవలం నీతిశాస్త్ర నిపుణులే కాకుండా రాజనీతి, యుద్ధ వ్యూహాలు, లౌకిక జ్ఞానంలో ఈయన దిట్ట.
తనను ఆశ్రయించిన రాక్షసులను ఎల్లప్పుడూ రక్షించడానికి ప్రయత్నించారు. శుక్రాచార్యులు ఘోరమైన శివతపస్సు చేసి మృతసంజీవని విద్యను వరంగా పొందుతాడు.
వృషపర్వుడనే రాక్షస రాజుకి శుక్రాచార్యుడు గురువుగా ఉంటూ రాజ్యపాలనలో అనేక సలహాలు ఇస్తుంటాడు.
దేవదానవ యుద్ధంలో మరణిస్తున్న రాక్షసుల్ని మృతసంజీవని విద్యతో తిరిగి బ్రతికిస్తాడు. ఆ విద్య ఒక్క శుక్రాచార్యునికే తెలుసు.
మృతసంజీవని విద్య ప్రభావంతో చనిపోయిన రాక్షసులు మళ్లీ మళ్లీ జన్మించడం దేవతలకు ఇబ్బందిగా మారింది.
ఇదేవిధంగా జరుగుతుంటే రాక్షసుల్ని జయించడం కష్టమని ఆందోళన పడ్డారు. యుద్ధంలో మరణించిన రాక్షసులు బతికి మరునాటికి తిరిగి యుద్ధానికి రాగా మళ్లీ వాళ్లతోనే యుద్ధం చేయవలసి రావడంతో దేవతలకు దిక్కుతోచలేదు.
దేవతలందరూ తమ గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్లి శుక్రుని మృతసంజీవని విద్య గురించి తెలిపి తమ ఆందోళనని వెళ్లబుచ్చారు.
శుక్రాచార్యుడి శక్తి మీకు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. స్వర్గంలో స్థానం కల్పించి మిమ్మల్ని గురువుగా చేసుకున్నందుకు మాకు ఒరిగింది ఏమీ లేదు అని పరుష పదాలతో నిందించారు. ఈ పరిణామాలతో దిక్కుతోచని శుక్రాచార్యుడికి ఒక ఆలోచన కలిగింది.
శత్రువులకు గురువైన బృహస్పతి వద్దకు తన కొడుకు కచుడిని పంపించి మృతసంజీవని విద్యను అభ్యసింపజేయాలని అనుకుంటాడు.
పుత్రుడిని పిలిపించి శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళ్లి ఎలాగోలా అతని అభిమానాన్ని సంపాదించి, అతని వద్ద మృతసంజీవని విద్యను నేర్చుకొని రమ్మని కోరుతాడు.
చివరికి అతని కూతురైన దేవయాని సహాయంతో అయినా ఆ కార్యాన్ని సాధించుకొని రమ్మంటాడు.
సరే అన్న కచుడు సురలోకం వదిలి అసురలోకం చేరి శుక్రుని కలిసి తాను బృహస్పతి కొడుకునని, విద్యాభ్యాసం కోసం వచ్చానని తెలిపి వినయంతో నమస్కరించాడు.
మృదుభాషణ, వినయవిధేయతలు, మంచి తేజస్సు కలిగి ఉన్న కచుడి గుణగణాలు శుక్రాచార్యుడికి బాగా నచ్చాయి. అతన్ని తన శిష్యుడిగా స్వీకరించి తన వద్దే ఆశ్రయమిచ్చి విద్యాబుద్ధులు నేర్పించసాగాడు.
శుక్రాచార్యుడి కూతురు దేవయాని కూడా కచుడి గుణగణాలు, అందచందాలు చూసి ముచ్చటపడింది. కచుడితో పరిచయం, చనువు పెంచుకొని నానాటికీ దగ్గర కావడానికి ప్రయత్నించింది. ఆమె కోసం అతడు అడవికి వెళ్లి పూలు తేవడం, కొన్ని సందర్భాల్లో పూలమాలలు కట్టి ఆమె జడలో తురమడంతో దేవయాని సంతోషపడేది.
