top of page

అశ్వ మేధం ఎపిసోడ్ 6Written By Gannavarapu Narasimha Murthy

'అశ్వ మేధం - ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక

రచన : గన్నవరపు నరసింహ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ..

చరణ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఢిల్లీలో జరిగే ఒక కోర్స్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతనికి సౌదామిని అనే యువతి పరిచయం అవుతుంది. తాజ్ మహల్ వద్ద ఇరువురూ మళ్ళీ అనుకోకుండా కలుస్తారు.


ఇంటికి తిరిగి వచ్చిన చరణ్ ని శాంతి అనే యువతి కలిసి న్యాయ సహాయాన్ని అభ్యర్థిస్తుంది.


సుక్కు అనే గిరిజనుడు చనిపోయిన సంఘటనను తన భర్త చైతన్య వీడియో తీసాడనీ, ఆ కోపంతో పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారనీ చెబుతుంది ఆమె. చరణ్, కేస్ వేయడంతో చైతన్యను కోర్ట్ లో హాజరుపరుస్తారు పోలీసులు. అతను బెయిల్ పై బయటకు వస్తాడు.


తన అన్నయ్య పెళ్లి చూపుల కోసం చరణ్ ఉన్న ఊరు వస్తుంది సౌదామిని. చరణ్ ఇంట్లో విహారి ఫోటో చూస్తుంది. అతడు తన స్నేహితురాలు దీపను మోసం చేసాడని చెబుతుంది. విహారి వాళ్ళ ఉరికి వెళ్తే నిజం తెలుస్తుందంటాడు చరణ్.


విహరితో తన పరిచయం గురించి సౌదామిని వివరిస్తాడు.

ఆమె ఊరికి వెళ్ళాక విహారి దగ్గరకు వెళతాడు. అతని కోరికపై బాక్సయిట్ తవ్వకాలు నిలిపివేయాలని కోర్టులో కేస్ వేస్తాడు చరణ్.


తవ్వకాలు తాత్కాలికంగా ఆగుతాయి.

సౌదామినిని తాను పనిచేసే కంపెనీ లో చేరమంటాడు చరణ్.


ఇక అశ్వ మేధం ఎపిసోడ్ 6 చదవండి..


వారంరోజుల తరువాత సౌదామిని చరణ్ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయింది. బాక్సైట్ మైనింగ్ కేసు వాదనలు పదిహేను రోజుల్లో మొదలౌతాయి. ఈలోగా అఫిడవిట్ తయారు చేయాలి. ఆ పనిని చరణ్ సౌదామిని కి అప్పచెప్పాడు.


ఆమె రాత్రి, పగలు కష్టపడి, ఎన్నో న్యాయశాస్త్ర గ్రంధాలు పరిశీలించి, చట్టాలను ఉంటకిస్తూ దాన్ని తయారు చెయ్యడంలో నిమగ్నమైంది.


చివరకు నలభై పేజీల డ్రాఫ్ట్ తయారైంది. దాన్ని చరణ్ ఒకసారి చదివి, విహారితో చర్చించి, దానికి తుదిరూపు ఇచ్చాడు. చివరకు డ్రాఫ్టు తయారైంది.


దీనిని వాదనలు ప్రారంభమవడానికి ఒకరోజు ముందు కోర్టులో దాఖలు చేసారు.


ఆరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. మొదటగా ప్రభుత్వం తరుపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు విని పెంచడం మొదలు పెట్టాడు.


“బాక్సైట్ చాలా ఖరీదైన, అరుదైన ఖనిజం. దాని విలువ అపారం, ఆ ఖనిజాలు భూమిలో నిక్షిప్తమై ఉంటే మానవాళికి ఏ విధమైన ఉపయోగం ఉండదు. భూమిలో ఉన్న ప్రతీ రాయి, రప్ప, ఖనిజాలు, ఇసుక, .. అన్నీ ప్రభుత్వ ఆస్తులు.. వీటిని వెలికితీస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయంతో పాటు మానవాళికి ఉపయోగపడుతుంది. దీన్ని వెలికితీసి ఆ వచ్చే ఆదాయంతో పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయబోతోంది ఈ ప్రభుత్వం. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఇల్లు.. అన్నీ సమకూర్చడానికి నిధులను బడ్జెట్ లో కేటాయించింది ప్రభుత్వం; అదీకాక ఈఖనిజాన్ని కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఖనిజాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వెలికితీస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వానికి, ప్రజలకు అన్యాయం జరిగే ప్రసక్తి ఉండదు.


