అశోకుని అహింస

Ashokuni Ahimsa - Telugu Inspirational Story | Rallabandi Sangam Naidu
అశోకుని అహింస - తెలుగు ప్రేరణాత్మక కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 28/09/2026
కళింగ యుద్ధం తర్వాత అశోకుడి జీవితంలో వచ్చిన గొప్ప మార్పును తెలియజేసే నీతి, ప్రేరణాత్మక కథ ఇది.
అశోకుని అహింస కథ పిల్లలకు, విద్యార్థులకు మంచి విలువలను పరిచయం చేసే ప్రేరణాత్మక కథగా నిలుస్తుంది.
పూర్వం భారతదేశాన్ని మౌర్య వంశానికి చెందిన అశోకుడు పరిపాలించేవాడు.
తన పూర్వికుల కాలంలో తమ రాజ్యంలో భాగం కాని కళింగ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా కళింగ రాజ్యంపై దండయాత్ర చేశాడు. శత్రువుపై గెలిచాడు.
కళింగ ఆ నాటి నుండి మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగం అయింది. యుద్ధవిజేత అశోకుడు అయ్యాడు కానీ, తన మనసు మాత్రం కకావికలమైంది.
అశోకుడు చేసిన కళింగ యుద్ధంలో ఒక లక్ష మంది సైనికులు అసువులు బాసారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. రక్తం ఆ యుద్ధంలో ఏరులై పారింది.
ఆ కళింగ యుద్ధం అశోకుని మనసు మార్చివేసింది. ఇక భవిష్యత్తులో యుద్ధం చేయనని ప్రతిన పూనాడు. తన రాజ్యాన్ని శాంతి పథంలో నడిపిస్తానని అనుకున్నాడు. "అహింసో పరమో ధర్మః" అని రాజ్యమంతా చాటాలనుకున్నాడు.
ప్రజలు నైతిక వర్తనులుగా ఉండాలని, శాంతి కాముకులుగా ఉండాలని తలచి ఎన్నో రాతి శిలాశాసనాలు వేయించాడు. భారతదేశంలో శిలాశాసనాలు వేసిన మొదటి చక్రవర్తి అశోకుడు.
అశోకుడు తన దగ్గరున్న సంపదను ప్రజలకు అందించాలనుకున్నాడు. అదీ వస్త్రాల రూపంలో. ఉచితంగా పంచకుండా ప్రజలకు ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. అశోకుని ఈ వస్త్రదాన ప్రధానోద్దేశం ప్రజలు అహింసా, నైతిక మార్గంలో పయనింపజేయాలనీ, ప్రజలు శాంతిమతులు కావాలనీ...
"రాజుగారికి ఎవరైతే బుట్ట నిండా పువ్వులు సమర్పిస్తారో... వారికి రాజుగారు ఖరీదైన వస్త్రాలు దానంగా బహుకరిస్తారు. ఒక షరతు. మీరు ఇంటి దగ్గర నుండి బుట్టలో సగం పూలతో రావాలి.
ఎవరైతే నీతి మార్గంలో జీవిస్తున్నారో వారి బుట్టలోని పూలు మార్గం మధ్యలో రెట్టింపై బుట్ట నిండుతుంది. నీతి మార్గంలో జీవించని వారి బుట్ట నిండదు." అని రాజ్యంలో దండోరా వేయించాడు.
పరీక్ష రోజు రానే వచ్చింది. అశోకుడు రాజ్యం ముఖద్వారం దగ్గర కొంతమంది భటులను ఉంచాడు. రాజ్యంలోకి వచ్చిన ప్రతీ మనిషిని క్షుణ్ణంగా తనిఖీ చేయమన్నాడు.
బుట్టలో సగం పూలున్న వారినే రాజ్యంలోకి పంపమన్నాడు. జనం తండోపతండాలుగా సగం నిండిన బుట్టలతో వచ్చారు. భటులు అందరినీ పరీక్షించి బుట్టలో సగం పూలున్న వారినే లోనికి వదిలారు. రాజ్య ముఖద్వారానికి రాజభవనానికి మధ్య చాలా దూరం ఉంది.
