top of page
Original.png

అమ్మ అందరికీ అమ్మ…

అమ్మ అందరికీ అమ్మ, కుటుంబ కథ, మాతృప్రేమ, పిల్లల కథ, నీతి కథ, జీవదయ, పక్షులపై ప్రేమ, తెలుగు కథ, భావోద్వేగ కథ, శ్రీనివాస రావు పింగళి

వర్షంలో తడిసిన గోరింకను ప్రేమగా కాపాడుతున్న తెలుగు కుటుంబం
వర్షంలో తడిసిన గోరింకను ప్రేమగా కాపాడుతున్న తెలుగు కుటుంబం

Amma Andarikee Amma - Telugu Inspirational Story | Srinivasa Rao Pingali

అమ్మ అందరికీ అమ్మ… - తెలుగు ప్రేరణాత్మక కథ | శ్రీనివాస రావు పింగళి 

Published in manatelugukathalu.com on 23/07/2026


"అమ్మ" అనే పదానికి మనుషులకే కాదు, ప్రతి ప్రాణికీ ఒకే అర్థం ఉంటుంది. వర్షంలో చిక్కుకున్న ఒక చిన్న గోరింకను ఆదుకున్న కుటుంబం, ఆ పిట్టను ప్రేమతో చూసుకున్న చిన్నారి, చివరకు తల్లి ప్రేమ విలువను అర్థం చేసుకున్న హృద్యమైన సంఘటనల సమాహారమే "అమ్మ అందరికీ అమ్మ" కథ. పిల్లల్లో కరుణ, జీవదయ, కుటుంబ విలువలను పెంపొందించే చక్కని కథ ఇది.


ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తొమ్మిదేళ్ల అమ్ములు ఎలాగైనా ఆ వర్షంలోకి వెళ్లి ఆడుకోవాలనుకుంది. అమ్ములు అసలు పేరు అమృత. తను వర్షంలో తడిచేందుకు వాళ్లమ్మ మమత ఒప్పుకోలేదు. అలాగని విసుక్కోలేదు, కనీసం ముద్దుగా కసురుకోనూ లేదు.


అమ్ముల్ని తన దగ్గరకు తీసుకుంది. వర్షంలో తడవడం వల్ల చిన్నపిల్లలకు వచ్చే జబ్బుల గురించి విశదీకరించి చెప్పింది. మమత చెప్పినదంతా అమ్ములు బాగానే అర్థం చేసుకుంది. రూమ్ లోకి వెళ్లి హోమ్ వర్క్ చేయసాగింది.


కాసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. ఇంటి గుమ్మం ముందు నుంచి ఏవో పిట్ట అరుపులు సన్నగా వినిపించాయి. గబగబా బయటకెళ్లిన మమతకు, వర్షంలో తడిచి ఎగురలేని స్థితిలో కీచుమంటూ అరుస్తున్న ఒక గోరింక నేల మీద కనిపించింది. వెంటనే ఆ గోరింకను చేతుల్లోకి తీసుకుంది మమత.


చలికి బాగా వణికిపోతున్న ఆ గోరింకను ఒక మెత్తటి పొడి బట్టతో నెమ్మదిగా తుడిచింది. అది ఒక ఆడ గోరింక. చలి తగ్గడంతో అది నెమ్మదిగా తేరుకుంది.


ఆ గోరింకను అమ్ములుకు చూపిద్దామని రూమ్ లోకి తీసుకొచ్చింది. సమయం రాత్రి ఎనిమిది అవుతోంది. ఆ పిట్టను చూసిన అమ్ములు ఆనందానికి అవధులు లేవు. గోరింకను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అమ్ములుకు చెప్పింది మమత. ఆమె చెప్పినట్లే మసలుకుంది అమ్ములు.


హోమ్ వర్క్ పక్కన పెట్టి ఆ గోరింకతో ఆడుకుంటున్న అమ్ములును, మొదట హోమ్ వర్క్ కంప్లీట్ చేయమంది మమత. వర్క్ పూర్తి చేసిన అమ్ములుకు ప్లేట్ లో భోజనం తీసుకొచ్చింది. గోరింకకు కూడా ఒక గిన్నెలో గింజలు తీసుకొచ్చి పెట్టింది మమత.


మమతకు ఓ అలవాటుంది. పక్షులకోసం రోజూ డాబాపైన గింజలు చల్లుతుంది. అందుకోసం ప్రతి నెల సరుకుల లిస్ట్ లో మూడు కేజీల సజ్జలు, జొన్నలు, రాగులు వంటివి కలిపి తెస్తుంది.


అమ్ములు ఆ గోరింకకు 'ట్వింకిల్' అని పేరు పెట్టింది. టైం తొమ్మిదిన్నర కావటంతో, అమ్ములు బెడ్ పక్కనే స్టూల్ వేసి ఓ చిన్న పరుపు వంటిది ఏర్పాటు చేసింది మమత. నిద్రపోతున్న ట్వింకిల్‌ను జాగ్రత్తగా ఆ పరుపు మీద ఉంచింది అమ్ములు. కాసేపటికి అమ్ములు కూడా నిద్రపోసాగింది.