ఇంక పర్యావరణ శాఖ పర్యావరణంపై దీనివల్ల పెద్దగా ప్రభావం ఉండదనీ, ఈప్రాంతంలో కేవలం 15 చిన్న గ్రామాలున్నాయనీ, జనభా మొత్తం మూడువేలు కూడా లేదని రిపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఈ కాంట్రాక్టును ఖరారుచేసింది. ఇది ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి కోర్టు వారు ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోరుచున్నాము. " అని తన వాదనలు వినిపించి తదనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేసింది.


ప్రతివాది తరుపున చరణ్ తన వాదనలు వినిపిస్తూ " ఈప్రాంతం చాలా సస్యశ్యామల ప్రాంతం. సుజలావతి అనే చిన్న ఏరు ఈ ప్రాంతాల్లో పోరుతోంది. ఇది సుమారు వంద కిలోమీటర్లు ప్రవహించి నాగావళిలో కలుస్తోంది. దీని మీద రామకృష్ణాపురం వద్ద ఆనకట్ట కూడా కట్టారు. దానివల్ల ఇక్కడ మంచి పంటలు పండుతున్నాయి. దీనివల్ల 150 గ్రామాలకు మంచి నీరు అందుతోంది. సుమారు 100 పాఠశాలలు, 50 ఆరోగ్య కేంద్రాలు, 2 లక్షలు ఎకరాల వ్యవసాయం, దీని పరివాహక ప్రాంతంలో వున్నాయి;


అటువంటిది ఈ ప్రాంతంలో మైనింగ్ వల్ల అందులో బాక్సైట్ ఖనిజం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగి పర్యావరణం బాగా దెబ్బతింటుందని మైనింగ్ శాఖ మొదట్లో ఓ రిపోర్ట్ ఇచ్చింది. అది కావాలని ప్రభుత్వం దాచిపెట్టింది. దీనివల్ల ఆనకట్ట యొక్క రిజర్వాయర్ నీరు విషపూరితమై ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ప్రముఖ శాస్త్రవేత్త ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాసారు. ఆ ఉత్తరాన్ని జడ్జి గారు చూడాలి"; అంటూ ఒక ఉత్తరాన్ని బెంచి క్లర్క్ కి ఇచ్చాడు; . ఇది వరకటి పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి, ఐయ్యేయస్ఆఫీసర్ రాఘవన్ ప్రభుత్వానికి ఈప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి చాలా నష్టమని హెచ్చరించినట్లు పేపర్లలో వార్తలు వచ్చాయి.

వీటిన్నింటికన్నా ఈ ప్రాంతాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. వాళ్ళు కొండలపై తండాల్లో నివసిస్తున్నారు. ఈ మైనింగ్ వాళ్ళ వాళ్ళ ఉనికి ప్రమాదమని వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు. మరోముఖ్య విషయం దానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క అనుమతి లేదు. ప్రభుత్వం ఆసంస్థకి ఈ ప్రాజెక్టు గురించి తెలియ పరచలేదు. కాబట్టి కోర్టువారు జోక్యం చేసుకొనే ఈప్రాజెక్ట్ ని వెంటనే రద్దుచేసి ఈప్రాంత ప్రజల ప్రాణాల కాపాడాలని కోరుచున్నాను ” అని తన వాదనలు ముగించాడు;


మధ్యాహ్నం హరిత ట్రిబ్యునల్ నుంచి హాజరైన సభ్యుడిని జడ్డి గారు 'మీ శాఖ అభిప్రాయం ఏమిటి" అని ప్రశ్నించడంతో అతను నిలబడి మా బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తోందని, వాళ్ళ రిపోర్ట్ రాగానే అఫిడవిట్ దాఖలు చేస్తాము" అని చెప్పడంతో కోర్టు నెలరోజులు ఆ కేసుని వాయిదా వేసింది.


విహారి ఆసాయంత్రం చరణ్ ఆఫీసుకి వచ్చి మంచి వాదనలు వినిపించావని అభినందించాడు.