అంతేకాకుండా రాజభవనానికి వెళ్లే మార్గానికి ఇరువైపులా పూల చెట్లు ఉన్నాయి. ముఖద్వారంలోకి ప్రవేశించిన ప్రజలు దారికి ఇరువైపులా ఉన్న పూలతోటలో ఏరుకుని సగం పూలతో నిండిన బుట్టలను బట్టల కోసం పూర్తిగా నింపుకున్నారు. ఈ ప్రజలు తమని తాము నీతిమంతులుగా చిత్రించుకున్నారు. రాజభవనానికి చేరుకున్నారు.
రాజు వారితో... "మీ అందరి దగ్గరున్న బుట్టలలో పూలు నిండుగా ఉన్నాయి. అంటే మీరంతా నైతిక విలువులతో జీవిస్తున్నారన్న మాట. శబాష్! మీ అందరికీ వస్త్రదానం చేస్తున్నాను.
సంవత్సర కాలానికి సరిపడా వస్త్రాలు ఇస్తాను. ఈ వస్త్రాలు కట్టుకున్నప్పుడల్లా విలువలతో... అహింసతో జీవించాలన్న సంగతి మీ అందరికీ గుర్తుండాలి సుమా!" అని వారితో ప్రతిజ్ఞ చేయించుకుని అందరికీ వస్త్రదానం చేశాడు. ప్రజలు సంతోషంగా సంవత్సరానికి సరిపడా వస్త్రాలు తీసుకుని నీతిగా జీవిస్తామంటూ ఇంటి ముఖం పట్టారు.
వస్త్రదానం తరువాత మంత్రి అశోకునితో... "వాళ్లంతా మన రాజమార్గాన్ని ఆనుకుని ఉన్న పూలతోటలో పూలు ఏరుకుని తమ బుట్టలు నింపుకున్నారు ప్రభు. వారు నీతిమంతులు కారు." అన్నాడు.
దానికి అశోకుడు మంత్రితో ఇలా చెప్పాడు... "మన దగ్గర చాలా సంపద ఉంది మంత్రివర్యా! ఆ సంపద వారిది. వారికే చెందాలి.
ప్రజలు తెచ్చిన సగం పూలు వారి సగం జీవితం. మన తోటలో ఏరిన పూలు మిగిలిన సగం జీవితం. ఇంతవరకు వారు నచ్చినట్లు హింసామార్గంలో జీవించి ఉండవచ్చు.
ఇకనుండి మన తోటలోని మంచి మాటలనే పూల ద్వారా అహింసా మార్గంలో జీవించి తమ జీవితాలను పరిపూర్ణం చేసుకుంటారు. పూలవలె జీవితాలు వికసించాలి.
ఎవరి జీవితం సగం పూలలాగా మధ్యలోనే ఆగిపోకూడదు. మనిషి ఆశాజీవి కావాలి. అప్పుడే సగం జీవితం అయిపోయిందే అని అనుకోకూడదు, సగం జీవితం మిగిలి ఉందని అనుకోవాలి. సగం జీవితం నాశనం చేసుకున్నామే అనుకోకూడదు, మిగిలిన సగం జీవితం బాగుచేసుకోవాలనే సంకల్పం ఉండాలి.
రాజు దగ్గరకు, దేవుని దగ్గరకు ఉత్తి చేతులతో రాకూడదు, అందుకే పూలు తీసుకురమ్మన్నాను. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదు. ఉచిత పథకాలు మంచివి కావు, వాళ్లను సోమరులను చేస్తాయి. అందుకే చిన్న పరీక్ష పెట్టాను. చిన్న పరీక్ష అయితే ఎక్కువ మంది పాల్గొంటారు, కఠిన పరీక్ష అయితే చాలా తక్కువ మంది పాల్గొంటారు."
అశోకుని తెలివితేటలకు మంత్రి అబ్బురపడ్డాడు. అశోకుడు ఏటేటా ఇలాగే ప్రజల దగ్గర నుండి పూలు తీసుకుని వస్త్రదానం చేసేవాడు.
ప్రజల్లోని అహింసను తొలగించి వస్త్రదానంతో మంచితనం పెంచేవాడు. ఇలా అశోకుడు అహింసా మార్గంలో తన జీవితాన్ని, తన ప్రజల జీవితాన్ని నడిపించాడు. ప్రజల మెప్పు, చరిత్రకారుల మెప్పు పొందేవాడు.
రాళ్లబండి సంగం నాయుడు
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments