top of page

అశ్వ మేధం ఎపిసోడ్ 5


Written By Gannavarapu Narasimha Murthy

'అశ్వ మేధం - ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ..

చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. తాజ్ మహల్ వద్ద ఇరువురూ మళ్ళీ అనుకోకుండా కలుస్తారు.


ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.

సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.


తన అన్నయ్య పెళ్లి చూపుల కోసం చరణ్ ఉన్న ఊరు వస్తుంది సౌదామిని. చరణ్ ఇంట్లో విహారి ఫోటో చూస్తుంది. అతడు తన స్నేహితురాలు దీపను మోసం చేసాడని చెబుతుంది. విహారి వాళ్ళ ఊరికి వెళ్తే నిజం తెలుస్తుందంటాడు చరణ్.


విహరితో తన పరిచయం గురించి సౌదామినికి వివరిస్తాడు.

ఆమె ఊరికి వెళ్ళాక విహారి దగ్గరకు వెళతాడు. అతని కోరికపై బాక్సయిట్ తవ్వకాలు నిలిపివేయాలని కోర్టులో కేస్ వేస్తాడు చరణ్.


తవ్వకాలు తాత్కాలికంగా ఆగుతాయి.

ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 5 చదవండి..


చరణ్ ఇంటికి వచ్చి వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు. వారం రోజుల తరువాత ఒకరోజు అతనికి సౌదామిని నుంచి ఫోన్ వచ్చింది. తాను ఫ్లైట్ కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కోనసీమకి బయలుదేరుతున్నానీ, మీరు కూడా బయలుదేరి రావాలనీ చెప్పడంతో చరణ్ ఆలోచనలో పడ్డాడు. మొదట్లో వెళ్ళాలా వద్దా అనీ సంశయించినా ఆమె అంతగా చెప్పడంతో కాదనలేక వెళ్ళాలని నిర్ణయించు కున్నాడు.


విశాఖ దాకా స్కార్పియోలో వచ్చిన తరువాత అతనికో ఆలోచనవచ్చింది. మళ్ళీ బస్సుకి బయలుదేరడం, అక్కడనుండి ఇంకెన్నో మారి ఆఊరుకి వెళ్ళడంకన్నా జీపులోనే వెళ్లిపోతే తిన్నగా ఆ ఊరెళ్ళిపోవచ్చు. మళ్ళీ పని అయ్యాక తిరిగి వచ్చేయవచ్చు అని జీపు లోనే బయలు దేరాడు; ఆ విషయాన్ని సౌదామిని కి ఫోన్ చేసి చెప్పాడు.


వెంటనే ఆమె తను రాజమండ్రిలో ఎదురుచూస్తూ ఉంటాననీ, కలిసి వెళ్లిపోవచ్చనీ చెప్పింది. విశాఖ నుంచి రెండున్నర గంటల్లో రాజమండ్రి చేరుకున్నాడు. ఆమె చెప్పిన ప్రకారం వెళ్ళి ఆమెని ఎక్కించుకొని మళ్ళీ బయలుదేరింది స్కార్పియో..


"సౌదామిని గారూ! ఆమె అంటే మీ స్నేహితురాలు; ఆమె పెళ్ళికి మీరు వెళ్ళడం సహజం. కానీ మీతో పాటు నేను వస్తే వాళ్ళేమనుకుంటారో? మీకు ఇబ్బందికాదా? మన గురించి ఎవరు తప్పుగా అనుకున్నా బాధపడాలి” అన్నాడు చరణ్;


"మనం ఎలా ఉన్నా సమాజం ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. దానిగురించి మీరు పెద్దగా ఆలోచించకండి. అయినా వరూధినితో నేను అన్నీ చెప్పాను. మీరు నాకు తోడుగా వస్తున్నారనీ, ఈప్రదేశం నాకు కొత్త అనీ దానితో చెప్పాను. కాబట్టి అదేమి సమస్యకాదు. దానిగురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి" అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు చరణ్;


ఆ తరువాత ఆమె చెప్పిన ప్రకారం ప్రయాణం కొనసాగింది. ముందుగా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం చేరుకుంది. అక్కడనుంచి అమలాపురం దారిపట్టింది.

పచ్చటి కొబ్బరి తోటల మధ్యలోంచి, కాలవగట్టుమీదనుంచి వెళుతుంటే అతనికి చాలా ఆనందం కలగసాగింది.


ఇంక సౌదామిని కైతే ఆపచ్చటి ప్రకృతిని చూసి మనస్సు పులకించిపోసాగింది. ద్రాక్షారామం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అక్కడ శివుడిలింగం చాలా పొడవుగా ఉంది. ఆగుడికూడా చాలా పురాతనంగా ఉంది. చాలా సేపు ఆగుడి సౌందర్యాన్ని చూసిన తరువాత కోటిపల్లి రేవుకి చేరుకున్నారు.


అది గోదావరి ఒకపాయ గౌతమి; .. ఒడ్డుని రాసుకుంటూ ప్రవహిస్తోంది; గట్టంతా పచ్చటి కొబ్బరిచెట్లు.. కనుచూపు మేరంతా సముద్రంలా గోదావరి; దూరంగా తెరచాపలతో పడవులు రేవువైపు వస్తున్నాయి. సూర్యుడి కిరణాలు గోదావరి తరగలపైపడి పరావర్తనం చెందుతున్న దృశ్యం సౌదామినికి చాలా నచ్చింది.


కోటిపల్లి రేవంటే ఆమెకి చాలా ఇష్టం. చాలా సినిమాల్లో ముఖ్యంగా బాపు సినిమాల్లో ఎక్కువగా చూసింది; ఎత్తైన గోదావరి ఒడ్డు, ఒడ్డు మీదనే విశాలమైన వటవృక్షం, దాని కింద కాంక్రీటు చవటా.. నిర్మలంగా పారే గౌతమి; కోనసీమకి గోదావరంటే ప్రేమ. వాళ్ళకి అది జీవనాధారం..


"గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

జలజలనిపోరు సెలయేటిలో తేటనై" అన్న కృష్ణశాస్త్రి గేయం ఆమెకు ఆ క్షణంలో గుర్తుకొచ్చింది.


ఎక్కడో నాసికాత్రయంబకం లో ఒక చిన్నపాయగా పుట్టిన గోదావరి కోనసీమ కొచ్చేసరికి విశాలత్వాన్ని సంతరించుకొని మూడు పాయలుగా విడిపోయి సముద్రంలో కలవడం దాని ప్రస్థానం; గోదావరి ఆంధ్రుల జీవన వాహిని. ఒక్కసారి గట్టు మీదనుంచి మెట్లద్వారా దిగి ఆ నదీమ తల్లి నీటిని తలమీద చల్లుకుంది. ఆతరువాత వచ్చి జీపులో కూర్చుంది. మళ్ళీ జీపు ప్రయాణం మొదలైంది; పచ్చటి కొబ్బరి తోటల మధ్యలోంచి, అమాయకమైన పల్లెసీమల్లోంచి వెళుతోంది.


"పచ్చని పచ్చికల మధ్య

విచ్చిన తోటల మధ్య"


అన్న తిలక్ అమృతం కురిసిన రాత్రి లోని గేయం గుర్తుకు వచ్చింది. సాయంత్రం అవుతుండగా వాళ్ళు ఆ అగ్రహారం చేరుకున్నారు. పచ్చటి తోటల మధ్య ఉందా ఊరు. మధ్యలో పెద్ద కాలవ, దాని మీద వంతెన, మధ్యలో రాములవారి గుడి.. ఊరినిండా జనాలు. చూడటానికి ఆపల్లె చాలా బాగుంది. చరణ్ కి బాగా నచ్చింది.


ఆ సాయంత్రం ఊళ్లోకి వెళ్ళారు. ఊరంతా సందడే; ప్రతీ ఇల్లు తోరణాలతో, అలంకరణలతో వెలిగిపోతున్నాయి. ఆ మర్నాడు రామాలయంలో ధ్వజా రోహణం, విగ్రహప్రతిష్ట; అక్కడ పురాతన రామాలయం ఉండేది. అది పాడుపడిపోతే వరూధిని నడంకట్టి దానికి మరమ్మతులు చేయించింది.


వరూధిని భర్త శంకరం ఆఊరి సర్పంచ్.. మంచివ్యక్తి. భార్య మాటకు గౌరవం ఇచ్చేవక్తి. బాగా చదువుకున్నవాడు. ఆ ఊళ్లోవాళ్ల కుటుంబం చాల మోతుబరి కుటుంబం.. ఊరికోసం పాటుపడే కుటుంబం. వరూధిని ఆఊరి రామాలయం పక్కనే ఒక సంగీత పాఠశాలని ప్రారంభించింది. సుమారు ఏభైమంది అమ్మాయిలు అందులో సంగీతం నేర్చుకుంటున్నారు. కర్నాటక సంగీతం.


చరణ్, సౌదామిని లిద్దరినీ వరూధిని ఆపాఠశాలకు తీసికెళ్ళి అక్కడ సంగీతం నేర్చుకుంటున్న అమ్మాయిలను పరిచయం చేసింది.


ఆమర్నాడు రామాలయంలో వరూధిని బృందం కర్నాటక సంగీతగాత్ర కచేరి ఉంది. అందుకే వాళ్ళంతా రిహార్సెల్ చేసుకుంటున్నారు.


అందరూ త్యాగరాజు కృతులు, అన్నమయ్య కీర్తనలు పాడుతునా రు. చరణ్ కి సంగీతంలో కొద్దిగా అభినివేశం ఉంది. అందుకే వాళ్ళని నిశితంగా గమనించసాగాడు.


ఒక మూల నుంచి "పిబరే రామరసం.. రసనే " అన్నత్యాగయ్య కృతి వీనులకు విందు చేస్తుంటే ఇంకో పక్కనుంచి పంచరత్న కీర్తనల్లోని 'ఎందరో మహానుభావులు' చెవులకు ఇంపుగా వినిపించసాగింది.


అది చాలా విశాలమైన హాలు.. గోడలనిండా ప్రముఖ వాగ్గేయకారుల పెద్ద పెద్ద చిత్రపటాలు ఆహుతులను ఆకర్షిస్తున్నాయి. త్యాగరాజస్వామి, అన్నమయ్య, శ్యామాశాస్త్రి, వాసుదేవాచారి.. ఇలా ఎందరో ప్రముఖుల చిత్రాలు.. ఇంకోపక్క బాలమురళీకృష్ణ గారి చిత్రం, ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మీ, వసంతకుమారి ఇలా ఈశతాబ్ధపు వాగ్గేయకారులవి కూడా ఉన్నాయి.


ఆ హాలుని చూస్తుంటే వరూధిని కళాహృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు చరణ్;


" వరూధిని గారూ! ఈపాఠశాలని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు చేసిన పని చాలా గొప్పది. కొన్ని తరాలు గుర్తుండిపోయే పనిని మీరు చేసారు. అసలు కర్నాటక సంగీతమన్నా, కీర్తనలు, కృతులన్నా మరచిపోతున్న ఈ తరంలో మీరు ఆ వాగ్దేవికి మళ్లీ పట్టాభిషేకం చేస్తున్నారు. అందుకు మీకభినందనలు.. సౌదామిని గారు నన్ను బలవంత పెట్టకపోతే నేను గొప్ప అవకాశాన్ని కోల్పోయేవాడిని. అందుకు ఆవిడకి కూడా కృతజ్ఞతలు.. ఆ త్యాగయ్య అన్నట్లు ‘ఎందరో మహానుభావులు.. మీలాంటివారు.. అందరికీ వందనములు’. కాసేపు మీపిల్లలతో ముచ్చటించవచ్చా?” అని అడిగాడు చరణ్.


"తప్పకుండా! నిజానికి వాళ్ళకి సంగీతంతో పాటు ఆ వాగ్గేయ కారులు, రాగాల గురించి కొద్ది కొద్దిగా నాకు తెలిసినవి అపుడప్పుడు చెబుతున్నాను; వాటి గురించి అడగండి ” అంది వరూధిని..


"పిల్లలూ! మీకు త్యాగరాజు గురించి తెలుసా?”


"తెలుసు మాస్టారూ! రాముడిమీద కృతులు వ్రాసిన భక్తుడు”.


అతను ఎక్కడ పుట్టాడో.. ఎపుడు పుట్టాడో, అతనే భాషలో కీర్తనలు వ్రాసాడో, సంగీత త్రయం గురించి, పంచరత్న కీర్తనలు గురించి ఇలా కొన్ని విషయాలు చెబుతాను వినండి. త్యాగరాజు గారి పూర్వీకులది కాకర్ల అన్నగ్రామం. అది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వుంది;


ఆ తరువాత వాళ్ళ కుటుంబం ప్రస్తుత తమిళనాడు లోని తంజావూరు వెళ్ళిపోయారు.. త్యాగరాజు 18వ శతాబ్దానికి చెందినవాడు. అతను రామభక్తుడు. మొత్తం కీర్తనలన్నీ రాముడి మీదే వ్రాసాడు. జగదానందకారకా, దుడుకుగల నన్నే, సాధించెనే, కనకనరుచిరా, ఎందరో మహానుభావులు.. ఈ ఐదంటినీ పంచరత్న కీర్తనలు అంటారు.