కానీ శుక్రుడి ఆశ్రమంలో అంతకుముందే ఉన్న రాక్షస జాతికి చెందిన శిష్యులకు కచదేవయానుల సరస సాంగత్యాలు మింగుడుపడలేదు. ఆ కోపంతో ఒకరోజు అడవికి వెళ్లిన కచుడిని వాళ్లు వెంబడించి అక్కడే కొట్టి చంపేశారు.
ఆరోజు సాయంకాలం వరకు కచుడు తిరిగి ఆశ్రమానికి రాకపోయేసరికి దేవయాని మనసు కీడు శంకించి, తన తండ్రికి విషయం వివరించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకున్నాడు.
తన సంజీవని విద్యతో శిష్యుడికి మళ్లీ జీవం పోశాడు. దేవయాని ఆనందానికి అవధుల్లేవు. కానీ రాక్షసులకు మాత్రం కచుడి మీద కోపం నానాటికి పెరుగుతూనే ఉంది. సమయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈసారి పూలకోసం అడవికి వెళ్ళిన కచుడిని పట్టుకొని చంపి, కాల్చి పూర్తిగా బూడిద అయ్యేలా చేసి ఆ బూడిదను మద్యంలో కలిపేసి గురువుగారికి ఇచ్చారు. అది తెలవక ఆ మద్యాన్ని శుక్రాచార్యులు తాగేశారు.
దేవయానికి కచుడు తిరిగి రాకపోవడంతో రాక్షసులమీద అనుమానం వచ్చింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది. శుక్రుడు తన దివ్యదృష్టితో మరోసారి వెదికాడు. ఏ లోకంలోనూ అతడు కనిపించలేదు.
చివరకు అతడు తన పొట్టలోనే ఉన్నాడని గ్రహించాడు. కచుడిని బతికించి బయటికి రప్పించాలంటే తాను మరణించాలి.
కనుక అతడికి ముందుగా సంజీవని విద్యను నేర్పించి తన పొట్ట చీల్చుకుని బయటకు వస్తే ఆ విద్యతో తనను బతికించుకోవచ్చని అనుకున్నాడు. అదే విషయాన్ని శుక్రుడు శిష్యుడికి చెప్పి ఒప్పించగా కచుడు శుక్రుడి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి కృతజ్ఞత ప్రకటించాడు.
ఆ వెంటనే తను నేర్చుకున్న మృతసంజీవని విద్యతో గురువును బతికించాడు. ఆ విధంగా దేవతల కోరిక మేరకు కచుడు ఎన్నో కష్టాలకు ఓర్చి మృతసంజీవని విద్యను నేర్చుకుని కార్యాన్ని సాధించాడు.
కచుడికి వచ్చిన పని పూర్తయింది. దేవలోకానికి బయలుదేరడానికి సిద్ధమవగానే దేవయాని తనను పెళ్ళాడమని కోరింది.
గురు పుత్రికవు, సోదరితో సమానం అన్నాడు. నాకు ప్రాణం పోసిన శుక్రుడు తండ్రి వంటివాడయితే, నువ్వు నాకు ఏమవుతావని ప్రశ్నించి ఆ కోరికను తిరస్కరించాడు.
దాంతో తన అహం దెబ్బతిని అతనిపై ద్వేషం పెంచుకుంది దేవయాని. ఆ కోపంలో అతడితో “నువ్వు నా కోరికని మన్నించలేదు కాబట్టి నువ్వు నేర్చుకున్న సంజీవని విద్య నీకు పనికి రాకుండా పోవుగాక!” అని శపించింది.
కచుడు దేవయాని శాపానికి మొదట బాధపడ్డాడు. తర్వాత తేరుకుని “దేవయానీ! నేను ధర్మ మార్గాన్ని అనుసరించేవాడిని. 'నాకు ఈ విద్య స్వయంగా పనిచేయకపోవచ్చు కానీ, నేను దీనిని ఇతరులకు ఉపదేశిస్తే అది వారికి తప్పకుండా పనిచేస్తుంది' అని చెబుతాడు.
నువ్వు అధర్మంగా ఆలోచించావు కనుక, బ్రాహ్మణ కన్యవైనా, నీకు బ్రాహ్మణుడితో వివాహం జరగకుండుగాక!” అని తిరిగి దేవయానిని శపించాడు.
తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి తిరిగి వచ్చి, దేవతల ప్రశంసలు అందుకుంటాడు. తను నేర్చిన మృతసంజీవని విద్యను దేవతలకు ఉపదేశించగా వారు ఆ విద్యను ఉపయోగించుకొని యుద్ధంలో మరణించిన తమ వారిని బతికించుకోగలిగారు.
ఆ విధంగా దేవతలు కచుడి సహాయం పొంది వారు కూడా అమరులుగా మారి విజయం సాధించారు.
రెండవ భాగం
కచుడు వెళ్లిపోయాక ఒకరోజు రాక్షసరాజైన వృషపర్వ మహారాజు (రాక్షస రాజు) కూతురు శర్మిష్ఠ తన చెలికత్తెలు మరియు దేవయానిని వెంటబెట్టుకొని విహారానికి ఉద్యానవనానికి వెళ్లింది.
ప్రకృతి ఒడిలో కాసేపు సేదతీరి ఒక కొలను గట్టుమీద తమ బట్టలు పెట్టుకుని వారందరూ కొలనులో స్నానం చేస్తున్నారు. అంతలో సుడిగాలి వచ్చి అందరి బట్టలు చల్లాచెదరై కలిసిపోయాయి. ఒడ్డుకు వచ్చి కలిసిపోయిన బట్టల్లోంచి ఎవరి బట్టలు వాళ్లు వెతుక్కోవడం స్త్రీలకు కష్టంగా మారింది. కంగారులో ఎవరికి దొరికినవి వాళ్లు తీసుకొని కట్టేసుకున్నారు.
అదే కంగారులో దేవయాని చీరని శర్మిష్ఠ కట్టుకుంది. కానీ శర్మిష్ఠ చీరని దేవయాని కట్టుకోలేదు. కట్టుకోకపోగా శర్మిష్ఠతో ఇలా అంది: “అసాధారణ ప్రజ్ఞావంతుడైన శుక్రాచార్యుడి కూతుర్ని, శ్రేష్టమైన బ్రాహ్మణ కులంలో పుట్టినదాన్ని, నీకు నేను పూజింపదగినదానిని.
అలాంటిది నువ్వు కట్టుకుని వదిలిన చీరని నేను ఎలా కట్టుకుంటాను?” దేవయాని మాటలు విని శర్మిష్ఠకు కోపం వచ్చింది. “నీ తండ్రి శుక్రుడు నా తండ్రి వృషపర్వుణ్ని ఆశ్రయించి పొగుడుతూ, సేవిస్తూ ఉంటాడు. నీ గొప్పలు నా దగ్గర చెప్పకు. నేను కట్టిన బట్టలు నువ్వు ఎందుకు కట్టుకోకూడదు?” అని అహంకారంతో అడిగింది.
ఆ విధంగా గొడవ పడుతూ, ఒకరు ఎక్కువంటే, ఒకరు ఎక్కువని వాదోపవాదాలు జరిగాక, వివస్త్రగా ఉన్న దేవయానిని కోపంతో శర్మిష్ఠ ఒక పాడుపడిన నూతిలోకి త్రోసి ఇంటికి వెళ్ళిపోయింది.
ఆ నూతిలో దొరికిన ఒక లావుపాటి లతను పట్టుకుని వేలాడుతూ ప్రాణాలు కాపాడుకుంది దేవయాని. నూతిలో భయంతో కేకలు పెడుతుండగా ఆ అరుపులు విని ఆ సమయంలో వేటకోసం ఆ ప్రాంతానికి వచ్చిన యయాతి ఆమెను రక్షించి తన దారిన తాను వెళ్ళిపోతాడు.
జరిగిన అవమానంతో దేవయాని తీవ్రంగా రోదించి, తన తండ్రి శుక్రాచార్యుడికి అంతా వివరిస్తుంది. ఆగ్రహించిన శుక్రాచార్యుడు వృషపర్వుడి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు.
గురువు వెళ్ళిపోతే తమ రాజ్యానికి రక్షణ ఉండదని భయపడిన వృషపర్వ మహారాజు, శుక్రాచార్యుడిని, దేవయానిని కాళ్ళావేళ్ళాపడి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు దేవయాని పంతం పట్టి ఒక కఠినమైన షరతు విధిస్తుంది.
"నన్ను అవమానించిన శర్మిష్ఠ తన వెయ్యి మంది చెలికత్తెలతో కలిసి నాకు జీవితాంతం దాసిగా సేవ చేయాలి, నేను ఎక్కడికి పెళ్ళి చేసుకుని వెళ్ళినా ఆమె నా వెంట దాసిగా రావాలి" అని కోరుకుంటుంది. రాజ్యం కోసం, రాక్షస వంశ క్షేమం కోసం తండ్రీకూతుళ్లు ఆ షరతుకు అంగీకరించగా దేవయాని శర్మిష్ఠ దాసిగా మారిపోతుంది.
తదనంతరం ఒకనాడు వనవిహారానికి వెళ్ళిన దేవయాని బృందం వేట కోసం వచ్చిన యయాతిని చూస్తారు. దేవయాని అతని వద్దకు వెళ్లి తాను నూతిలో వివస్త్రగా ఉన్నప్పుడు తన చేయి పట్టుకుని రక్షించినప్పుడే పాణిగ్రహణం జరిగిపోయిందని, కాబట్టి తనను పెళ్ళిచేసుకోమని నిలదీస్తుంది.
రాక్షస గురువు శుక్రుని అనుమతితో దేవయాని యయాతిల వివాహం జరిగిపోతుంది. ఇచ్చిన మాట ప్రకారం వృషపర్వ మహారాజు (రాక్షస రాజు) తన కూతురు శర్మిష్ఠతో సహా దాసదాసీజనాన్ని యయాతి దేవయానులకు అప్పగిస్తాడు.
మహారాణిగా దేవయాని సకల భోగాలను అనుభవిస్తూ యదువు, తుర్వసుడు అనే బిడ్డల్ని కంటుంది.
శర్మిష్ఠ దేవయాని దాసిగా అనేక కష్టాలను అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు యయాతి అశోకవనంలో ఒంటరిగా ఉన్న శర్మిష్ఠను కలవడం జరుగుతుంది.
మాటామాటా కలిసిన వెంటనే శర్మిష్ఠ అతనితో నేను కన్యను, రాజపుత్రికను, దేవయానిని గ్రహించినట్లే తనను కూడా గ్రహించమని కోరగా యయాతి అంగీకరించి చేరదీస్తాడు.
ఆమెకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు అనే కొడుకులు పుట్టారు. కొంతకాలానికి ఈ విషయం తెలిసిన దేవయానికి కోపం, దుఃఖం కలిగింది. తన దాసి తనకు సవతి అయిందని కోపంగా వెళ్లి తండ్రి వద్ద మొరపెట్టుకుంది.
ముందువెనక ఆలోచించకుండా శుక్రుడు యయాతిని ముసలితనంతో బాధపడమని శపిస్తాడు. యయాతి బ్రతిమాలగా శాంతించిన శుక్రుడు "నీ ముసలితనాన్ని నీ కుమారుల్లో ఎవరికైనా ఇచ్చి వారి యవ్వనం నువ్వు తీసుకోవచ్చని" చెబుతాడు.
ముసలితనంతో బాధపడుతున్న యయాతి తన ఐదుగురు కుమారుల్ని ఒకరొకరుగా పిలిచి తన ముసలితనం తీసుకొని వారి యవ్వనాన్ని ఇవ్వమని అడుగుతాడు. ఇంకా భోగాలను అనుభవించాలన్న తృష్ణ తీరక కోరిన కోరిక అతడి విచక్షణను కప్పేసింది.
