అదృశ్య వాహిని

Adrusya Vahini- Telugu Love Story | Bhattu Venkata Rao
అదృశ్య వాహిని - తెలుగు ప్రేమ కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 13/08/2026
చాలా కాలం తరువాత ఒక నది ఒడ్డున కలుసుకున్న ఇద్దరు పూర్వ ప్రేమికుల జ్ఞాపకాలతో సాగే హృద్యమైన కథ “అదృశ్య వాహిని”. ఒకప్పుడు ఊరి ప్రజల దాహాన్ని తీర్చిన నది, చెలమలు, కావడులు, బిందెలు, సాయంత్రపు సందడి—కాలంతో కనుమరుగైన ఆ దృశ్యాలన్నీ వారి జ్ఞాపకాలలో మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఎండిపోయిన నది మధ్యలోనూ, గత ప్రేమ ఒక అదృశ్యవాహినిలా వారి మనసుల్లో ప్రవహిస్తూనే ఉంటుంది.
పూర్వ ప్రేమికులు ఇరువురు ఒక నది ఒడ్డున కూర్చుని ఉన్నారు. మధ్యవయస్కులుగా ఉన్నారు వాళ్ళు. చాలా కాలం తరువాత కలుసుకున్నారు.
"అప్పుడు చాలా నీళ్ళుండేవి. ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండేది ఈ నది!" అన్నదామె.
"అవును. ఎంత వేసవి కాలం ఎండలలో కూడా నీళ్ళు లేకుండా ఉండేది కాదు. అలా చూసిన జ్ఞాపకం నాక్కూడా లేదు!" అన్నాడతడు.
"ఎంతమందో వచ్చేవాళ్ళు రోజూ నదికి!" అందామె.
"అవును. తాగేందుకు మంచినీళ్ళు తీసుకెళ్ళాలిగా మరి!" అన్నాడతడు.
"ఎంత బాగుండేవో చెలమల్లో నీళ్ళు! అప్పటికప్పుడు ఊరిన ఆ నీళ్ళని బిందెల్లోను, కడవల్లోను నింపుకుని భుజాన పెట్టుకునెళ్ళేవాళ్ళం!" అందామె.
"నువ్వెప్పుడు మోసుకెళ్ళావ్? నేనెప్పుడూ చూడ లేదే!" అన్నాడతడు.
"బాగా పొద్దున్నే వచ్చేవాళ్ళం. అయినా నేను రోజూ వచ్చేదాన్ని కాదనుకో..." అందామె చిరునవ్వుతో.
"నాకు తప్పేది కాదు. నేను రోజూ కావడిలో ఇత్తడి బుంగలు పెట్టుకుని మోసుకెళ్ళేవాడిని. కావడిలో బుంగలు పెట్టుకుని నీళ్ళు మోయడం నేను ఇక్కడే నేర్చుకున్నాను!" అన్నాడతడు.
"ఏరు పొంగినపుడు మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం!" అందామె.
"అవును. నడుముల్లోతు నీళ్ళలో కావడిని చేత్తో భుజం లెవెల్ కంటే బాగా పైకి ఎత్తి పట్టుకుని మోసుకెళుతూ కష్టపడడం నాకింకా గుర్తుంది! రెక్క బలం చాలా కావాలి దానికి!" అన్నాడతడు.
"చాలా మారిపోయింది కాలం. ఇప్పుడు పైపులైన్లొచ్చాయి. నదికి ఎవరూ రారు. రానవసరం లేదు. నది లోపల ఇసుక బెడ్ లో పెద్దపెద్ద బోర్లు వేసారు. ఊళ్ళోవాళ్ళకి రోజూ నీళ్ళు ఇళ్ళకు మోసుకెళ్ళే బాధ తప్పింది!" అందామె.
"అవును. కానీ నది ఎండిపోయింది. మనుషులు రాకపోవడం వలననే అనుకుంటాను. ఇప్పుడు అసలు నదిలానే కనిపించడంలేదు. ఎటు చూసినా ముళ్ళ కంపలు, చిక్కిరి బిక్కిరిగా పెరిగిన గడ్డి తుప్పలు. అలా ఉండడం చూస్తుంటే చాలా బాధేస్తుంది!" అన్నాడతడు.
అతడి మాటలకు నొచ్చుకున్నట్లుగా ఒక చిన్న నవ్వు నవ్వి...ఒక క్షణం తరువాత అందామె "బాగా వర్షాలు పడ్డప్పుడు నీళ్ళొస్తాయి. నువ్వు ఊరు విడిచి వెళ్ళిపోయావు గాని, నేనిక్కడే ఉన్నానుగా. నాకు తెలుసు. అప్పుడు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి పూర్తిగా నిండిపోయి ప్రవహిస్తుంది నది, మునుపటిలానే!"
"సరేలే!" అని అతడూ ఒక చిన్న నవ్వు నవ్వి...కవిత్వం చదువుతున్నట్లుగా...
"కానీ
ఊళ్ళోని జనంలో ముప్పాళ్ళు
ఏళ్ళుగా ప్రవహించే నది చెలమల్లో నీళ్ళను
కడవల్లోను కావళ్ళలోనూ
మోసుకెళ్ళే దృశ్యం
నేడదృశ్యం కాదూ..." అన్నాడు.
విని స్నేహంగా మరొక నవ్వు నవ్వి ఊరుకుందామె.
అలా మోసుకళ్ళే సందర్భాలలోనే, నది అవతలి వొడ్డు చెలమల దగ్గర ఆడ, మగ జనంతో నిండి, పడుచు వాళ్ళ మధ్య సాగే మాటల సరససల్లాపాలతో నిత్యం కళకళలాడతూ ఉండేది అక్కడ ప్రతిరోజు సాయం సమయం అని వారిద్దరికీ ఇంకా జ్ఞాపకమే!
ఒకప్పటి ఆ నిరంతర యౌవనదృశ్యం వారిరువురి జ్ఞాపకాలలో అలుపెరుగక ప్రవహిస్తూ సాగే ఒక రసరమ్య అదృశ్యవాహినిగా మారి స్థిరపడిపోయింది.
***
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.





Old memories rekindled