అందమైన కిటికీ
కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Andamaina Kitiki' New Telugu Story Written By Pendekanti Lavanya Kumari
రచన: పెండేకంటి లావణ్య కుమారి
ఒక అందమైన కిటికీ చూసి ఆ కిటికీ వెనుక కథ ఇంకెంత అందంగా వుంటుందోనని, తెలుసుకోవాలని ప్రయత్నించి, తెలుసుకుని వారితో కలిసిపోయిన ఒక యువకుని కథ ఇది. * * *
రవి కాలేజీకి వెళ్ళే దారి పక్కనే ఒక అందమైన ఇల్లు కొత్తగా కట్టారు. సంవత్సరం క్రితం ఆ ఇల్లు కట్టటం మొదలయ్యింది. అప్పటి నుండి రవి ప్రతిరోజూ ఆ ఇంటిని కట్టటానికి జరిగే పనులు గమనిస్తూ వచ్చాడు. ఆ ఇంటి ముందు అప్పుడప్పుడూ ఒక కారు ఆగి వుండేది. బహుశా ఇంటి ఓనర్లు వచ్చారేమో అనుకునే వాడు. రవి రోజూ కాలేజీకి ఆ ఇంటి ముందు నుండే వెళ్ళేవాడు. అందుకే ఆ ఇంటిని కట్టటానికి మొదటగా తవ్వి పునాదులు వేసినప్పటి నుండి చూస్తూనే వున్నాడు. తర్వాత దాని మీద గోడలు కట్టటానికని ఎక్కడెక్కడ వాకిండ్లు, కిటికీలు వస్తాయో అక్కడ వాటి చెక్క చట్రాలను అమర్చి గోడలు కట్టటం కూడా చూసాడు. కొన్ని రోజులకు గోడలపైన దూలాలు పెట్టి సెంటరింగ్ చేయటం, తర్వాత కాంక్రీట్తో మొదటి అంతస్తు స్లాబ్ వేయటం అన్నీ గమనిస్తూ, అబ్బో! అప్పుడే ఇంటి మొదటి అంతస్తు అయిపోయిందనుకున్నాడు కూడా. చూస్తుండగానే రెండో అంతస్తుకు కూడా స్లాబ్ వేసేసారు. కొన్ని రోజులకు ఫ్లోరింగ్ అయిపోయింది. అది చూసాక రవి, ఇల్లు చాలా ముచ్చటగా రూపుదిద్దుకుందనుకున్నాడు. రవికి అన్నిటికంటే ఆ ఇంటి కిటికీ ఎంతో అందంగా అనిపించేది. అదొక ఫ్రెంచ్ కిటికీ. చాలా బాగా రూపకల్పన చేసారు. అలాగే ఒకరోజున కిటికీకి అందమైన గ్రిల్ అమర్చారు. మరియొక రోజున కిటికీకి అందమైన గాజు అమర్చిన కిటికీ రెక్కలు పెట్టారు. ఇంకో రోజున కిటికీకి రంగులు వేసారు. మొత్తానికి చూడటానికి ఆ కిటికీని చాలా అందంగా తయారు చేసారు. తల వాకిలిని కూడా చాలా బాగానే రూప కల్పన చేసినా, ఎందుకో రవికి కిటికీనే ఎంతో బాగా నచ్చింది. ఇంటికి చివరాఖరు పనులుగా, ఇంటిని చూస్తూనే చాలా బాగా కనపడాలనేమో ఇంటి ముందున్న గోడకు వినూత్నమైన మోటివ్తో తీర్చిదిద్దారు. అన్నీ సమకూరుతూ ఇల్లెంతో అందంగా రూపుదిద్దుకుంది. ఇంత అందమైన ఇంటికి ఎవరొస్తారో అనుకున్నాడు రవి మనసులో. తర్వాత రవికి రెండు నెలల వేసవి సెలవులు ఇచ్చారు. ఇంక ఆ రోజే సెలవులు అయిపోయి కాలేజీ మొదలయ్యింది. కాలేజీకి వెళ్తూ అనుకున్నాడు, ఆ ఇల్లు ఎలా వుందో, ఎవరైనా వచ్చుంటారా అని. దారిలో ఇంటిని చూసాడు, ఇల్లు అంతా పూర్తయి పోయి ఎవరో ఇంట్లో దిగినట్టుగా తెలుస్తోంది. తనకిష్టమైన