రాగం, తానం, పల్లవి ఉండేటట్లు ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఇందులో జగదానంద కారక నాటాయి రాగంలో, దుడుకుగల గౌళ రాగం లో, సాధించెనే అరభి రాగంలో, కనకనరుచిర వరలిరాగంలో, ఎందరో మహానుభావులు శ్రీరాగం లో స్వరపరచబడ్డాయి.


త్యాగయ్య, శ్యామాశాస్త్రి, ముత్తు స్వామి దీక్షితార్ ఈ ముగ్గురిని సంగీత త్రయం Trinity of carnatic Music అంటారు. అలాగే తాళ్లపాక అన్నమాచార్యులది కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామం. 16వ శతాబ్దపు కవి.. ఆ ఏడు కొండలవాడి పై ఎన్నో కీర్తనలు వ్రాసేడు. సుమారు 33, 000 కీర్తనలు మనకు లభించాయి. కొండలలో నెలకొన్న కోనేటిరాయుడువాడు లాంటి గొప్ప కీర్తనలు ఆయన రాసేడు.


ఆ పద కవితా పితామహుడు 95 సంవత్సరాలు ఈభూమి మీద నివసించి ఆస్వామికి ఎంతో పద సేవ చేసాడు; మిగతావి మీటీచరుగారు చెబుతారు" అన్నాడు చరణ్;


చాలా మంచివి, తెలియని విషయాలు మీరు మాపిల్లలకు చెప్పారు. మీకు సంగీతంలో, వాగ్గేయకారులమీద మంచి అభినివేశం ఉందని తెలుస్తోంది. " అంది వరూధిని చప్పట్లు కొడుతూ..


ఆసాయంత్రం గోదావరి ఒడ్డుకి వెళ్లారుచరణ్, సౌదామిని;


పడమటి సంధ్యారాగం.. పడమర కొండల్లోకి సూర్యుడు జారుకుంటున్నాడు. ఎర్రటి కిరణాలు గోదావరిలో మిలమిల మెరుస్తూన్నాయి.


"మీకు సంగీతంలో బాగా జ్ఞానం ఉన్నట్లు ఈరోజు తెలిసింది. మంచి విషయాల చెప్పారు. ” అంది సౌదామిని;


"పల్లెల్ని ఈ గ్లోబలైజేషన్ మింగేస్తోంది. ఈతరం వాళ్ళు పల్లెల్లో ఉండటానికి ఇష్టపడటంలేదు. వీళ్లంతా మన సంస్కృతీ వారసత్వ సంపదను దూరం చేసుకుంటున్నారు. చూడండి.. ఈపల్లె జీవనం ఎంత బాగుందో.. ఎంతసేపు విమానాల్లో ప్రయాణం, కంప్యూటర్లు, మొబైల్స్, స్మార్ట్ ఫోన్ లు .. సాఫ్ట్ వేర్, పిజ్జాలు.. బర్గర్స్.. ఇంగ్లీషు భాష, పాశ్చాత్య పోకడలు. ఇలా సమాజం ఎక్కడికో గమ్యం తెలియని పయనం కొనసాగిస్తోంది. దీనివల్ల మన తరువాత తరానికి అనుబంధాలు, ప్రేమలు తగ్గిపోతాయి. మానవ సంబంధాల్లో పెద్ద మార్పులు రావొచ్చు. ” అన్నాడు చరణ్ నిరాశగా..


“ మీరు చెప్పింది నిజం.. ఈ మార్పుల్ని ఎవ్వరూ ఆపలేరు. పదండి వెళదాం.. గోధూళి వేళ ప్రవేశిస్తోంది. ” అంది నవ్వుతూ..


ఆ మర్నాడు సాయంత్రం రామాలయంలో ధ్వజారోహణం, కొత్తగా తయారు చేసిన సీతారాముల విగ్రహాలు ప్రతిష్ట చెయ్యడం జరిగింది.


