అందలానికి నిచ్చెన
- T. V. L. Gayathri

- 3 days ago
- 5 min read

Andalaniki Nichhena - Telugu Emotional Story | T. V. L. Gayathri
అందలానికి నిచ్చెన - తెలుగు భావోద్వేగ కథ | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 21/04/2026
“తల్లిదండ్రులు నిచ్చెనలా నిలిస్తే… పిల్లలు ఆకాశాన్ని తాకుతారు!”
అందలానికి నిచ్చెన కథలో ఈ విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పారు టి. వి. యెల్. గాయత్రి గారు.
ప్రకాశం, విజయవాడ వన్ టౌన్ కూరగాయల మార్కెట్‌లో కూలీ. పొద్దున నుండి కూరగాయలు మోస్తూ ఉంటాడు. అతడి భార్య వనజ. తాపీ పనికి వెళ్లి వస్తూ ఉంటుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. వినీత, విశాల్‌లు. భార్యాభర్తలు చేసేది కూలీ పని అయినా, పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక ఉండేది ఇద్దరికీ. ప్రకాశం టెన్త్ దాకా చదివాడు. తర్వాత చదువుదామనుకొన్నా, అతడి కుటుంబ పరిస్థితుల వల్ల కూలీ పనికి వెళ్లాల్సి వచ్చింది. తన లాగా పిల్లల జీవితం పేదరికంలో మసిబారిపోకూడదని, ఉన్నంతలో పిల్లల చదువుకు ప్రాధాన్యతనిస్తుంటాడు.
అందుకే ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూలులో చేర్పించాడు పిల్లల్ని. ప్రతినెలా వచ్చి పిల్లల క్లాసు టీచర్లను కలిసి చదువుల గురించి కనుక్కుంటూ ఉండేవాడు. అతడి శ్రద్ధకు టీచర్లకు, ప్రిన్సిపాల్‌కు ముచ్చట వేస్తుండేది.
"మిడిల్ క్లాసు పిల్లల కంటే మీ పిల్లలు మెరుగ్గా చదువుతారు ప్రకాశం! వాళ్ల గురించి నువ్వు దిగులు పడనక్కరలేదు," అంటుండేది వినీత ప్రిన్సిపాల్ రజనీ మేడం.
"పెద్ద పెద్ద చదువులు చదవాలంటే మా శక్తి సరిపోతుందా, మేడం?" అన్నాడు ప్రకాశం.
"మంచి ర్యాంకులు తెచ్చుకుంటే ఖర్చుదేముంది? ఇప్పటి నుండి కాస్త కాస్త పొదుపు చెయ్యి! నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా," అంది రజని.
అప్పటి నుండి ఆమె మాట వేదం అయింది ప్రకాశానికి.
"చూడు! మనం తిన్నా తినకపోయినా, పిల్లలకు మాత్రం మంచి పోషకాలుండే తిండి పెట్టాలి! పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో పిల్లలకు బలం కోసం బాదం పప్పులు, పాలు, నెయ్యి పుష్కలంగా పెడతారంట! మనకంత లేదు. అయితే మాత్రం ఏమిటి? ఉన్నంతలో పిల్లలకు లోటు లేకుండా చూసుకుందాం!" అంటూ భార్యకు బోధించాడు.
అప్పటి నుండి కడుపు కట్టుకొని పిల్లల కోసం డబ్బులు కూడబెట్టడం చేస్తుండేవాళ్ళు భార్యాభర్తలిద్దరూ.
రజనీ మేడంనడిగి ఇన్సూరెన్సులు వేయసాగాడు. నిలకడ లేని పని. ఏ రోజుకా రోజు కూలీ తెచ్చుకొనే జీవితాలు. అయినా అధైర్యపడలేదు ప్రకాశం.
ప్రతి పది రోజులకు వచ్చిన డబ్బుల్లో పొదుపుకింత అని, ఖర్చుకింత అని విడిగా పెట్టుకునేవాడు.
కూరగాయల లారీల్లో పడిపోయిన కూరలు, పండ్లు ఏరుకొచ్చుకునేవాడు. రోజూ పిల్లలకు గుడ్లు, నువ్వుండలు పెట్టేది వనజ.
ఒక్కోసారి పిల్లలు పండ్లు, గుడ్లు తింటూ "ఇదిగో నాన్నా! నువ్వూ అమ్మా కూడా తినండి!" అంటూ చేతికి అందిస్తే,
"నాకు పడవురా! ఏమిటో మొన్న ఒక పండు తింటే పడలేదు. ఒకటే కడుపులో తిప్పడం! ఎలర్జీ ఏమో! మీరు తినండి!" అనేవాడు ప్రకాశం. అతడి ఎలర్జీ జాబితాలో గుడ్లు, పళ్ళు, పాలు, పెరుగు, స్వీట్లు లాంటి పదార్థాలు చేరిపోయాయి.
ఇంక వనజ అయితే పిల్లల ముందు తినటమే మానేసేది.
"ఇందాకే తిన్నాలే! కడుపు నిండిపోయింది," అంటూ తప్పించుకొనేది.
పిల్లలు వాళ్ళ ధ్యాసలో వాళ్ళుండేవాళ్ళు.
తాము కడుపు నిండా తింటే పిల్లలకు తక్కువవుతాయని భార్యా భర్త లిద్దరికీ భయం.
చదువుకొనే పిల్లలకు ఆ మాత్రం బలమైన తిండి లేకపోతే ఎలాగా?
వినీత టెన్త్ పాస్ అయింది. స్కూలులో ఆమెదే ఫస్ట్ ర్యాంక్.
"ఐ ఐ టి కోచింగ్ ఇప్పించు ప్రకాశం!నేను కోచింగ్ సెంటర్ వాళ్ళతో మాట్లాడతాను! ఫ్రీ కోచింగ్ ఇస్తారేమో కనుక్కుంటా! సీటు తప్పకుండా వస్తుంది!" ప్రోత్సాహించింది రజనీ మేడం.
ఏనుగెక్కినంత సంబరంగా ఉంది ప్రకాశానికి.
'పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదివే కాలేజీలో తమ బిడ్డకు సీటు వస్తే ఎంత భాగ్యం! చర్మం కోసి పెట్టమంటే పెడతాడు తను.'
అతడి కలలు నిజమయ్యాయి.
వినీతకు ఐఐటీ చెన్నైలో సీటు వచ్చింది. విశాల్ మాత్రం ఎం.ఎస్సీ చదివి లెక్చరర్‌గా విజయవాడలోనే ఉంటానన్నాడు.
తన పద్ధతిని మార్చుకోలేదు ప్రకాశం దంపతులిద్దరూ.
"హాస్టల్‌లో ఉండే పిల్లకు సరైన తిండి ఉండదంటూ పదిహేను రోజులకొకసారి పెద్ద డబ్బాలో తినుబండారాలు పెట్టుకొని ఏదో ఒక లారీ ఎక్కి చెన్నై చేరుకొనేవాడు ప్రకాశం.
కూతురుకు లోటు లేకుండా డబ్బులు చేతిలో పెట్టి వచ్చేవాడు.
కాలం గడిచింది.
వినీతకు ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం వచ్చింది.
విశాల్ బి.ఎస్.సి పూర్తి చేశాడు. అతడికి ఇంకా రెండేళ్లు చదువుంది. సాయంత్రం కాలేజీ నుండి వచ్చాక ఇంటర్ స్టూడెంట్స్‌కు ఫిజిక్స్, మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడు విశాల్.
"ఎందుకురా! నీ చదువు నువ్వు చూసుకో! ఇంకో రెండేళ్లు డబ్బులు పెట్టలేమా!" అనేవాడు ప్రకాశం.
తండ్రి ఇంకా బస్తాలు మోస్తుంటే సిగ్గుగా ఉండేది విశాల్‌కు.
శని, ఆదివారాలు బస్తాలు మొయ్యటానికి తను కూడా వెళ్ళేవాడు విశాల్.
"వద్దులేరా!నీ కెందుకీ కష్టం!ఇట్లాంటి పనులు చెయ్యమాకురా!"అనేవాడు చూడలేక.
"ఏమవుతుంది? ఈ వయసులో కూడా నువ్వు చేస్తే బాగుండే పని, వయసులో ఉన్న వాడిని నేను చేస్తే తప్పవుతుందా?" అనేవాడు విశాల్.
"ఒరేయ్! మీ నాన్న నిన్ను అందలం ఎక్కిద్దామనుకున్నాడ్రా! ఈ కూలీ పనులు నువ్వు చేస్తుంటే తండ్రి ప్రాణం కొట్టుకులాడదూ!" అంటూ ఎక్కిరించేవాళ్ళు ప్రకాశంతో పాటు పనిచేసే కూలీలు.
నవ్వేసేవాడు విశాల్.
రెండేళ్లు గడిచాయి. పేరున్న ఎంసెట్ కోచింగ్ సెంటర్‌లో విశాల్‌కు ఉద్యోగం వచ్చింది.
అప్పటి నుండి తండ్రిని కూలీ పనికి వెళ్లనివ్వడం లేదు విశాల్.
కొంచెం పెద్ద ఇంటిలోకి మారారు ఇప్పుడు.
తల్లిదండ్రులకు మంచి బట్టలు కొనిపెట్టాడు విశాల్.తల్లికి కమ్మలు, నానుతాడు చేయించాడు.
ఇద్దరికీ ట్రావెల్ టిక్కెట్లు కొనిపెట్టి తీర్థ యాత్రలు చెయ్యమని చెప్పింది వినీత.
చెన్నై నుంచి మొదలు పెట్టి కేరళ దాకా చుట్టబెట్టి వచ్చారు ప్రకాశం,వనజలు.
కొత్త జీవితంలాగా ఉంది ఇద్దరికీ.
ఈ సంవత్సరం వినీతకు ఉద్యోగంలో 'ఎక్సలెంట్ అవార్డు' వచ్చింది.
అవార్డు ఫంక్షన్‌కు తల్లిదండ్రులను తీసికొని పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు విశాల్.