తన సంతానానికి వారి యౌవనాన్ని అనుభవించే హక్కు ఉందన్న విషయం మరిచాడు. కోరికలను తీర్చుకోవాలన్న తృష్ణ ఈ వయసులో తనకే ఇంత ఉంటే, యౌవనంలో ఉన్నవారికి ఇంకెంత ఉంటుందో అన్న ఆలోచన అతనికి రాలేదు.
యయాతి ప్రతిపాదనకు కుమారులు ఎవరూ ఒప్పుకోలేదు. ముసలితనంలో వచ్చే శారీరక బలహీనతలను భరించలేమని నలుగురు కుమారులు ఖరాకండిగా చెప్పి తండ్రి కోరికను తిరస్కరిస్తారు. తన కోరికను తీర్చనందుకు యయాతి విచక్షణను మరచి, ఆవేశంతో వారిని శపించాడు.
కానీ శర్మిష్ఠ చిన్న కుమారుడైన పూరుడు మాత్రం పితృవాక్య పరిపాలన కోసం సంతోషంగా తండ్రి ముసలితనాన్ని తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇది అతని పితృభక్తికి నిదర్శనం. యయాతి నిర్లజ్జగా చిన్న కొడుకైన పూరుడికి తన వార్ధక్యం ఇచ్చి, అతని యౌవనం స్వీకరించి, సుఖభోగాలను మళ్ళీ కొంతకాలం అనుభవించాడు.
కానీ కాలక్రమేణా, ఏదో ఒక రోజు ఈ సుఖాలు, కోరికల దుగ్ధ వదిలించుకోవలసినదే అన్న నిజాన్ని యయాతి తెలుసుకుంటాడు. "అగ్నిలో నెయ్యి పోస్తే మంట పెరుగుతుందే తప్ప చల్లారనట్లే, అనుభవించే కొద్దీ కోరికలు పెరుగుతాయే కానీ తీరవు" అనే వాస్తవాన్ని గ్రహిస్తాడు.
చివరికి తన కొడుకు పూరుడి యవ్వనాన్ని తిరిగి అతనికే ఇచ్చేసి, ముసలితనాన్ని స్వీకరించి, వనవాసానికి వెళ్లి మోక్షాన్ని పొందుతాడు. తప్పు తెలుసుకుని దేవయానితో కలసి ఎన్నో యాగాలు చేసి జ్ఞాని అయ్యాడు.
సంక్షిప్తంగా చెప్పాలంటే భౌతిక సుఖాలు, కోరికలు తాత్కాలికమైనవి. వాటి వెనుక పరిగెత్తితే జీవితం వృథా అవుతుంది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, ఉన్నదానితో సంతృప్తిగా జీవించడమే నిజమైన ఆనందం అని యయాతి కథ మనకు బోధిస్తుంది.
భౌతిక ప్రపంచంలోని ధనధాన్యాలు, బంగారం, విలువైన వస్తువులు, పశువులు, స్త్రీలు ఇవేవీ వ్యక్తికి శాశ్వత తృప్తినివ్వవని అర్థం చేసుకున్నాడు యయాతి. అవన్నీ కామప్రేరేపకాలే తప్ప కామాన్ని చల్లార్చేవి కావు అని గ్రహించాడు.
ఈ వృత్తాంతం ద్వారా గ్రహించవలసిన నైతిక విలువలు
గురు పుత్రికని సహోదరిగా భావించడం.
గురువుని తిరిగి బతికించడంలో కచుడి నిజాయితీ.
నూతిలో చేయి పట్టుకుని రక్షించినప్పుడే పాణిగ్రహణం జరిగిపోయిందని దేవయాని భావించడం.
అత్యాశతో, యవ్వనం మీద దుగ్ధతో యయాతి తన కొడుకులను శపించి తప్పు చేయడం.
కోరికలు శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదని గ్రహించి, చేసిన తప్పును సరిదిద్దుకోవడం.
కృష్ణార్పణమస్తు 🙏
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త






Comments