ఆ సందర్భంగా ఆ ఊరి పెద్దలు, వరూధిని చరణ్ ని ప్రసంగించమన్నారు. చరణ్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ “ప్రతీ మానవుడు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాడు. ఈ కష్టాలకు కారణం ఏమిటో అని జాగ్రత్తగా పరిశీలిస్తే నూటికి తొంభై శాతం కారణం తోటి మానవుడే అని స్పష్టం అవుతుంది. మానవుడికి అత్యధికంగా దానవత్వము, కొంచెం మానవత్వము ఉంటాయని శంకరాచార్యులవారు చెప్పారు.


మానవునిలో స్వార్ధపరత్వం జీవితాంతం అతన్ని వెన్నంటి ఉంటుంది. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదు . ఈ స్వార్ధపరత్వాన్ని ఉపనిషత్తులు కూడా చాటి చెబుతున్నాయి. అందుకే లోకంలో స్వార్థం, అవినీతి, బంధుప్రీతి ఆధర్మం పెరిగిపోతున్నాయి. మనలో ధర్మచింతన తగ్గిపోతోంది.


ఆధ్యాత్మిక చింతన పెరిగితే మానవుడిలో స్వార్థం తగ్గుతుంది. పరులకు సేవ చెయ్యాలి. ఇవన్నీ పెంపోందాలంటే ప్రతీ వాళ్ళు రామయణాన్ని విధిగా చదవాలి. రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి.


"ఇదం పవిత్రం పాపవిఘ్నం పుణ్యం వైదైశ్చ సమ్మితమ్య:

పఠే ద్రామ చరితం సర్వ పాపై: ప్రముచ్చతే"!


" రామచరిత్ర పవిత్రమైనది; . పాపములను నశింపచేయును. పుణ్యములను ఇచ్చును. ఇది వేదాలతో సమానం; దీన్ని చదువు వారికి సర్వపాపములు నశించును; "


"మీ అదృష్టం కొద్దీ ఈ రామాలయం మళ్ళీ కొత్తగా నిర్మించబడింది. రామాలయం అన్నది ప్రతీ ఊరికి ఒక ఆథ్యాత్మిక కేంద్రం. ఇది ఉంటే ఊళ్ళో శాంతి, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. ఈ గుడిలో సాయంత్రం పూట భజనలు, హరికధలు, మంచిని చెప్పే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ప్రతీ రోజు ఉంటాయి; ఇలా ప్రతీ వారికీ ఈగుడి ఒక పాఠశాలలలా మంచిని బోధిస్తుంది.


ప్రతీ పల్లెలో ఈ రామాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా భాసిల్లాలి. అందుకే రామాలయం లేని ఊరు ఉండదు. క్రౌంచపక్షి ని వేటాడి చంపిన తరువాత బోయవాడైన వాల్మీకి మహర్షి గా మారి రామాయణాన్ని మనకందించాడు. ఈ మార్పు ప్రతివానిలో రావాలి. చెడుపై మంచి విజయం రామాయణం.


రామాయణం చదివితే ఏం ప్రయోజనం కలుగుతుందనీ ఈతరం యువతకు ఓ సందేహం. రామాయణాన్ని చదివితే మనుషులు పరిపూర్ణ వ్యక్తులుగా మారతారు. దీనివల్ల చిన్న చిన్న కష్టాలకు ఆత్మహత్యలు చేసుకునే ఆలోచనలు గానీ, ఆస్తిపాస్తుల కోసం అన్న తమ్ములతో తగవులు గానీ, పెట్టుకోరు. దశరధపుత్రుడైన రాముడు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు? ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు; అయినా ధైర్యాన్ని వీడలేదు. ఓటమిని అంగీకరించలేదు.


రాముడుతో మనకి పోలికేమిటి అనీ అనుకోరాదు. రాముడు ఎక్కడా తాను దేవుడిననీ చెప్పుకోలేదు. అలా ప్రవర్తించనూ లేదు. సాధారణ మనిషిగానే జీవించి, ఆటుపోట్లని తట్టుకొని జీవితాన్ని గడిపాడు. విజయాలను అందుకున్నాడు. రామాయణం అంటే రాముడు నడిచినదారి"


"వాల్మీకం చదవకపోతే మనం ఎంతో కోల్పోతాము. ఇందులో సకల వేదాల సారం, ఉపనిషత్తుల రహస్యం ఇమిడి ఉన్నాయి. వ్యక్తి ధర్మం, రాజు ధర్మం, పుత్ర ధర్మం, అన్నింటికీ మించిన మానవ ధర్మం రామకధలో అంతర్లీనంగా చెప్పబడింది.