వినీత ఇంటికి చేరారు ముగ్గురూ.
రెండో రోజు ఆఫీసుకు వెళ్లారు.
పెద్ద హాలు.చాలా మంది సూట్లు వేసుకున్న వాళ్ళున్నారక్కడ.కొంత మందికి వినీత తల్లి దండ్రులని పరిచయం చేసింది.
ఇంగ్లీషు రాదు. పెద్ద పెద్ద వాళ్ళ ముందు ముడుచుకుపోతున్నారు ప్రకాశం, వనజలు.
ఇంతలో అక్కడికి ఇస్రో ఛైర్మెన్ వచ్చాడు.
"మీ అమ్మాయి ఎంతో తెలివైనది. చక్కగా చదివించారు. మీ లాంటి తల్లిదండ్రులు అందరికీ ఆదర్శం!" అంటూ ప్రకాశం భుజం మీద చెయ్యి వేసి తీసికెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టాడు. అతడి ప్రక్కనే కుటుంబ సభ్యులు.
అవార్డు వచ్చిన వాళ్లను స్టేజ్ మీదకు పిలుస్తున్నారు.
విజేతలను అభినందించి షీల్డులను అందచేస్తున్నాడు ఇస్రో చైర్మన్.
వినీత వంతు వచ్చింది.
అవార్డు తీసుకొందామె.
"నీకు స్ఫూర్తినిచ్చిన వారి గురించి చెప్ప"మంటూ వినీతకు మైక్ అందించాడు చైర్మన్.
"ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం మా అమ్మా, నాన్న. విజయవాడలో మా అమ్మా నాన్నలిద్దరూ సాధారణమైన కూలీలు! ఈ రోజు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టటానికి ఎంతో కష్టపడ్డారు. వాళ్లే నాకు స్ఫూర్తి," అంది వినీత. అందరూ చప్పట్లు కొట్టారు. తుండుగుడ్డతో కళ్ల నీళ్లు తుడుచుకొన్నాడు ప్రకాశం.
అందరూ ప్రకాశం దంపతులను మెచ్చుకోలుగా చూశారు.
కార్యక్రమం ముగిసింది.ఇక విందుకు బయలు దేరుతున్నారందరు.
భోజనాల హాల్లోకి వచ్చారు ప్రకాశం వాళ్ళు.అక్కడ రకరకాల పదార్థాలు పెట్టి ఉన్నాయి.
కొన్ని పదార్థాల పేర్లు ఏమిటో కూడా తెలియదు వీళ్లకు.
"ఈ భోజనం ఎంత ఖరీదవుతుందో!" అంది కొడుకుతో గుసగుసగా వనజ.
"డబ్బులివ్వక్కర లేదమ్మా! అంతా ఫ్రీ. మనకెంత కావాలంటే అంత తినొచ్చు!"అన్నాడు నవ్వుతూ విశాల్.
అందరూ వరుసలో వెళ్తుంటే అక్కడ నిల్చున్న సర్వర్లు ప్లేట్లల్లో వడ్డిస్తున్నారు.
ప్రకాశం, వనజలు కూడా ప్లేట్లల్లో పెట్టించుకొని వచ్చి ఒక మూల కూర్చుని, అన్ని పదార్థాలను మెల్లగా తింటున్నారు.
వినీత ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉన్న విశాల్, తల్లిదండ్రులను చూచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అప్పటికి భోజనం ముగించి, ఇంకో ప్లేటులో పళ్ళ ముక్కలు, స్వీట్స్ పెట్టుకొని తింటున్నారు ఇద్దరూ.
ఆశ్చర్యంగా చూశాడు విశాల్.
తండ్రికి స్వీట్లు, పళ్ళు అంటే ఎలర్జి!
"పళ్ళు, స్వీట్లు తినకు నాన్నా! మళ్ళీ నీకు ఒళ్ళు పాడవుతుంది!" అన్నాడు విశాల్ కంగారుగా.
నవ్వాడు ప్రకాశం.
"ఇప్పుడా ఎలర్జి తగ్గిపోయిందిరా!"అన్నాడు.
తండ్రి నవ్వుతుంటే అర్థం అయింది విశాల్‌కు. తమ చదువుల కోసం తల్లిదండ్రులు ఎన్ని అబద్ధాలు చెప్పారు... ఎంత కష్టపడ్డారు... తమని అందలం ఎక్కించాలని నిరంతరం రక్తమాంసాలు రంగరించి పోశారు. నిచ్చెన మెట్లలాగా నిలబడ్డారు.
కన్నీళ్లు తిరిగాయి అతడికి.
ఆ రాత్రికి వినీతకు కూడా నిజం తెలిసిపోయింది.
అమ్మా, నాన్నలను పట్టుకొని భోరుమంది.
ఆ తర్వాత నుంచి తల్లిదండ్రులను కాలు కిందపెట్టనివ్వకుండా చూసుకొన్నారు ఇద్దరూ.
తమ కష్టానికి ఫలితం దక్కిందనుకొన్నాడు ప్రకాశం.
సమాప్తం.
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |






Comments