కిటికీ వైపు చూసాడు. దోమతెర(మస్కిటో నెట్) పెట్టి వున్న ఒక కిటికీ రెక్క మాత్రం తెరుచుకుని వుంది, తొంగి చూసాడు ఏమీ కనపడలేదు. ఎవరూ కనపడలేదని ఏదో నిరాశగా అనిపించింది. "కిటికీ అనేది తెరిచి వుంచితేనే చూపులకు, గాలికి, వెలుగుకు వారధిలా పని చేస్తుంది. గాజు రెక్కలున్న కిటికీ అయితే మూసి వుంచినా వెలుగుకు వారధిలా ఉపయోగపడుతుందిలే", అని ఏదో అలా చూస్తూ ఈ మాటలనుకుంటూ వెళ్ళి పోయాడు రవి. సెలవులు ముగిసిన మొదటి రోజు కాబట్టి కాలేజీలో ఏమీ జరగలేదు. లెక్షరర్ల పరిచయాలు, పిల్లల పరిచయాలు అవీ అంతే. చదివేది ఏమీ అంతగా లేదని తన ఫ్రెండ్స్ తో సాయంత్రం వరకు క్రికెట్ ఆడి ఆరు గంటలకు ఇంటికి బయలుదేరాడు రవి. వెళ్తుంటే దారిలో కొత్తిల్లు, దూరం నుండే కిటికీ నుండి లైటు వెలుగు కనిపిస్తోంది. దగ్గరకు రాగానే ఆత్రుతగా ఎవరైనా కనపడతారేమోనని కిటికీ వంక చూసుకుంటూ వెళ్ళాడు రవి. చూస్తున్న రవికి ఈసారి ఆనందం కలిగింది. కారణం అక్కడో ఏడెనిమిదేళ్ళ చిన్నమ్మాయి కిటికీలో కూర్చుని ఏదో చేస్కుంటూ కన్పించింది. చాలా ముద్దుగా వుంది. రవి చూస్తుండగానే తను కూడా రవిని చూసింది. రవికి తెలియకుండానే అప్రయత్నంగానే అతని ముఖంలో చిన్న నవ్వు వికసించింది. అది చూసి ఆ పాప ముఖంలో కూడా చిన్న నవ్వు విరిసింది. రవి అలా మొదటగా ఆ అమ్మాయిని చూసాడు. అలా ఎప్పుడు కాలేజీలో ఆడుకుని ఆలస్యంగా సాయంత్రం ఇంటికి వెళ్తున్నా ఆ పాప ఆ కిటికీలో ఏమన్నా బొమ్మలు వేసుకుంటూనో, పాలు త్రాగుతూనో రవికి కనపడేది. రవి ఆ పాపను ఎప్పుడు చూసినా ముచ్చటైన గౌన్లలో ముద్దుగా కనిపిస్తూ చిన్నగా పలకరిస్తున్నట్టు నవ్వుతూ కనబడేది. అలా కళ్ళతోనే వాళ్ళ పలకరింపులు జరిగిపోయేవి. అక్కడ దగ్గరలో వున్న ఇళ్ళలోని పిల్లలు సాయంకాలాలు ఎప్పుడూ ఇంటి బయట ఆడుతూ రవికి కనపడేవారు. మాట్లాడ్దామంటే ఈ పాప ఎప్పుడూ బయట ఆడుతూ కనపడలేదు, వాళ్ళమ్మ బయట ఆడుకోనివ్వదేమో అనుకున్నాడు. అందుకే ఒక రోజు కిటికీ నుండే పేరు అడిగాడు, ప్రిన్సీ అని చెప్పింది. ఓహ్! ప్రిన్సీనా! నిజంగా ప్రిన్సెస్ లాగానే వున్నావన్నాడు రవి. ఆ పాప చిన్నగా నవ్వింది. అలా చాలా సార్లు ఒకరికొకరు పలకరించుకోవటం జరుగుతూ వచ్చింది. ఒకరోజు రవి కాలేజీ నుండి ఇంటికి వెళ్తూ, పాపకు కొంచెం దూరంలో వాళ్ళమ్మ వున్నది గమనించక, యధాప్రకారంగా ప్రిన్సీని పలకరించాడు. అది చూసి ఆమె ప్రిన్సీతో ఎవరా అబ్బాయి అంది. ప్రిన్సీ వాళ్ళమ్మతో నా ఫ్రెండ్ అంది. వెంటనే వాళ్ళమ్మ లోపలికి రా బాబూ అని పిలిచింది. పర్వాలేదు వెళ్తా ఆంటీ అన్నాడు రవి. లేదు వచ్చి కాఫీ తీస్కోని