కాబట్టి కొత్తతరం యువకులు రామాయణ, భారత, భాగవతాలు చదవండి. సక్రమ మార్గంలో నడవండి. ఈకొత్తగా కట్టిన రామాలయం మీ ఊరికంతటికీ విలువులు నేర్పి, భక్తిని పెంపొందిస్తుంది అని నమ్ముతున్నాను.


చివరగా యోగవాసిష్టం లో వశిష్టుడు రామునితో ఇలా అంటాడు.

" తరవోసి హి జీవంతి జీవంతి మృగపక్షిణ:

సజీవతిమనోయస్యమననే వహిజీవతి" అంటే చెట్లు, మృగాలు, పక్షులు జీవిస్తాయి. కానీ ఎవరైతో మనసుతో మనసారా జీవిస్తారో వాళ్ళే నిజంగా జీవించినట్లు. వాళ్ళ జీవితమే సార్థకం; ”


చలంతి గిరయ: కామం యుగాంత పవనాహతా:

కృచ్చేపినచలత్వేన ధీరాణా నిశ్చలం మన:”


అంటే ఎట్టి పరిస్థితుల్లోను ధీరుల మనస్సు చలించదు” అనీ చరణ్ తన ప్రసంగాన్ని ముగించడంతో ఆలయ ప్రాంగణమంతా చప్పట్లతో మారు మ్రోగిపోయింది.


అప్పుడు అతను అక్కడ దీపస్తంభం లోని దీపాలను వెలిగిస్తూ..

“దీపం జ్యోతి పరం బ్రహ్మ

దీపం సర్వత మోపహం

దీపేన సాధ్యతే సర్వం

సంధ్యా దీపం నమోస్తుతే" అని నమస్కారం చేసి క్రిందికి దిగిపోయాడు ;


ఆ తరువాత ప్రజలంతా సీతారాముల్ని దర్శించుకున్నారు.

మరో గంటకు ఆలయ ప్రాంగణంలో కొత్తగా కట్టిన స్టేజిపై వరూధిని తన సంగీతాలాపన ప్రారంభించింది.


ముందుగా " ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు” పాడింది..


ఆతరువాత జగదానందకారకా, పిబరే రామరసం.. నిధి చాలా సుఖమా.. రాముని సన్నిధి సేవ సుఖమా.. " వరసగా ఆలపించింది;


ఆకీర్తనలు వింటూ ప్రజలు మైమరిపోవడం చరణ్ గమనించసాగేడు. కచేరి ముగిసిన తరువాత ఆ ఊరి వాళ్ళు చరణ్ చేత ఆమెకు సన్మానం చేయించారు;


ఆ మర్నాడు చరణ్, సౌదామిని బయలుదేరి చరణ్ వచ్చేసారు; బాగా అలసిపోడంతో సౌదామిని పూర్తిగా ఆరోజంతా చరణ్ వాళ్ళింట్లో విశ్రాంతి తీసుకొని మర్నాడు ఉదయాన్నే బయలుదేరింది.


ఆమెని స్టేషను దగ్గర దించుతూ " సౌదామిని గారు! మీకభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో చేరవచ్చు కదా!.. మాదగ్గర ఇపుడు కేసులు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఈ బాక్సైట్ కేసులు; వాటిని చాలా జాగ్రత్తగా బోలెడన్నీ చట్టాలు, శాస్త్రాలు, జర్నల్స్ తిరగేసి వాదనలు వినిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రముఖ లాయర్లని పెట్టుకొంది. వాళ్ళ సలహాలతో కేసు నడుస్తుంది. కాబట్టి మీరు చేరితే మనం ఈ కేసుల్ని బాగా ప్రజెంట్ చెయ్యవచ్చు. మీకూ ఎక్సిపీరియన్స్ వస్తుంది. మీకిష్టం లేకపోతే ఎప్పుడైనా మానివేయవచ్చు. ఇంటికెళుతున్నారు కదా ఆలోచించండి. " అని చెప్పి ఆమెకి వీడ్కోలు పలికాడు.

=================================================================================

ఇంకా వుంది...

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


27 views0 comments

コメント


bottom of page