చరణ్ నవ్వుతూ “ దీన్ని సౌదామిని తయారుచేసింది. ఆమెని అభినందించు.. ఆమె చాలా ఫైళ్ళు, పేపర్ క్లిప్పింగ్స్ సేకరించి దీన్ని తయారుచేసింది. ఈకేసులో ప్రభుత్వానికి చుక్కెదరు తప్పదు. ” అన్నాడు చరణ్ ; అది సరే విహారీ.. ఇంతకీ దీప సంగతి ఏమిటైంది. ఇప్పుడేం చేస్తోంది?" అని అడిగాడు;

"మా ప్రేమని ఆమె తల్లితండ్రులు ఒప్పుకోవడం లేదురా. దీప మాత్రం భయపడకుండా నన్నే పెళ్ళాడతానని పట్టుబట్టి కూర్చుంది. అమెరికా సంబంధాలను తెస్తే ఆమె ఒప్పుకోవటంలేదు. నెలరోజుల క్రితం యూనివర్సిటీ హాస్టల్ కి మారిపోయింది. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. నేనే అప్పుడప్పుడు వెళ్ళి ఆమెని కలుస్తున్నాను. ఈ ఊళ్ళోనే ఉన్నా రోజు కలవటం లేదు. నేను కూడా మా కృష్ణాపురంలో రెండు, మూడు రోజులే వారానికి ఉంటూ మిగతా సమయాల్లో ఇక్కడే ఉంటున్నాను. ఈమధ్యనే ఇక్కడ ఓయిల్లు కూడా కొన్నాను. అందులో ఉండమని దీపకి చెప్పినా ఆమె వినక యూనివర్సిటీ లో ఉంటోంది. ” అంటూ తన బాధని చెప్పుకున్నాడు విహారి.


సౌదామిని మౌనంగా వింటూ తన పని తాను చేసుకోసాగింది.

వారంరోజుల తరువాత చరణ్ తన ఊళ్ళో పొలం పనులు చూసుకుంటున్న సమయంలో విహారి నుంచి అర్జెంటుగా రమ్మనమని ఫోన్ వచ్చింది.


వెంటనే బయలుదేరాడు చరణ్ ; ... బహుశా ఈకేసు విషయాలను మాట్లాడటానికేమో అని అనుకున్నాడు;

అతను వెళ్ళేసరికి సాయంత్రం అయింది.


అతన్ని చూసి విహారి బయటకొచ్చీ” ఈరోజు నువ్వు పేపరు చూడలేదా? అని అడిగాడు.


“ లేదు.. ఉదయం నుంచి పొలంలో ఉండటం వల్ల చూడటం కుదరలేదు”

విహారి అతనికి ఆరోజు పేపరు ఇచ్చాడు.


ఎన్జీటీ సెక్రటరీ రోడ్డు ప్రమాదంలో మృతి.. హత్యగా అనుమానం.. పోలీసుల రహస్య పరిశోధన” అన్న హెడ్డింగ్ పక్కన అతని ఫోటో వేసి ఉంది.


" ఈరోజు రాత్రి 12 గంటలు సమయంలో ఎయిర్ పోర్టు కి వెళ్ళేదారిలో టీ జంక్షన్ వద్ద ఒక వ్యక్తి ప్రమాదానికి గురై మరణించినట్లు ప్రాధమికంగా అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇతను ప్రయాణిస్తున్న జీపు రోడ్డు డివైడర్ను ఢీ కొనడం వల్ల తలకు బలంగా గాయలై చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. జీపు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఇతను జాతీయ హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ అని, ఢిల్లీ నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చాడనీ మిగతా విషయాలు పరిశోధన అనంతరం వెల్లడిస్తామనీ జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. అతని పేరు రాఘవన్ అని, మిగతా విషయాలు తెలియాల్సి ఉందనీ వున్నాయని అందులో రాసి ఉంది.


'అతను మాఊరు కృష్ణపురం బాక్సైట్ మైనింగ్ కేసు పనిమీద వచ్చాడు. నేను అతన్ని మాఊళ్ళో నాలుగురోజుల కిందట చూసాను. అతను ఆ టీం కి లీడర్. ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టులో కేసు మీద వాదనలు జరుగుతాయి. నా ఉద్దేశ్యంలో ఇతనిది ప్రమాదం కాదు. హత్య అని అనుమానం” అన్నాడు విహారి.