వెళ్దువురా బాబూ, మా పాపతో మాట్లాడే వారెవరూ లేరని బలవంతం చేస్తే లోపలికి వెళ్ళాడు రవి. వెళ్ళగానే ఒక పక్కగా చిన్న వీల్చైర్ ఒకటి కనపడింది, ఏంటో అనుకున్నాడు. తర్వాత వాళ్ళమ్మతో పాపను కూడా బయట పిల్లలందరితో ఆడుకోటానికి పంపించవచ్చుగా ఆంటీ అన్నాడు రవి. దానికి ఆమె ఏమీ పలక లేదు. నన్ను సోఫాలో కూర్చోమని చెప్పి వెళ్ళి ప్రిన్సీని ఎత్తి వీల్చైర్ లో కూర్చోబెట్టి రవి వద్దకు తీసుకొచ్చింది. అది చూస్తూనే రవికి నోట మాట రాలేదు, అలానే చూస్తుండిపోయాడు. ఇంత ముద్దుగా వున్న పాపకు ఇదేమి శిక్షరా బాబూ అనుకున్నాడు మనసులో. అనుకోని ఘటనకు రవికి బాగా ఏడుపొచ్చేసింది, కానీ తమాయించుకుని, "ఏమయ్యింది ఆంటీ", అని అడిగాడు. పుట్టుకతోనే ఏదో నర్వస్ ప్రాబ్లమ్ వల్ల నడవ లేక పోతోంది, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, తొందరలోనే నడవగలదన్నారు డాక్టర్లు అని కాఫీ తీసుకొస్తానని, వద్దంటున్నా వినకుండా లోపలికెళ్ళింది ఆంటీ . ప్రిన్సీని ఇప్పుడు చూస్తుంటే రవికి ఎందుకో జాలిగా అనిపించింది. కానీ అది బయట పడకుండా తన ప్రక్కనే కూర్చుని మాట్లాడసాగాడు. ఇంతలో కాఫీ, బిస్కెట్లు తెచ్చిచ్చిందాంటీ. అది త్రాగి కాసేపు ప్రిన్సీతో లుడూ ఆడి ఆంటీతో వెళ్ళొస్తానంటే, 'అప్పుడప్పుడూ వస్తుండు బాబూ' అంది ఆంటీ. 'ప్రిన్సీ కొరకైనా తప్పకుండా వస్తా ఆంటీ' అని చెప్పి బయలుదేరాడు రవి. వెళ్తూ కిటికీ వంక చూసి ఏ కిటికీ వెనుక ఏ కథ వుంటుందో కదా అని అనుకున్నాడు రవి. చెప్పినట్టుగానే రవి అప్పుడప్పుడూ వచ్చి ప్రిన్సీతో ఆడుకుని వెళ్ళేవాడు. కొద్ది కాలానికి ప్రిన్సీకి చేసిన ఆపరేషన్ మంచిగా జరిగి తను చిన్నగా నడవడం మొదలు పెట్టింది. చూస్తుండగానే ప్రిన్సీకి పరుగెత్తటం కూడా వచ్చేసింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రవి ప్రిన్సీకి చాలా సపోర్టుగా వున్నాడు. ఇప్పుడు సాయంకాలం సమయంలో కనుక రవి ఆ ఇంటి వైపుకు వెళ్తే ప్రిన్సీ కూడా బయట పిల్లలతో ఆడుతూ కనిపిస్తూ, పలకరిస్తుంది. రవి దేవుడికి ప్రిన్సీని మామూలుగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇప్పుడు రవికి ఆ అందమైన కిటికీ అందం రెట్టింపయినట్టుగా అనిపిస్తుంది. కారణం, ఇంటికి అసలందం ఆ ఇంటిలోని మనుషుల ఆనందమే కదా.
---- సమాప్తం ---
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.manatelugukathalu.com/post/results-of-weekly-prizes-958
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం:
నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.