తెల్లవారిపోయింది. ఆదివారం కావడంతో ఆలస్యంగా నిద్ర లేచిన అమ్ములుకు ట్వింకిల్ కనిపించలేదు. బిక్కమొహంతో మమత కోసం వెదకసాగింది. మమత కూడా కనిపించకపోవడంతో ఏడవసాగింది. ఏడుపు శబ్దం విని బాత్‌రూమ్ లోంచి డోర్ తీసి కంగారుగా బయటికొచ్చాడు విరాట్. తండ్రిని చూసి మరింతగా ఏడుపు లంకించుకుంది అమ్ములు.


విరాట్ కు విషయం అర్థమయ్యింది. "ట్వింకిల్ కోసమేనా నీ ఏడుపు" అంటూ అమ్ముల్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. విరాట్ ఓ ప్రైవేట్ బ్యాంకులో క్లర్క్ గా పని చేస్తున్నాడు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటికి ఆలస్యంగా వస్తుంటాడు.


ఈసారి కూడా ఆలస్యంగా వచ్చిన విరాట్ కు జరిగినదంతా చెప్పింది మమత. ఇద్దరూ మాట్లాడుకుని ఓ నిర్ణయానికొచ్చారు. ఆ నిర్ణయాన్ని అమలు కూడా చేశారు. తెల్లవారుజామున నిద్ర లేచిన ట్వింకిల్ బెడ్‌రూమ్ లోనే అటూ ఇటూ ఎగురసాగింది. విరాట్ ట్వింకిల్‌ను జాగ్రత్తగా ఒడిసిపట్టుకున్నాడు.


ట్వింకిల్‌ను బయటకు తీసుకెళ్లి ప్రహరీ గోడపైన ఉంచాడు విరాట్. మమత, విరాట్ ఇద్దరూ చూస్తుండగానే ట్వింకిల్ స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. జరిగిన విషయాన్ని అమ్ములుకు చెప్పాడు విరాట్.


సెలవురోజు కావడంతో ట్వింకిల్‌ను ఫ్రెండ్స్ కు చూపించాలని, వారితో కలసి ట్వింకిల్‌తో ఎంచక్కా ఆడుకోవాలనుకున్న అమ్ములు కాస్తా డీలాపడింది. అది ముందే ఊహించిన విరాట్, తాను ఆర్డర్ పెట్టి తెప్పించిన చిలుక బొమ్మను ఆమె ముందు ఉంచాడు. అయినా ఒప్పుకోలేదు అమ్ములు. ట్వింకిల్ కావాల్సిందేనని భీష్మించింది.


అమ్ముల్ని బ్రతిమలాడుతూ త్వరగా బ్రష్ చేసి టిఫిన్ తినమన్నాడు విరాట్. అప్పుడు మమత ఇంట్లో లేదని గుర్తించింది అమ్ములు. "అమ్మ ఎక్కడుంది?" అని అడిగింది విరాట్ ను. అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేదని వెళ్లిందని, సాయంత్రానికి తిరిగొస్తుందని చెప్పాడు విరాట్. అమ్మ కావాలంటూ గొడవ మొదలుపెట్టింది అమ్ములు.


అమ్మ వచ్చేంత వరకు ఏమీ తిననని మొండిపట్టు పట్టింది అమ్ములు. మమతకు కాల్ చేశాడు విరాట్. పుట్టినిల్లు దగ్గర్లోనే ఉండటంతో గంటన్నర కల్లా తిరిగొచ్చింది మమత. స్కూల్ సమయంలో తప్ప ఆమెను విడిచి ఉండని అమ్ములు ఎగిరి వాటేసుకుంది.


అప్పుడు మమత అమ్ములుతో "అమ్ములూ... నేను లేకుండా కాసేపైనా ఉండలేకపోతున్నావు. మరి ట్వింకిల్ కు కూడా పిల్లలు ఉంటాయి కదా... వాటి పరిస్థితి ఆలోచించు.... అమ్మ ఎవరికైనా అమ్మే కదా..." అంది. అమ్ములు అలాగే కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అప్పుడు నోరు తెరచి "అవునమ్మా... అమ్మ అందరికీ అమ్మ..." అంది పెద్ద ఆరిందాలా. అంతా గమనిస్తున్న విరాట్ నవ్వుతూ చప్పట్లు కొట్టాడు.

***



శ్రీనివాస రావు పింగళి
శ్రీనివాస రావు పింగళి

రచయిత పరిచయం: శ్రీనివాస రావు పింగళి

పేరు : శ్రీనివాస రావు పింగళి 

తల్లిదండ్రులు : అలివేలుమంగమ్మ, సుబ్బారావు 

ఉద్యోగం : ఏ.పి.యస్ ఆర్టీసీ కండక్టర్ 

చదువు : డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 

ఇతర రచనలు : ఆంధ్రభూమి వీక్లీలో అనేక కవితలు, తెలుగు వెలుగు మాసపత్రికలో "భలే పెళ్లిపెద్ద"  హాస్య కథ, స్వాతి వీక్లీలో "వర్మ ఫ్రమ్ బర్మా" హాస్య కథ ప్రచురింపబడినవి. 

ప్రస్తుత నివాసం : గుంటూరు 




bottom of page