“ఎవరు చేసారంటావు.. ఇదంతా నీ ఊహ అని నా అనుమానం" అన్నాడు చరణ్;


“ లాజికల్ గా ఆలోచించు; ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చాడనుకో ; దానివల్ల ఆ ప్రాజెక్ట్ ని కోర్టు రద్దు చేయవచ్చు అని బహుశా ఆ పనులు చేస్తున్న సంస్థ ఈపనిచేయించిందేమో”.


" విహారీ! ఇది చాలా విచిత్రమైన వాదన.. ఇంతకీ పోలీసుల విచారణ పూర్తైతే వాళ్ళే చెబుతారు. రేపటి దాకా ఆగుదాం. ” అని చెప్పి చరణ్ వెళ్ళిపోయాడు.


ఆమర్నాడుదయాన్నే మళ్ళీ విహారి వచ్చి " చరణ్ ! నేనుకున్నంత పనీ అయింది. దీపమీద హత్య ప్రయత్నం జరిగింది. ఏదో జరుగుతోంది. మమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నట్లున్నాయి. ” అన్నాడు గాబరాపడుతూ..


" కూల్ విహారీ.. ఏం జరగదులే.. నీదంతా వొట్టి అనుమానమే.. పద.. ఇపుడు దీప ఎక్కడుంది?”


“ దీప రాత్రి 9 గంటలప్పుడు హాస్టల్ నుంచి మెడికల్ షాప్ కి వచ్చినప్పుడు ఎవరో ఆమెని వెంబడించి మోటారు సైకిల్తో డేష్ ఇచ్చే ప్రయత్నం చేసారని ఆమె చెబుతోంది. అదేకాక మొన్నరాత్రి రాఘవన్ ది హత్యేనని, తాను ప్రత్యక్షంగా చూసానని చెబుతోంది.. నువ్వొస్తే అన్ని వివరాలు చెబుతానంటోంది; " అని చెప్పడంతో చరణ్ వెంటనే సౌదామినిని యూనివర్సిటీ హాస్టల్కి రమ్మనమని చెప్పి విహారితో హస్టల్ కు బయలుదేరాడు.


వీళ్ళు హస్టల్కి వెళ్ళే సరికి బెడ్ మీద పడుకొని ఉంది దీప. ఆమెకు నుదురు మీద బేండేజ్, చేతులకు కట్లు వేసి ఉన్నాయి.


"దెబ్బలేమీ తగల్లేదన్నాడు విహారి" అన్నాడు దీపను చూసి చరణ్ ;


" గాబరా పడతారని నేనే చెప్పలేదు"


" ఇంతకీ ఏంజరిగింది?"


"మీకు చాలా చెప్పాలి. మొన్న రాఘవన్ గారు చనిపోయిన రోజు రాత్రి పదిగంటలకు నేను ఓ స్నేహితురాల్ని రిసీవ్ చేసుకునేందుకు స్టేషన్ కి వెళ్ళాను; తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు ఒక మోటారు సైకిల్ మీద వచ్చి ఒక కారును ఢీకొట్టడం, ఆకారు డివైడర్ ని ఢీకొట్టి ఆగిపోగానే వాళ్ళు పరుగున వచ్చి ఆకారు తలుపు తీసి అతన్ని చాకుతో పొడిచి పారిపోవడం నేను చూసాను. వెంటనే నాకు చాలా భయం వేసింది.


ఆటోవాడు నన్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. నాకొంచెయ్యాలో తోచక పోలీసు స్టేషన్ 100 కి ఫోన్ చేసాను. ఎవరు ఫోన్ ఎత్తితే వెంటనే ఈ హత్య గురించి చెప్పాను. అతను నా పేరు, ఎక్కడుంటానో వివరాలు కనుక్కొని నేను మా కానిస్టేబుల్ని పంపిస్తానని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

నేను వెంటనే కొంచెం దూరం నడిచి ఇంకో ఆటోలో హాస్టల్ కి వెళ్ళిపోయాను. ఆ చనిపోయినవ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ కి సంబంధించిన పెద్ద అధికార నీ , అతను ప్రమాదంలో చనిపోయాడనీ, ఉదయం తెల్లవారిన తరువాత తెలిసింది; కానీ హత్య అని ఏ పేపరూ రాయలేదు. కానీ నేను ప్రత్యక్షంగా చూసాను అది ముమ్మూటికి హత్యే' అని చెప్పింది దీప;


“ వా ళ్ళను నువ్వు చూసావా"? అని అడిగాడు చరణ్;


“ చూసాను.. అదృష్టవశాత్తూ అక్కడే పెద్ద లైట్సు టవర్ ఉండటం వల్ల ఆ వ్యకులిద్దర్నీ చూసాను.


"మరి చూస్తే గుర్తుపట్టగలవా?”


“ గుర్తుపట్ట గలను”.


" మరి ఈవిషయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావా?

"ఎలాగూ పోలీసు స్టేషన్లో కి కంప్లైంట్ చేసాను కాబట్టి మళ్ళీ ఫిర్యాదు చెయ్యలేదు; కానీ రాత్రి మందుల కోసం ఓ మెడికల్ షాప్ కి వచ్చినపుడు అత్యంత వేగంతో ఓమోటార్ సైకిల్ నన్ను డేష్ ఇవ్వాలని ప్రయత్నించింది. ఒక్క క్షణం ఆలస్యం అయితే నా శరీరం నుజ్జు నుజ్జు అయ్యేది కానీ అదృష్టవశాత్తు ఓ కుక్క వల్ల నేను బతికి బయట పడ్డాను. ”

" అది హత్యప్రయత్నమని మీకెలా తెలుసు? ప్రమాదవశాత్తు జరగవచ్చు కదా"


"లేదు.. ఆవేగం, నేను చేతులు అడ్డుపడుతూ వద్దంటున్నా అత్యంత వేగంతో నామీదకు వచ్చే విధానం చూస్తే అది తప్పకుండా నన్ను చంపాలనే అంత వేగంతో వచ్చారని తెలుస్తోంది. ”అంది దీప;


"ఇది హత్యా ప్రయత్నంలాగే ఉంది ; బహుశా నిన్న నువ్వు హత్యను చూసావు కాబట్టి బహుశా సాక్ష్యం లేకుండా చేద్దామని ఎవరో ఈ పని చేసి ఉంటారు. చూస్తుంటే ఇదేదో పెద్ద కుట్ర లాగుంది.. ఈరాత్రికి నువ్వు ఈ హాస్టల్ లో ఉండొద్దు. సౌదామిని తో ఆమె ఇంటికి వెళ్లిపో, రేపు పోలీసుస్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేద్దాం. ” అని దీపతో చెప్పాడు చరణ్;


ఆ మర్నాడు చరణ్ దీప, సౌదామిని, విహరితో పొలిసు స్టేషను కి వెళ్లి దీప మీద హత్యా ప్రయత్నం జరిగినట్లు ఫోర్యాదు చేసాడు; జరిగినదంతా దీప సి. ఐ. తో చెప్పింది. తాను ఫోన్ చెయ్యడం, పోలీస్ స్టేషన్ లో ఎవ్వరో ఫోన్ ఎత్తడం.. తనమీద హత్యాప్రయత్నం జరిగిన సంగతి అతనికి చెప్పడం అన్నీ చెప్పింది;


“ నాఉద్దేశ్యంలో ఆమె ఫోన్ చేసింది. రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ కి అయి ఉంటుంది. " అంటూ ఆ స్టేషన్ కి ఫోన్ చేసాడు రాజారామ్ .

ఆ తరువాత " చరణ్ గారూ.. వాళ్లకి ఎవరు ఫోన్ చెయ్యలేదంటున్నారు; అయినా నేను కనుక్కుంటాను లెండి” అంటూ దీప ను జరిగింది రాసి ఇమ్మన్నాడు. రైటర్ సాయంతో ఆమె కంప్లెంట్ రాసిచ్చింది. అలా ఆ కేసులో ఎఫ్. ఐ. ఆర్. రికార్డ్ చెయ్యబడింది.


ఇంతలో చరణ్ అతనికి ఆరోజు అన్ని ప్రముఖ పత్రికల్లో పడ్డ వార్తని చూపించాడు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది ఆ వార్త.


“ రాఘవన్ హత్య.. ప్రభుత్వ పెద్దల హస్తం.. నిజాలు దాస్తున్న పోలీసుశాఖ.. ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం... ” అన్న వివిధ హెడ్డింగుల కింద వివరాలు వ్రాయబడ్డాయి.


తాము చేసే మైనింగ్ కి వ్యతిరేకంగా రిపోర్ట్ తయారుచేసిన హరిత ట్రిబ్యునల్ మెంబర్ సెక్రటరీ రాఘవన్ ది ముమ్మాటికీ హత్యేనని, ఇందులో అధికార పార్టీలోని కొందరి పెద్దల హస్తం ఉందనీ, దీన్ని యాక్సిడెంట్ గా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, పోలీసుశాఖ ఒత్తిళ్లకు లొంగి ఎఫ్. ఐ. ఆర్. ని మార్చివేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. రాఘవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ తయారుచేసాడనీ, అది రెండు రోజుల్లో కోర్ట్ లో దాఖలుచెయ్యవలసి ఉన్నదనీ, యెన్జీటీ వర్గాలు తెలిపాయి. ఆ రిపోర్ట్ బయటకు రాకుండా ఈప్రాజెక్ట్ కి సంబంధించిన పెద్దలెవరో ఈపనికి పూనుకొని ఉంటారని పుకార్లు

వినిపిస్తున్నాయి.


ఆపక్కనే "ఎవరీ రాఘవన్? అతను వ్రాసిన రిపోర్టులో ఏముంది? అన్న బాక్స్ కింద "హరిత ట్రిబ్యునల్లో మెంబర్ సెక్రటరీగా పనిచేసి దారుణ హత్యకుగురైన రాఘవన్ మొదట నుంచి ముక్కుసూటిగా పనిచేసే మనస్తత్వం గల సైంటిస్టు అని ఆశాఖలో పనిచేస్తున్న ఇంకొక సైంటిస్తు రాజేశ్వర్ చెప్పారు. అతను కృష్ణాపురం బాక్సైట్ మైనింగుని క్షుణ్ణంగా దగ్గరుండి సర్వేచేసి ఎన్నో విషయాలను సేకరించి దగ్గరుండి ప్రయోగశాలలో పరీక్షలు చేసి సమగ్రమైన రిపోర్ట్ చాలారహస్యంగా తయారుచేసినట్లు చెబుతున్నారు.


ఆ రిపోర్టులో అతను చాలా విషయాలను ప్రస్తావించారనీ, బాక్సెట్ ఖనిజం తవ్వకాల వల్ల ఆప్రాంతం మొత్తం అంతా కాలుష్యం బారినపడుతుందనీ, దగ్గర్లోనే రిజర్వాయర్ ఉండటం వలన ఆర్సెనిక్, గంధకం, బొగ్గు, పోటాషియం, మెగ్నీషియం మొదలైన ప్రమాదకరమైన రసాయనాలు నీటిలో కలిసి దాన్ని విషపూరితం చేస్తాయనీ, దాన్ని తాగిన మనుషులు, పశు, పక్ష్యాదులు కాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలబారిన పడతాయనీ, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ ఖనిజ తవ్వకం ఈప్రాంత పర్యావరణానికి మంచిదికాదనీ ఆ రిపోర్టులో పొందుపరిచినట్లు తెలిసింది.


దీనికి ప్రభుత్వం వివరణ ఇవ్వవలసి ఉంది. ఇంతకీ రాఘవన్ మృతి ప్రమాదం వల్ల జరిగిందా? లేక హత్యా? ఈవిషయంలో ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. జిల్లా ఎస్సీని వివరాలు అడిగితే కేసు పరిశోధన జరుగుతోందనీ, అన్ని వివరాలు సేకరిస్తున్నామనీ, ఆతరువాత కోర్టులో ఎఫ్. ఐ. ఆర్. దాఖలు చేస్తామనీ చెప్పారు. హరిత ట్రిబ్యునల్ రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తే ఏంజరుగుతుంది? ఎవరికి నష్టం?విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం ఖనిజాన్ని తవ్వితీసే కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ చాలా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ పెద్దలకు డబ్బుని ముట్టజెప్పి ఈ కాంట్రాక్టుని దక్కించుకున్నారనీ, అటువంటిది ఈ రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తే మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా ఆపివేయవలసి ఉంటుందనీ, ఇటువంటి పనులకు హరిత ట్రిబ్యునల్ యొక్క ఆమోదం తప్పనిసరనీ అందువల్ల ఆకంపెనీ బాగా నష్టపోతుందనీ నిపుణులు చెబుతున్నారు.


కాబట్టి రాఘవన్ యొక్క హత్యలో ఆకంపెనీకి ఏమైనా సంబంధ ఉన్నదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు, ఎస్పీ దగ్గరుండి కేసుని పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది; ” పేపరులో వ్రాసిన మొత్తం విషయాన్ని చదివి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారాంకి వినిపెంచాడు చరణ్;


"చూడండి !వాస్తవాలు ప్రకారం మేము పరిశోధిస్తాం.. దీపగారి మొబైల్ నెంబర్, ఎడ్రస్ ఇవ్వండి. ఆవిడకి రక్షణ కల్పిస్తాం” అని చెప్పడంతో వాళ్ళంతా బయట కొచ్చేసారు;


వారంరోజులు తరువాత కోర్టులో వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం రాఘవన్ హత్యోదంతాన్ని కోర్టుకి తెలపలేదు. హరిత ట్రిబ్యునల్ అధికారి ఒకతను వచ్చి కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసాడు. దర్యాప్తు చేస్తున్న తమ అధికారి రాఘవన్ ఆకస్మికంగా చనిపోవడంతో రిపోర్ట్ ఆలస్యం అయిందనీ, వారంరోజులు సమయం కావాలని కోరడంతో కోర్టు మంజూరుచేసింది.


అప్పుడు చరణ్ కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టాడు. కృష్ణాపురం బాక్సైట్ కేసులో హరిత ట్రిబ్యునల్ సెక్రటరీ రాఘవన్ హత్యకుగురయ్యాడు. అది హత్య అనడానికి మాదగ్గర ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. దీప అనే ఒకయూనివర్సిటీ విద్యార్ధిని ఆహత్యని రాతిపూట ప్రత్యక్షంగా చూసారు. నాకు తెలిసి రాఘవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ రాయడంతో, అతన్ని ప్రభుత్వానికి సహకరించేటట్లు రిపోర్ట్ ఇమ్మని ప్రభుత్వాధికారులు, కాంట్రాక్ట్ ఏజన్సీలు ఒత్తిడి తెచ్చాయనీ, అతను వినకపోయేసరికి హత్య చేసారనీ మాకు తెలిసింది.


ఈవిషయంలో మేము పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసాము. కానీ ఇప్పటిదాకా రాఘవన్ ది హత్యని ఎఫ్. ఐ. ఆర్. కూడా పోలీసులు దాఖలు చేయలేదు. కాబట్టి సెషన్స్ కోర్టు వారు ఈకేసుని త్యరగా పరిశోధించి దోషులును పట్టుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించమని కోరుతూ ఈకేసులో మావాదనలు వినకుండా ఏవిధమైన తీర్పును ఇవ్వవద్దని కోర్టువారిని కోరుతున్నాను ” అని వ్రాసిచ్చాడు.


కోర్టు ఆ అప్లికేషన్ చదివి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద కోప్పడింది. ఎందుకు కోర్టుకి ఆవిషయం చెప్పలేదని ప్రశ్నించింది. రాఘవన్ హత్యకూ, ఈకేసుకూ సంబంధం లేదని అతను వాదిస్తే, కోర్టు అతని వాదనలతో విభేధించి వెంటనే ఆకేసుని రిజిస్టర్ చేసి, ఆస్టేషన్ రిపోర్టుని కోర్టుకి సమర్పించాలని కోరింది.


చనిపోయిన రాఘవన్ ఈకేసు యొక్క పర్యావరణ అనుమతులమీద రిపోర్ట్ ఇచ్చే అధికారి కాబట్టి ఈకేసుకి, హత్యకు సంబంధం లేదనడం సహేతుకం కాదు అని కోర్టు అభిప్రాయపడింది. కేసుని పదిరోజులకు వాయిదా వేసింది.

సివిల్ కోర్టులో వాజ్యాలంటే ఇలాగే ఉంటాయనిపించింది విహారికి.


చరణ్ విహారికి చెప్పి అతని ఊరు బయలుదేరాడు.

=================================================================================

ఇంకా వుంది...

=================================================================================

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.13 views0 comments
bottom of page